Next Page 
గిఫ్ట్ పేజి 1


                                  గిఫ్ట్
   
                                          _ కురుమద్దాలి విజయలక్ష్మి

 

                                                       


    "బంగారుతల్లీ !"

    కూతురుని పిలవబోతూ గుమ్మంలో ఒక్కక్షణం ఆగాడు ఛటర్జీ.

    ఛటర్జీ పూర్తిపేరు నికుంజో కృపలాని ఛటర్జీ. అరవయ్యో పడిలో పడినా మనిషి దారుఢ్యంగా మిలటరీ వాడిలా వుంటాడు.

    నొప్పించక తానొవ్వక అన్నట్లు తన పనేదో తనేమో ....అంతే! అందరికి సహాయం చేయడం, పసిపిల్లవాడిలాగా మాట్లాడడం, చిన్నపిల్లవాడిలాగా గంతులు వేయడం చేస్తుంటాడు.

    పట్టుమని పది నిమిషాలు ఓ చోట కూర్చోడు. ఏదో ఒక పని చేస్తూనే వుంటాడు. మార్నింగ్ వాక్. ఆ తర్వాత కొద్దిపాటి వ్యాయామం. కాఫీ సిప్ చేస్తూ దినపత్రిక తిరగెయ్యటం. అన్నీ మంచి అలవాట్లే.

    "మీ పేరేమిటి అంకుల్?" అని ఎవరైనా అడిగితే.

    నికుంజ్ కృపలాని ఛటర్జీ. మూరకొలిస్తే సరిగ్గా మూరెడు పేరు. సింపుల్ గా చెప్పాలంటే ఛటర్జీ" అంటూ తన మీద తనే జోక్ వేసుకుంటూ పేరు చెపుతాడు.

    ఛటర్జీ ఇప్పుడు వెళ్ళేది ఈవినింగ్ వాక్ కి.

    గుమ్మంలో ఆగిన ఛటర్జీ ఒకసారి జేబు తడుముకున్నాడు. పైపు ,లైటర్ చేతికి తగిలాయి. ఎడం చేతివైపు చూసుకున్నాడు. పాత హేండ్ స్టిక్ కాక ఈ మధ్యనే హరీన్ ప్రెజెంట్ చేసిన కొత్త హాండ్ స్టిక్ వుంది. అది చూసి తృప్తిగా తల పంకించాడు.

    కొద్దిగా వంగి కాలికి వేసుకున్న షూస్ చూసుకున్నాడు. ఎగుడు దిగుడు కాకుండా ఒకేరకంగా బూట్లు లేసులు ముడివేసి వున్నాయి. ఈ తఫా కళ్ళజోడుని సరిచేసుకున్నాడు.

    ఛటర్జీ అన్నీ క్రమబద్ధంగా వుండాలి. కొద్ది మార్పు తోచినా ఆయన అనీజీగా ఫీలవుతాడు. అలా కాకుండా వుండతానికే ఇలా ముందు జాగ్రత్త వహిస్తూ వుంటాడు.

    కూతురు షాలిని చదివింది మామూలు చదువు కాదు. ఎం.బి.బి.ఎస్ ఫోర్తు ఇయర్ చదువుతోంది. రాత్రింబవళ్ళు చదువుతోకుస్తీ పడుతూ వుంది.

    ఛటర్జీకి యిష్టమైన చదువు. షాలిని చిరకాల వాంఛ ఒకటే మెడిసిన్ చదవటం.

    మెడిసిన్ లో సీటు షాలినికి చాలా తేలికగా వచ్చింది. చదువు పూర్తయి బోర్డు కట్టడం ఒకటే తరువాయి.

    "నేను షికారుకి వెళుతున్నాను. తలుపేసుకో." అని షాలినితో చెపితే మధ్యలో షాలిని లేస్తే చదువుకి అంతరాయం కలుగుతుంది. అలా అని చెప్పా పెట్టకుండా వెళ్ళడం ఎలా?

    ఆఖరికి చెప్పి వెళ్ళడమే మంచిదని నిర్ణయానికి వచ్చాడు ఛటర్జీ.

    "బంగారు తల్లీ! నే అలా కాసేపు తిరిగివస్తాను నువ్వు లేచినప్పుడు తలుపువేసుకో. నేను రావడం కాస్త ఆలస్యమయినా కంగారుపడకు" అని చెప్పి, తలుపు దగ్గరగా వేసి, షికారుకి బయలుదేరాడు ఛటర్జీ.

    ఛటర్జీ కొంతదూరం వెళ్ళగానే రమేష్ ముఖర్జి ఎదురువచ్చాడు. ముఖర్జీ కొడుకు పాండే కూడా మెడిసన్ చదువుతున్నాడు.

    ఇరువురూ ఎదురెదురు పడటంవలన ముందు పలకరింపుగా చిరునవ్వు నవ్వుకున్నారు. ఆ తరువాత వాళ్ళిద్దరి మధ్యా కొద్ది సంభాషణ జరిగింది.

    ఆ తరువాత.

    "మనం బెట్ కాద్దామా!" ఛటర్జీ అడిగాడు.

    "ఏ విషయంలో?" ముఖర్జీ కరోనాను వెలిగించుకుంటూ అడిగాడు.

    "మెడిసిన్ లో గోల్డ్ మెడల్ ముందుగా మీవాడు సంపాదిస్తాడా? మా అమ్మాయి సంపాదిస్తుందా? ఈ విషయంలో బెట్ కాస్తే ఎలా వుంటుందంటావ్?" నవ్వుతూ అడిగాడు ఛటర్జీ.

    "నిక్షేపంగా వుంటుంది. కాని నేను మీ షాలినివైపు బెట్ కాస్తాను" ముఖర్జీ అన్నాడు.

    "అదేమిటి?"

    "అదంతే!"

    "అదంతే అంటే నాకెలా తెలుస్తుంది? విడమరచి చెబితే నాకు అర్ధమవుతుంది. నీ అంత గడుసువాడిని కాదు నేను ముఖర్జీ! నేను ముక్కు సూటిగా మాట్లాడతాను. నీవేమో తిప్పి తిప్పి మాట్లాడతావు. నా కర్దమయ్యేభాషలో తేలికగా చెబుదూ!" అని ఛటర్జీ అడిగాడు.

    "షాలినీ ప్రక్కన బెట్ కాస్తే నేను గెలుస్తాను కాబట్టి - గోల్డుమెడల్ చదువుల సరస్వతి షాలినికి తప్ప ఎవరికీ రాదు కాబట్టి నేనే షాలిని తరపున బెట్ కాస్తున్నాను. పందెం డబ్బు ఎంతో చెప్పు" నవ్వుతూ అన్నాడు ముఖర్జీ.

    ఉత్సాహం పట్టలేక ముఖర్జీ రెండు భుజాల మీదా చేతులు వేసి ఆనందంగా కుదుపుతూ, ఓహ్! ముఖర్జీ నీ మాటలు నా చెవులకి అమృతం సోకినట్టు వినవస్తున్నాయి. పదివేల వరహాలు ఇప్పటికిప్పుడు నీపరం చెయ్యాలని వుంది. కానీ, దురదృష్టమేమిటంటే ఇపుడు ఒక్క వరహా కూడా లేదు. సిగరెట్టు లైటర్, పైపు వున్నాయి. అవి కావాలంటే ఇస్తాను" అన్నాడు ఛటర్జీ.

    "ఈ కరోనా కమ్మదనం నీ పైపుకి రాదు. రేపు మీ ఇంటికి వస్తాను. నీ చేత్తో "టీ" ఇవ్వు చాలు."

    "చాలా చిన్న కోరిక"

    "చిన్న కోరికలే ఎప్పుడూ మానవుని తృప్తిపరుస్తాయి. పెద్ద కోరికలెప్పుడూ తొందరగా తీరవు ఎందుకొచ్చిన గోల!" ముఖర్జీ నవ్వుతూ అన్నాడు.

    ఛటర్జీ కూడా చిన్నగా నవ్వి.

    "నువ్వు చెప్పింది కూడా నిజమే" అంటూ తృప్తిగా తల ఆడించాడు.

    ముఖర్జీతో మరో రెండు మాటలు మాట్లాడి ముందుకు సాగాడు ఛటర్జీ.

    "నా బంగారు తల్లిమీద నాకే కాదు వూళ్లో అందరికీ కూడా ఎంత నమ్మకమో!" కూతుర్ని గురించి ఆలోచిస్తూ నెమ్మదిగా అడుగులేస్తున్నాడు ఛటర్జీ.

    ఛటర్జీ తాపీగా అడుగులు వేస్తూ, నాలుగు వీధులూ చుట్టి, ఆ తరువాత పార్కుకి వెళ్తాడు. పార్కులో ఓ అరగంట కూర్చొని, తిరిగి సరాసరి ఇంటికి వస్తాడు. ఇది ప్రతినిత్యం జరిగే కార్యక్రమమే.

    ఛటర్జీ రెండు వీధులు తిరిగి మూడో వీధిలోకి ప్రవేశించేసరికి, అక్కడ ఆయనకి ఓ ఇంటిముందు జనం గుమిగూడడం కనిపించింది.

    ఏదో జరిగితేనే అంతమంది గుమికూడారు అన్న విషయం అర్ధమైంది ఛటర్జీకి. ఛటర్జీ కాస్త నడకవేగం పెంచి అక్కడికి చేరాడు.

    మూగిన జనాన్ని తప్పించుకుని, మధ్యలోకి వెళ్ళడానికి ఆయనకి సాధ్యంకాలేదు.

    "ఏం జరిగింది ?" అక్కడున్న ఒకరిద్దర్ని అడిగాడు.

    "ఇలాంటిది చూడాలిగానీ, చెబితే అర్ధంకాదు!"

    "వెళ్లి చూడండి!"

    "ప్రపంచలో ఎన్ని వింతలో !"

    "ఇలాచేసే మనుషులు కూడా వుంటారా ?"

    "బహుశా ఏ దుండగుల పనో అయి వుంటుంది !"

    ఇలా తలా ఓ రకంగా పొడిపొడి జవాబులు ఇచ్చారు గానీ, అసలు విషయం ఏమిటో ఒక్కళ్ళూ చెప్పలేదు.

    ఛటర్జీ మెల్లిగా జనాన్ని తప్పించుకొని ఎలాగో అలా మధ్యలో చేరాడు.

    ఎదుటి దృశ్యం చూసి ఆశ్చర్యంతో అతని కళ్లు పెద్దవయ్యాయి.

    ముద్దువస్తూవున్న బుల్లి ఎర్రరంగు మారుతీ కారు సగం తగలబడి పోయివుంది. సీట్లు పూర్తిగా కాలిపోయాయి. టైర్లూ కాలిపోయాయి. సగభాగం నల్లగా మారివుంది. ఆ కారు తాలూకా వాళ్లు కారు దగ్గర నిలబడి లబలబలాడుతున్నారు.

    "ఏం ప్రమాదం జరిగింది?" ఛటర్జీ ప్రక్కనున్న కుర్రాడిని అడిగాడు.

    "నాకూ తెలియదండీ ! నేనూ ఇప్పుడే వచ్చాను!" కుర్రాడు సమాధానం చెప్పాడు. 


Next Page 

  • WRITERS
    PUBLICATIONS