Home » vasireddy seeta devi novels » Mises Kailasam


    ప్రకాశరావు రిసీవర్ పెట్టేసి తలపట్టుకొని కూర్చున్నాడు దిగాలు పడి, లక్ష్మిని చూస్తూ, ఓ అరగంట అలాగే వుండిపోయాడు.
    లక్ష్మి ముసుగు తీయలేదు. నిద్రపోతోందేమో! నిద్రపడితే కొంత మార్పు రావచ్చు.
    ప్రకాశరావు అన్యమనస్కంగానే స్నానం ముగించి, డాక్టర్ కు ఫోన్ చెయ్యాలనే ఉద్దేశంతో గదిలోకి వచ్చాడు. అంతవరకూ ముసుగు బయట తలపెట్టి కప్పుకేసి చూస్తున్న లక్ష్మి ప్రకాశరావును చూసి గబుక్కున ముసుగు లాక్కుంది ముఖంమీదకు. ప్రకాశరావు నిట్టూర్చాడు.
    బయటినుంచి తలుపు తట్టిన శబ్దం వినిపించి ప్రకాశరావు చేతిలోని రిసీవర్ ను కిందపెట్టి తలుపు తెరిచాడు.
    "అయ్యగారూ! తమర్ని చూడడానికి ఎవరో వచ్చారు?" అన్నాడు నాయర్ ప్రవేశించి.
    "తెల్లవారిందీ; అప్పుడే తయారయ్యారన్నమాట సానుభూతి చూపించటానికి! ఇదిగో నాయర్ ఇకనుంచి ఎవరొచ్చినా, ఇంట్లోకి రానివ్వకు! ఏదోఒకటి చెప్పి పంపించివెయ్. కాని నాయర్ కు ఏమీ తెలియలేదు. నాయర్ తలవంచుకొని మెల్లిగా బయటికి నడిచాడు. ప్రకాశరావు తలవంచుకొని తిరిగి డయల్ చేస్తూండగా నాయర్ మళ్ళీ ఉప్పెనలా వచ్చిపడ్డాడు.
    "అయ్యగారూ? చినబాబు! మన చినబాబు!" నాయర్ ఉక్కిరిబిక్కిరవుతున్నాడు.
    "ఏమిటిరా చినబాబు?"
    "వచ్చారండీ! ఆ వచ్చినాయనతో చినబాబు వచ్చారండీ?" జవాబిచ్చాడు నాయర్ రొప్పుతూ.
    "చినబాబా! ఒరేయ్ నీకూ మతిపోయిందీ? ఈ ఇంట్లో నాకు తప్ప...." అంటూ ప్రకాశరావు తెరిచిన నోరు అలాగే ఉండిపోయింది. కళ్ళ నుంచి ఆనందభాష్పాలు జడివానలా రాలినై.
    ఐదేళ్ళ పసివాడు....రవి-తండ్రిని చుట్టేసుకొని ఉద్రేకంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు. ప్రకాశరావుకు ఆనందంతో నోరు పెగల్లేదు. పిల్లవాణ్ణి యెత్తుకొని గుండెలకు గాఢంగా హత్తుకున్నాడు. ఒళ్ళంతా నిమిరాడు. "నాన్నా! అమ్మ! అమ్మ ఏదీ!" అంటున్న బిడ్డను యెత్తుకొని ప్రకాశరావు గది బయటకు వచ్చాడు. లక్ష్మి ముసుగులో నుంచి తల బయటకు పెట్టాలా వద్దా అన్నట్లు కాసేపు కదులాడి అంతలోనే బిగుసుకుపడుకుంది.
    నీరుకావి ధోవతీ, జరీకండువా, ఖద్దరు లాల్చీలో వున్న అరవై సంవత్సరాల పెద్దమనిషి. వరండాలోకి వచ్చిన ప్రకాశరావును చూసి లేచి నిల్చొని నమస్కారం చేశాడు.
    "మీ ఋణం ఈ జన్మలో తీర్చుకోలేనిది!" ప్రకాశరావు ముసలాయన రెండుచేతులూ పట్టుకొని కళ్ళనీళ్ళు నింపుకున్నాడు.
    ఆ పెద్దమనిషి కుర్రాడు తనకు ఏ పరిస్థితిలో దొరికిందీ? కుర్రాణ్ణి తల్లిదండ్రులకు చేర్చడానికి తను ఎన్ని ప్రయత్నాలు చేసిందీ చెప్పి, కాఫీ అన్నా పుచ్చుకోకుండా, అర్జంటు పనులేవో ఉన్నాయంటూ ఆదరాబాదరా వెళ్ళిపోయాడు.
    అలా వెళ్ళిపోతున్న ముసలాయనకు వెనుకనుంచి రెండు చేతులూ ఎత్తి మౌనంగా నమస్కరించాడు ప్రకాశరావు.
    "నన్నా, అమ్మ ఎక్కడ? అమ్మను చూపించు" రవి మారాం చెయ్యసాగాడు.
    ప్రకాశరావు పిల్లవాణ్ణి ఎత్తుకొని ఆనందపారవశ్యంతో భార్య పడుకున్న గదిలోకి వచ్చాడు.
    "లక్ష్మీ! లక్ష్మీ! చూడు! ఇదుగో మన బాబు తిరిగి వచ్చాడు. భగవంతుడు కరుణించాడు."
    లక్ష్మి చివాలున లేచి కూర్చుంది. కళ్ళింత చేసుకొని కుర్రాణ్ణి చూడసాగింది. ప్రకాశరావు బిడ్డను తల్లికి అందించబోయాడు. రవి భయంతో తన రెండు చేతులూ తండ్రి మెడకు చుట్టి గుండెలో ముఖం దాచుకున్నాడు.
    "వీడు నాబాబు కాదు. నా బాబుకు కళ్ళు తోడేశారటగా? వీడి కళ్లు ఆల్చిప్పల్లా వున్నాయి - వీడు మన బాబెలా అవుతాడు?" కుర్రాణ్ణి అన్నివైపుల నుంచీ పరీక్షగా చూస్తూ అంది లక్ష్మి.
    ప్రకాశరావుకు చీకట్లు కమ్మాయ్, "లక్ష్మీ! లక్ష్మీ! వీడు మన బాబే! మన రవి! చూడు సరిగ్గా! కంఠం వణికింది. అశ్రుపూరిత నయనాలతో భావరహితంగా వున్న లక్ష్మి ముఖంలోకి చూస్తూ నిలబడ్డాడు ప్రకాశరావు.
    "ఏవండీ! నా బాబును నేను గుర్తుపట్టలేనంటారా? యెవరో బిడ్డను తెచ్చి నన్ను నమ్మించాలని చూస్తున్నారు. నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారా? బ్రతిమాలుతూ కళ్ళంట బొటబొట నీరుకారుస్తూ అంది.
    రవి ఒకసారి తలెత్తి తల్లివైపు చూసి, భయంతో తండ్రి మెడను గట్టిగా చుట్టేశాడు.
    ప్రకాశరావు బిడ్డను గుండెలకు అదుముకొని బయటకు పరుగెత్తాడు. ప్రకాశరావును పలకరించటానికి వచ్చిన ఆత్మీయులు ఆయన్ను చుట్టుకున్నారు.
    "పిల్లవాడు దొరికాడటగా!"
    "పాపం ఆవిడకు మతిపోయిందటగా! ఇప్పుడే నాయర్ చెప్పారు."
    "పిల్లవాణ్ణి గుర్తుపట్టటంలేదట? నా పిల్లవాడికి కళ్ళు లేవంటుందటగా!"
    "జాగ్రత్త, పిల్లవాణ్ణి తల్లి దగ్గరకు పోనివ్వకండి! నిజంగానే పిచ్చిలో కళ్ళు పీకేయగలదు."
    ప్రకాశరావు గుండెల్లో తలదాచుకున్న పసివాడు ఎందుకో బావురుమన్నాడు, ప్రకాశరావుకు చెమటలు పట్టసాగాయి. కళ్లు తిరుగుతున్నాయి.
    "వెళ్ళిపోండి! మీకూ, మీ సానుభూతి వచనాలకు ఓ నమస్కారం" అని గట్టిగా అరవాలనుకున్నాడు. కాని గొంతు పెగల్లేదు. కళ్లు తిరుగుతున్నాయి.
    "అయ్యో! అలా అయిపోతున్నారేం? పడిపోతాడేమో పట్టుకోండి!"
    "ముందు పిల్లవాణ్ణి తీసుకోండి!"
    పిల్లవాణ్ణి తననుంచి లాగినట్లూ, ఎవరిచేతుల్లోనో తను ఒరిగిపోతున్నట్లూ లీలగా, కలలోలా తోచింది ప్రకాశరావుకు.

                            * * * *


Related Novels


Prathikaram

Mises Kailasam

Matti Manishi

Idee Katha

More