Next Page 
ఊగవే ఉయ్యాల పేజి 1


                         ఊగవే ఉయ్యాల
                 
                                                   - కొమ్మూరి వేణుగోపాలరావు

 


    బస్ మెడికల్ కాలేజీ కాంపౌండ్ దాటి ఆవరణలో ఆగాక ఆడపిల్లలందరూ ఒక్కొక్కరుగా క్రిందకు దిగుతున్నారు.    

 

    చివరకు కల్యాణి మిగిలింది. మెట్టు వరకూ వచ్చి ఆగిపోయి బెదురుచూపులు చూస్తూ నిలబడింది. అప్పటికే నాలుగడుగులు వేసి, ఏదో అనుమానం వొచ్చి తలత్రిప్పి చూసిన మాధవి మళ్ళీ వెనక్కి తిరిగివొచ్చింది.

 

    "ఆగిపోయారేం?" అనడిగింది.

 

    "నాకు... భయంగా వుంది."

 

    "ర్యాగింగ్ గురించా?"

 

    కల్యాణి తల ఊపింది.

 

    "ఏం చేస్తాం? ఉయ్ హావ్ టు ఫేస్ యిట్. ధైర్యం తెచ్చుకోవాలి. రండి" అని చేయి అందించింది. తప్పనిసరి అయినట్లు కల్యాణి ఆమె చేయి పట్టుకుని క్రిందకు దిగింది.

 

    ఇద్దరూ ప్రక్కప్రక్కన నడుస్తున్నారు. ఇద్దరికీ పెద్దగా పరిచయం లేదు. అంతకు ముందురోజు సాయంత్రమే ఇద్దరూ హాస్టల్లో చేరేటప్పుడు కలుసుకున్నారు. ఇద్దరికీ కలిపి ఒకరూమే వచ్చేసరికి రాత్రికి కొద్దిగా సన్నిహితమయ్యారు.

 

    రాత్రి సంభాషణలో ఒకరికొకరు వాళ్ళ ఊర్లేమిటో, తల్లితండ్రులేమిటో తెలుసుకున్నారు.

 

    "మీకెన్నిమార్కులు వొచ్చాయి?" అనడిగింది కల్యాణి మాటల మధ్య.

 

    "నూట ముప్పయి రెండు మీకు?"

 

    "నూట ఇరవై ఆరు." అంది కొంచెం సిగ్గుపడుతూ.

 

    ఇద్దరూ ఫస్ట్ ఛాన్స్ లో పాసయ్యారని తెలుసుకున్నారు.

 

    కల్యాణికి మిగతావారికన్నా ఎందుకో మాధవే నచ్చింది. ఆమె చాలా చొరవగా, ధైర్యంగా వున్నట్లు కనిపించింది.

 

    ఆ రాత్రి సీనియర్సంతా కొత్తగా జాయినయినవాళ్ళని ఒక ఆట పట్టించారు.

 

    మెస్ లో జూనియర్స్ తో ఇష్టం వచ్చినట్లు సర్వింగ్ చేయించుకున్నారు.

 

    గీత అనే ఓ అమ్మాయిని "నీ హాబీ ఏమిట"ని అడిగింది ఓ సీనియర్.

 

    "డాన్స్" అందా అమ్మాయి.

 

    "ఓహో! భారతనాట్యం చేస్తావా? చెయ్యి చూద్దాం."

 

    ఆ అమ్మాయి ముందూ, వెనకా ఆలోచించకుండా "మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో..." అని తానే పాట అందుకుని చకచకా చేసెయ్యటం మొదలుపెట్టింది. సీనియర్స్ తెల్లబోయారు. నిజంగా ఆ అమ్మాయి చాలా బాగా చేస్తోంది.

 

    "ఆపు. చాల్లే చూడలేకపోతున్నాం" అని మధ్యలో ఆపించేశారు.

 

    ఇంకో జూనియర్ స్టూడెంట్ ని పాట పాడమన్నారు.

 

    "నాకు పాటరాదు" అందా అమ్మాయి.

 

    "అయినాసరే పాడాల్సిందే."

 

    విధిలేక ఆ అమ్మాయి" నెమలికి నేర్పిన నడకలివీ" అనే పాట అందుకుంది.

 

    ఓ సీనియర్ చప్పున ఎక్కడ్నుంచో ఓ చీపురు కట్ట తీసుకొచ్చి నెమలిపించంలా విప్పి ఆ అమ్మాయికి వీపు దగ్గర అటూఇటూ కదుపుతూ నిల్చుంది.

 

    అంతా గొల్లుమన్నారు.

 

    ఒక జూనియర్ ని "నీకేమిటిష్టం?" అనడిగితే "సినిమాలు" అని జవాబు చెప్పింది.

 

    "అలాగా? నీ ఫాన్ ఎవరు?" అనడిగిందో సీనియర్.

 

    ఆ అమ్మాయి తికమకపడి "నా ఫాన్ కమలహాసన్" అంది.

 

    "ఏమిటి నీ ఫాన్ కమలహాసనా?"

 

    "అవును."

 

    "రోజుకు ఎన్ని ఉత్తరాలు రాస్తాడేమిటి?"

 

    అప్పటికి తన పొరపాటు గ్రహించుకుని "కాదు... కాదు... నేనే అతని ఫాన్ ని" అంది సరిదిద్దుకుంటూ.

 

    కల్యాణి వంతు వచ్చింది.

 

    "ఏయ్! నీ పేరేమిటి?"

 

    "క... ల్యా... ణి..."

 

    "ఏం? అంత పొగరుగా చెబుతున్నావు? వినయంగా నమస్కారంబెట్టి పరిచయం చేసుకోవాలని తెలియదూ?"

 

    ఆ అమ్మాయి మరింత భయపడిపోయింది.

 

    "అ... బ్బె... నాకు... పొగరు... లేదండీ..." అంది వొణికే గొంతుకతో.

 

    "పొగరుగా సమాధానం చెబుతూనే లేదంటావేం? నా కాళ్ళకి దణ్ణం పెట్టు."

 

    ఇంకా వొణికిపోతూ తటపటాయిస్తోంది.

 

    "ఏం? చెప్పేది నీక్కాదూ? వుండు నీకు పనిష్మెంట్ ఇస్తాను" అంటూ అల్మైరాలోంచి ఓ స్కల్ తీసుకొచ్చి చేతిలో పెట్టింది. ఇంకో చేహ్తిలో ఫీమర్ బోన్ పెట్టింది. మెళ్ళో పెర్టిబుల్ బోన్స్ ని దండగా చేసి అలంకరించి. "ఊ. నడు." అంది. తాను టిబియా, ఫిబ్యులా పట్టుకుని వీపుమీద చరుస్తూ "జై కపాళీ ఛల్ ఛల్" అంటోంది.  

 

    వళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. అయినా హాస్టలంతా తిరగక తప్పింది కాదు.

 

    ఓ గది దగ్గరకొచ్చి "ఇందులో దెయ్యముంది తెలుసా?" అంది.

 

    కల్యాణికి ఒళ్ళు జల్లుమంది.

 

    "అవును. నాలుగేళ్ళక్రితం ఓ స్టూడెంట్ ఈ గదిలో ఫ్యాన్ కి ఉరేసుకు చచ్చిపోయింది. అప్పట్నుంచీ..."

 

    కల్యాణి వినిపించుకోలేదు. గబగబ ఆ గది దగ్గర్నుంచి దూరంగా వెళ్ళిపోయింది.

 

    రాత్రి హాస్టలంతా సర్దుమణిగేసరికి పదకొండు దాటింది. కల్యాణి ఎంతకూ నిద్రపోకుండా అటూ, ఇటూ కదుల్తూ వుండటం మాధవి గమనించింది. "పిచ్చిపిల్ల భయపడిందేమో" అనుకుంది. మాధవిని కూడా బాగానే ర్యాగింగ్ చేసి ఏడిపించారు. చేసేదేముందని స్పోర్టివ్ గా తీసుకొని ఊరుకుంది.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS