Home » vasireddy seeta devi novels » Mises Kailasam
అనూరాధ ముఖం తెల్లకాగితమే అయింది.
నిజంగానే ఈ పుస్తకాలగురించీ, రచయితలగురించీ ఇప్పటి కిప్పుడు తెలుసుకోవాలంటే వున్న మతికాస్తా పోయేలా ఉంది. ఇంకా నయం! కృష్ణ కనక సరిపోయింది! అదే మరొకరయితే ఎంత నగుబాబు అయేది తనపని?
వాకిట్లో అలికిడి అయింది. అనూరాధ ఆలోచనలనుంచి బయటపడింది. గబుక్కున లేచి వాకిట్లోకి వచ్చింది. ఒడ్డూ పొడుగూ వున్నఒక యువకుడు భుజానికి "కెమెరా" తగిలించుకొని నిల్చొని వున్నాడు. అనూరాధకు ఓ క్షణం గుండెలు దడదడ లాడినట్లనిపించాయి.
"అనూరాధగారు....?"
"నేనేనండీ? రండి! కూర్చోండి!" తడబడుతూ అంది అనూరాధ.
కృష్ణవేణిని పరిచయం చేసింది. నమస్కారంచేసి కూర్చున్నాడు థర్.
"మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా?" భుజానికి తగిలించివున్న కెమేరాను చేతిలోకి తీసికుంటూ ప్రశ్నించాడు.
"అబ్బే! అదేం లేదండీ! మీ కోసమే ఎదురు చూస్తూ కూర్చున్నాం." అనేసి నాలుక కరచుకుంది అనూరాధ.
"చాలా థాంక్సు!" అన్నాడు కళ్ళనిండుగా కృతజ్ఞతాభావాన్ని నింపుకొని.
అతను అంత వినయ విధేయతలు చూపించటం ఎందుకనో అనూరాధకు అంతగా నచ్చలేదు.
"మీకు అభ్యంతరం లేకపోతే మీ ఫోటో ఒకటి తీసుకుంటాను."
అనూరాధకు మొహమాటంగా వుంది.
"దానికేం? తీసుకోండి!" అంది కృష్ణవేణి.
ధర్ గారి కళ్ళు సంతోషంతో మిలమిల లాడటం చూసింది కృష్ణవేణి.
అర్ధగంట తాను చెమటలుకక్కి, అనూరాధచేత నురగలు కక్కించినంతపనిచేసి, చివరకు కెమేరా స్విచ్ నొక్కాడు. "అమ్మయ్య!" అనుకుంది కృష్ణవేణి.
ధర్ జేబులోంచి ఆటోగ్రాఫ్ పుస్తకంతీసి అనూరాధకు అందించబోయాడు. అనూరాధ అర్ధంకానట్టు చూసింది.
తనను ఇంటర్వ్యూ చెయ్యటానికి వచ్చి ఆటోగ్రాఫ్ అడుగుతాడేం?
యాంత్రికంగానే అందుకొని సంతకం పెట్టి ఇచ్చింది. అతను అతివినయంగా, కళ్ళనుంచి భక్తిభావాన్ని గుమ్మరిస్తూ అందుకున్నాడు.
అతని రచనల్లోని గడుసుదనం ప్రవర్తనలో కనిపించలేదేం? తన దగ్గిర అంత వినయంగా వుండాల్సిన అవసరం అతని కెందుకో?
కృష్ణవేణి మౌనంగా కూర్చొని కుతూహలంగా చూస్తోంది.
"మీ అభిమాన రచయితలు ఎవరో తెలుసుకోవచ్చునా అండీ?"
చివ్వున తలెత్తి ధర్ ముఖంలోకి చూసింది అనూరాధ. ముందు తన పుట్టుపూర్వోత్తరాలు అడక్కుండానే అభిమాన రచయితలగురించి అడుగుతాడేం?
"నాకు అభిమాన రచయితలంటూ ఎవరూ లేరు. నేను అసలు ఎవరి రచనల్నీ చదవను." ఠపీమని జవాబిచ్చింది అనూరాధ.
కృష్ణవేణి విస్తుబోయి చూసింది. పోనియ్ లే. నిజంచెప్పేసి బ్రతికి పోయింది అనుకుంది.
"అలాగా? కారణం?"
"కారణం......ఇతరుల రచనలు చదివితే వారి ప్రభావం నా రచనల మీద పడుతుందని నాభయం. అది నేను సహించను" ఎలావుంది నా జవాబు అన్నట్లు అనూరాధ కృష్ణవేణి ముఖంలోకి చూసింది.
"చాలా బాగుంది! ప్రశంసనీయమైన అభిప్రాయం!" అంటూ థర్ అనూరాథ అభిప్రాయాన్ని నోటుబుక్కులో నోట్ చేసుకొన్నాడు.
"మీ సమకాలీన రచయిత్రులగురించి మీ అభిప్రాయం?" కొంచెం ముందుకు వంగి ప్రశ్నించాడు థర్.
"ఎవరిమీదా నాకు సదభిప్రాయం లేదు. ఎవరూ బాధ్యతతో రాయడంలేదు." నిస్సంకోచంగా అనేసింది అనూరాధ.
కృష్ణవేణి కళ్ళు పెద్దవిచేసుకొని చూసింది. అనూరాధ ధైర్యానికి ఆశ్చర్యం వేసింది.
"ఎవరి రచనలూ చదవనని ఇప్పుడేగా అన్నావు? అలాంటి నీకు ఎవరేం రాస్తున్నారో ఎలా తెలుసు?" అనేసింది కృష్ణవేణి.
అనూరాధ కృష్ణవేణిని చుర చుర చూసింది.
ధర్ కృష్ణవేణి మాటకు విలువ ఇవ్వనట్లే "మీ హాబీ?" అని అడిగాడు.
అప్పుడే "హాబీ" దాకా వచ్చాడేం? తన రచనా వ్యాసంగాన్ని గురించి అడగడేం?
"తోటపని చెయ్యటం, ప్రాచీనగ్రంథపఠనం!" తడుముకోకుండా అనేసింది అనూరాధ.
ధర్ నోట్ బుక్ లో రాసుకున్నాడు శ్రద్దగా.
"చాలా బాగుందండీ! మీరు ఏ ఏ ప్రాచీన గ్రంథాలు చదివారో సెలవిస్తారా?" వెన్నకంటే మృదువైన కంఠంతో ప్రశ్నించాడు, చక్కరకంటే తియ్యని చిరునవ్వును పెదవులకు పులుముకొని.
"భారతం, భాగవతం, రామాయణం క్షుణ్ణంగా చదివాను. మళ్ళీ మళ్ళీ చదువుతూనే వున్నాను." అంది అనూరాధ కృష్ణవేణి ముఖంలోకి చూస్తూ.
కృష్ణవేణి కళ్ళప్పగించి చూస్తూ వుండిపోయింది.
"ఆధునిక సాహిత్యంకంటే మీకు ప్రాచీన సాహిత్యం అంటే ఎక్కువ మక్కువ అన్నమాట?"
"చిట్టినాయన కవిత్వంలో మాట్లాడుతున్నాడు!" అనుకున్నది కృష్ణవేణి.



