Home » vasireddy seeta devi novels » Matti Manishi


    "చూపరా? రత్నంలాంటివాడు కదయ్యా! వీధిలో నడుస్తూ తల పక్కకు తిప్పడంటే నమ్ము! అంత బుద్దిమంతుడు ఈ ఊళ్ళో లేనేలేడు. ఏ పిల్లదానికి రాసి పెట్టివుందో - అదృష్టవంతురాలవుతుంది."
    "మరయితే ఆ బలరామయ్య అట్టా వాగుతాడేం?"
    "వాగుతాడు, వాగుతాడు. ఎందుకు వాగడూ? ఆయన చేసిన నిర్వాకం ఏందట? మూతవేసివుంది కాబట్టి నిండుగా కనిపిస్తుంది. నలుగురు కొడుకులు పంచుకొంటే తలా పాతికెకరాలుకూడా రాదు. ఇంకా ఆఖరుదానికి పెళ్ళికూడా చెయ్యాలి." కనకయ్య గొంతు తగ్గించి అటూ ఇటూ చూసి, "ఇదిగో నలభైవేల అప్పుంది ఆయనకు. ఎక్కడా అనబాక. నామీదపడి ఏడుస్తాడు. అంటే - ఆ లెక్కన మిగిలేది ఏంటో నువ్వే చూడు. అప్పులు తీరిస్తే ముష్టి పదిహేను ఎకరాలు మనిషి అది చూసుకోడు. మాటకుముందు 'ఆ వెంకయ్య మా ఇంట్లో పాలేరు. యీ సాంబయ్య పాసన్నం తింటాడు. మా వంశం, మా అంతస్తూ' అంటాడు. ఈయన రెండో కూతురి సంగతి ఏమిటో తెలిస్తే - ?" ఇంతలో బయట నుంచి "కనకయ్యా" అనే కేక విన్పించి అదిరిపడ్డాడు! ఆ పెద్దమనిషిని ఆదరాబాదరాగా సాగనంపటానికి ప్రయత్నించాడు.
    "అయితే! ఈ సంబంధం మాట్లాడండి."
    "ముందు నువ్వేం ఇవ్వగలవో తేల్చుకొని వచ్చి చెప్పు. ఆ తర్వాత వ్యవహారం నేను చూసుకుంటా."
    "సరే, వచ్చే లక్ష్మివారంనాడు మళ్ళీ వస్తా. మీరు ఊళ్ళో ఉంటారుగా?" అన్నాడు ఆ పెద్దమనిషి.
    "ఎందుకూ మీరు రావటం? నాకు ఎటుదిరిగీ బస్తీకి వెళ్ళే పనుంది. వెళ్తూ వెళ్తూ మీ ఊరొస్తా. తోవేగదా?" అని కనకయ్య ఆయన్ను సాగనంపాడు.
    
                              9
    
    "రా! కనకయ్యా రా! ఎప్పుడొచ్చావ్ ఊళ్ళోకి?" సాదరంగా ఆహ్వానించాడు సాంబయ్య.
    కనకయ్య సాంబయ్య డాబా వరండాలో మొకరం పక్కన బల్లమీద కూర్చొని అలసట తీర్చుకోసాగాడు. ఎదురుగా సమబయ్య నవారు మంచంమీద కూర్చొని రెండు చుట్టలు చుట్టి, ఒకటి కనకయ్యకు అందించాడు. కనకయ్య చేతిలో వున్న లెదర్ బ్యాగ్ పక్కనపెట్టి చుట్ట వెలిగించుకొన్నాడు.
    సాంబయ్య మెరుస్తోన్న కొత్తబ్యాగ్ కేసి కన్నార్పకుండా చూస్తూ "కొత్తది కొన్నట్టున్నావ్? ఎంతయిందేమిటి?" అని అడిగాడు.
    "ఏడున్నర!" కనకయ్య నొసలు ఎగరేస్తూ గర్వంగా చెప్పాడు. "నీక్కూడా ఒకటి తెస్తాలే ఈసారి బస్తీకి వెళ్ళినప్పుడు" అంటూ సాంబయ్య మొహంలోకి చూశాడు.
    "నాకెందుకయ్యా అంత ఖరీదుపెట్టి ఆ తోలుసంచులూ అవీనూ? నీ కంటే లావాదేవీలూ, కాగితాలూ, పత్రాలూ, గట్రా వుంటాయి పెట్టుకోవటానికి. నాదగ్గరేముంటుంది అందులో దాయటానికి?" సంచి తీసుకొని తిప్పి తిప్పి చూస్తూ అన్నాడు సాంబయ్య.
    కనకయ్య ఓ సారి సకిలించి "అవున్లే" అన్నట్టు తల ఎగరేశాడు.    
    సాంబయ్య కనకయ్యను తేరిపార చూశాడు.
    ఇరవై ఏళ్లనాడు అంగవస్త్రంలో కాగితాలు చుట్టుకొని తిరిగిన కనకయ్య, పదేళ్ళక్రితం గొనెపట్టా సంచితో తిరిగిన కనకయ్య, ఈనాడు ఏడున్నర రూపాయలు పెట్టి తోలుసంచి కొని తిరుగుతున్నాడు. పలచగా, బక్కగా, తిండిలేక ఆవురావురుమంటూ తిరిగే కనకయ్య ఆకారంలో, అంతస్తులో కూడా చాలామార్పు వచ్చింది. కాలవకింద పదెకరాల పొలం కొన్నాడు. ఇల్లు ఊడదీసి మరో నాలుగు వేలుపెట్టి పెంచి కట్టాడు. శేషావతారం మిల్లులో పావలావాటా సంపాదించాడు. ఆడపిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేసి అత్తగారి ఇళ్ళకు తోలేశాడు. మిగిలింది ఒక్కడే కొడుకు. వాడు పట్నంలో బి.ఏ ప్యాసయి "లా" చదువుతున్నాడు. బక్కగా వుండే కనకయ్య వళ్ళు చేశాడు. పేటు అంచు పంచలు కడ్తున్నాడు. కాని అతని వృత్తీ, పద్దతీ, ధోరణి ,మారలేదు.
    సాంబయ్యలో బాహ్యంగా వచ్చిన మార్పులు అట్టే లేవు. ఆ నీరుకావి బట్టలే కడుతున్నాడు. అతని చుట్టూ చాలా మార్పులు వచ్చాయి. కాని సాంబయ్య మారలేదు. సాంబయ్యా, కనకయ్యా సంబంధాలూ మారలేదు. వాళ్ళ మనస్తత్వాలు ఇనుము కరిగించి మూసపోసిన అచ్చుల్లా అలాగే వుండిపోయాయి ఈనాటికీ. కనకయ్య చుట్ట అవతలికి విసిరి "సాంబయ్యా! ఓ మంచి సంబంధం తెచ్చావయ్యా!" అన్నాడు.
    సాంబయ్య వినీ విననట్టుగా కాసేపు ఆగి "అంత తొందరేమొచ్చిందీ?" అన్నాడు.
    "బలేవాడివయ్యా! నువ్వు! అదును తప్పితే విత్తనం మొలుస్తుందా?"
    "అప్పుడే వాడికేం వయసు మీరిందయ్యా? ఇంకా ఇరవై అన్నా దాటలేదు."
    "మీ అబ్బాయికి కాదు సాంబయ్యా సంబంధం! నీకు! నీకు!"
    "నాకా? పెళ్ళా?" సాంబయ్య నోరు తెరచి అలాగే కనకయ్య కళ్ళలోకి చూశాడు.
    "నీకేం తక్కువయ్యా?"
    "అహ! అదికాదు. ఇప్పుడేం పెళ్ళని?"
    "ఇప్పుడు కాకపోతే షష్టిపూర్తయిం తర్వాత చేసుకుంటావేమిటి?"
    "అయితే ఇప్పుడు నా వయస్సెంత అనుకుంటున్నావ్?"
    "వయస్సెంతయితే మాత్రం ఏం? నసిగర్రలా వున్నావ్! డెబ్బై ఎనభై ఎకరాల ఆసామివి. రాయిలాటి మనిషివి."
    కనకయ్య మాటలు సాంబయ్య మెదడులో ప్రవేశించి ఎక్కడ నాటుకోవాలో అక్కడే నాటుకున్నవి.
    ఆలోచనలో పడ్డాడు.
    దుర్గమ్మ గుర్తొచ్చింది. ముసలమ్మ ఆసరాతో తను కొడుకును పెంచినరోజులు కళ్ళలో కదిలినై. ముసలమ్మా కూతురు సుబ్బమ్మ మనసులో మెదిలింది దానిచూపూ మనిషి బిగువూ - లగువూ...! కాని దాని తాడుతెగ ఎట్టా తిట్టిపోసింది?
    "ఏమిటి సాంబయ్యా ఆలోచనా?"
    "నాకు-ఏభై కూడా లేనట్టున్నాయ్." వేళ్ళు మడిచీ తిరిచీ లెక్క కట్టి అన్నాడు సాంబయ్య.
    "ఛ! ఛ! ఎవడయ్యా ఆ మాట అంటాడు? నిన్ను చూస్తే నలభై, నలభై అయిదుకంటే వుండవని నిర్ధారణ చేసుకోవచ్చు."
    "అదేనయ్యా! ఏభైలోపు అంటివిగా?"
    "అంతే! అంతే! అంతకు లోపుమాటే!"
    "దాందేముందిగాని కనకయ్యా! పెళ్ళీడు కొచ్చిన కొడుకుని పెట్టుకొని నేను మళ్ళీ పెళ్ళి చేసుకోవటం బాగుంటుందీ?" సాంబయ్య మెత్తబడ్డాడు.
    "అదే నేను మొత్తుకొనేది. వేంకటపతికి పెళ్ళిచేసేముందే నీ పెళ్ళి అయిపోవాలి."
    "ఏమోలే కనకయ్యా! ఇప్పుడెందు కొచ్చిన పెళ్ళి?" సాంబయ్య నీళ్ళు నమలసాగాడు.
    "ఎంతకాలమయ్యా ఈ ఒంటరితనం? భార్యపోయిన రోజుల్లో  డబ్బు  చిక్కుల్లోపడి సతమతమైపోతూ సాచాత చేశావు. గుర్తుందా? ఏడెనిమిదేళ్ళ నాడు ఒకసారి హెచ్చరిస్తే వెంకటపతి ఏమయిపోతాడన్నావ్? వాడికి ఆస్తిపాస్తుల్లో ఎక్కడ తక్కవ అయిపోతుందో అన్న బెంగతో పెళ్ళిమాట తలపెట్టలేదు. ఇప్పుడు నీకేమయ్యా? నలుగురు పంచుకొన్నా లోపం లేదు. తక్కువ కాదు."
    "ఈ వయసులోకూడా పిల్లలు పుడతారంటావా?" వుండీవుండీ సాంబయ్య కనకయ్యమీదకు బ్రహ్మాస్త్రం విసిరాడు.
    కనకయ్యకి పచ్చివెలక్కాయ గుజ్జు గొంతుకు అడ్డం పడ్డట్టు అయింది. సాంబయ్య ఆ ప్రశ్న ఎంతో ఆలోచించి అడిగిందే. ఆ ప్రశ్నకు తను ఇచ్చే సమాధానం మీద, సాంబయ్య  పెళ్ళిచేసుకోవటం, మానుకోవటం ఆధారపడినట్టు పసిగట్టాడు కనకయ్య.
    భార్యపోయిన మొదట్లో, ఆస్తి పెంచుకొనే తాపత్రయంలో వున్న రోజుల్లో, పెళ్ళి సందర్భం వస్తే రెండోపెళ్ళానికి కూడా పిల్లలు పుడ్తే ఆస్తిపంపకం అవుతుందనే ఉద్దేశ్యంతో "నాకెందుకయ్యా మారుమనువు?" అనేవాడు. తన స్వార్జితమైన భూమి చెక్కు చెదరకుండా వుండాలి. దానికి వెంకటపతి ఒక్కడే వారసుడు కావాలి. ఊళ్ళో అందరికన్నా, ఆ భద్రయ్యగారి మనుమళ్ళకన్నా తన కొడుకు స్థితిపరుడు కావాలి. ఆ కోరిక సాంబయ్య నరనరాన్నీ పట్టి పీడిస్తూ వచ్చిన సంగతి కనకయ్యకు తెలుసు.


Related Novels


Prathikaram

Mises Kailasam

Matti Manishi

Idee Katha

More