Previous Page Next Page 
నానీ పేజి 2


    చేయి పట్టుకుని నడుస్తూనే తలపైకెత్తి తాతయ్య మొహంలోకి చూశాడు.

 

    శాసించే వేదంలా, బోధించే పురాణంలా, రంజించే కావ్యంలా మూడు రూపాలూ మూర్తీభవించిన విశ్వేశ్వరశాస్త్రి నానీకి తాతయ్య మాత్రమే కాదు... అమ్మనే పదాన్ని ఉచ్ఛరించడానికి ముందే ఓంకారం గురించి తెలియపరిచిన తొలిగురువు .

 

    కాన్వెంట్ లో థర్డ్ స్టేండర్డ్ చదివే నానీకి తాతయ్య చెప్పే శ్లోకాలు వల్లించడానికి నోరు తిరక్కపోయినా ఊరందరూ గౌరవించే తాతయ్యంటే తనకి వల్లమాలిన భక్తికావడంతో చెప్పింది ఇట్టేపట్టేసి తాతయ్యని సంతృప్తి పరుస్తుంటాడు.

 

    ఏటిఒడ్డునుంచి మామిడితోపులోకి అడుగుపెట్టిన విశ్వేశ్వరశాస్త్రి వృద్ధాప్యం మూలంగా కళ్ళు సరిగా కానరాక మనవడిచేయిని గట్టిగా పట్టుకున్నాడు.

 

    కాలవగట్టుమీదున్న సన్నని తూముదాటితే వూళ్ళో అడుగుపెట్టినట్టే.

 

    తాటిచెట్టును నరికి తోవగాచేసిన ఆ తూముదగ్గరకి రాగానే ముందు తనే నడుస్తూ వెనుకగా వచ్చే తాతయ్యకి ఆసరా ఇచ్చాడు నాని.

 

    "నమస్కారం బావగారూ" తూముకి అవలివేపు నిలబడ్డ రామనాథశాస్త్రి పలకరించాడు.

 

    పాండిత్యంలో ఆయనకూడా ఉద్ధండుడేకాని మరిది వరస కాబట్టి విశ్వేశ్వరశాస్త్రితో అప్పుడప్పుడూ ఛలోక్తులు విసురుతుంటాడు. "ఏటికెళ్ళి వస్తున్నట్టున్నారు?"

 

    "అవును. గూటికి చేరాలని" మృదుగంభీరంగా నవ్వాడు విశ్వేశ్వరశాస్త్రి.

 

    "ఊతకర్రలేనిదే వృద్ధాప్యం అడ్డుపడుతున్నట్టుంది" నానీనే చూస్తూ అన్నాడాయన.

 

    "తాత కర్ర ఆసరా లేకపోతే తనూ నడవనంటూంది ఊతకర్ర."

 

    మనవడితోపాటు ముందుకు నడిచాడాయన.

 

    పెరుగుతున్న నాగరికతకు ప్రతీకగా ఊరిలో కొత్తగా వేయబడ్డ విద్యుద్దీపాల కాంతిలో శాస్త్రిని చూసిన కొందరు వినమ్రంగా నమస్కరించి పక్కకు జరుగుతుంటే ఆత్మీయంగా పేరుపేరునా పలకరిస్తున్నాడాయన.

 

    అలాంటప్పుడు నానీ మరీ గర్వపడిపోతుంటాడు ఆ తాతకి తనొక్కడే మనవడైనందుకు.

 

    మరో అరఫర్లాంగుదూరం నడిచారోలేదో హఠాత్తుగా ఓ ఇంటిలోనుంచి ఓ స్త్రీ ఆర్తనాదం వినిపించగానే క్షణం ఆగాడు.

 

    అప్పటికే శాస్త్రిని చేరిన వయసుడిగిన రామిరెడ్డి "అయ్యా! కోడల్ని... కోడల్ని కొట్టి చంపేస్తున్నాడు మా రంగడు" అంటూ చేతులు పట్టుకుని ప్రాధేయపడగా నెమ్మదిగా ఆ ఇంట్లో అడుగు పెట్టాడాయన.

 

    తాగిన నిషాలో భార్యను చిదకగొడుతున్న రంగారెడ్డి టక్కున ఆగిపోయాడు శాస్త్రిని చూడగానే.

 

    ఏడుస్తూ శాస్త్రి కాళ్ళను చుట్టేసింది లక్ష్మి- రంగారెడ్డి భార్య.

 

    "అయ్యా" రామిరెడ్డి చెప్పుకుపోతున్నాడు. "సంపాదించే శక్తి లేనోడ్ని కాబట్టి యిప్పుడు ఇంటిలో వాడిదే ఇష్టారాజ్యం అయిపోయింది. తాగి రావడం పెళ్ళాన్ని చావబాదడం ఇదే తంతైపోయింది."

 

    లక్ష్మిని ఆప్యాయంగా పైకి లేపాడు శాస్త్రి. పూజలూ పురస్కారాలూ పెద్దలయెడ గౌరవం గల ఆడపిల్లగా లక్ష్మి శాస్త్రికి తెలీనిదికాదు.

 

    "కళంకంలేని మనస్సును నిష్కళంకంగా మరొకరికి అర్పించే ప్రక్రియే రంగా కళ్యాణమంటే. భావం తెలుసుకుని ప్రవర్తించేది మంచిభార్య ఎలా అవుతుందో బాధ్యతను తీసుకుని భరించేవాడూ మంచి భర్త కాగలుగుతాడు. అత్తవారింటి మెట్లెక్కే మెట్టెలకి మకిలిపట్టినా, అయినింటి ఆడపడుచు మెట్టినింట కన్నీళ్ళు పెట్టుకున్నా అది శుభప్రదం కాదు. నీకోసం నిన్ను నిలుపుకోవడంకోసం వ్రతాలుచేసే భక్తిగలదే భార్యంటే. మగాడు చేయగలిగేదీ చేయాల్సిందీ ఒకే ఒక వ్రతం. అదే ఏకపత్నీవ్రతం... ఆ వ్రతం భగ్నమైందా అది నీకు శాపమే అవుతుంది."

 

    రంగారెడ్డి తలవంచుకు నిలబడిపోయాడు. బిడియంగా నేలచూపులు చూస్తున్న అతడ్ని గమనించగానే అర్థమైపోయింది ఆ మాటలు ఎంత బలంగా పనిచేశాయో అన్నది.

 

    నానీతోబాటు శాస్త్రి బయటికి వచ్చేశాడు. మరో పదిగజాల దూరం వెళ్ళేసరికి శాస్త్రిని చేరుకున్న రామిరెడ్డి "పంతులుగారూ..." కృతజ్ఞతగా చూశాడు." వాడికి మీరంటే చెప్పలేనంత గురి. అసలు మీకెప్పుడూ చెబుదామనుకుంటూనే బాగా ఆలస్యం చేసేశానయ్యా... మీకు కోపమొస్తే శాపంలా పనిచేస్తుందని అప్పుడప్పుడు నీగురించి వాడు నాకు చెప్పింది గుర్తుచేసుకుంటే నా కోడలు బ్రతుకు మీరుతప్ప బాగుచేసే దేవుడెవరూ లేరయ్యా... పూర్తిగా మారిపోయాడు అనలేనుకాని ఎప్పుడైనా ఇటొచ్చినప్పుడు కాస్త మందలిస్తుండండి చాలు" జవసత్వాలుడిగి కొడుకుపై ఆధారపడిమాత్రమే బ్రతుకుతున్న అతడు చెప్పింది  విని ముందుకు నడుస్తుంటే అసంకల్పితంగా తన స్థితీ గుర్తుకొచ్చింది.

 

    బాల్యంనుంచీ అదుపాజ్ఞలమధ్య పెంచడంవలననేమో తన కొడుకు ఏనాడూ తనుగీసిన గీత దాటనందుకు అంతర్గతంగానైనా ఎంతో సంతృప్తిపడ్డాడాయన.

 

    నిజానికి ఆయనకూడా ప్రస్తుతం కొడుకు సంపాదనపై ఆధారపడి బ్రతుకుతున్నవాడే.

 

    కాని ఎంత అణకువని!

 

    తన గదిలో ఏ గ్రంథపఠనంలోనో మునిగిపోయే తను ఉన్నంతసేపూ అసలు గొంతుసైతం వినిపిస్తుందా!

 

    "తాతయ్యా!"

 

    మనవడి పిలుపుతో ఆలోచననుంచి తేరుకున్నాడాయన.

 

    "నీకు కోపమొస్తే శాపమైపోతుందా?"

 

    రామిరెడ్డి మాటల్ని మననం చేసుకుంటూ నానీ ఆ ప్రశ్న వేశాడని మృదువుగా నవ్వేశాడాయన.

 

    "మరేం... నేనేం అంటే అది జరిగిపోతుంది."

 

    "నిజం" విప్పారిత నేత్రాలతో ఆగి తాతకళ్ళల్లోకి చూశాడు తలపైకెత్తి.

 

    "ఆఁ... ఈ తాతయ్య కావాలనుకుంటే తాటిపండుకూడా ఠక్కున ప్రత్యేక్షమై పోతుంది."

 

    "తాటిపండు కాదు తాతయ్యా..." మథనపడిపోతున్నాడు నానీ ఎలా చెప్పాలో తెలీక సందిగ్థతతో.

 

    "సంగతేంట్రా తాతయ్యా..." హఠాత్తుగా మనవడి కళ్ళలో నీరు చూసి కంగారుపడుతూ పైకెత్తుకున్నాడు.

 

    "మరేమో" వెక్కిపడుతున్నాడు నానీ. "ఊరందరూ నీమాట వింటారుగా... మరి నాన్నకీ చెప్పొచ్చుగా."


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS