Home » vasireddy seeta devi novels » Mises Kailasam
"అవునండీ! నాకు ప్రాచీనత అంటే మహా అభిమానం. ప్రాచీన సాహిత్యమే కాదు. ప్రాచీనమైనది ఏదైనా నాకు అభిమానమే. ఆమాట కొస్తే "ఆధునికం" అనే శబ్దంకంటే "ప్రాచీనం" అనే శబ్దమే నా చెవులకు ఇంపుగా వినిపిస్తుంది. ఆధునిక భావాలూ, ఆధునిక వేషభాషలూ, ఆధునిక సంస్కృతీ.....ఏదన్నానాకు అసహ్యమే. అందుకే ఆధునిక రచయితల్ని ఎవర్నీ నేను చదవను."అంది అనూరాధ.
"బాగుంది! చాలా బాగుంది. మీ అభిప్రాయాలు చాలా గొప్పగా వున్నాయి." అంటూనే గబగబా మీ అభిప్రాయాలను నోట్ బుక్ లో రాసుకున్నాడు.
"నీ బొందలా వున్నాయి." వళ్ళు మండిన కృష్ణవేణి మనస్సు లోనే అనుకొంది.
"నువ్వు రామాయణ భారతాలను క్షుణ్ణంగా చదివావా? ఏ భాషలో? ఇంగ్లీషులోనా?" కృష్ణవేణి అనూరాధను నిలదీసినట్లు అడిగింది.
అనూరాధ జవాబుకోసం ధర్ ఆమె కళ్ళలోకి చూశాడు. అనూరాధ గొంతుకు పచ్చి వెలక్కాయ అడ్డం పడ్డట్టే అయింది.
"నీ ప్రశ్నలకు జవాబులు తరువాత చెబుతాలేవోయ్!" అంటూ ధర్ వైపు తిరిగి "మీరు ఏమీ అనుకోకండి ధర్ గారూ! మా ఫ్రెండూ నేనూ ఎప్పుడూ జోక్స్ వేసుకుంటూనే వుంటాం. అది నాకు ఆడబిడ్డ వరస అవుతుంది." అంది అనూరాధ తాపీగా.
కృష్ణవేణి అనూరాధ సమయస్ఫూర్తికి మనస్సులోనే మెచ్చుకుంది.
కుర్చీ చివరకు జరిగి, కొంచెంగా ముందుకు వంగి, నోట్ బుక్ తెరచి రాయటానికి సిద్దంగా కూర్చొని ధర్ ప్రశ్నించాడు. "మీరు సాహిత్యానికి ఓ ప్రయోజనం ఉండాలంటారా?"
"తప్పకుండా! కళ కళకోసంకాదు ప్రయోజనంకోసం!"
"మీరు ప్రయోజనం దృష్టిలో ఉంచుకొనే రాస్తున్నారా?"
"అవును! నా రచనలవల్ల ఓ చిన్నారి పాపాయి మారినా నా జన్మ ధన్యం అయినట్లు భావిస్తాను."
"అదేమిటోయ్? చిన్నారి పాపాయి మారటం ఏమిటి" వస్తున్న నవ్వును పెదవులమధ్య బంధిస్తూ అంది కృష్ణవేణి.
అనూరాధకు తాను తాటకిలా పెరిగి కృష్ణవేణిని అమాంతం మింగేయాలనిపించింది. ధర్ అసలు ఆ మాటలు విన్నట్టేలేదు. నోట్ బుక్ లో అనూరాధ అభిప్రాయాలను నోట్ చేసుకోవటంలో మునిగిపోయి వున్నాడు.
"రచయిత్రులు ఈ విషయాన్ని విస్మరిస్తున్నారు. బాధ్యతారహితంగా రాస్తున్నారు." అంది అనూరాధ.
"పోనియ్ నువ్వొక్కదానివైనా ప్రపంచాన్ని ఉద్దరించటానికి కంకణం కట్టుకున్నావు. అంతేచాలు!" అనుకొంది కృష్ణవేణి. పైకే అనాలనుకుంది. అనూరాధ మరీ ఏడ్చిపోతుందని ఊరుకుంది.
"రచయిత్రులంతా బాధ్యతారహితంగా రాస్తున్నారంటారు?" క్వశ్చెన్ మార్కు ముఖంపెట్టి అన్నాడు ధర్.
"అవును!" జంకూ గొంకూ లేకుండా అనేసింది అనూరాధ.
కృష్ణవేణికి వళ్ళు మండిపోయింది.
"నీ తెగిపోయిన తీగెలూ, విరిగిపోయిన వీణా అనే కథలు చౌకబారు ప్రేమకథలేగా? అవికూడా ప్రయోజనం కొరకే రాశానంటారా?" అనేసింది కృష్ణవేణి.
అనూరాధకు ముచ్చెమటలు పట్టినంత పనయింది. ధర్ ముఖంలోకి చూసింది. అతనికి ఇదేమీ పట్టినట్టులేదు. అనూరాధనే రెప్పవెయ్యకుండా చూస్తున్నాడు. అనూరాధ ఇబ్బందిగా కుర్చీలో కదిలి మళ్ళీ నిటారుగా కూర్చుంది.
"మీరు ఇంతవరకూ వివాహం చేసుకోకపోవటానికి కారణం?"
అనూరాధ ఉలిక్కిపడి చూసింది థర్ ముఖంలోకి.
ఇదేమిటి? సాహిత్యం గురించి ఒక్క ప్రశ్నా అడగడేం ? తన వివాహం గురించి అడుగుతాడేం? అనూరాధకు ఏం జవాబు ఇవ్వాలో చటుక్కున తోచలేదు.
"మా అనూరాధకు ఓ మంచి మొగుణ్ణి చూడండి. పెళ్ళిచేసేద్దాం?" నాలుకవరకూ వచ్చిన మాటల్ని ప్రయత్నపూర్వకంగా మింగేసింది కృష్ణవేణి.
"వివాహం చేసుకుంటే నా సాహిత్యసేవకు ఆటంకం కలుగుతుందేమోనని నా భయం" అనేసి నాలుక కరచుకొంది అనూరాధ.
కృష్ణవేణి ముఖమంతా కళ్ళుచేసుకొని చూసింది.
"ఈ విషయంలో మీ అభిప్రాయంతో నేను ఏకీభవించను. మీ భర్తగారి అండదండల్లో మీ సాహిత్య వ్యాసంగాన్ని మూడు పువ్వులూ, ఆరుకాయలుగా పెంపొందించుకోవచ్చు. కనీసం ఫైయిర్ కాపీలయినా చేసి పెడతారుగా? ఆయనకూ సాహిత్యవాసన వున్నట్లయితే ఇంకా మంచిది. ఇద్దరూ కలసి ఎంచక్కా, బోలెడన్ని కథలు రాసుకోవచ్చు." అన్నాడు కళ్ళతో ఆరాధన కడవలతో నీళ్ళు గుమ్మరించినట్లు గుమ్మరిస్తూ.
"ఏం బాబూ! నీకింకా పెళ్ళికాలేదా?" అనుకున్నది కృష్ణవేణి మనస్సులోనే.
అనూరాధ మౌనంగా, ఇబ్బందిగా కూర్చొనివుంది.
"మీకు భగవంతుడిమీద నమ్మకమేనా?"
"లేదు" అనబోయి 'ఉంది' అనేసింది.
"రోజూ ఓగంట ఇంట్లోనే పూజ చేసుకుంటాను" అంది.
"పచ్చి అబద్దం!" కృష్ణవేణి అనుకుంది.
"చాలా థాంక్సు నాకీ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞున్ని" అంటూ కుర్చీనుంచి లేవబోయిన థర్ ను వారిస్తూ అంది అనూరాధ.
"రెండు నిముషాలు కూర్చోండి!"
అనూరాధ లోపలకు వెళ్ళి ఫలహారం పళ్ళాలతో తిరిగివచ్చింది.
"ఇప్పుడివన్నీ ఎందుకండీ?" అన్నాడు ధర్ ముడుచుకొని పోతూ.



