Home » vasireddy seeta devi novels » Matti Manishi
సాంబయ్య కొడుకు భుజం మీద చెయ్యివేసి "నా కొడుకు నాగలి పట్టి భూమి బద్దలు కొట్టాడు. ఈరోజే కాలువ తవ్వుతున్నారని శుభవార్త! కలువ వస్తూంది. నీరు పారుతుంది. నా కొడుకు భూమి దున్నుతాడు. రత్నాలు పండిస్తాడు. కనకయ్యా! నా బిడ్డ నగాలీ, భూమినీ నమ్మినవాడయ్యా! అహాయ్! ఏహేయ్! చో!" అంటూ ఎద్దుల్ని అదిలించాడు సాంబయ్య. మోరలుచాచి ఎద్దులు ముందుకు సాగాయి. మువ్వలు మోగాయి.
నాగలి మొన నేలమీద జారుతూ సాంబయ్య అదృష్టాన్ని గానం చేసింది.
"కనకయ్యా! మళ్ళీ కలుస్తావుగా?" అంటూ సాంబయ్య తనువెల్లా పులకించగా కొడుకుని వెంటబెట్టుకుని, నాగలికట్టిన ఎద్దుల్ని తోలుకొని ఇంటికి వెళ్ళాడు.
అన్నంతిని ఆరుబయట మంచంమీద చుట్ట కాల్చుకుంటూ కూర్చున్న సాంబయ్య ఆలోచనలు కాలువ - నీరు - పొలంమీద అల్లుకుపోసాగాయి. ఈ సంవత్సరమే ఊడ్పులనాటికి కాలవ తవ్వకం పూర్తి అవుతుంది. అవగానే నీరు వదుల్తారు. తను కొంత పోలమన్నా దున్ని పైరు వెయ్యగలడా? ఈ పట్టున తనూ, కొడుకూ చేస్తే ఎన్నాళ్ళకు ఆ పొలం పాటుకు వస్తుంది? ఇహ కూలీలను పెట్టి చేయించక తప్పదు. ఓ వందమందిని పెట్టి బాగు చేయిస్తే మాత్రం నష్టం ఏమిటి? ఆ వారంతా ఈ ఏడే పండించుకోవచ్చు. సాంబయ్య తనకు తెలియకుండానే లేచి నిలబడ్డాడు. పైపంచ భుజాన వేసుకొని కర్ర తీసుకొని కనకయ్య ఇంటికేసి బయలుదేరాడు.
ఇంటి ముందుకు వచ్చిన సాంబయ్యను చూసి కనకయ్య పెద్దకూతురు గాబరాగా ఇంట్లోకి పరుగెత్తి అన్నం తింటున్న తండ్రితో అన్నది - "అయ్యోయ్! మళ్ళీ వచ్చాదయాన, ఇంత లావుకర్ర తీసుకొని. నువ్వు బయటకు రామాక!"
కనకయ్య ముద్ద మింగి నోరు తెరిచేలోపున పెద్దకూతురు బయటకు పరుగెత్తుకొచ్చి సాంబయ్యతో -
"మా అయ్య ఇంట్లో లేడు." తొట్రుపాటుపడుతూ చెప్పింది.
"ఇంట్లో లేకపోతే వచ్చిందాకా వుంటాలే! వచ్చినపని కావలిగా మరి!" అంటూ సాంబయ్య అరుగుమీద చతికిలబడ్డాడు. సాంబయ్య మీసాలు లీలగా పైకీ కిందకీ కదిలాయి. అంటే, సాంబయ్య చాలా కాలానికి మళ్ళీ నవ్వాడు. కాని కనకయ్య పెద్దకూతురు గుండెలు కనబడ్డాయి. ఇంట్లోకి దౌడుతీసి పెరుగ్గిన్నె తెస్తున్న తల్లికి 'ఢీ' ఇచ్చింది.
"అమ్మోయ్! ఇంటిముందే కూర్చున్నాడే! ఇవ్వాళ ఇంకేమయినా వుందా?" అన్నది తల్లితో.
చీరమీద ఒలికిన పెరుగు తుడుచుకుంటూ "ఎవరే! ఏమిటే నీ గొడవ?" అన్నది తల్లి.
"ఆయనేనే! అప్పుడు నాన్నని - మరప్పుడు కర్ర తీసుకొని -" కూతురి మాట పూర్తి కాకుండానే కనకయ్య గ్రహించాడు.
"ఏమిటే పిచ్చి మొద్దా! ఎందుకలా కంగారు పడ్తావ్? మన సాంబయ్యేగా వచ్చింది!" అని తల ముందుకు చాచి కనకయ్య కేక వేశాడు.
"ఎవరూ? సాంబయ్యా! నువ్వేనా?"
"ఆఁ - నేనే కనకయ్యా! భోంచేస్తున్నావా? తొందరేం లేదులే. మెల్లగానే కానియ్!" అతి సౌమ్యంగా సాంబయ్య కంఠం వసారా అరుగుమీదనుంచి పలికింది.
8
సాంబయ్య కొడుకు వెంకటపతికి పద్దెనిమిది నిండి పందొమ్మిది ఏళ్ళు వచ్చాయి. నూనూగు మీసాలు దువ్వుకుంటూ, బండి తొట్టిలో కూర్చొని గిత్తల్నిఅదిలిస్తూ పరుగులు తీయిస్తోన్న వెంకటపతిని చూసి, ఊళ్ళోకి వచ్చిన బంధువులు.
"ఆ కుర్రాడు ఎవరు?" అని ప్రశ్నిస్తే, "ఊరుపోయిన వెంకయ్య మనవడు" అని ఊళ్ళోవాళ్ళు చెప్పారు.
"ఆస్తిపాస్తులేమాత్రం?" బలరామయ్య కొడుకు పెళ్ళికొచ్చిన బంధువుల్లో ఓ పెద్దమనిషి బలరామయ్యను అడిగాడు...
"ఎనభై ఎకరాల సుక్షేత్రమయిన మాగాణి. దొడ్లూ దోవలూ, కొత్తగా కట్టిన డాబాయిల్లు! ఒక్కడే కొడుకు." ఈ మాటలు చెప్పింది బలరామయ్య కాదు అతని పక్కనే కూర్చొని వున్న పరంధామయ్య.
"ఆడపిల్లలున్నారా?"
"అబ్బే! ఒక్కడే కొడుకని చెప్పటంలా?"
"అయితే మంచి సంబంధమే. మా రెండోదానికి మాట్లాడకూడదూ?" దూరపు బంధువైన అంజయ్య బలరామయ్యను హెచ్చరించాడు. బలరామయ్య కాలిమీద జర్రిపాకుతున్నట్టు మొహంపెట్టి అన్నాడు.
"ఏంటి అంజయ్యన్నా? నీకేమయినా మతిపోయిందా?"
"ఇందులో పొరపాటేముందీ? మీ ఊళ్ళో ఉన్నవాళ్ళందర్లో ఆ కుర్రాడే మోతుబరి ఆసామి బిడ్డకదయ్యా?"
"ఆస్తిపాస్తులుండగానే అయిందటయ్యా? వంశం, మంచీ చెడ్డా ఏం అక్కర్లేదా?" అన్నాడు బలరామయ్య.
"మీ ఊళ్ళో సంగతులన్నీ మా కెట్టా తెలుస్తాయి? ఆ మంచి చెడ్డలేమిటో మీరు చెప్పాలి మరి!"
"ఆ వెంకటపతి తాత మా యింట్లో పాలేరుపని చేశాడు."
అంజయ్య దవడలు ఎవరో నొక్కి నట్టయింది.
చుట్టూ వున్నవాళ్ళ మొహాలు పెళ్ళికి ఇచ్చిన తాటాకు విసనకర్రలంతా అయాయి. సగం ఆనందంతో సగం ఆశ్చర్యంతో -
"ఏమో బలరామయ్యా! నేను నమ్మలేకుండా వున్నా అట్లా అయితే ఇంత ఆస్తి ఎట్లా సంపాదించారంటావ్?" ఆస్తి గలవాడూ, ఒక్కడే కొడుకూ, తన అల్లుడైతే తన పిల్ల అదృష్టవంతురాలు అవుతుందని ఆశలు పెంచుకొన్న ఆడపిల్లల తండ్రి అంజయ్య ఓపట్టాన ఆశలు చంపుకోలేక అడిగాడు.
"చెడిబతికిన రకం. పెంటకుప్పమీద కానీవేస్తే కళ్ళకద్దుకొని తీసుకొంటారు."
"ఇదుగో బలరామయ్యా! అందరూ నీలాగే వెర్రిబాగులవాళ్ళలా ఉంటారా ఏం? మీ తండ్రి పోయేనాటికి రెండొందల ఎకరాల మొనగాడి భూమి నీకిచ్చి వెళ్ళాడు. ఇప్పుడు ఎంత వుందో చెప్పు. తగు జాగ్రత్తలు చేసుకొంటేనే అది నిల్చేది. అందులో తప్పేమీ నాకు కన్పించడంలా." అంజయ్య తన ఆశలకు నీళ్ళు పోసుకుంటూ అన్నాడు.
"తెలియకుండా మాట్లాడకు. ఆ సాంబయ్య ఎట్టాంటివాడో మాకు తెలుసు. పెళ్ళాన్ని విషం ఇచ్చి చంపాడు. వాళ్ళు ఇంట్లో ఏం తింటారో తెలుసా? పాచిపోయిన అన్నం! మన ఇళ్ళలో జీతగాళ్ళు కూడా తినరు. వంశమర్యాదలూ, గౌరవప్రతిష్టలూ వున్నవాడెవడూ ఆ ఇంట్లో పిల్ల నివ్వడు. వాడి ఆస్తి తగలబడ! ఎవడిక్కావాలి?" బలరామయ్య విసిరిన మాటలు అంజయ్య గుండెల్లో తుమ్మముళ్ళులా గుచ్చుకున్నాయి.
"ఛీ! చీ! అట్లాటివాళ్ళతో నేను వియ్యమందుతానా? మాట వరసకన్నాగాని! మా ఇంటా వంటా లేదు. మా వంశాన్ని గురించీ, మాకు ఏ ఫాయివాళ్ళతో సంబంధాలు వున్నాయో నీకు తెలియదా బలరామయ్యా! మా పెద్దమ్మాయిని ఇచ్చింది జమీందార్ల వంశంలోనేకదా!" అని అంజయ్య చుట్టూ వున్నవాళ్ళకేసి చూస్తూ తాటాకు విసనకర్రతో విసురుకోబోయి మొహానికి కొట్టుకొన్నాడు.
అందరూ తనను మెచ్చుకున్నట్టూ అతని వంశాన్ని గురించి గొప్పగా ఒప్పుకొన్నట్టు భావించిన అంజయ్య, తన రెండో పిల్ల దురదృష్టానికి అంతరాంతరాల్లో ఎక్కడో బాధపడ్డాడు. అలా బలవంతాన అంజయ్య జారవిడిచిన తాళ్ళను నలుగురు ముగ్గురు దొరకపుచ్చుకున్నారు. అయితే అందరిలో మళ్ళీ ఎవరికీ సాంబయ్య కొడుకు వెంకటపతిని గురించి ఆరా అడిగేందుకు ధైర్యం చాలకపోయింది.
పెళ్ళి అయిపోయి తమ ఊళ్లకు వెళ్ళబోయేముందు లోపాయికారిగా కూపీలు తీసి, మనసు కుదుటపర్చుకొనివెళ్ళారు.
అందులో చితికిపోయిన ఆసామి ఒకడు "సంబంధానికేం బంగారంలాంటిది వాళ్ళు ఒప్పుకుంటే!" అని తన అసలు అనుమానాన్ని బయటవేశాడు కనకయ్య దగ్గిర.
"మెల్లగా అంటావేమయ్యా! ఇంతకంటే మంచి సంబంధం ఈ ప్రాంతంలోనే దొరకదనుకో! కొత్తవంతెన పక్కన - ఏదీ - ఆ రోడ్డు వార పొలం అంతా సాంబయ్యదే! ఈ రోజుకూ తండ్రీ కొడుకులిద్దరూ పొలంలో వంచిన నడుం ఎత్తకుండా పనిచేస్తారు. అయ్యా కొడుకులు ఊళ్ళో ఒకరి జోలీ-శొంఠీ పట్టించుకోరు. తెలుసా?"
"కుర్రాడు కూడా చూపరే అనుకుంటాను."



