Previous Page Next Page 
బొమ్మరిల్లు పేజి 3


    "ఏమిట్రోయ్. ఆవిడగార్ని అంతవెనకేసుకొస్తున్నావ్? ఏమిటి కథ! ప్రేమిస్తున్నావా? ఆమాట చెప్పు! నేను ఆమె జోలికి వెళ్ళను!"


    "పిచ్చిగా మాట్లాడకు. నీ చెల్లెలూ ఇదే కాలేజిలో చదువుతోందిగా?"


    "అవును! అయితే?"


    "నీ చెల్లెల్ని ఏ కుర్రవాడైనా అవమానిస్తే ఏం చేస్తావ్?"


    "దవడపళ్ళు రాలగొడతాను" రోషంగా అన్నాడు హనుమంతరావు.


    మిగతా ఇద్దరూ గౌతమ్ నూ హనుమంతరావునూ మార్చి మార్చి చూశారు.


    సుధాకర్ కు ఉషారుగా ఉంది. హనుమంతరావు గౌతమ్ ను అంతగా అభిమానించడం అతనికి ఈర్ష్యగా ఉంటుంది.


    బాగా అయింది హనుమంతుగాడికి. ఈ దెబ్బతో గౌతమ్ ముఖంకూడా చూడడు.


    "ఓహో! అలాగే! అంటే పరాయి ఆడపిల్లల్ని అవమానించే హక్కు నీకు జన్మతోనే సంక్రమించిందన్నమాట. నీ చెల్లెల్ని మాత్రం ఎవరూ ఏమీ అనకూడదు" గౌతమ్ వ్యంగ్యంగా అన్నాడు.


    "అవును! అంత!" మొండిగా అన్నాడు హనుమంతరావు.


    "అంత అహంకారం పనికిరాదురా. నువ్వు మంచివాడివేరా? అదే...ఆ జేబు ఉంది చూశావ్ అదే చెడ్డది. ఆడబ్బే నీ చేత ఇలా చేయిస్తుంది. ఇకనీతో వాగి లాభంలేదు. నా ముందు మాత్రం ఇలాంటి మాటలు ఇంకెప్పుడూ మాట్లాడకు. నా స్నేహం నీకు కావాలనుకుంటే...వాక్యం పూర్తి చెయ్యకుండానే చివున లేచి వెళ్ళిపోయాడు గౌతమ్.


    "ఏమిట్రోయ్ రేణుకను అంటే వాడికి అంతకోపం వచ్చింది?" సుధాకర్.


    "ప్రేమిస్తున్నాడేమో!" రమేశ్.


    "వాడిమొహం! వారాలు తిని బతికేవాడికి ప్రేమ ఏమిటి?"


    "నోళ్ళు మూస్తారా?" హనుమంతరావు కోపంగా అన్నాడు.


    "అదేమిట్రావాడి మీద కోపం మామీద చూపిస్తావ్?"


    "వాడిమీదనాకు కోపంలేదు. వచ్చినా అది ఎంతోసేపు ఉండదు. వాడు వారాలు తినే బతకవచ్చు. కానీ వాడు యాచకుడు కాడు. వాడి మనసుకు బీదతనం లేదు. కాని మీరో? నేను కొత్త షర్టువేసుకోవడం పాపం! నాకివమంటే నాకివమనిపోటీ పడ్తారు. గౌతమ్ కు నేనే ఆఫర్ చేసినా తీసుకోడు. తినో తినకో ఆ వచ్చే స్కాలర్ షిప్ తోనేబతుకుతున్నాడు. ట్యూషన్సు కూడా చెప్పుకొని సంపాదించుకుంటున్నాడు. ఇంకెప్పుడూ వాణ్ణి గురించి నాదగ్గిర తేలిగ్గా మాట్లాడకండి"


    హనుమంతరావు చివ్వున లేచి నిల్చున్నాడు.


    సుధాకర్, రమేష్ బిక్కచచ్చిపోయి ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకున్నారు."


    ఆడపిల్లల వైటింగ్ రూం.


    రంగు రంగుల చీరలు, గాజుల గలగలలు, పత్తికాయలుపగులుతున్నట్టు పకపకలు.


    రేణుక గడ్డంకింద చెయ్యి పెట్టుకొని కూర్చుంది. తనచుట్టూ ఉన్న వారి మాటలు గానీ, నవ్వులు గానీ ఆమెకుకన్పించడం లేదు. ఆమె కళ్ళు దూరంగా దేన్నో చూస్తున్నాయ్. ఆమె మనసు రెక్కలు కట్టుకొని నీలాకాశంలో ఎగురుతున్నది. గమ్యం కోసం వెతుకుతున్నది. గమ్యం చాలా దూరంగా కనీకన్పించకుండా ఉన్నది. ఆ గమ్యం గౌతమ్ ను చేరుకోవడమే.


    గౌతమ్! గౌతమ్! మనసులోనే ఎన్నోసార్లు అనుకుంది.


    గౌతమ్! ఎంతచక్కని పేరు. పేరుకు తగ్గట్టు బుద్ధుడిలాగే కన్పిస్తాడు. ఆ ముఖం ఎప్పుడూ ప్రశాంతంగానే కన్పిస్తుంది. తనకు అతని ముఖంలోకి అలా చూస్తూ యుగాలు గడపాలనిపిస్తుంది. ఎందుకు టిప్ టాప్ గా ఉండడు. అతని దుస్తులు చూస్తుంటేనే తెలుస్తుంది. అతను ఎంత బీదవాడో! ఆడపిల్లలకేసి కన్నెత్తి కూడా చూడడు. కల్పించుకొని మాట్లాడటానికి ప్రయత్నించడు. రోగుల్ని చూస్తున్నప్పుడు, సీనియర్స్ రోగాల గురించి వివరిస్తున్నప్పుడూ ఎంతశ్రద్ధగా వింటాడు? తపసిలా కన్పిస్తాడు. నర్సులకూ, రోగులకూ కూడా అతనంటే ఇష్టం. చిన్నగా మాట్లాడతాడు. రోగుల్ని చూస్తున్నప్పుడు అతని ముఖంలో ఆదరణా, కళ్ళలో ఆర్ద్రతా కన్పిస్తాయి. తను దొంగలా అతన్ని గమనిస్తూనే ఉంటుంది. కానీ అప్పుడప్పుడు అతను అనుకోకుండా తనకేసి చూస్తాడు. తనకు ఏదో దొంగతనం చేస్తూ చిక్కిపోయినట్టు అన్పిస్తుంది.


    విద్యార్థులమధ్య అతను ప్రత్యేకంగా కన్పిస్తాడు. బహుశా తనకు ఇష్టం కనక అలా కన్పిస్తాడేమో? లక్షమందిలో ఉన్నా తను గౌతమ్ ఉనికి గుర్తించగలదు.


    ఉపాధ్యాయులకూ, డాక్టర్లుకూ అతనంటే ఎంతో గౌరవం. అతని తెలివితేటల్ని మెచ్చుకుంటారు. మూర్తీభవించిన సంస్కారంలా ఉంటాడు.


    తనకంటే ఒకసంవత్సరం సీనియర్. అందువల్లనే ఎక్కువగా చూసే అవకాశం తనకు దొరకదు. తను అతన్ని పరీక్షగా ఎప్పుడు చూసింది?


    ఆ అవును! ప్రాక్టికల్ చేస్తున్న రోజు. తన అవస్థ పడుతూ వుంటే అతను ఎంతసేపటినుంచి గమనిస్తున్నాడో "నేను హెల్ప్ చెయ్యనా?" మృదువుగా అడిగాడు. అప్పుడే అతన్ని తను పరిశీలనగా చూసింది. ఎందరో తోటివిద్యార్థులతో తను మాట్లాడుతుంది. కాని అతనితో మాట్లాడాలంటే ఏదో తడబాటు కలిగింది. మొదటిసారి ఒక యువకుడితో మాట్లాడటానికి తను తడబడింది. తన సమాధానానికి ఎదురు చూడకుండానే ప్రాక్టికల్ కు సహాయం చేశాడు.


    ఆ రాత్రంతా తను ఆలోచిస్తూనే పడుకుంది. అతను తనను కావాలనే చనువు పెంచుకోవడానికి పలకరించాడనుకుంది. మళ్ళీ మళ్ళీ పలకరిస్తాడని ఆశించింది. కానీ అలా జరగలేదు. తను ఎదురుపడ్డా చూసీచూడనట్టే వెళ్ళిపోతాడు. ఒకటి రెండుసార్లు తనే ఏదో అడిగింది. తను అడిగిన దానికి సమాధానం చెప్పి వెళ్ళిపోయాడు. తనకు నిరాశతోపాటు అతని మీద చిరాకు కూడా కలుగుతుంది.


    ఛ! అతన్ని గురించి తను యింతగా ఆలోచించడం ఏమిటి? తను కావాలనుకుంటే ఆమాత్రం మగవాడే దొరకడా? అంతపట్టీపట్టనట్టు ఉండే వాడిని తను అహర్నిశలు తల్సుకోవడం ఏమిటి?


    ఎన్నోసార్లు అతని పేరును కూడా ఉచ్చరించకూడదు అనుకుంది. అయినా తన మనసు మాత్రం అతని నామాన్నే జపిస్తుంది. తన కళ్ళలో అతని రూపమే మెదులుతుంది. అతను అంత దూరంలో కన్పించగానే తన మనసులో ఏదో మధురమైన ఆలాపనతో పాటు తన గుండె కూడా ఆగిపోయినట్టు అనిపిస్తుంది. అతను తనను పట్టించుకోకుండా వెళ్ళగానే గుండెలో ఏదో గుబులు. అక్కడ నిల్చోవాలనిపించదు. ఎక్కడా నిల్చోవాలనిపించదు. ఎక్కడికో పరుగులు తియ్యాలనిపిస్తుంది.


    ఎందుకు?

    
    తను గౌతమ్ ను ప్రేమిస్తున్నది. ప్రేమలో ఇంత బాధ ఇంత ఆనందం ఉన్నాయా?


    "ఏయ్ రేణూ?"


    "ఏమిటే పగలే కలలు కంటున్నావ్?"


    "ఎవరా రాజకుమారుడు?"


    "ఇంకెవరు, గౌతమ్!"


    గౌతమ్ పేరు విన్పించగానే త్రుళ్ళిపడింది. ఆలోచనలనుంచి బయట పడింది. చుట్టూ కలయచూసింది.


    "ఇలా కలలుకంటూ పెద్ద పెద్ద నిట్టూర్పులు విడవకపోతే ఆ రాజకుమారుడితో చెప్పెయ్యరాదూ?"


    రేణుక సుగంధి కేసి బిక్కుబిక్కుమంటూ చూసింది.


    "అదేమిటే అలా చూస్తావ్? నాకు ఎలా తెలిసిపోయిందనా?" అన్నది సుగంధి.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS