Home » vasireddy seeta devi novels » Matti Manishi


    సాంబయ్య ప్రశ్నకు సమాధానం దొరగ్గానే కనకయ్య చిటికవేసి వెకిలిగా నవ్వాడు.
    "కతాచితు. నూటికో కోటికోగాని జరగదు."
    "అంటే, ఏభై ఏళ్లవాడికి పిల్లలు అసలు పుట్టే అవకాశమే లేదంటావా?" అడిగాడు సాంబయ్య.
    "రెండో పెళ్ళాన్ని కట్టడి చేసుకోలేనివాళ్ళ సంగతి మనకెందుకు సాంబయ్యా! నా మాటవిను! మంచిపిల్ల! పని పాటలు బాగాచేస్తుంది. నీకు ఖర్చు కూడా అంత వుండదు. ఊ అంటే రేపే ముహూర్తం పెట్టిస్తాను."
    "నాలుగు రోజులు ఆగలేవా?" సాలోచనగా అన్నాడు సాంబయ్య.
    "నేనాగుతానయ్యా! అవతలవాళ్ళు ఆగొద్దూ? ఎదిగొచ్చిన పిల్ల. ఏదో స్థితిగతులు బాగాలేక రెండో పెళ్ళివాడికన్నా యిచ్చి బరువు దించుకోవాలని చూస్తున్నారు వాళ్ళు. ఇప్పుడే తేల్చి చెప్పు. రేపు ఏ మాటా వాళ్ళకు చెప్పాలి. లేకపోతే మరో సంబంధం చూసుకొంటారు."
    "ముహూర్తాలు పెట్టుకొనేదాకా నీ కడుపులోనే పెట్టుకోవాలి. మన ఊళ్ళో రెండోవాడికి తెలియకూడదు. ఇంతకీ పిల్లదేవూరన్నావ్?"
    "గంగుపాలెం ఐదుగురు ఆడపిల్లలు. ఈ పిల్ల మూడోది తండ్రి మర్యాదస్తుడు."
    "సరే! ఏ గుళ్ళోనో పెళ్ళి జరుపుకుంటే సరిపోతుందనుకుంటా."
    "నీ యిష్టం. వాళ్ళకేం అభ్యంతరం లేదు. మరి నే వస్తా!" అని లెదర్ బ్యాగ్ తీసుకొని రెండు మెట్లు దిగి మళ్ళీ వెనక్కు వచ్చాడు కనకయ్య.
    "మర్చేపోయా! పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. ఓ రెండు సర్దగలవా? వారమే గడువు. ఒక్కరోజన్నా ఆలస్యం కాకుండా తిరిగి ఇచ్చేస్తా."
    "రెండు....రెండువేలా?" సాంబయ్యముఖం వెలవెలబోయింది.
    "లేక రెండొంద లనుకున్నావా? ఇంకా కనకయ్య వందల వ్యాపారాలే చేస్తున్నాడనుకుంటున్నావా? ఈ సంవత్సరం మా మిల్లు తరఫున అరలక్ష కిమ్మత్తు కొనుబడి చేయబోతున్నాం. తెలుసా? నాకు బస్ టైం అవుతూంది. త్వరగా తేల్చు. ఊరికే వద్దులే. కావాలండీ వడ్డీ తీసుకో!"
    సాంబయ్య మారు మాట్టాడకుండా ఇంట్లోకివెళ్ళి రెండు వేలు తెచ్చి కనకయ్యకు ఇచ్చి అన్నాడు - వడ్డీ పాడూ ఏం వద్దు. నాలుగురోజుల్లో తిరిగి ఇయ్యి. వారందాకా గడువు పెట్టొద్దు!"
    తోలుసంచిలో నోట్ల కట్టాను కుక్కుకొని గబగబా మెట్లు దిగిపోతున్న కనకయ్యను ఉద్దేశించి సాంబయ్య అన్నాడు:
    "ఇదిగో! ఈ సంగతి ఎక్కడా బయటికి పొక్కకూడదు."
    "డబ్బు సంగతేనా?"
    "కాదు అదే - ఆ సంగతి!"
    "ఆ - అట్లాగే! అట్లాగే! పిట్టకు తెలియనిస్తావా?" అని బిగ్గరగా జవాబు చెపుతూ వీధినపడి బస్ స్టాండ్ కేసి పరుగు తీశాడు కనకయ్య.
    తెల్లవారే వస్తానన్న కనకయ్య మూడురోజులయినా రాలేదు. సాంబయ్యకు ఆదుర్దా ఎక్కువయింది. కనకయ్య వచ్చి వెళ్ళిన దగ్గిరనుంచి సాంబయ్యకు మనసు వశం తప్పిపోయింది. కాబోయే పెళ్ళాం రూపురేఖలు స్పష్టంగా వూహించలేకపోయినా వయసులోవున్న ఆడదాని రూపం కల్పించసాగింది అతని కళ్ళకు. పొలం పోయినా అదే యవగా వుంది. ఆడకూలీలకేసి కళ్ళప్పగించి చూడసాగాడు. ఇన్నాళ్ళూ కూలీలు చేస్తున్న పనిని మాత్రమే చూడగలిగిన సాంబయ్య కళ్ళకు ఆడకూలీల  మెరిసే కళ్ళూ, గట్టి నడుమూ, నడకలలోని హొయలూ వంపులూ కనిపించసాగాయి.
    రాత్రిళ్ళు అన్నం తినగానే నిద్రపోయే సాంబయ్యకు కన్ను మూతపడటం లేదు. దుర్గమ్మ - సుబ్బమ్మ - రెండో పెళ్ళాం. అతన్ని వొరచుకొని తోస్తున్నట్లు అనిపించసాగింది. పొలం పోబోతూ సాంబయ్య "ముండాకొడుకు మనిషి అంతులేడు" అనుకొంటుండగా కనకయ్య రావటం కనిపించింది. సాంబయ్య గుండెలు గుబగుబలాడాయి. నరాలు జివ్వుమన్నాయి.
    "మొన్నే వస్తానన్నావ్? ఇవ్వాళా వచ్చేది?" మంచంమీద కాళ్ళు మడిచిపెట్టుకొని కూర్చుంటూ అన్నాడు సాంబయ్య.
    "నీ పనే! నాకు రెండురోజులు వేస్ట్!" ఎదురుగా బల్లమీద కూర్చుంటూ చెప్పాడు కనకయ్య.
    "వేస్టా? ఏందయ్యా అదీ?"
    "అదేలే! వృధా అని అర్ధం."
    "ఎట్టెట్టా! బస్తీలో తిరగమరిగి ఇంగిలీసుముక్కలు కూడా నేర్చుకున్నానన్నమాట?"
    "ఇంగ్లీషు ముక్కలకేంగానీ, రేపు అమావాస్య వెళ్ళగానే వచ్చే మంగళవారం నాడు ముహూర్తం. పెళ్ళి గోసాలస్వామి గుళ్ళో. అంతా సెటిల్ చేసేశా. ఇక  నీదే ఆలస్యం." అన్నాడు కనకయ్య.
    సాంబయ్య కళ్ళు వెలిగాయి. ఉద్రేకాన్ని తొక్కిపెట్టి "అంతా నీమీదే పెట్టానుగా! బరువో సులువో నువ్వె మోయాలి. నువ్వు చెప్పావని ఒప్పుకున్నా, అంతేమరి! ఆఁ! అన్నాడు."
    "రేపే పొలం రిజిష్టరుచేసి నువ్వట్టా కూర్చో! మిగతా పెళ్ళి ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటా."
    "ఏం పొలం, ఏం రిజిష్టరీ?" సాంబయ్య  అదిరిపడ్డాడు.
    "ఏం పొలం ఏంటయ్యా? పిల్ల పేర ఐదెకరాల పొలం రాస్తామని ఒప్పుకొన్నాంగా?"
    "ఏమిటి కనకయ్యా, నువ్వు మాట్లాడేది? నేను పొలం రాస్తానని ఎప్పుడన్నాను?"
    "ఆరోజు చెప్పానుగా? అయిన ఐదెకరాల పొలం రాయందే నీకు వాళ్ళు పిల్ల నెట్టా యిస్తారనుకున్నావయ్యా?"
    "ఇదిగో కనకయ్యా, ఇట్టాంటి తప్పుడు కూతలు కూస్తేనే నాకు వళ్ళు మండేది! నువ్వా మాట అసలు నాతో అనందే?"
    "చెప్పాననుకొన్నానే? ఆ మిల్లు హడావిడిలో వచ్చానా? మర్చిపోయి వుంటాను."
    "అట్టారా దారికి, నాతో అనని మాట అన్నావంటే ఎట్టా వుంటదయ్యా నువ్వే చెప్పు?" సాంబయ్య కొంచెం తగ్గి అన్నాడు.
    "అయితే ఇప్పుడు చెప్తున్నా వినవయ్యా! పెళ్ళికూతురిపేర ఐదెకరాల మాగాణి రాయాలి. పెళ్ళి ఖర్చులు నువ్వే పెట్టుకోవాలి."
    "మనకు కట్నాలూ కానుకలూ రావాల్సిందిపోయి ఎదురివ్వాలా? ఏం సంబంధం తెచ్చావయ్యా సంబంధం?"
    "ఆఁ!- కట్నాలు ఇస్తారు. కట్నాలు! కట్నాలు ఇవ్వగలిగిన వాళ్ళయితే రెండో పెళ్ళి ముసలాడికి ఎందుకిస్తారయ్యా? పెళ్ళి జరగాలంటే అయిదెకరాల మాగాణి ఐనా సరే రాయాల్సిందే."
    "పెళ్ళి ఖర్చుల వరకు పెట్టుకుంటా! కాని పొలం సెంటు భూమి కూడా రాయను." నిక్కచ్చిగా చెప్పాడు సాంబయ్య.
    "రేపు నువ్వు హరీ అంటే ఆ పిల్ల గతేంకాను? ఆ మాట చెప్పు! ఇంత కర్కోటకం పనికిరాదు సాంబయ్యా! బాగా ఆలోచించుకో."
    "ఇందులో ఆలోచించేదేమీలేదు. చావు బతుకులంటావా - అది ఎవడు చూశాడు? అదే నాకంటే ముందు పోవచ్చు. మా దుర్గి పోలా? ఎవరు చూశారు?"
    "అయితే నేను చెప్పేదేమి లేదు. వాళ్ళను మరో సంబంధం చూసుకోమని చెప్తా మరి" అంటూ కనకయ్య లేచాడు.
    "పిల్ల తండ్రికి చెప్పి ఒప్పించలేవా? ఉత్తరోత్రాల దాని భ్రుతికి లోతులేకుండా చూస్తాను. పెళ్ళయిన తెల్లారినుంచి ఆ పిల్ల బాధ్యతలు నావే కదయ్యా? నా భార్య బాగోగులు నేను చూసుకోనూ? దుర్గమ్మను పువ్వుల్లో పెట్టి పూజించాను. దానికేం తక్కువ చేశాను?"
    "ఏం తక్కువ చేశావ్? ఇంత విషం మింగించావ్. నిన్ను నమ్మి ఎవడయ్యా పిల్లనిస్తాడు? ఇస్తే దాని గొంతు కోసినట్టే. ముందుగా నువ్వు పొలం రాయందే ఏ దౌర్భాగ్యుడూ చూస్తూ చూస్తూ నీకు పిల్లనివ్వడు."
    మెట్లు దిగి పోతూ పోతూ అన్నాడు కనకయ్య. ఈ మాటలు. అందుకే బతికిపోయాడు.


Related Novels


Prathikaram

Mises Kailasam

Matti Manishi

Idee Katha

More