Home » vasireddy seeta devi novels » Mises Kailasam
"ఫరవాలేదు. తీసుకోండి!" అంటూ ఫలహారం ప్లేటు అతని ముందు వుంచింది అనూరాధ.
కృష్ణవేణికి ఒక ప్లేటు అందించి తనొకప్లేటుతో కూర్చుంది. ముగ్గురూ మౌనంగా ఫలహారం చేస్తున్నారు.
ఇంటర్వ్యూ తను అనుకున్నదానికంటే బాగానే జరిగింది. కాని తన జీవిత విశేషాలూ, రచనావ్యాసంగం గురించీ తెలుసుకోనే లేదు. మరి ఎలా రాస్తాడు! ఊహించి రాస్తాడేమో? ఏడ్చినట్లే వుంది. తన సమాధానాలే తన నమ్మకాలకు వ్యతిరేకంగా వున్నాయి. మిగతాది ఆయన ఊహించి రాస్తాడు.
"మీ మొదటి కథ ఏ సంవత్సరరంలో వచ్చింది" మౌనభంగం చేస్తూ ప్రశ్నించాడు ధర్.
ఆలోచనలనుంచి పూర్తిగా బయటపడకుండానే "1953" అంది అనూరాథ.
"క్షమించండి! మీ వయస్సెంత?"
"మీ కంటే చిన్నదే. ఏం మారేజ్ ప్రొపోజల్ పెట్టిగాని కదలదలచుకోలేదా?" పెదవులవరకు వచ్చిన మాటల్ని బయటపడకుండా జాగ్రత్తపడింది కృష్ణవేణి.
"ఇరవైఎనిమిది" అని ఐనా అనాలనుకొని "ఇరవైమూడు" అని అనేసింది అనూరాథ.
కృష్ణవేణి పిచ్చిచూపులు చూసింది.
"మీ మొదటి కథ ఇతివృత్తం?"
"ప్రేమకథ ఒక ప్రసిద్ద వారపత్రికలో అచ్చయింది. చాలా మంది పాఠకుల అభిమానాన్ని చూరగొన్నది" అంది అనూరాధ.
"అంతేకాదు. ఆ కథ చదివి ఇద్దరు ముగ్గురు పసిపాపాయిలు కూడా మారిపోయారట." అంది వళ్ళుమండిన కృష్ణవేణి. తీరా అన్న తర్వాత అనూరాథ చిన్నబుచ్చుకున్న ముఖం చూసి, ఎందుకన్నానా అని బాధపడింది కృష్ణవేణి.
"బాగుందండీ! ఆ కథపేరు?" అన్నాడు థర్.
"తెగిపోయిన తీగెలు!" నీరసంగా ఉంది అనూరాథ స్వరం. అనూరాథ అవస్థచూసి కృష్ణవేణి 'ఎందుకొచ్చిన బాధ' అనుకుంది.
"నేను చదువలేదు. కాని చాలా గొప్పవిషయం? మీరు ఎనిమిదో ఏటనే పాఠకుల మన్ననలను పొందగలిగిన ప్రేమ కథను రాశారంటే సామాన్య విషయం కాదు. ఎంత మేధాసంపత్తి కావాలి?" అన్నాడు థర్.
అనూరాథ గొంతులో తింటున్న పకోడీ అడ్డంపడింది పొలమారటం వల్ల. ఉక్కిరిబిక్కిరి అయిపోయింది.
"మంచినీళ్ళు తాగు" అంటూ కృష్ణవేణి మంచినీళ్ళగ్లాసును అందించింది.
కాఫీలు తాగారు. అతను లేచి నిలబడ్డాడు. ఇద్దరికీ నమస్కరించి "శెలవిప్పించండి!" అన్నాడు థర్.
"ఈ ఇంటర్వ్యూ ఏ పత్రికలో వస్తుందండీ?" అని అడిగింది కుతూహలంగా కృష్ణవేణి.
థర్ గారు అయోమయంగా చూశారు. అనూరాథ జవాబుకోసం ఆత్రంగా చూసింది.
"బహుశా మీరు పొరపడిఉంటారు." అన్నాడు థర్ ఏదో ఆలోచిస్తూ.
"మరి ఈ ఇంటర్వ్యూ దేనికి చేశారు." ఆశ్చర్యంతో ప్రశ్నించింది కృష్ణవేణి.
"నేను అనూరాథగారి అభిమాన పాఠకున్ని. ఈ ఊరు వచ్చాను కదా ఓసారి ఆమెగారి దర్శనం చేసుకుందామని వచ్చాను. ఈ ఊళ్ళో మా మామయ్య వున్నారు. ఫ్రీ రైల్వేపాసు వుంది. ఓసారి చూసిపోదామని వచ్చాను. బహుశా మీరు నన్ను యం.యస్. థర్ అనుకున్నారనుకుంటాను. నేను యం.జి.థర్ ను అంటే నా పూర్తిపేరు గిరిథర్. ఇంటర్వ్యూలుచేసే ఆయనపేరు యం. శ్రీధర్" అన్నాడు గిరిథర్ ఉరఫ్ యం.జి.థర్.
అనూరాథ కాళ్ళకింద జరుగుతున్నట్లున్న నేలమీద బలంగా నిలబడటానికి ప్రయత్నిస్తోంది.
"మరి ఇంటర్వ్యూ ఇవ్వమని అడిగారు ఆరోజు ఫోన్ లో?" నూతిలోనుంచి వచ్చినట్లు వచ్చాయి అనూరాథ గొంతులోనుంచి మాటలు.
"అదే.....అంటే తమతో కలుసుకొనే అవకాశం ఇవ్వమని అడిగారు."
అనూరాథ సడలిపోతున్న నరాలను కూడదీసుకుంటూ నిలబడటానికి సతమతమైపోతుంది.
"మరి ఫోటోకూడా తీసుకున్నారు?" కృష్ణవేణి థర్ వైపు జాలిగా చూస్తూ ప్రశ్నించింది.
"నా అభిమాన రచయిత్రుల ఫోటోలను సేకరించటం, వాటిని ఆల్బంలో అమర్చటం నా హాబీ!" అన్నాడు గిరిధర్.
"ఇంకానయం జేబులో, గుండెలకు దగ్గరగా పెట్టుకోవటం నా సరదా అన్నారు కాదు!" అనబోయి మానేసింది కృష్ణవేణి.
"ఏదో ఒకటి ఏడ్వు! ఇక్కడ నుంచి కదలుముందు." అరవాలనిపించింది అనూరాథకు.
"వస్తానండీ!"
"మళ్ళీ రావడంకూడా ఎందుకు!" అనుకుంటూ "మంచిది వెళ్ళిరండి!" అంది విసురుగా అనూరాధ.
"ఒక్క రిక్వెస్టు!"
అనూరాథ విసుగ్గా చూసింది. జిడ్డుగాడులా వున్నాడు అనుకుంది కృష్ణవేణి.
"ఈసారి మీరు రాసేకథలో నాగురించికూడా కొద్దిగా రాయండీ?" అన్నాడు అతివినయంగా.
"ముందు ఇక్కడనుంచి పోవయ్యా బాబూ?" అనాలనిపించింది అనూరాథకు.
"అలాగేలెండి. ఒకవేళ అది మర్చిపోయినా నేను జ్ఞాపకం చేస్తాను." అంది కృష్ణవేణి వస్తున్న నవ్వును ఆపుకుంటూ.
కృతజ్ఞతా సూచకంగా కృష్ణవేణికి మరోసారి నమస్కరించి బయటకు నడిచాడు గిరిథర్.
అనూరాథకు ఏడుపొస్తుంది. ఖాళీప్లేట్లూ, కప్పులూ గ్లాసులూ జాలిగా ఆమె ముఖంలోకి చూశాయి. అది అనూరాధకు మరీ అవమానంగా అనిపించింది.
నీళ్ళుకారిపోతున్న అనూరాధను చూస్తుంటే ఎక్కడలేని జాలిపుట్టుకొచ్చింది కృష్ణవేణికి.
"ఇంకా మ్యాట్నీకి టైంవుంది. బయలుదేరు. 'ఆత్మవంచన' బాగుందట." అంది కృష్ణవేణి.
ఇంటర్వ్యూను గురించిగానీ, గిరిధర్ గురించిగానీ ఇద్దర్లో ఏ ఒక్కరికీ మాట్లాడాలని అనిపించలేదు.



