Previous Page Next Page 
బొమ్మరిల్లు పేజి 2


    "మరిలేకపోతే? వాళ్ళకోసం నేను నిద్రపోకుండా దేవదాసులా తాగుతూ పాటలు పాడుకుంటాననుకుంటున్నారా?" హనుమంతరావు అన్నాడు మరో సిగరెట్ వెలిగించుకుంటూ.

    
    "అంత మరీగొప్పలు కొట్టుకురా?"


    "మీ బొంద! ఇందులో గొప్పలు కొట్టడం ఏముంది? చిట్టినాయనల్లారా నేను వాళ్ళ కోసం దిగులుపడటంలేదు. ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తున్నాను. నాకు ఆ బాధ తప్పినందుకు సంతోషంగా ఉంది" హనుమంతరావు కాలిన సిగరెట్టును కిందపడేసి బూట్ కాలితో నలిపేశాడు.


    "క్రొత్తపిల్లల్ని పట్టినట్టున్నాడురోయ్ మనవాడు" అన్నాడు సుధాకర్.


    "నా దృష్టిలో ఆడదానికీ,ఈ సిగరెట్టుకూ అట్టే తేడాలేదు. అనుభవించడం...."

    
    "ఆ తర్వాత కాలికింద నలిపెయ్యడం!" గౌతమ్ వ్యంగ్యంగా అన్నాడు.


    "అవును! నాకు నీలా పూలిష్ సెంటిమెంట్సు లేవు. నేను కోరుకోవాలే గానీ అంబుజాక్షులూ, వనజాక్షులూ కోకొల్లల్లు. దాని బాబులాంటి వాళ్లు నా చుట్టూ తిరిగారు"


    "అవున్రా! తిరుగుతారు! ఎందుకు తిరగరు? ఆధునిక లైలాలు మజ్నూలు చుట్టూ తిరగడంమానేసి చాలాకాలం అయింది. ఇప్పుడు వాళ్ళు జేబులు చుట్టూ తిరుగుతున్నారు.


    నీ జేబుబరువుగా ఉన్నంతకాలం నీచుట్టూ తిరిగేవాళ్ళు ఉంటూనే ఉంటారు. అది ఖాళీ అయ్యాక చూడు...." అన్నాడు గౌతమ్.


    అందరూ గౌతమ్ కేసి చూశారు.


    "నిజమేరా! గౌతమ్ అప్పుడప్పుడు బ్రహ్మాండమైన సత్యాలు చెబుతాడు."


    "వాడు అలాగే అంటాడులే!"


    "వాడి మాటల్లో నిజంలేకపోలేదని నాకు అనిపిస్తుంది. నీకంటే నేను అందంగా ఉంటానా? మరి నీ చుట్టూతిరిగేవాళ్ళు నా చుట్టూ తిరగరేం?" అన్నాడు రమేశ్.


    "అదేం కాదులే!"


    "మరి?"


    "నీ అందచందాలు చూసే తిరుగుతున్నారంటావ్?" అన్నాడు సుధాకర్.


    "అవును! వాళ్ళు నా డబ్బును చూసితిరగడంలేదు. నా వ్యక్తిత్వంలో ఏదో ఆకర్షణ ఉండి ఉండాలి. కేవలం డబ్బుకోసమే తిరిగే వాళ్ళయితే నాచుట్టూ ఎందుకు తిరగాలి. మా డాడీ చుట్టూ తిరగొచ్చునుగా?"


    "అదీ నిజమేలా అనిపిస్తుంది" సాలోచనగా అన్నాడు రమేశ్.


    "దీనికి జవాబు ఏమిటి!" అన్నట్టు గౌతమ్ ముఖంలోకి చూశాడు హనుమంతరావు.


    "మీ నాన్నవయసు ఉడిగిపోయినవాడు. ఆయనకు జీతం నేర్పిన అనుభవం ఎంతో ఉన్నది. ఒకవేళ అమ్మాయిలు చుట్టూ తిరిగినా ఆయన నీలా తన వ్యక్తిత్వం, అందచందాలు చూసి తిరుగుతున్నారని భ్రమలో పడడు. ఆయనకు తెలుసు వాళ్ళకు కావల్సింది తను కాదనీ, తన డబ్బేననీను! ఆ వయసులోని వాళ్ళు సాధారణంగా అమ్మాయిలు మీదకంటే వెండి బంగారాల మీదే వ్యామోహపడతారు. డబ్బంటే పడి చచ్చిపోతారు. అందుకే నీ చుట్టూ తిరిగేవాళ్ళు మీ డాడి చుట్టూ తిరగరు!" తెలిసిందా నాయనా అన్నట్టు హనుమంతరావు కళ్ళలోకి చూశాడు గౌతమ్.


    "నీకు ఈ విషయంలో బొత్తిగా అనుభవంలేదు. అందుకే అలా మాట్లాడుతున్నావు. వయసు మళ్ళినవాళ్ళకే ఆడవాళ్ళ మీద మోజు ఎక్కువ. కాని వయసులో ఉన్న ఆడపిల్లలు వాళ్ళను పట్టించుకోరు"


    "కాని విదేశాల స్త్రీలు నలభై దాటిన మగవాడినే ఎక్కువ ఇష్టపడతారట" అన్నాడు సుధాకర్.


    "కారణం. ఆ పురుషులకు స్త్రీలను ఎలా గౌరవించాలో తెలుసు"


    "కానేకాదు. మనవాళ్ళు స్త్రీని దేవత అన్నారు. మాతృమూర్తి అన్నారు. మన దేశంలో స్త్రీని గౌరవించినంతగా మరేదేశంలోనూ గౌరవించరట. కానిరోజులు మారిపోతున్నాయ్. మనదేశపు స్త్రీలు పాశ్చాత్య సభ్యతను అనుకరిస్తున్నారు. ఫ్యాషన్ పేరుతో శరీరంలోని వంపుల్ని బజార్లలో ప్రదర్శిస్తున్నారు. స్వతంత్రం పేరుతో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఇదంతా పాశ్చాత్య స్త్రీలను అనుకరించటంవల్లే జరుగుతున్నది"


    "నువ్వు పొరపడుతున్నావ్ రమేశ్! పాశ్చాత్య స్త్రీలు గురించి తెలియకుండా దారుణంగా మాట్లాడకు. అక్కడి స్త్రీలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో కృషి చేస్తూ దేశపురోవృద్ధిలో భాగం పంచుకుంటున్నారు. ఇంతకాలం తనేమో తన సంసారమేగా నాలుగుగోడల మధ్య మగ్గిపోయారు మనదేశంలో స్త్రీలు. వారు ఇప్పుడిప్పుడు బయట అడుగుపెడుతున్నారు. కొత్తగా నడక నేర్చుకునేవాడు అక్కడకూడా పడటంజరుగుతూ ఉంటుంది. అంతమాత్రంచేత మన భారతీయ సంస్కృతిని మట్టిపాలయిపోతుందని గగ్గోలు పెట్టనక్కర్లేదు. స్త్రీకి ఒక నీతి పురుషుడికి ఒక నీతి కాదు. హనుమంతరావు అమ్మాయిల్ని మారుస్తూ తిరుగుతూ ఉంటే మీకు అదో గొప్పతనంగా కన్పిస్తున్నది. అదే అంబుజం విషయం వచ్చేసరికి మీకు చాలా ఘోరం జరిగిపోతున్నట్లు అన్పిస్తున్నది" అన్నాడు గౌతమ్.


    "అబ్బబ్బ! బోర్! సరదాగా కబుర్లు చెప్పుకోక ఏమిట్రా ఉపన్యాసాలూ మీరూనూ!" అన్నాడు హనుమంతరావు సిగరెట్ ను పెట్టెమీద కొడుతూ.


    "ఒరేయ్ హనుమాన్! అదుగో చూడరా మన కాలేజీబ్యూటీ వస్తుంది" అన్నాడు రమేశ్.


    హనుమంతరావు కళ్ళు పెద్దవి చేసుకొని చూడసాగాడు. పెదవులు నాక్కుంటున్నావ్?"


    "ఛ! ఉండరా నువొకడివి!"


    "ఎందుకనో మనవాడు రేణుకను వదిలేశారు?" అన్నాడు రమేశ్.


    "వదిలెయ్యడం ఏమిటి? ఆమె జోలికిపోతే పళ్ళు రాలిపోతాయని తెలుసు మనవాడికి" అన్నాడు గౌతమ్.


    "చింతకాయలు రాలినట్టేనా...."


    "ఛ! నోరుముయ్యండిరా. నేనుకావాలనుకోవాలేగాని....ఇంతవరకూ నాకు ఆ ఆలోచనేరాలేదు."

    
    "కొయ్!కొయ్! అన్నాడు సుధాకర్.


    "కోతలు కోసేది మీరు. మీరందరూ దద్దమ్మలు. నన్నుచూస్తే ఏడుపు. నేను కావాలనుకుంటే ఎంతసేపు! అది ఎప్పుడూ డల్ గా కన్పిస్తుంది. ఒక సరదా లేదు--పాడూ లేదు-- ఈసురోమంటూ ఉండేవాళ్ళంటే నాకు పరమ అసహ్యం!" అన్నాడు హనుమంతరావు.


    "లేతలేత సొరకాయలు బలే కోస్తున్నావ్ లే!"


    "దమ్ముల్లేవురా! ఆవిడగార్ని చూస్తేనే మనవాడికి చమట్లు పడ్తాయి" రెచ్చగొట్టాడు సుధాకర్.


    "ఏడ్చింది. చూస్తూండండి...ఒకరోజు దాన్ని కూడా...."


    ఛ....బొత్తిగా సంస్కారంలేదు" గౌతమ్ కంఠం తీవ్రంగా ఉంది.


    "కరెక్టు! ఎవరికి? దానికేనా బొత్తిగా సంస్కారంలేనిది. అదే నేనూ...."


    "ఆమెకుకాదు....నీకు"


    హనుమంతరావు ఓ క్షణం గౌతమ్ ముఖంలోకి చూశాడు. హనుమంతరావుకు గౌతమ్ అంటే ఇష్టం. ఆమాటే మరొకడు అని ఉంటే చొక్కా కాలర్ పట్టుకుని చెంపచెళ్ళు మనిపించేవాడు.


    "తోటివిద్యార్థినుల్ని అదీ ఇదీ అనడానికీ సిగ్గెలా వెయ్యడంలేదురా. రేపో మాపో డాక్టర్లం కాబోతున్నాం. ఎందుకు మనకీ చదువులు!" అన్నాడు గౌతమ్ విసురుగా.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS