Next Page 
సూపర్ స్టార్  పేజి 1


   
                  సూపర్ స్టార్
           

                                             -సూర్యదేవర రామ్ మోహనరావు



    తుషార స్నాత ప్రభాత స్వప్నంలో ఆమె బంగారు ఇసుక  తిన్నెలపై పవళించి ఉంది.

    తెల్లవారటానికి ముందు ఉండే నాలుగు ఘడియల కాలం  క్రమంగా కరిగిపోతోంది.

    ఆమె అరమూసిన ఆల్చిప్పల్లాంటి అందమైన కనురెప్పల వెనుక కమనీయ దృశ్యాలు అల్లనల్లన కదలాడుతున్నాయి.

    ఆమె లేలేత లావణ్యంపై ప్రభాత సూర్యుని నీరెండ కిరణాలు తళుక్కున తాకి వక్రీభవిస్తున్నాయి.

    అతను కెమెరాలోంచి చూస్తూ ఆమెను ఫ్రేమ్ లోకి తీసుకున్నాడు.

    క్రమంగా తూరువు ప్రొద్దున సింధూరపు అంచు పైపైకి వస్తోంది. ఓ సన్నని కిరణం కొబ్బరి ఆకుల మధ్య నుంచి వచ్చి ఆమె సన్ననినడుము వంపులో తాకి అదృశ్యమైపోయింది చటుక్కున.

    తను ఫిక్స్ చేసుకున్న ఫ్రేమ్స్ లోని అందాల్ని ఓసారి చూసుకున్నాడతను.

    ఫ్రేమ్ అడుగున ఆమె ఆకాశానికి అభిముఖంగా పడుకొని ఉంది. ఆమెకు అతి దగ్గరగా, అవిరామంగా సముద్రం పొంగి పొర్లుతోంది.

    అందమైన సంద్రం.....

    ఆ ముందు ఆమె.....

    అత్యద్భుతమైన బ్యాక్ డ్రాప్.....

    అద్భుతమైన ఫ్రేమ్ బ్యూటీ.....

    నేచరల్ లైట్ లో చీకటి వెలుగుల సమ్మేళనం లైట్ అండ్ షేడ్ ఎఫెక్ట్..

    అతను సంతృప్తిగా తల పంకించి ఓసారి  తల పైకెత్తి ఆమెకేసి  చూసాడు.

    సరిగ్గా అప్పుడే ఆమె కనురెప్పల్ని ఒకింతగా తెరచి చుట్టుపక్కలకు  ఓసారి అలవోకగా చూసి చటుక్కున కుడిచేతిని గాలిలోకి లేపి పిడికిలి  బిగించి బొటనవేలును పైకి వుంచి కెమేరా యూనిట్ కి సంజ్ఞ చేసింది.

    అంతే..... ఆ మరుక్షణం కెమెరా నిశ్శబ్దంగా పనిచేయటం ప్రారంభించింది.

    ఆ అందమైన గోవా సంద్రపు అందచందాల్ని అపురూపమైన రీతిలో తనలో నిక్షిప్తం చేసుకుపోతోంది.

    ఆమె ఛామనచాయ శరీరంపై మెరిసే మధురమైన మృదుస్నిగ్ధ నవ్యతను ఎంతో అపురూపంగా ఆస్వాదిస్తోంది సోనీ సి.సి.డి. వీడియో-కెమేరా రికార్డర్.

    ఇప్పుడామె కనురెప్పల వెనుక కమనీయ దృశ్యాలు కదలాడటం ఆగిపోయింది.

    అనంతమైన వృత్తిపరమైన ఆలోచనలిప్పుడు ఆమెను చుట్టుముట్టాయి.

    అతిత్వరలోనే ప్రస్తుతం తను చేపట్టిన ప్రాజెక్టు పూర్తయిపోతుంది. తరువాత హైదరాబాద్ కి ప్రయాణం.

    ఆమె సుకుమారమైన శరీరం అసంకల్పితంగా చిన్న కుదుపులు లోనైంది.

    ఆమె కాలిక్యులేషన్ పూర్తయింది. వెంటనే లేచి కెమెరాను ఆఫ్  చేయమని సంజ్ఞచేస్తూ కాశ్మీర్ శాలువను ఒంటినిండుగా కప్పుకొని యూనిట్ కేసి కదిలింది.


                                               *    *    *

    ఆ విశాలమైన హాల్లో మనుష్యులున్న అలికిడి లేదు. దాదాపు పాతికమంది పోలీసు అధికారులు ఊపిరి బిగబట్టి టెలివిజన్ స్ర్కీన్ వేపే చూస్తున్నారు.

    న్యూఢిల్లీ పాలం విమానాశ్రయం. ఎయిరోడ్రోమ్ వెలుగుల తోరణంలా అమెరికన్ విమానం. అందులోంచి వరుసగా  దిగిన ప్రయాణీకులు కస్టమ్స్ కౌంటర్స్ వేపు వెళ్తున్నారు.

    ఆ ప్రయాణీకుల్లో అమెరికన్స్ సెక్యూరిటీ చీఫ్ కూడా ఉన్నాడు. అతనిమీదే కెమెరా ఎక్కువ పోకస్ చేయబడిందని అక్కడున్న ఆఫీసర్స్ గ్రహించారు.

    "మైడియర్ ఆఫీసర్స్" చీఫ్ అక్కడున్న ఆఫీసర్స్ ని ఉద్దేశించి అన్నాడు.

    వాళ్ళు అలర్ట్ అయిపోయి ఓ ప్రక్క టీవీ చూస్తూనే మరో ప్రక్క ఛీఫ్ చెప్పబోతున్న సమాచారాన్ని వినేందుకు సిద్ధమయ్యారు.

    "ఇండియన్  ఎయిరోడ్రమ్ అన్న టాపిక్  మీద తయారుచేసిన క్యాసెట్ నే మీరిప్పుడు చూస్తున్నారు. అయితే ఆ రోజు అదే విమానంలో అతను వస్తున్నట్లు ముందుగా ఎవరికీ తెలీదు. అదే అతని ప్రత్యేకత. పాదరసంలా జారి పోతుంటాడు. భారతీయ అంతర్జాతీయ విమానాశ్రయం రాత్రివేళల్లో ఎలా ఉంటుందనేది చూపించటమే ఈ క్యాసట్ పరిమిత ఉద్దేశ్యం. అందుకే ప్రయాణీకులపై జూమ్ లైన్స్ ఉపయోగించలేదు....." అతను చెబుతూ చెబుతూ చటుక్కున ఆగిపోయి కేసెట్ ని రివైండ్ చేసి తిరిగి ఫ్లే నొక్కాడు.

    "ఇప్పుడు చూడండి...... ఇప్పుడు వెళ్తున్న ప్రయాణీకులు 18 మంది. అతనికి ఆరు అంకె చాలా సెంటిమెంట్ . కనుక ఆరో ప్రయాణీకుడ్ని 15వ ప్రయాణీకుడ్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఆ ఇద్దరిలో ఒకరు అతను తప్పక అయి ఉంటాడన్నది కేవలం నా ఊహ మాత్రమే....."

    ఆఫీసర్స్ కళ్ళు చిట్లించుకొని మరీ చూస్తున్నారు.

    అది రాత్రి పదిగంటల సమయం....

    పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని డి.ఐ.జి క్రైమ్స్ పర్సనల్ ఛాంబర్ అది.

    స్లో మోషన్ లో సెకన్ కి ఒక ఫ్రేమ్ మాత్రమే టీవీ తెరపై కదులుతోంది.

    "ఇంతవరకు అతనెలా ఉంటాడన్నది ఏ ఒక్కరికి తెలీదు. గుర్తులు తప్ప కనీసం ఖచ్చితమైన ఏ ఒక్క ఆనవాలు పోలీసుళ రికార్డ్స్ లోకి ఎక్కలేదు...."

    ఫ్రేమ్స్ ఒక్కొక్కటే ముందుకు కదులుతున్నాయి. ఆ ఎయిర్ కండిషన్డ్ హాలు నాలుగు గోడలమధ్య పేరుకున్న లోతైన నిశ్శబ్దంలో పాతికమంది సుశిక్షితులైన పోలీస్ ఇంటిలిజెన్స్  అధికారులు అతనిపై వలపన్నే  ప్రయత్నంలో చురుగ్గా ఆలోచిస్తున్నారు. ఒక్క క్లూ అయినా దొరకకపోతుందా అని.

    ముందుగా ఆరవ వ్యక్తిని చూసారు. అతని హైట్ ని కాస్త అటూ , ఇటూగా అంచనా వేసే ప్రయత్నంలో ఉన్నాడు 'ప్రభూ అనే యంగ్ ఆఫీసర్ . మొత్తం పద్దెనిమిది మంది వైడ్ యాంగిల్ లో ఫ్రేమ్ ఆ చివర  నుంచి ఈ చివరి వరకు చీమల  బారులా కనిపిస్తున్నారు.

    ఆ ఫ్రేమ్ ని ఫాజ్ లో పెట్టారు. వెంటనే ప్రభు తన దగ్గరున్న మినోల్టా కెమెరాతో చక్....చక్....చక్...మంటూ మూడుసార్లు ఎక్స్ పోజ్ చేశాడు టీవీ స్క్రీన్ ని. టీవీలో ఫిల్మ్ ఫాజ్ లోంచి ప్లేలోకి వచ్చింది.

    ప్రయాణీకులంతా ఒక్కొక్కరే కస్టమ్స్ క్లియరెన్స్ కౌంటర్ వేపుకు వెళ్తున్నారు.

    ఆ సీన్  ఆఖరి ప్రయాణీకుడు కౌంటర్ లోకి వెళ్ళే వరకే ఉంది. ఆ వెంటనే సీన్ కట్ అయి ఎయిర్ పోర్టు ఇంటీరియర్ లో ఓపెన్ అయింది.

    ఆఫీసర్స్ లో ఆసక్తి ఉత్కంఠగా మారింది. సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్ ఎయిర్ పోర్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో  షాట్  ఓపెన్ అయిందని గ్రహించారు ఆ ఆఫీసర్స్. విజిటర్స్ లాంజ్, హిగ్గిన్ బాదమ్స్ బుక్ స్టాల్, ఆ పక్కనే ఉన్న స్నాక్స్ బార్  మీంచి కెమెరా ఫోకస్ అయి బోర్డింగ్ పాస్ లిచ్చే కౌంటర్స్ మీదకు మళ్ళి ఆ వెంటనే ఎస్క్ లెటర్ మీదకు జామ్ అయి క్రమంగా కస్టమ్స్ కౌంటర్  వేపు మరలింది విజన్.

    ప్రభు కెమేరా తిరిగి సిద్ధం చేసుకున్నాడు. ఒక్కొక్కరే ప్రయాణీకులు కస్టమ్స్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకొని అవుట్ గేట్ లాంజ్ లోకి వస్తున్నారు.

    అక్కడ అప్పటికే రిసీవ్ చేసుకునేందుకు వచ్చిన జనంతో రద్దీగా ఉంది.

    "చూశారా.....అక్కడ ఎంతమంది సెక్యూరిటీ వాళ్ళున్నారో? మరెంతో మంది సివిలియన్స్ లా మనులుతున్న ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ అధికారులున్నారు. వాళ్ళ పని మన ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్స్ లో నిఘా వేసి  అంతర్జాతీయ క్రిమినల్స్ ని, స్మగ్లర్లణీ గుర్తించి అదుపులోకి తీసుకోవటమే. కానీ  అతను అందరి కళ్ళు కప్పి పాదరసంలా జారుకొని దేశంలోకి చొచ్చుకువచ్చాడు"....... చీఫ్ తన సహజ ధోరణిలో ఎయిర్ పోర్ట్ లో నిఘా ఉన్న ధికారుల అసమర్థతను ఎత్తి చూపాడు.

    'అతనెలా ఉంటాడో కనీసం ఒక్క గుర్తయినా తెలీకుండా అతన్ని  వాళ్ళెలా పసిగట్టగలరు?' ప్రభు టీవీ వేపే చూస్తూ ఒకింత ధైర్యంగా అన్నాడు.

    'అతను ఢీల్లీని సమీపిస్తున్నాడని ముందుగానే న్యూయార్క్ లో ఉన్న  మన సిబిఐ అధికారి ఒకరు ఇన్ ఫర్మేషన్ అందించారు. అది అందిన వెంటనే అప్రమత్తంగా ఉండమని సిబిఐ చీఫ్ ఆదేశించారు. అయినా అతను మిస్  అయ్యాడు. అందుకే పోలీస్ డిపార్ట్ మెంట్ లోని ప్రతివ్యక్తి ఏ స్వల్ప విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఒక్కోసారి బ్రహ్మాండమైన ఆధారాలు సయితం  ఎందుకూ కొరగాకుండా పోయి, స్వల్ప విషయాలే అనుకొని నిర్లక్ష్యం చేసిన విషయాలే దారుణ పరిణామాలకు దారి తీస్తాయి.

    పరోక్షంగా అక్కడున్న అధికారుల్ని అలాంటి తప్పు మీరు చేయవద్దని హెచ్చరిస్తున్నట్లున్నాయి చీఫ్ మాటలు.

    "సార్- ఇంతకీ ఈ క్యాసెట్ షూట్ చేసిందెవరు?" ప్రభు పరిశోధనలో లోతుకు వెళ్తున్నాడు.

    'హంపి......మిస్ హంపి..... ది గ్రేట్ ఇండియన్ టీవీ, వీడియో కెమెరా వుమెన్......'

    'ఆమె అడ్రస్......?'

    "దివ్యతేజ బిల్డింగ్స్, జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్-6, హైదరాబాద్. అయితే ప్రస్తుతం ఆమె గోవాలో ఉన్నట్లు  మనకు ఇన్ ఫర్మేషన్ వచ్చింది. బహుశా రెండు మూడు రోజుల్లో హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. ఆమెను కలుసుకున్నా మనకంతగా ప్రయోజనం ఉంటుందని నేననుకోను.....' అన్నాడు చీఫ్ లేస్తూ.

    అప్పటికే క్యాసెట్ పూర్తయింది.

    ప్రభు లేస్తూ మనస్సులోనే అనుకున్నాడు 'ఏ స్వల్ప విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు' అని

    అతన్ని ఎలా పట్టుకోవాలి? ఎలా అతనిపై వలపన్నాలి?

    అనే విషయాలు తేలకుండానే ఆ హాల్లో టీవీ ఆఫ్ అయి- లైట్స్ వెలిగాయి.

    అతని అసలు పేరు జయధీర్.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS