Home » vasireddy seeta devi novels » Mises Kailasam


    "ఎంత దారుణం. అది ఆడది కాదు. రాక్షసి" అంది రఘు భార్య కదిలిపోయి.
    "ఆవిడ అలా రాక్షసిగా మారటానికి కారణం" కోటేశ్వరరావు అన్నాడు అదే ఉద్రేకంతో.
    "ప్రేమ, సానుభూతి మనిషిని మనిషిగా చేస్తాయి. ఆ ఆడదాని గుండెల్లో ప్రేమకు స్థానంలేదు" అన్నాడు గోపాలరావు.
    "హుఁ ప్రేమ! సానుభూతి; ఈ మాటలకు అర్థం ఆకలి ఎరగదు" కోటేశ్వరరావు అన్నాడు.
    "అంటే! ప్రేమ కంటేకూడా ఆకలి గొప్పదంటారా?" రఘు ప్రశ్నించాడు వ్యంగ్యంగా.
    "గొప్ప సంగతి నాకు తెలియదు. ఆకలి మనిషిని శాసించినంతగా మరొకటి శాసించలేదని నా ఉద్దేశం".
    "నేను ఒప్పుకోను" మొండిగా అన్నాడు రఘు.
    "ఎలా ఒప్పుకుంటారు? మీకు ఆకలంటే ఏమిటో తెలిస్తేకదూ? విశ్వామిత్రుడంతటివాడు కుక్కను తిన్నాడు! ఇక మామూలు మనిషి, ఆకలి పంజాలో చిక్కుకున్న సాధారణ మానవుడు, ఏం చెయ్యడు?" అన్నాడు కోటేశ్వర్రావు ఇనుమడించిన ఉద్రేకంతో.
    "అంటే మీరు ఆ ఆడదాని పైశాచిక కృత్యాన్ని సమర్ధిస్తున్నారన్నమాట!" ఈసడింపుగా అన్నాడు రఘు.
    "సమర్థించటంలేదు. ఆ ఆడదాన్ని పిశాచిని చేసిన పరిస్థితులను ఆలోచించమంటున్నాను. అలా ఆలోచిస్తే నువ్వూ, నేనూ సిగ్గుపడాలి. ఆవిడకాదు" విసురుగా వచ్చి తగిలాయి కోటేశ్వర్రావు మాటలు.
    అకస్మాత్తుగా కోటేశ్వరరావు వాగ్దోరణి ఆగిపోయింది. ప్రకాశరావు కొయ్యబారి కుర్చీలో బిగుసుకునిపోయి వున్నాడు. అతనిలోని చైతన్యం ఘనీభవిస్తున్నట్లుంది. తెలివితప్పి పడిపోయిన లక్ష్మి ముఖంమీద సుమతి నీళ్ళు చిలకరిస్తోంది. కోటేశ్వరరావు, రఘూ తమ పొరపాటును గ్రహించి బాధపడ్డారు.
    
                      *    *    *    *

    "అదుగో నా బాబు! నా బాబు దొరికాడు! నా కన్న కనిపించాడు!" పరుగెత్తుకెళ్ళి బస్ స్టాండ్ లో నిల్చున్న పిల్లవాణ్ణి ఎత్తుకొని గుండెలకు అదుముకుంది లక్ష్మి. ఒళ్ళంతా నిమిరి నిమిరి చూసుకుంది. "బాబూ! నన్ను చూడకుండా ఎలా వుండగలిగావురా!" అంటూ గడ్డం పట్టుకుని ముఖాన్ని పైకి ఎత్తింది. ఒక్కసారిగా శరీరంలో కరెంటు షాక్ కొట్టింది. గావుకేకపెట్టింది. పిల్లవాడి 'పెద్ద పెద్ద కళ్ళ స్థానంలో, రెండు గుంటలు తల్లి మొహంలోకి జాలిగా చూశాయి. లక్ష్మి పిచ్చిగా ఏడుస్తోంది.
    ప్రకాశరావు ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. లక్ష్మి నిద్రలోనే ఏడుస్తోంది. గబగబా లేచివచ్చి లక్ష్మిని కుదిపి కుదిపి లేపాడు. కళ్లు తెరచిన లక్ష్మి పిచ్చిదానిలా వెర్రిచూపులు చూస్తోంది. ఒళ్ళంతా చెమట పట్టివుంది.
    "ఏడీ! నా బాబు ఏడీ! మీరంతా రాక్షసులు. మనుషులు కారు. జంతువులు, పురుగులు, బొద్దెంకలు" పిచ్చిగా అరుస్తున్న లక్ష్మిని పొదివి పట్టుకున్నాడు ప్రకాశరావు.
    "లక్ష్మీ! ఏమిటది పిచ్చిదానిలా! చూడు! కల వచ్చిందా?"
    "పిచ్చి! నాకేం పిచ్చిలేదు. మీ అందరికీ పిచ్చి! అందుకే నా బిడ్డను ఎత్తుకెళ్ళారు. నా బిడ్డ కళ్ళను పీకేశారు. అడుగో నా రాజా ఎవర్నో పైసలు అడుగుతున్నాడు. నా బాబు బిచ్చం ఎత్తుకుంటున్నాడు." పిచ్చిదానిలా మాట్లాడుతూ పోతోంది.
    "ఏమిటి లక్ష్మీ మరీ ఇంతగా ఇదైపోతే ఎట్లా పడుకో! రేపు మన బాబు వస్తాడు! తప్పక వస్తాడు!" అన్నాడు ప్రకాశరావు అంతకంటే భార్యను ఎలా ఓదార్చాలో అర్థంకాక.
    లక్ష్మి కన్నార్పకుండా కొంచెంసేపు ప్రకాశరావు మొహంలోకి చూసింది. ప్రకాశరావుకు లక్ష్మి చూపులు కొత్తగా అనిపించాయి. కొంచెం భయంకూడా వేసింది.
    అలా చూసి చూసి ఒక్కసారిగా మంచంమీద పడుకుని కళ్లు మూసుకుంది లక్ష్మి. ప్రకాశరావు కొంచెంసేపు అలాగే కూర్చుని చిన్నగా లేచాడు. అలా లేచివెళ్ళి లైటు ఆర్పుతున్న ప్రకాశరావును కళ్లు తెరిచి చూసింది లక్ష్మి.
    మానసికంగా, శారీరకంగా కూడా బాగా అలసిపోయిన ప్రకాశరావుకు మంచంమీద నడుం వాల్చగానే నిద్ర పట్టింది.

                      *    *    *    *

    బస్ లూ, లారీలూ, రిక్షాలూ, కార్లూ, సైకిళ్లూ జనం ఎక్కడ చూసినా జనం! హడావిడిగా వుంది బజారు. బస్ స్టాండ్ రద్దీగా వుంది. ప్రకాశరావు జనాన్ని తోసుకుంటూ వెళ్ళి బస్ ఎక్కబోయాడు. అంతలో ఎవరో తన జేబులోనుంచి, చెయ్యి తీసినట్లనిపించింది. జేబు తడుముకున్నాడు. పర్సు లేదు. వెనక్కు చూశాడు. ఓ కుర్రాడు పరుగెడుతున్నాడు. "పట్టుకోండి! పట్టుకోండి!" జనాన్ని తప్పించుకుని వచ్చి కేక పెట్టాడు. "పట్టుకోండి! పట్టుకోండి! దొరికాడు! దొంగ గాడిద!" అంటూ కేకలు. "కొట్టండి! కొట్టండి! తన్నండి! గాడిద! అమ్మోయ్! బాబోయ్! నన్ను వదలండి!" ఏడుస్తున్నాడు కుర్రాడు. ఇదిగో పర్సు ఎవరో కుర్రాడి జేబునుంచి పర్సు బయటకు తీశారు. "అదే! నాదే! నాదే!" అంటూ ప్రకాశరావు ముందుకు వచ్చి పర్సు అందుకున్నాడు. అంతలో ఒకడు బూటు కాలితో కుర్రాడి ముఖంమీద తన్నాడు. "రక్షించండి! చంపేస్తున్నారు!" అంటూ కుర్రాడు ప్రకాశరావు కాళ్ళకు చుట్టుకున్నాడు. "ఆగండి! కొట్టకండి!" అరిచాడు ప్రకాశరావు. అందరూ ప్రకాశరావు వైపు వింతగా చూశారు. ప్రకాశరావు వంగి కుర్రవాణ్ణి రెండు చేతులతో లేపి నిల్చోపెట్టాడు. కుర్రాడి నోటినుంచీ, ముక్కోళ్ళనుంచి రక్తం కారుతోంది! కుర్రాడి మొహంలోకి జాలిగా చూసి అంతలోనే ఉలిక్కిపడి "బాబూ!" అంటూ గావుకేక పెట్టాడు.


Related Novels


Prathikaram

Mises Kailasam

Matti Manishi

Idee Katha

More