Home » vasireddy seeta devi novels » Matti Manishi

   
    ఓ రోజు పొలాన్నుంచొస్తున్న వెంకటపతి బలరామయ్య పనిగట్టుకొని పలకరించాడు:
    "ఏం వెంకటపతీ! పెళ్ళీడుకొచ్చిన నిన్ను అట్టాపెట్టుకొని మీ నాయన మళ్ళీ పెళ్ళి చేసుకోబోతున్నాడంటగా?"
    వెంకటపతి తలెత్తి బలరామయ్యకేసి అయోమయంగా చూశాడు. తన తండ్రి పెళ్ళిచేసుకోవటం ఏమిటి?
    "ముసలాడి కొచ్చిందేమిట్రా తొందర?"
    "అదేంలేదే? ఎవరన్నారు?" వెంకటపతి నిలబడి అడిగాడు.
    "నువ్వొట్టి అమాయకుడివిరా! మీ నాయన నీకు అన్యాయం చేస్తున్నాడా!"
    "మా నాయన అట్టాంటివాడుకాడు. గిట్టనివాళ్ళెవరో మీతో అని వుంటారు."
    "సరే! అట్టా అయితే మంచిదేగా! అబ్బా కొడుకుల మధ్యన మా కెందుకొచ్చినట్టు? ముసలాడు - వయసు మళ్ళాక ఇలాంటివి తలపెట్టాడని తెలిసి....." అని బలరామయ్య గొడుగు తిప్పుకుంటూ వెళ్ళిపోయాడు.
    వెంకటపతి ఇంటికివచ్చి సావిట్లో గొడ్లకు మేతవేస్తున్న తండ్రిని చూశాడు. ఏదో అడగాలని మధనపడ్డాడు. నోరు పెగల్లేదు. తనే ఏదో తప్పుచేసినవాడిలా గొడ్లచావిట్లో నుంచి ఇంట్లోకి వచ్చాడు.
    సాంబయ్య కొడుకువెంటే ఇంట్లోకివచ్చి "ఏవిట్రా! అట్లా వున్నావ్?" అని అడిగాడు.
    "ఏమీ లేదు."
    "మరెందుకట్టా వున్నావూ?"
    "ఎట్టా వున్నానూ?"
    సాంబయ్యకు కొడుకు ధోరణి అర్ధంకాలేదు. సంభాషణ మార్చి "జనపకట్టె గూడు ఏయించావా?" అన్నాడు.
    "ఆఁ! ఇంకా అవలేదు. కుదరలా పడింది. రేపు ఒక్కపూట వేస్తే అవుతుంది."
    "ఎంతమంది కూలీలను పెట్టావేంటీ?"
    "నలుగురు ఇద్దర్నేమో పిల్లి పెసరచేనుదగ్గరకు పంపించా, అందుకని ఇవ్వాళ గూడు పడలా."
    "వూఁ! నీళ్ళు పోసుకొని అన్నం తిను. గడ్డం అదీమాసింది. రేపు మంగల్ని పిలిచి తలంటి పోయించుకో" అని సాంబయ్య పంచె పైన వేసుకొని బయటకెళ్ళాడు.
    వెంకటపతి ఏడుపొచ్చినంత పనయింది. తనంటే అంత ప్రేమగా వుండే తండ్రిని గురించి అలా మాట్లాడిన బలరామయ్య మీద అసహ్యం వేసింది.
    ఓ నెలరోజులు గడిచాక కనకయ్య సాంబయ్య దగ్గరకు వచ్చాడు. రెండు వేళా రూపాయలు చేతిలో పెట్టి అన్నాడు - "ఆలస్యం అయిపోయింది."
    "వారం అన్న పెద్దమనిషిని నెలరోజుల తర్వాత తెచ్చేది?" ముఖం అంతా చిట్టించుకొని అడిగాడు సాంబయ్య.
    "ఇదిగో  వడ్డీ! ఊరికినే అట్టే పెట్టుకోలేదులే" అని కనకయ్య లెక్కకట్టి ఇరవై రూపాయలు ఇచ్చాడు.
    మామూలు పరిస్థితుల్లో అయితే కనకయ్య వడ్డీ ఇచ్చేవాడు కాదు. వాళ్ళిద్దరిమధ్యా పెళ్ళి వ్యవహారంలో సంబంధాలు బెడిసివుండటాన సాంబయ్యను జోకొట్టే ఉద్దేశ్యంతో వడ్డీ డబ్బుకూడా ముట్టజెప్పాడు.
    "ఎందుకు కనకయ్యా, ఈ వడ్డీలూ గిడ్డీలూ?" అంటూనే సాంబయ్య డబ్బు, లెక్కపెట్టుకొని, లోపలికెళ్ళి ఇనప్పెట్టెలో భద్రం చేసి వచ్చాడు.
    "ఆ గంగుపాలెం పిల్ల పెళ్ళయిపోయింది విన్నావా?" అన్నాడు కనకయ్య. సాంబయ్య ఎలా తీసుకుంటాడో చూడాలని మాట వదిలాడు.
    "పెళ్ళీ పెటాకులూను. ఈ వయసులో నాకు పెళ్ళేంటయ్యా? నువ్వె పురెక్కించి ఎక్కగొట్టావ్! ఏదో మాట జారాను. అది జరక్కపోవటమే మంచిదయింది! నా భార్య పోయి ఇరవై ఏళ్ళయింది. మళ్ళీ చేసుకోవాలనే ఉద్దేశం ఇన్నాళ్ళుగా నాకు ఏ కోశానా రాలేదు. ఇప్పుడెందుకయ్యా నాకు పెళ్ళి? చావు తర్వాత మాలావు దుఃఖం అన్నట్టు!"
    "సాంబయ్యా! నిజం చెబుతున్నా విను" అని దగ్గరకు జరిగి గొంతు చిన్నది చేసి "ఆ పెళ్ళి తప్పిపోవడం మంచిదయింది. సుందరరామయ్య రెండో పెళ్ళాం సంగతి విన్నావా?" అన్నాడు.
    సాంబయ్య కుతూహలంగా ముందుకు వంగి "అప్పయ్యగారి సుందర్రామయ్యేనా? ఏమయింది?" అన్నాడు.
    "మొదటి సంబంధం కొడుకు పాతికేళ్ళవాడున్నాడా? వాడికీ, సవితితల్లికి సంబంధం వుందట. వాడికి పుట్టినవాడేనట సుందర్రామయ్య రెండో పెళ్ళాం కొడుకు."
    "ఘోరకలిగా వుందే? ఛీ! ఛీ!" అంటూ సాంబయ్య తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. తన ఊహల్లో అతను విన్నదానికంటే ఘోరమైంది  చిత్రించుకుని చూసి నిట్టూర్చాడు.
    "మరి నే వస్తా!" కనకయ్య బాగ్ తీసుకొని లేచాడు. వడ్డీ డబ్బులు రుచి చూసిన సాంబయ్య "పైకం అవసరమయితే  వెనకాడద్దు. పట్టుకెళ్ళు" అన్నాడు.
    సాంబయ్య దగ్గిర పోయిందనుకొన్న పరపతిని మళ్ళీ సంపాదించుకోగలిగినందుకు కనకయ్య సంతోషించాడు.
    వెళుతున్న కనకయ్యను ఆపి తనమనసులో తన్నుకులాడుతున్న విషయాన్ని బయటపెట్టాడు:
    "మా వెంకటపతికి ఈ యేడు పెళ్ళి చేద్దామనుకుంటున్నాను."
    "శుభస్య శీఘ్రం! సంబంధం చూడమంటావా?"
    "మరి నీకు చెప్పిన దెందుకు?"
    కనకయ్య చంకలెగ రేసుకుంటూ వెళ్ళిపోయాడు.
    
                             10
    
    వేంకటపతికి ఇరువై ఐదు ఏళ్ళు వెళ్ళాయి. మనిషి కండలు తేలి బుసలు కొడ్తున్నాయి. మనిషి పక్కగా వెళ్తే చిత్రమయిన ఏదువాసన క్షణకాలం వచ్చేది! అతని పక్కన ఎక్కువసేపు నిలబడితే తల తిరిగిపోయేట్టు ఉంటుంది. ఎప్పుడూ ఏదో పనిలోనే మునిగి వుంటాడు. వ్యవసాయంలో తండ్రిని మించినవాడయాడు. నలుగురు పెట్టు ఒక్కడే చేస్తాడు. నిండు వడ్ల బస్తా అవలీలగా ఎత్తుకొని బండిమీదకు విసిరేస్తాడు. ముఖం వళ్ళూ ఎప్పుడూ జిడ్డుఓడుతూ వుంటుంది. సాంబయ్య లక్షణాలు కొడుకు వెంకటపతి చాలావరకు పుణికి పుచ్చుకొన్నాడు. పోతే, వచ్చేదీ పోయేదీ అంతగా పట్టించుకొనేవాడు కాదు. తండ్రి వెయ్యి కళ్ళతో చూస్తుండటంచేత అతనికి ఆర్జన సంగతి అంతగా పట్టేదికాదు.
    సాంబయ్య దొడ్లో మొన్నటిదాకా కోడెదూడ అని పిలిచేదాన్ని ఇప్పుడు గిత్త అంటున్నారు. ఆవుదూడ, కాలం జరుగుతుంటే, కోడెదూడ అయి, తర్వాత తనుకు తెలియకుండానే గిత్త అయిపోయింది.
    వెంకటపతి అదే వయసులో వున్నాడు. నిగనిగలాడే కోడెదూడ పొట్లగిట్టగా మారిపోయినట్టున్నాడు.
    వెంకటపతి వీధిన వెళ్తుంటే రచ్చబండమీదున్న ఊళ్ళో పెద్దలు తలోమాట మాట్లాడేవారు.
    "సాంబయ్య ఇహ కొడుక్కు పెళ్ళి చెయ్యడనుకొంటా."
    "ఎందుకు చెయ్యడూ చూస్తుండు. లచ్చలు కొట్టాలని చూస్తున్నాడు."
    "ఇరవైవేలు రొక్కం ఇస్తామని వస్తే అరవైవేలు అడిగాడట సాంబయ్య."
    "ఆఁ - ఇస్తారు. ఇంకా రెండేళ్ళు వాడి నెత్తిమీద కొస్తే ఎదురివ్వాల్సి వుంటుంది."
    "బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా లాభం లేదు."
    "ఆ మధ్య మా అత్తారి ఊళ్ళోనే ఓ మంచి సంబంధం కుదిరింది. ఏడెకరాల పొలం, నగా నట్రా బాగా ఇచ్చేవాళ్ళే! సాంబయ్య పదెకరాలన్నా ఇవ్వకపోతే లాభంలేదని దాదాపు కుదిరిన సంబంధం వదులుకొన్నాడు."
    "అసలా సాంబయ్యేం మనిషయ్యా! కొడుకుని అచ్చోసిన ఆంబోతులా ఊరిమీద వదిలి, రూపాయలూ, అణాలూ లెక్క పెట్టుకొంటూ కూర్చుంటాడు."
    "వెంకటపతి మంచోడేనయ్యా! మేదకుడు."
    "అందుకే తండ్రి ఆటలు సాగనిస్తున్నాడు. మరొహడయితే సాంబయ్యను నోరెత్తనిస్తాడా?"


Related Novels


Prathikaram

Mises Kailasam

Matti Manishi

Idee Katha

More