Home » vasireddy seeta devi novels » Matti Manishi


    "నాన్నా, నేను సినిమా చూడను. ఇంకెప్పుడూ వెళ్ళను. నన్ను ఇంటికి తీసుకెళ్ళవా?"
    "అట్లాగే బాబూ!"వెంకటపతిని గుండెలకు హత్తుకొని వెనక్కు తిరిగాడు సాంబయ్య.
    ఇంటికి రాగానే పెరుగన్నం కలిపి కొడుక్కు ముద్దలు తినిపించాడు. తిని వెంకటపతి నిద్రకు పడ్డాడు. మర్నాడు కొడుకుని వదలి పొలం పోలేకపోయాడు సాంబయ్య. కొడుకుని కనిపెట్టుకుని మంచం పక్కనే వున్నాడు. నిద్రలోవున్నా వెంకటపతిని ఎన్నో సార్లు నిమిరి ఆప్యాయంగా చూసుకొన్నాడు. చావిట్లో గేదె లేగదూడని నాకుతూ అరవడం వినిపించింది.
    సాయంకాలానికి వెంకటపతి తేరుకున్నాడు. వాడికి జరిగిందంతా ఓ కలలా వుంది. సాంబయ్యకు ఆడో పీడకలలా అనిపించింది.
    ఇక వాణ్ణి వదిలేసి వుండడం మంచిదికాదు. బలరామయ్య పిల్లలతో కలిసి చెడిపోతాడు. తనకు దూరమౌతాడు. ఆ బలరామయ్య తన మీదా, తన కొడుకు మీదా కసిపట్టి వున్నాడు. ఓ క్షణం ఏమారినా తన సర్వస్వమూ అయిన తన కొడుకును తననుంచి దూరంచేస్తారు వాళ్ళు. కొడుకుపక్కలోనే పడుకొని రాత్రంతా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు సాంబయ్య.
    ఉదయం పలకా పుస్తకాలు తీసుకొని బడికి వెళుతున్న వెంకటపతిని పిల్చాడు సాంబయ్య. కొడుకు చేతిలోనుంచి పలకా పుస్తకాలు తీసుకొని చిత్తూ బస్తాలమీదకు విసిరేశాడు.
    "వెధవ చదువు పాడు సావాసాలు బలిసి చెడిపోతావు. మనకొచ్చే దేమీలేదు" అన్నాడు సాంబయ్య.
    వెంకటపతి బిత్తరపోయాడు. తండ్రి తనచుట్టూ కట్టిన తాళ్ళను విప్పేసి బాధావిముక్తుడ్ని చేసిన అనుభూతి పొందాడు వెంకటపతి.
    ఆనందం, ఆశ్చర్యం ముప్పిరికొనగా "ఇంకెప్పుడూ వెళ్ళొద్దా?" అని అడిగాడు తండ్రిని వెంకటపతి.
    "ఆఁ - అంతే!"
    "చదువుకోకపోతే చెడిపోతావురా అని చెప్పేవాడివిగా?"
    "అది తప్పు చదువుకొంటేనే చెడిపోతారు."
    కళ్ళు పెద్దవిచేసి ఆనందంగా విన్నాడు వెంకటపతి.
    "ఆ చదువు మనకు పనికిరాదు. మీ తాతా, నేనూ చదువుకోలేదు. అయినా మేము బాగుపడ్దాం. నువ్వు చదువుకొని చెడిపోవటం నాకిష్టం లేదు."
    "నాన్నా! నేను ఇక బడికేసే పోను! నా పుస్తకాలు చింపేస్తా; పలక పగలకడ్తా."ఉత్సాహంతో గెంతులువేస్తూ అన్నాడు వెంకటపతి.
    "ఒరే నాయనా! మనం భూమిని నమ్ముకొని బతికేవాళ్ళం. నువ్వూ భూమిని నమ్ముకునే బతకాలి. తెలిసిందా?" అని సాంబయ్య అన్నంమూట భునాన వేసుకొన్నాడు. వెంకటపతి గేదెదూడ పలుపు విప్పి చావిట్లోనుంచి బయటకు తోలుకొచ్చాడు. తండ్రి అరక కట్టి ముందు బయలుదేరాడు. కొడుకు గేదెదూడ పలుపు పుచ్చుకొని తండ్రి వెనకే నడిచాడు.
    తండ్రీకొడుకులు డొంకదాటి బీడుగడ్డ గరువుపొలం చేరారు.
    "ఒరే వెంకటపతీ! ఇదంతా మన పొలమేరా!" సాంబయ్య చేతిలో కర్ర పైకెత్తి, రాయి రప్పా, దుబ్బులూ వున్న పొలంకేసి చూపించాడు.
    "అదంతా మందేనా?" చెయ్యి ముందుకు చూపిస్తూ అడిగాడు వెంకటపతి.
    "ఓ! అక్కడ పోత్తాడి చెట్టుంది చూడూ! అందాకా మందే!" తన్మయత్వంతో చెప్పాడు తండ్రి. 'తనదీ' అన్న మమకారం పసిహృదయాన్ని కూడా తాకి, కదిలించి, గిలిగింతలు పెట్టింది. గర్వంగా ముఖంపెట్టి భుజాలు ఎగరేసుకొంటూ, పొలానికి అడ్డంపడి తాటిచెట్టుదాకా పరుగుతీశాడు. సాంబయ్య నాగలికట్టి, కుడివైపు దిబ్బపక్కగా ఎద్దుల్ని నిలబెట్టి కొడుకుని కేకవేశాడు. పోతుతాటిచెట్టు ప్రాకటానికి ప్రయత్నిస్తున్న వెంకటపతి రివ్వున దిగి పరుగు లంకించుకున్నాడు.
    వగరుస్తూ వచ్చిన కొడుకుని చూసి "ఒరేయ్! అబ్బాయ్! ఈ పొలం ఎవరికీ పనికిరాందని వదిలేశారు! దీన్ని మనం బాగుచెయ్యాలి. దున్ని - రాయీ, రప్పా తీసేయాలి. చెక్క చదును చెయ్యాలి. కంపా, కట్టే కొట్టి మంటపెట్టాలి. రోజూ ఓ సెంటు చేసినా చాలు, మూన్నెల్లకు ఒక ఎకరం బాగు చెయ్యొచ్చు. తెలిసిందా?"
    "రోజూ మూడుసెంట్లు బాగు చేస్తాను." వెంకటపతి అమాయకత్వంలో ఆశలు పొడచూపటం తండ్రి గ్రహించాడు. సాంబయ్యకు వళ్ళు పొంగిపోయింది.
    "రా! నాగలి పట్టు!"
    పదేళ్ళవయసులో కొడుకుచేత నాగలి పట్టించాడు సాంబయ్య. వెంకటపతి నాగలిపట్టగా తండ్రి ఎద్దుల్ని అదిలించాడు. నాగలిపట్టి దున్నుతున్న వెంకటపతి నీవూ, ముఖమూ చెమటతో తడిసిపోయాయి. అది చూస్తున్న సాంబయ్య హృదయంలో అమృతం చిలకరించింది.
    మునిమాపువేళ కొత్తపొలంనుంచి తిరిగొస్తున్న తండ్రీకొడుకులకు చెరువు గట్టుమీదకు రాగానే దూరంనుంచి కేక విన్పించింది. సాంబయ్య తిరిగి చూశాడు.
    తను కనబడితే ముఖం చాటేసే కనకయ్య, తనకేసి చూస్తూ వడివడిగా పరుగెత్తుకు రావటం సాంబయ్యకు ఆశ్చర్యంతోపాటు కోపాన్నికూడా కలిగించింది.
    "సాంబయ్యా! ఆగు! నిన్నే! ఆగమంటుంటే?" కనకయ్య పైపంచ విసురుతూ కేకపెట్టాడు.
    "ముండాకొడుకు చేసినమోసం చాలక ఇంకా ఎట్టా పిలుస్తున్నాడో చూడు!" అనుకొన్నాడు సాంబయ్య.
    కనకయ్య దగ్గిరౌతూ వుంటే "మళ్ళీ ఏం పన్నాగం పన్నుతున్నాడో! రానియ్! గాడ్దికొడుకును! పళ్ళు  రాలగొడ్తాను." అనుకొంటూ సాంబయ్య, అతని ముందు కొచ్చి ఎద్దుల్ని ఆపుచేశాడు.
    వగర్చుకుంటూ వచ్చిన కనకయ్య "ఆగమంటూంటే ఏంటయ్యా అట్టా గుడ్డెద్దు చేలో పడ్డట్టు పోతావ్?" అన్నాడు.
    కనకయ్య తనకు ఎదురుపడటమే కాకుండా, అంత ధైర్యంగా మాట్లాడటం చూసిన సాంబయ్య అయోమయంలో పడిపోయాడు.
    "ఎందుకంటా ఆగడం? ఏంటి సంగతి?" చిరాగ్గా అన్నాడు సాంబయ్య.
    "కనకయ్య మోసం చేశాడూ - కనకయ్య మోసం చేశాడూ - కనకయ్య నా కొంప కూల్చాడూ - అంటూ ఊరూనాడూ చెప్పావు గదయ్యా? ఇప్పుడేమంటావ్?" గొంతు పెద్దదిచేసి నిలదీసి అడిగాడు  కనకయ్య.
    సాంబయ్య క్షణకాలం ఆలోచనలో పడ్డాడు. వీడి సిగ తరగ! తను పొలం బాగుచేయటం సంగతి అప్పుడే వీడిదాకా వచ్చిందన్నమాట! రాయీరప్పా తీసి తనూ తన కొడుకూ రెక్కలు ముక్కలు చేసుకొని వస్తూంటే, అప్పుడే తనేదో బంగారం తవ్వి  తలకెత్తుతున్నట్టు మాట్లాడుతున్నాడు వీడు.
    "అయితే ఇప్పుడేమయిందంటా?" పేడపురుగును చూసినట్టుగా కనకయ్యను చూస్తూ అడిగాడు సాంబయ్య.
    "ఏమయిందా! కాలవ! కాలవయ్యా! కాలవ వస్తోంది. ఆనాడు నే చెప్పలా?"
    సాంబయ్య క్షణకాలం స్తంభించిపోయాడు. బుద్ది పనిచేయలేదు. అనందానుభూతిని కూడా పొందలేకపోయాడు.
    "ఏంటి సాంబయ్యా? గుడ్లు తేలేసి చూస్తావ్? కాలవ తవ్వుతున్నారు. నీ చేను బంగారం కాబోతోంది." సాంబయ్య భుజం తట్టి మరీ అన్నాడు, కనకయ్య.
    "కాలవా? నీ మాట.....?" సాంబయ్య గొంతునుండి మిగతా మాటలు పెగిలి రాలేదు. మళ్ళీ వీడు తనను పల్టీ కొట్టించబోతున్నాడేమోననే అనుమానం కలిగింది.
    సాంబయ్య పక్కనే నిలబడ్డ వెంకటపతిని చూసి కనకయ్య "నీ కొడుకు అదృష్టజాతకుడు. వాడిదే అదృష్టం!" అన్నాడు.
    "కనకయ్యా! సరిగా చెప్పు! నీ మాట నిజమేనా?" ప్రాధేయపూర్వకంగా అడిగాడు సాంబయ్య.
    కనకయ్య మాటలు నమ్మాలని సాంబయ్య హృదయం ఆరాటపడింది. కాని బుద్ది మాత్రం అందుకు సహకరించలేదు.
    "ఓరి నీ అనుమానం దొంగల్దోలా! కాలవ తవ్వటం మొదలు కూడాపెట్టారు గదయ్యా? కావాలంటే రేపు నాతో రా చూపిస్తా. మన ఊరికి ఇరవైమైళ్ళ ఎగవన తోటపల్లి దగ్గిర అప్పుడే ఓ పర్లాంగు కాలవపనికూడా పూర్తి అవబోతుంటేను?" అన్నాడు కనకయ్య. పైపంచతో ముఖానపట్టిన చెమట తుడుచుకొని ఊపిరి పీల్చుకున్నాడు.


Related Novels


Prathikaram

Mises Kailasam

Matti Manishi

Idee Katha

More