Home » vasireddy seeta devi novels » Mises Kailasam


    ప్రకాశరావు ఓ పెద్ద ప్రైవేటు ఎన్ టర్ ప్రయిజింగ్ కంపెనీకి మానేజింగ్ డైరెక్టరు. రాబడి నెలకు నాలుగువేలు. కంపెనీలో వున్న షేర్లుకాక భార్య తరఫున బోలెడంత ఆస్తి వచ్చింది. కానీ చాలాకాలం ఆ దంపతులకు సంతానం లేని కొరత బాధిస్తూ వుండేది. లక్ష్మి మొక్కని దేముళ్ళూ, పట్టని నోములూ లేవు. కాపరానికి వచ్చిన పదేళ్ళకు ఆమె కడుపు పండింది. పండులాంటి కుర్రాడు కలిగాడు. మళ్ళీ ఆమెకు పిల్లలు కలగలేదు. "ఒక కన్ను కన్నూ కాదు ఒక బిడ్డ బిడ్డా కాదు" అనే సామెతను జ్ఞాపకం చేసుకొంటూ కంటిరెప్పతో కనుపాపను కాపాడినట్లు పెంచసాగారు. ఐదేళ్ళకే బాగా పెరిగాడు. పచ్చగా బొద్దుగా ఠీవిగా కనిపించేవాడు. తమ జీవితాలకు వెలుగు రేఖలా, ఆశాకిరణంలా లభించిన ఆ పసివాడికి సూర్య చంద్రుల పేర్లను జోడించి "రవిచంద్ర" అని నామకరణం చేశారు ఆ దంపతులు!
    ప్రకాశరావు దంపతులు బిడ్డను తీసుకొని గోదావరీ పుష్కరాలకు వెళ్ళారు. అక్కడే బిడ్డ తప్పిపోయాడు. రెండురోజులు పోలీసు సహాయంతో రాజమండ్రి అంతా గాలించారు. కాని రవి జాడ తెలియలేదు. ప్రాణాలను వదిలేసి శరీరాలను మాత్రం హైదరాబాదుకు చేర్చారు. పోలీసు డిపార్టుమెంటువారు బిడ్డ తప్పక దొరుకుతాడని ఆశ చూపించారు.
    హైదరాబాదు చేరిన మరుక్షణం నుంచీ, స్నేహితులూ, బంధువులూ, ఆఫీసువాళ్ళూ పరామర్శించటానికి వస్తున్నారు. ప్రకాశరావు దంపతుల బాధను చూసి కన్నీరు పెట్టనివారు లేరు. సానుభూతికి లోపం లేదు. కాకపోతే వాళ్లు మళ్ళీ మళ్ళీ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పటం, వారు వినిపించే వింత కథలను వినటం అంటేనే కష్టంగా వుంది ప్రకాశరావుకు. ప్రతివాళ్ళూ వచ్చి అంతకుముందు వచ్చినవారు వేసిన ప్రశ్నలే వేస్తారు. కాకపోతే వారు వినిపించే కథలు మాత్రం వేరు వేరు. గుండెల్ని పిండేసేలా దారుణంగా వుంటున్నాయి ఆ కథలు.
    "పోలీసు రిపోర్టు ఇచ్చారా?"
    "అసలు ఎలా తప్పిపోయాడండీ?"
    "పేపర్లో వేయించారటగా."
    "అయినా ఆచూకీ దొరకలేదు కదూ?"
    "ఇలా తప్పిపోయిన పిల్లలు మళ్ళీ దొరకటం చాలా కష్టం!"
    "పాపం ఉన్న ఒక్క బిడ్డా ఇలా అయ్యాక మీ జీవితాలు వ్యర్థమే!"
    "ఏ మంచి కుటుంబీకులకో దొరికివుంటే ఈపాటికి వాళ్ళు బిడ్డను పోలీసులకు అప్పజెప్పి ఉండేవాళ్ళే!
    "ఏ రౌడీల చేతుల్లో పడ్డాడో!"
    "ఏ అడుక్కుతినేవాళ్ళకు దొరికాడో? అడుక్కొనేవాళ్ళు ఇలాంటి బిడ్డల్ని ఎత్తుకుపోయి, అంగవైకల్యం కలిగించి, వాళ్ళచేత బిచ్చం ఎత్తిస్తారట!"
    "ఈమధ్య పిల్లల్ని దొంగిలించేవాళ్లు ఎక్కువయ్యారు. నా స్నేహితురాలు పనిచేసే ఆఫీసులో ఒకావిడ వుందట. ఆమె కొడుకు స్కూలుకు వెళ్ళినవాడు తిరిగి రాలేదుట!"
    "అయ్యో పాపం!"
    "చిత్రం ఏమంటే! ఆవిడకు ఎనిమిదిమంది సంతానం అట. నెలలో సగంరోజులు పస్తులు ఉండాల్సిందేనట. ఆవిడ పిల్లవాడు కనిపించటం లేదని నవ్వుతూ చెబుతుందట."
    "ఒక్కడు తగ్గినా తగ్గినట్లేనని ఆమెకు సంతోషమేమో!"
    "ఎన్నాళ్ళయింది ఆ కుర్రాడు కనిపించక?" ఆత్రంగా ప్రశ్నించాడు ప్రకాశరావు.
    "ఆరునెలలు కావస్తోంది."
    "వయస్సు ఎంత?"
    "ఎనిమిదేళ్ళట!"
    ప్రకాశరావు నిట్టూర్చాడు. లక్ష్మి ముఖానికి పైటచెరగు అడ్డం పెట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తోంది.
    ఒకరోజు.
    "ఇలా తప్పిపోయిన పిల్లలు సాధారణంగా మళ్ళీ దొరకరు." సానుభూతితో అంది ఓ యాభై సంవత్సరాల పునిస్త్రీ.
    "అవును! చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్ళి బొంబాయిలో అమ్ముకుంటారట. ఇదికూడా ఒక వ్యాపారంగానే జరుగుతుందట!" ఆవిడకు వంత పలికింది మరో స్త్రీ.
    "మా మేనత్తగారి కోడలికి పెద్దాడపడుచు స్నేహితురాలి మేనమామ కొడుకు ఇలాగే కోటప్పకొండ తిరనాళ్ళకు వెళితే తప్పిపోయాడట.
    "దొరికాడా?" కళ్ళతోనే ప్రశ్నించింది లక్ష్మి ఆదుర్దాగా.
    "వాళ్ళకూ వాడు ఒక్కడే కొడుకు. వెతికి వెతికి చివరకు తల్లిదండ్రులు ఆశ వదిలేసుకున్నారు."
    లక్ష్మి కళ్ళల్లో నీరు గిర్రున తిరిగింది. ప్రకాశరావు గట్టిగా నిట్టూర్చాడు.
    "మళ్ళీ ఆ పిల్లాడు దొరకనేలేదా?" మొదటి స్త్రీ ప్రశ్నించింది.
    "వినండి మరి! ఆ తరువాత నాలుగేళ్ళకు ఆ పిల్లవాడి మేనమామ ఏదో బిజినెస్ మీద బొంబాయి వెళ్ళాడు. ఆయన బస్ స్టాండులో నిల్చుంటే అడుక్కొనేవాళ్ళు ఒకటే తొందరపెట్టారట. ముఖ్యంగా ఓ కుంటి పిల్లాడు మెడనరాలు ఉబ్బేలా పెద్దగా అరుస్తూ యాచిస్తున్నాడట. విసుగ్గా వుండి రెండడుగులు వెనక్కి వేసిన అతని కాళ్ళకు చుట్టుకుపోయాడట ఆ కుర్రాడు. వంగి విసుగ్గా ఆ కుర్రాడి చేతుల్ని వదిలించుకోపోయాడట.
    "మామయ్యా!" ఆ పిల్లవాడి పిలుపుకు ఉలిక్కిపడి ముఖంలోకి చూశాడట. మామా అల్లుళ్ళు ఒకర్నొకరు గుర్తించుకున్నారు. ఒకర్నొకరు కావిలించుకొని బావురుమన్నారట!"
    "ఆ ఆఁ తరవాత!" ఆదుర్దాగా ప్రశ్నించింది ఓ యువతీ.
    "ఆ కుర్రాడు తనను ఎలా మాయ మాటలతో ఓ బిచ్చగాడు తప్పించి తీసుకెళ్ళిందీ, తన కాళ్ళను ఎలా విరిచి తనను బిచ్చం ఎత్తటానికి ఉపయోగించుకుంటున్నదీ చెప్పాడట. ఆ కథ వినీ, ఆ కుర్రాడి రూపాన్ని చూసి ఆ మేనమామకు మతిపోయినంత పనయిందట. ఏం చెయ్యాలో తోచలేదట! రేపు మంచి బట్టలు తెచ్చి తీసుకెళతాననీ, అదే బస్ స్టాండ్ లో కలవమనీ చెప్పి అతను అక్కడనుంచి వెంటనే బయలుదేరి చేల్లెలిగారి వూరికి వచ్చేశాడట!"


Related Novels


Prathikaram

Mises Kailasam

Matti Manishi

Idee Katha

More