Previous Page Next Page 
గిఫ్ట్ పేజి 2

    చటర్జీ ఇటు తిరిగి పక్కనున్న ఆయన్ని అడిగాడు "ఏం జరిగింది?" అంటూ.

    "నిక్షేపంలాంటి కారుని ఎవరో తగలబెట్టారు!"

    "కనపడుతూనే వుందిగా, అది తెలుస్తోంది! ఎవరీ పాడుపని చేసినట్లు?"

    "అది కారు ఓనరుకే తెలియక లబ్బున గోలపెడుతున్నాడు.

    తెల్లవారుఝామున ఏ వూరో వెడదామనుకుని కారుని వాకిట్లోనే వుంచాడట. రాత్రి పన్నెండు గంటలదాకా మేలుకునే వున్నారట ఇంటి వాళ్లు. వాళ్లు తెల్లవారుఝామునే లేచి చూసేసరికి అప్పటికే సగం మండిపోయి మంటలు చల్లారే స్థితిలో వుంది...." ఆయన తనకు తెలిసినంతవరకూ చెప్పాడు.

    "చాలా విచిత్రంగా వుంది. కారులో పెట్రోల్ వుంటుంది. పెట్రోల టాంకు బద్దలయి కారు అంతా కాలిపోయి వుండాలి కదా! కాలీ కాలనట్లు ఇలా వుందేమిటి? పైగా తెల్లవారుఝామున ఎప్పుడో జరిగితే ఈ జనమేమిటి? ఇలా గుమిగూడి వుండడమేమిటి?" చటర్జీకి ఎన్నో అనుమానాలు వచ్చాయి కానీ కొన్ని అనుమానాలే వెలిబుచ్చాడు.

    పోలీసులు ఈ కారుని ఇక్కడనుండి కదిలించవద్దన్నార్ట. ఇదేదో చాలా తమాషా అయిన కేసు. కారుని పాడుచేసిన వాడెవడో. కారుకి అల్లంత దూరాన మూరెడు పొడుగు అట్టముక్క విడిచి వెళ్ళాడుగ. ఆ అట్టముక్కమీద ఏదో పాక్ చేసి వున్న గిఫ్ట్ తాలూకా బొమ్మ వుందట. అలా వుండటమేకాక పెద్ద పెద్ద అక్షరాలతో దానిమీద ఇంగ్లీషులో 'ది గిఫ్ట్' అని అందంగా రాసి వుందట పైన 'బి' అనే అక్షరం, మధ్యలో 'ది గిఫ్ట్' అని క్రింద ఒకమూల "పి" అని అక్షరం వుంది. ఈ అట్టముక్క మీద వున్న అక్షరాలకీ, ఈ కారు తగలబడటానికి ఏమన్నా సంబంధం వుందేమో అని విచారిస్తున్నారు ఇన్సూరెన్స్ వాళ్లు రావాలి ఇంకా చాలా గొడవవుంది కదండీ! ఇదేదో చాలా పెద్దకేసే!" తను తెలుసుకున్నంతవరకూ చెప్పాడాయన.

    "చాలా విచిత్రమయిన కేసే" అనుకున్నాడు ఛటర్జీ.

    ఎవరయినా చచ్చిపోయి ఏడుస్తున్నా, ఎవరి వస్తువులయినా పోయి బాధపడుతున్నా చుట్టూ వున్నవాళ్లు అసలు విషయం వదిలేసి, "ఇలా చేస్తే బావుండేది. అలా చేస్తే బావుండేది" అని వెధవ సలహాలు ఇస్తుంటారు. బాధపడే వాళ్ళను చూస్తుంటే పక్కవాళ్ళకి బోల్డు కాలక్షేపం. ఉచిత సలహాలు ఇస్తూ దుఃఖాన్ని మరింత ఎగదోస్తూ టైమ్ పాస్ చేసుకుంటూ వుంటారు.

    ప్రస్తుతం ఇప్పుడక్కడ అదే జరుగుతోంది.

    అక్కడ వుండి ఇంక తెల్సుకోవాల్సిందేమీ లేదు. ఛటర్జీ గుంపులోంచి బయటపడి ముందుకు సాగాడు.

    "ఎర్రరంగు ముచ్చటైన బుల్లి మారుతీకారు ముద్ద మందారంలాగా వుంటుంది. తనకీ షాలినీకి ఆ కారంటే ఎంత యిష్టమో!...."

    ఆ కారు గురించీ ,ఆ సంఘటన గురించీ ఆలోచిస్తూ పార్క్ దాకా వచ్చాడు ఛటర్జీ.

    అప్పుడు ఆయనకి గుర్తువచ్చింది ఆ విషయం....

    "కారు ఎందుకు ధ్వంసం చేయబడిందో అప్పుడు ఆయనకి అర్ధం అయ్యింది.

    "ఈ రోజు ఏప్రిల్ ఫస్ట్ ఎవడో సరదాగానో, కారు యజమానిని ఏడ్పించే శత్రుత్వం వుండో మారుతీకారుని ధ్వంసం చేశాడు. "ఏప్రిల్ ఫూల్ అని రాసే బదులు "ది గిఫ్ట్" అని రాసి వుంటాడు. ఇది ఫూని ని చెయ్యడానికి చేసిన పని" అని తన ఆలోచన్లు రాంగ్ రూట్లో పయనిస్తున్నాయని గ్రహించి ఛటర్జీ ఆగిపోయాడు.

    "ఏప్రిల్ ఫూల్ అనేది సరదాగా చేసేపని. నవ్వుకునే లాగానో ఆశ్చర్యపోయేలాగానో చేస్తారుగాని ఇంత భారీ నష్టం తెచ్చిపెట్టరు. దీని వెనుక పెద్ద కారణం వుందని ఇది ఇక్కడితో ఆగదని ఎవరికీ తెలియదు. ఆఖరికి దీని గురించీ, ఇంతగా ఆలోచిస్తున్న ఛటర్జీకి కూడా తెలియదు.


                                          2


    రాత్రి పన్నెండు గంటలయ్యింది.

    భర్త రాకకోసం కామాక్షి ఎదురుచూస్తూ భోజనం చెయ్యకుండా కూర్చుంది. ఆమె ఆలోచనలన్నీ భర్త మీదనే సాగుతున్నాయి.

    కామాక్షి తల్లి మహాలక్షమ్మ ఒక నిద్రతీసి పడుకున్నది కాస్తాలేచి వచ్చింది.

    కిటికీ దగ్గరగా కూచుని, బయటికి చూస్తూ దీర్ఘాలోచన చేస్తున్న కూతురిని చూడగానే మహాలక్ష్మమ్మ హృదయం ద్రవించింది.

    "కామాక్షి" దగ్గరగా వస్తూ పిలిచింది మహాలక్ష్మమ్మ.

    కామాక్షి చిన్న వులికిపాటుతో తెప్పరిల్లి, "ఎందుకమ్మా! లేచి వచ్చావ్?" తల్లిని చూసి అడిగింది.

    "నువ్వింకా భోజనం చెయ్యలేదు కదూ !" కూతురి ప్రశ్న వినిపించుకోకుండా అడిగింది మహాలక్ష్మమ్మ.

    "ఆకలిగా లేదమ్మా!" చిన్న అబద్ధం ఆడింది కామాక్షి.

    ఆ మాట వినగానే, ఆ తల్లి హృదయం బాధగా మూలిగింది.

    "నిజం నాకు తెలుసులేమ్మా!" అన్నట్లు జాలిగా చూడడం మినహా ఏమీ చెయ్యలేకపోయింది ఆ తల్లి.

    మహాలక్ష్మమ్మ బి.పి. పేషెంట్ రాత్రిళ్ళు నిద్రమాత్రలు వాడటం, పగలు తగినంత విశ్రాంతి తీసుకోవటం తప్పించి పెద్దగా పనేమీ చెయ్యదు. మధ్యరకం సంసారాల్లో తప్పించుకుని తిరుగుదామన్నా కుదరదు. రోజు మొత్తంమీద, తప్పనిసరయి ఎంతో కొంతపని చెయ్యాల్సిందే. కూరలు తరగడం, బియ్యం కడిగి ఇవ్వడం లాంటివి ఎవరయినా చేస్తే. వంటవరకూ చేస్తుంది. పనిమనిషి అంట్లుతోమి కడిగి వెడితే, అవి మళ్ళా శుభ్రంగా కడిగి బోర్లిస్తుంది. రోజు మొత్తంమీద అలాంటివే చిన్నచిన్న పనులు చేస్తుంది.

    మధ్యతరగతి సంసారాల్లో బాధ్యతలు ఎక్కువ. కష్టాలు ఎక్కువ. ఈ మూడూ మాధవయ్య యింట్లో కూడా వున్నాయి. ఇవన్నీ కాక అధమ బాధ్యతలూ, చికాకులు కూడా ఎక్కువే.

    మాధవయ్య ఎవరోకాదు మహాలక్ష్మమ్మ భర్త.

    ఆయనకి నలుగురు కూతుళ్ళూ, ఒక కొడుకు. అందరికీ పెళ్లిళ్లు చేసి అత్తవారింటికి పంపించాడు. ఒక్కడే కొడుకు. ఆడపిల్ల పెళ్ళిళ్ళకి అయిన అప్పులు సగం అలానే వున్నాయి. కొడుక్కి పెళ్ళయింది కోడలు పుట్టింటికి వెళ్ళింది పురిటికోసం.

    మూడో కూతురు కామాక్షి. భర్త పాండురంగం. అతని వుద్యోగం అకస్మాత్తుగా వూడిపోయింది. ఆ వుద్యోగ విషయంలో నానాగోల జరగడం, పేపర్లకెక్కటం అతను జైలుకి వెళ్ళేంత పనికావటం చాలా జరిగింది. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు ఎలాగో అలా అన్నింటినీ తప్పించుకో గలిగాడు. కానీ మళ్ళీ వుద్యోగం అంటూ రాలేదు.

    ఉన్న ఊళ్ళోనూ, తన వాళ్ళదగ్గర మరింత మాటలు పడుతూ బాధతో తల బొప్పులు కడుతూ వుంటే అప్పటి నుంచీ అతను అదోరకం మనిషిలా తయారయ్యాడు. అక్కడి బాధలు పడలేక భర్తకి వుద్యోగం లేనందువల్ల కామాక్షి భర్తను తీసుకుని పుట్టింటికి వచ్చింది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS