Home » vasireddy seeta devi novels » Mises Kailasam


                                సానుభూతి
    
    గోడగడియారం పన్నెండు కొట్టింది. అర్దరాత్రి అయినా ఆకుఅల్లల్లాడటంలేదు. వాయుదేవుడు ఊపిరిబిగబట్టి ఎవరికోసమో పొంచి వున్నాడా అనిపిస్తుంది. తెలి మబ్బులతో నీలాకాశం నెర్రెలిచ్చిన సున్నం గోడలా వుంది. చంద్రుడు ఒంటరిగా, నక్షత్రాలకు దూరంగా అలసిపోయినట్లు, చాలాకాలంగా అలసిపోయి ఉన్నట్లుగా పయనిస్తున్నాడు మెల్లమెల్లగా.
    టెక్నికలర్ నైలాన్ వస్త్రాలతో సొక్కి సోలిపోయిన అందమైన యువతిలా వుంది. హైదరాబాదు నగరం నిశ్శబ్దంగా. పగటి ఎండ వేడిమికి అలసిపోయిన జనం కొట్టేసినట్లు నిద్రపోతున్నారు. వారి వారి బాధలూ, గాథలూకూడా సుషుప్తావస్థలో వున్నాయి.
    శ్రీమంతుల అంతస్థులను ఎత్తిచూపించే బంజారా హిల్సులోని ఆ రెండతస్థుల సుందర భవనంలో, ఎయిర్ కండిషన్ రూములో డన్ లప్ గద్దెలమీద నిద్రపట్టక రెండు జీవులు అటూ ఇటూ అశాంతిగా పొర్లుతున్నాయి.
    "ఏం లక్ష్మీ! నిద్రపోలేదూ?" ప్రశ్నించాడు భర్త.
    "ఏమండీ! మరి!" అంటూ చివుక్కున లేచి కూర్చుంది భార్య.
    "లైటువేసేదా?" అంటూ లేచి వెళ్ళి స్విచ్ ఆన్ చేశాడు ప్రకాశరావు. టేబుల్ మీద వెలవెలపోతున్న బెడ్ లైటును ఆర్పివచ్చి భార్య ప్రక్కన కూర్చున్నాడు ప్రకాశరావు.
    ఇద్దరి ముఖాలమీద విషాదం నల్లని ముసుగు వేసింది. వ్యధ మనస్సులను మెలివేస్తున్నది.
    "ఏమండీ! ఇవ్వాల్టికి ఎన్నాళ్ళయింది మన బాబు!" గొంతులో ఏదో ఉండ చుట్టుకుపోయి మాటలు పెగల్లేదు.
    "ఇవ్వాల్టికి సరిగా ఎనిమిదిరోజులయింది." అన్నాడు ప్రకాశరావు విషాదంలో భారంగా వున్న స్వరంతో.
    "ఎనిమిది రోజులా? ఎంతకాలమో అయిపోయినట్లు అనిపిస్తుందండీ! నా బాబును చూసుకొని ఎనిమిది సంవత్సరాలు.....కాదు.....ఎనిమిది యుగాలు అయినట్లుంది" రెండు చేతుల్లో ముఖాన్ని దాచుకొని బావురుమంది లక్ష్మీదేవి.
    పసిబిడ్డను తల్లి పొదివి పట్టుకొన్నట్లు రెండు చేతులతో పట్టుకొన్నాడు.
    "ఊరుకో లక్ష్మీ! మరీంతగా కుమిలిపోతే ఎట్లాచెప్పు?" తనకు తనే ధైర్యం చెప్పుకుంటున్నట్లూ, విచ్చిపోతున్న తన హృదయాన్నే కూడదీసుకువున్నట్లు ఉన్నాయి ప్రకాశరావు మాటలు. లక్ష్మి కళ్ళుతుడుచుకొని భర్త మొహంలోకి చూసింది ఓ క్షణం.
    "ఏవండీ, ఇప్పుడు మనబాబు ఏం చేస్తూవుంటాడు."
    "పసివాడు ఏం చేస్తూ వుంటాడు! అర్ధరాత్రి హాయిగా నిద్రపోతూ వుంటాడు."
    లక్ష్మి కళ్ళు ఓ క్షణం సంతోషంతో వెలిగిపోయాయి. అంతలోనే అకస్మాత్తుగా కరెంటు ఆగిపోయినట్లు ఆమె కళ్ళలో వెలుగు ఆరిపోయి నిరాశపరచిన చీకటి తెరలు అలుముకున్నాయి.
    "నిజంగా? మీకు హాయిగానిద్రపోతున్నాడనే అనిపిస్తుందా? ఒక వేళ ఏ బిచ్చగాళ్ళకో దొరికివుంటే.....కళ్ళు.....తోడేశారేమో; నాబాబు ఎలాంటి రాక్షసుల చేతుల్లో పడ్డాడో!" దూరంగా ఏదో చూస్తున్నట్లు న్నాయి ఆ చూపులు. మాటలు పలవరిస్తున్నట్లున్నాయి.
    "ఛ! ఏమిటి లక్ష్మీ! నీ పిచ్చి! మనబాబుకు ఏమీకాదు. సుఖంగా నిద్రపోతూ ఉండివుంటాడు."
    "మళ్ళీ మన బాబు తిరిగి వస్తాడా?"
    "తప్పక వస్తాడు లక్ష్మీ! మన బాబు త్వరలోనే మనకు దొరుకుతాడు?"
    "నిజంగా అలా అనిపిస్తుందా మీకు? నా కళ్ళలోకి చూసి చెప్పండి." అంది లక్ష్మి భర్తమొహంలోకి ఆశగా చూస్తూ.
    "నిజంగా లక్ష్మీ! మన బాబు మనకు తప్పక దొరుకుతాడు." అన్నాడేకాని ఆ మాటలు అనేప్పుడు లక్ష్మి ముఖంలోకి చూడలేదు. కళ్ళలో తిరిగిన నీరు కట్టలు తెంచుకోకుండా ప్రయత్నించాడు ఎటో చూస్తూ.
    "పోలీస్ స్టేషన్ కు ఇవ్వాళ ఫోన్ చేశారా?"
    "ఆఁ చేశాను. ఇంకా ఆచూకీ దొరకలేదట. అన్ని ముఖ్యమైన పోలీస్ స్టేషన్లకూ బాబు ఫోటోకూడా పంపించారట"
    "మొన్న వెంకటనర్సు ఏమందనుకున్నారు? ఇవ్వాళ కమలకూడా ఏవేవో కథలు చెప్పిందండీ! మన బాబు ఎలాంటి రాక్షసుల చేతుల్లో పడ్డాడో! మన బాబు బిచ్చం ఎత్తుకుంటున్నాడేమో! నా బాబుకు కళ్ళు తీసేశారేమో! ఇలాంటి ఆలోచనలు ప్రతి నిమిషం నా ప్రాణాల్ని తోడేస్తున్నాయండీ! అంతకంటే మన బాబు చచ్చిపోయినా బాగుండేది."
    ప్రకాశరావు ఉలిక్కిపడి భార్యనోటికి చెయ్యి అడ్డు పెట్టాడు.
    "ఏమిటి లక్ష్మీ పిచ్చిదానిలా మాట్లాడతావు? బాబుచచ్చిపోవాలా? ఎంత మాట అన్నావు!" అన్నాడే కాని ప్రకాశరావుకు అలా జరిగితేనే ఇంతకంటే బాగుండేదేమో ననిపించింది. ఈ బాధను మర్చిపోలేరు. తమ బిడ్డ ఎక్కడున్నాడో! ఎలా వున్నాడో! ఎంత పెరిగాడో! అసలు వున్నాడో లేడో అనే ప్రశ్నలు జీవితాంతం, చాలీచాలని పగటి నిద్ర వల్ల వచ్చే తలనొప్పిలా మనస్సుకు నొప్పిని కలిగిస్తూనే వుంటాయి. ఆలోచిస్తున్న ప్రకాశరావుకేసి చూస్తూ ఒక్కసారిగా ప్రశ్నించింది లక్ష్మి.
    "మీకూ అలాగే అనిపిస్తుంది కదూ?"
    "ఆఁ ఆఁ. కాదు.....కాదు..... మన బాబు మంచివాళ్ళకే దొరికివుంటాడు. ఏ పిల్లలు లేని వాళ్ళకో దొరికి వుంటాడు. ఏ చల్లని తల్లి ఒళ్ళోనో పెరుగుతూ వుండివుంటాడు. మనబాబు క్షేమంగా వుంటాడు లక్ష్మి!" గబగబా అనేశాడు ప్రకాశరావు వల్లించిన పాఠాన్ని అప్పగిస్తున్న పసివాడిలా.    
    "అవును . మన బాబు కులాసాగానే వుండి వుంటాడు. మంచివాళ్ళకే దొరికి వుంటాడు. నా బాబు ఏ బిచ్చగాళ్ళకో, ఏ రౌడిలకో దొరికి ఉండడు. నా బాబు ఎక్కడున్నా నాకు దిగులు లేదు. కేవలం నా బాబు కులాసాగా ఉన్నాడని తెలిస్తే చాలు. ఏమండీ కనీసం ! ఆ వార్తయినా మన చెవుల్లో పడితే చాలండీ . నా బాబు !" పోర్లుకోస్తున్న దుఃఖాన్ని గొంతు లోనే అపుకుంది లక్ష్మి దేవి.
    "పడుకో లక్ష్మి! చాలా ప్రొద్దుపోయింది. ఎన్ని రోజులు నిద్రా హారాలు లేకుండా వుంటావు? నువ్వు మూలబడితే నా పనేం గాను చెప్పు?" బ్రతిమాలుకున్నాడు ప్రకాశరావు సౌమ్యంగా!
    "నిద్రపోవాలంటే భయమేస్తోందండీ, బాబు మీద అన్నీ పీడా కలలే!"
    "ఇప్పుడు మాత్రం ఎలా వుంది. ! పీడకల చూస్తున్నట్లు లేదూ?" అన్నాడు ప్రకాశరావు తనను తనే ప్రశ్నించుకుంటున్నట్లు.
    "అవునండీ! మన బ్రతుకే పీడకల అయిపొయింది!" ప్రకాశరావు ఉలిక్కిపడ్డాడు. తను చేసిన తప్పు అర్ధం అయింది.
    "పడుకో లక్ష్మి!" అన్నాడు జాలి ఉట్టిపడే కంఠంతో.
    బాగా అలసిపోయి వున్న లక్ష్మి మంచం మీదకు వాలిపోయింది. ప్రకాశరావు లేచి లైటు అర్పి వచ్చి తన మంచం మీద అడ్డంగా పడ్డాడు. ఎంత ప్రయత్నించినా ఇద్దర్లో ఏ ఒక్కరికీ నిద్ర పట్టడం లేదు. ఈ వారం రోజులుగా విన్న రకరకాల కధలూ బుర్రలో గజిబిజిగా తిరగసాగాయి.
        
                               *    *    *    *


Related Novels


Prathikaram

Mises Kailasam

Matti Manishi

Idee Katha

More