Home » vasireddy seeta devi novels » Mises Kailasam
ప్రకాశరావు తృళ్ళిపడి లేచాడు. నాలుక పిడచకట్టుకొనిపోయింది. గొంతు ఎండిపోతున్నట్లనిపించింది. ఒళ్ళంతా చిరుచెమటలు పట్టింది. మంచినీళ్ళు తాగటానికి లేచి లైటు వేశాడు. కూజాలో నీళ్లు వణుకుతున్న చేత్తో వంపుకుని గ్లాసెడు నీళ్లు గటగటా తాగాడు. ప్రాణంవచ్చినట్లయింది. తన కేకకు లక్ష్మి మేలుకోలేదు. మంచిదే అయింది. లక్ష్మి మంచంవైపు చూశాడు. ఖాళీ మంచం! ప్రకాశరావు గుండెలు దడదడలాడాయి. గబగబా గది బయటకు పరుగెత్తాడు. ఓరవాకిలిగా వేసివున్న పూజగదిలోంచి సన్నని వెలుగు బయటకు ప్రసరిస్తున్నది. యాంత్రికంగా వెలుగు వస్తున్నవైపుకు నడిచాడు. గదిలోనుంచి మాటలు వినిపిస్తున్నాయి, ప్రకాశరావు ఆగిపోయాడు ఆశ్చర్యంతో.
'నా పిచ్చి తండ్రీ! ఈ రెండు ముద్దలు కూడా తిను! ఎన్నాళ్ళయిందో తిని! ఆకలి! ఆకలికెంత బాధపడిపోయావో నా చిట్టితండ్రీ! మీగడ పెరుగు కలిపానురా చిట్టితండ్రీ! ఈ ఒక్క ముద్ద., అమ్మముద్ద., తినరా బాబూ! గోముగా, లాలింపుగా మాటలు వినపడ్డాయి! ప్రకాశరావు అయోమయంలో పడిపోయాడు. మాటలు చెవులు రిక్కించి వినసాగాడు.
"ఇన్నిరోజులు అమ్మను చూడకుండా ఎలా వున్నావురా నా చిట్టితండ్రీ! ఏం బాబూ! అమ్మకోసం ఏడ్చావు కదూ? అమ్మను చూడాలని వుందని ఏడ్చావుగదూ?"
"అవును! అది లక్ష్మి కంఠమే! ప్రకాశరావు హృదయం ఆనందంతో వెల్లువయింది. తనువు పులకించింది. పీడకల చెదిరిపోయింది.
అవును. దుస్స్వప్నం నుంచి తను బయటపడ్డాడు! మాతృహృదయంలోని మమకారం పొడారిపోయిన తన గుండెల్లో మధువును చిలకరించింది. తన బాబు తిరిగివచ్చాడు! తన వంశోద్ధారకుడు తిరిగివచ్చాడు! తమ ఏకైక పుత్రుడు తిరిగివచ్చాడు. తన జీవితం, తన ప్రాణాలూ తిరిగి వచ్చాయి!
ఎప్పుడు వచ్చాడూ, ఎలా వచ్చాడూ అన్న ప్రశ్నలను అవతలకు తరిమేసి "బాబూ! బాబూ!" అంటూ ప్రకాశరావు గదిలోకి పరుగు తీశాడు.
లక్ష్మి పెరుగన్నం కలిపిన వెండిగిన్నెను చేత్తో పట్టుకొని, బాలకృష్ణుని బొమ్మ ముందు కూర్చొని, ముద్ద వున్న కుడిచేతిని ముందుకు చాచి కూర్చొని వుంది. మాట్లాడుతుంది. ముద్ద కోసం నోరు తెరవమని బ్రతిమాలుతోంది. ప్రకాశరావు అయోమయంగా కృష్ణుని బొమ్మకేసి చూశాడు. మాతృహృదయాన్ని బద్దలు కొట్టుకొని వస్తున్న ఆక్రందన కృష్ణభగవానుని చెవుల వరకూ అందినట్లు లేదు.
లక్ష్మి భుజాలు పట్టుకొని కుదుపుతూ "లక్ష్మీ" అన్నాడు ప్రకాశరావు బాధగా, లక్ష్మి వెనగ్గా కూర్చొని.
లక్ష్మి చేతిలోని గిన్నె కింద పడింది. గిర్రున వెనక్కు తిరిగి ప్రకాశరావు ముఖంలోకి ముఖంపెట్టి చూసింది.
పాలిపోయిన ఆమె ముఖంలో ఏ భావమూ లేదు. ఎక్కడో, దూరంగా వున్న దేన్నో బెదిరిన చూపులతో చూడసాగింది.
ప్రకాశరావు ఆమెను గట్టిగా కుదుపుతూ "లక్ష్మీ! లక్ష్మీ!" అంటూ అరిచాడు. ఆమె ఓ క్షణం రెప్పలార్పకుండా చూసి, ఒక్కసారిగా నిండుకుండ బద్దలయినట్లు బావురుమంది. కొంచెంసేపు వెక్కివెక్కి ఏడ్చి చేతులు బిగించి, కాళ్లు నిగడదన్ని ఉద్రేకంగా మాట్లాడసాగింది.
"చెప్పు! నా బాబుని ఏంచేశావ్? ఎక్కడ దాచావ్! అంత అందమైన కళ్లు పీకెయ్యటానికి నీకు చెతులెట్లావచ్చినయ్? భగవంతుడు నిన్ను శిక్షించడూ? తప్పక శిక్షిస్తాడు...."
ప్రకాశరావు గుండెల్లో అగ్నిపర్వతాలు బద్ధలయ్యాయి. తలలో ఏవేవో ప్రేలుతున్నాయి.
"భగవంతుడా! ఎంతపని చేశావ్!" అనుకున్నాడు మతి చలించినట్లు మాట్లాడుతున్న భార్య మొహంలోకి చూస్తూ. గతులు తప్పుతున్న తన మనస్సును అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు.
లక్ష్మిని బలంగా పట్టుకొని, తీసుకెళ్ళి మంచంమీద పడుకోపెట్టాడు. ఆమె కన్నార్పకుండా భర్తకేసి భయంగా చూస్తూ పడుకుంది.
ప్రకాశరావు గడియారం చూశాడు. ఐదున్నర దాటింది. తెలతెలవారుతోంది. ఒక అరగంటపాటు గదిలోనే, భార్యకేసి చూసీ చూడనట్లు చూస్తూ, అటూ ఇటూ తిరిగాడు. లక్ష్మి ఉండీ ఉండీ గబుక్కున నిండా ముసుగు కప్పుకొని నిగడతన్ని పడుకుంది.
ప్రకాశరావు సంక్షోభంలో పడ్డాడు. లక్ష్మికి మతి భ్రమించింది. మరోసారి టైం చూసుకొని ఫోన్ దగ్గరగా వెళ్ళాడు. రిసీవర్ ఎత్తి డాక్టర్ కు ఫోన్ డయల్ చేశాడు.
"ఇంకా నిద్రలేచి వుండడు!" ప్రకాశరావు విస్మయంగా లక్ష్మి వైపు చూశాడు. లక్ష్మి ముసుగులోనుంచి తల బయటకు పెట్టి చూస్తోంది. ప్రకాశరావుకు కొంత రిలీఫ్ దొరికినట్లయింది. ఫరవాలేదు, ఈ లోకంలో పడుతుంది అనుకున్నాడు. లక్ష్మి స్థితి అంత ప్రమాదంగా ఏమీలేదు. త్వరలోనే కోలుకోవచ్చు.
"ఏమిటి లక్ష్మీ!" అన్నాడు అంతకుముందేమీ జరగనట్టే.
"అదే ఆయన ఇంకా నిద్రలేవడుగా" అంది లక్ష్మి సౌమ్యంగా.
"ఎవరూ?" అన్నాడు ప్రకాశరావు ఆమె తోవన పడుతున్నందుకు సంతోషపడుతూ.
"దేముడు!" ఠఫీమని చెప్పింది లక్ష్మి కళ్లు పెద్దవిచేసి.
ప్రకాశరావు గతుక్కుమన్నాడు. లేదు! లాభంలేదు! పూర్తిగా మతిపోయినట్లే వుంది. అవతల ఫోన్ రింగవుతోంది. ఎంతకూ ఎవరూ ఎత్తటంలేదు.
"ఇంకా నిద్రపోతూనే వుంటాడు ! నేను చెప్పలా! బాబు !" అనేసి లక్ష్మి మళ్ళీ ముసుగు బిగించి పడుకొంది.



