Home » vasireddy seeta devi novels » Mises Kailasam


    "కుర్రవాణ్ణి వదిలేశా?" ఆశ్చర్యంగా ప్రశ్నించాడు వృద్ధుడు.
    "అవును! ఆ స్థితిలో ఆ కుర్రాణ్ణి మళ్ళీ తెచ్చుకోవటమా లేదా అనేది అతనికి తోచలేదట!"
    "ఆఁ ఆ తరవాత!"
    "ఆ పిల్లవాడి తల్లి అన్నాను నానామాటలు అందట! బావమరిది కూడా పిల్లవాణ్ణి చూసి తీసుకు రానందున నానామాటలూ అన్నాడట! దానికి జవాబుగా "మీకు చాదస్తం ఎక్కువ. ఎక్కడలేని ఆచారాలాయె! కుర్రాడు ఎలా పెరిగాడో తెలిసి తీసుకురాలేకపోయాను" అని జవాబిచ్చాడట. ఆరోజే తల్లిదండ్రులూ, మేనమామా బొంబాయికి బయలుదేరారట."
    "మరి కాదూ! కన్నబిడ్డను ఆచారాలంటూ వదిలేసుకుంటారా?"
    "నువ్వూరుకోవమ్మా! చెప్పనియ్!" అంటూ వచ్చినపని మర్చిపోయి కథ వినటంలో నిమగ్నమైపోయారు.  
    "ఆఁ ఆ తరవాత ఏం జరిగింది!"
    "వాళ్ళు బొంబాయి చెరి ఆ బస్ స్టాండు దగ్గిరకు వెళ్లారట. కాని ఆ కుర్రాడు కనిపించలేదు. బొంబాయిలోని అన్ని బస్ స్టాండులూ గాలించారు. కాని కుర్రాడు కనిపించలేదు. నెలరోజులు బొంబాయిలో వున్నా కుర్రాడు కనిపించలేదట. ఏంచేస్తాడు? గుండె రాయి చేసుకొని తిరిగివచ్చారు" అంది.
    ఈ అడుక్కుతినేవాళ్ళు చేసే పనులు చాలా భయంకరంగా వుంటాయి. కళ్ళు పొడిచేసీ, కాళ్లు చేతులూ విరిచేసీ, పిల్లల్ని వికృత రూపుల్ని చేసీ, వాళ్ళ ద్వారా డబ్బులు సంపాదిస్తారట! కొందరు అడుక్కునేవాళ్ళకు బ్యాంక్ బాలెన్స్ కూడా వుంటుందట!"
    లక్ష్మి కెవ్వున కేకవేసింది. మరుక్షణంలో తెలివితప్పిపోయిన ఆమె చుట్టూ సానుభూతి చూపించటానికి వచ్చినవాళ్లు మూగారు. ప్రకాశరావు మరో స్త్రీ సహాయంతో ఆమెను ఇంట్లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టారు.
    ఆరోజు కనుచీకటి పడుతుండగా ప్రకాశరావు న్సేహితుడు రఘూ, అతని భార్యా పలకరించటానికి వచ్చారు. వారిని చూడగానే లక్ష్మి బావురుమంది. రఘు భార్య ఆమెను పట్టుకొని కూర్చుంది. ప్రకాశరావు గుడ్లనీరు గుడ్ల కుక్కుకున్నాడు.
    "ఎంత అన్యాయం జరిగింది! ఇవ్వాళే మాకు తెలిసింది!" అంది రఘు భార్య కళ్ళనీరు పెట్టుకుంటూ.
    "పోలీసువాళ్లు ఇంకా ఆచూకీ తియ్యలేదా?" లేదన్నట్లు తల ఊపాడు ప్రకాశరావు.
    "పేపర్లలో వేయించకపోయారూ?"
    "ఇంగ్లీషు పేపర్లలో వేయించాను. నిన్ననే తెలుగు పేపర్లకు కూడా పంపించాను." అన్నాడు ప్రకాశరావు.
    "ఎవరి చేతుల్లో పడ్డాడో ఏమో!" అన్నాడు రఘు.
    "మంచి వ్యక్తులకు దొరికితే ఈపాటికి ఆచూకీ తెలిసివుండేదే!" అంది రఘు భార్య.
    "ఈమధ్య పిల్లలు పోవడం ఎక్కువయిపోయింది. మళ్ళీ దొరకడం కష్టమే." జాలీ, సానుభూతి ఉట్టిపడుతూ అన్నాడు రఘు.
    "అవునండీ? ఇలా దొరికిన పిల్లల్ని దొంగతనాలకు కూడా ఉపయోగిస్తారటగదూ?" రఘు భార్య కుతూహలంగా ప్రశ్నించింది.
    "అవును. పిక్ పాకెటింగ్ కు ఉపయోగిస్తారు. దొంగతనాలలో కూడా పిల్లల్ని ఉపయోగిస్తారట."
    "పిల్లల్ని కిటికీలగుండా లోపలకు దించి వాళ్ళచేత అవసరమైన పనులు చేయిస్తారట. ఆలివర్ ట్విస్ట్ చదవలేదూ?" చదువుకున్న భార్యను ప్రశ్నించాడు రఘు.
    వచ్చిన విషయం, అక్కడి వాతావరణం మర్చిపోయి కబుర్లలో పడిపోయారు భార్యా భర్తలు. అప్పుడే వచ్చిన గోపాలరావు కూడా మౌనంగా కూర్చుని కుతూహలంగా వినసాగాడు. గోపాలరావు ప్రకాశరావు కంపెనీలో మేనేజరు. అతనితో ఇంజినీరు కోటేశ్వరరావు కూడా వచ్చాడు.
    "అవును! ఆ మధ్య నా స్నేహితుడి బావమరిది తమ్ముడికొడుకు ఇలాగే తప్పిపోయాడని తెలిసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కుర్రాడి జాడ తెలియలేదు. మూడేళ్ళ తర్వాత మద్రాసులో సాక్షాత్తూ వాడి పెదనాన్న జేబు కత్తిరిస్తూనే దొరికాడట" అన్నాడు గోపాలరావు.
    "నిజంగా!" ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది రఘు సతీమణి.
    "అవునండీ! నిజమే! తర్వాత వాడు ఇంటికివచ్చి కూడా చిన్న చిన్న దొంగతనాలు మొదలుపెట్టాడట. చివరకు ఒకనాడు మళ్ళీ చెప్పకుండా ఎటో వెళ్ళిపోయాడట! ఆ జీవితానికి ఒకసారి అలవాటుపడ్డాక మళ్ళీ ఇంటిపట్టున బుద్ధిగా వుండటం కష్టమే!" అన్నాడు గోపాలరావు.
    "అంతకంటే దారుణాలు జరుగుతాయి. ఆ మధ్య బ్లిడ్జిలో చదివాను. ఎంత దారుణమైన వార్త అనుకున్నారు? ఒక స్త్రీ బస్ స్టాండ్ లో బిచ్చమెత్తుకుంటూ ఉందట. ఇది బొంబాయిలో జరిగింది. నిజంగానే జరిగింది సుమండీ! ఆమె చంకలో ఓ బిడ్డ-రెండేళ్ళు కూడా నిండనివాడు ఉన్నాడట. వాడి కళ్ళకు గుడ్డకట్టి వుందట. ఆ బిడ్డ హృదయ విదారకంగా ఏడుస్తున్నాడట! చంకలో బిడ్డ మెలికలు తిరిగి పోతున్నాడట. ఆ బిడ్డ రోదన వింటే పరమ రాక్షసుడిలో కూడా నిద్రిస్తున్న మానవత్వం ఉలిక్కిపడి లేచికూర్చుంటుందట. ఆ బిడ్ద్ ఏడ్పు దారేపోయే వాళ్ళను ముందుకు అడుగు వెయ్యనివ్వటంలేదట. చుట్టూ చేరిన జనం అడిగే ప్రశ్నలకు నిర్లక్ష్యంగా జవాబు చెప్పకుండా వాళ్ళనే డబ్బులు అడగసాగిందట ఆ ఆడది. ఆ దారేపోయే డాక్టర్ కూడా ఆగిపోయి ఆ స్త్రీ దగ్గరకు వచ్చాడట. పిల్లవాడి బాధ ఏమిటో చూస్తానన్నాడు. కాని ఆ స్త్రీ అందుకు అంగీకరించలేదు. చివరకు చుట్టూ చేరిన జనం పిల్లవాణ్ణి బలవంతంగా ఆ స్త్రీ నుంచి వేరుచేశారు. డాక్టర్ పిల్లవాడి కళ్ళకు కట్టిన గుడ్డను లాగేశాడు. ఆ దృశ్యం చూసి మానవత్వమే సిగ్గుతో తలవంచిందట! సృష్టికే శృంగారంగా ఎంచబడే మానవుడు ఇతర జంతువులకంటే శ్రేష్టమైన ప్రాణిగా పరిగణించబడే మనిషి ఎంత వికృతంగా కౄరంగా, భయంకరంగా వుంటాడో తెలియజేసే దృశ్యం అది. ఆ స్త్రీ మాతృ దేవతగా పూజింపబడే స్త్రీ చేసిన పైశాచిక కృత్యం అది. ఆ దృశ్యాన్ని చూడలేక చాలామంది కళ్ళు మూసుకున్నారు. పిల్లవాడి కనుగుడ్లమీద బొద్దింకలు వున్నాయి. అవి కొంచెం కొంచెం కనుగుడ్లను పీకుతుంటే ఆ పసి ప్రాణం విలవిల్లాడిపోతుంది. ఆ స్త్రీ బొద్దెంక కంటే వికృతంగా కనిపించి వుండాలి ఆ క్షణంలో అక్కడ చేరినవాళ్ళకు." అప్పుడప్పుడు కథలు రాస్తూ వుండే కోటేశ్వరరావు చెప్పుకుపోతున్నాడు ఉద్రేకంగా!


Related Novels


Prathikaram

Mises Kailasam

Matti Manishi

Idee Katha

More