Home » vasireddy seeta devi novels » Mises Kailasam


    "అమ్మమ్మోయ్!"
    అమ్మమ్మ ఉలకలేదు. పలకలేదు. గురకమాత్రం వినిపించింది. ఈ ముసలాళ్ళతో వచ్చిన చిక్కే ఇది. రాత్రిళ్ళు నిద్రపోరు, నిద్రపోయేవాళ్ళ ప్రాణాలు తోడేస్తారు. దగ్గులతో, నసతో, పగలు మాత్రం హాయిగా కునుకులు తీస్తారు!
    "అమ్మమ్మోయ్?" అమ్మమ్మను కుదుపుతూ పెడబొబ్బ పెట్టింది.
    కళ్ళు నింపాదిగా తెరిచింది అమ్మమ్మ.
    "ఏవిటే అమ్మాయ్ ఆ చావుకేకలు? నీ కథగానీ ఏ పేపర్లోనైనా అచ్చయిందా ఏం?" అడిగింది అమ్మమ్మ బోసిబోసిగా, తోసిబోతూ నవ్వుతూ.
    అమ్మమ్మకు కూడా తన కథలంటే ఎగతాళే! అనూరాధకు ఏడుపు వచ్చినంత పనయింది.
    "హల్లో రాధా! ఎక్కడికో ప్రయాణం అయినట్లున్నావ్?" అప్పుడే ప్రవేశించిన కృష్ణవేణి ప్రశ్నించింది.
    "రా కృష్ణా! మంచి సమయానికే వచ్చావ్?" అంది అనూరాధ సంతోషంగా.
    ధర్ గారు వచ్చేప్పటికి స్నేహితురాలితో కబుర్లుచెబుతూ కూర్చొనే అవకాశం లభించినందుకు అనూరాధ తేలిగ్గా నిట్టూర్చింది.
    "సినిమాకు వెళదామా?" కృష్ణవేణి ప్రశ్నించింది.
    "ఇవ్వాళ వద్దులే!"
    "ఏం? ఎక్కడ కెళుతున్నావ్?"
    "ఎక్కడకు వెళ్ళడం లేదు."
    "మరి ఈ ముస్తాబు?"
    "పెద్ద ముస్తాబేముందిలే! యం.యస్. ధర్ గారు వస్తున్నారు."
    "ఆయ నెవరు?" ఆశ్చర్యంగా ప్రశ్నించింది కృష్ణ.
    "పేరుకూడా విన్లేదూ? అవునులే, నువ్వు తెలుగుపత్రికలు చదువవగా! ఎం.యస్. ధర్ రచయితల్నీ, రచయిత్రుల్నీ ఇంటర్వ్యూచేసి, వారిగురించి పత్రికల్లో రాస్తూంటారు ఆయన.....ఆయనే వస్తున్నారు." అనూరాధ కంఠంలో గర్వం ధ్వనించింది.
    "ఎందుకూ?"
    అనూరాధకు అమాంతం స్నేహితురాల్ని మింగేయాలనిపించింది.
    "ఎందుకేమిటి? నన్ను ఇంటర్వ్యూ చెయ్యటానికి!" అనూరాధ స్వరం కొంచెం చురుగ్గా వుంది.
    "అదా సంగతి? నువ్వుకూడా కథలు రాస్తావుగా? ఆ సంగతి నా కసలు గుర్తే వుండదు సుమా? నేనుకూడా చూస్తాను. ఇంటర్వ్యూ ఎలా జరుగుతుందో!" అంది కృష్ణవేణి.
    కృష్ణవేణి పుస్తకాలు తెగచదువుతుందని అనూరాధకు తెలుసు.
    నాలుగు పుస్తకాలపేర్లూ-రచయితల పేర్లూ తెలిసి పెట్టుకోవడం ఎందుకయినా మంచిదేమో!
    "జేమ్స్ బాండ్ రాసిన రెండు మంచిపుస్తకాలపేర్లు చెప్పు కృష్ణా?" అంది అనూరాధ.
    కృష్ణవేణి కళ్ళను వెడల్పు చేసి అనూరాధను చూస్తూ వుండి పోయింది.
    "ఏమిటలా చూస్తావ్? నువ్వు పుస్తకాల పురుగువుగా? ఆ మాత్రం తెలియదూ?" ఇంతకాలానికి కృష్ణవేణిని దెబ్బకొట్టగలిగినందుకు ఆనందిస్తూ అంది అనూరాధ.
     కృష్ణవేణి మరోసారి అనూరాధ ముఖంలోకి చూసింది జాలిగా. "నిన్ను అందుకే పుస్తకాలు చదవమంటాను. జేమ్స్ బాండ్ రచయిత పేరుకాదు. ఈయాన్ ప్లెమింగ్ అనే రచయిత సృష్టించిన పాత్ర పేరు జేమ్స్ బాండ్" అంది కృష్ణవేణి.
    అనూరాధకు మూర్చ వచ్చినంత పనయింది.
    "మరి ఆ మధ్య ఓ రచయిత్రి తన అభిమాన రచయితల పేర్లు చెబుతూ జేమ్స్ బాండ్ పేరుకూడా చెప్పింది!" ఎలాగో అనగలిగింది అనూరాధ.
    "ఆమె నీలాగే జేమ్స్ బాండ్ పేరు మాత్రం విని వుంటుంది." అంది కృష్ణవేణి అతి సాధారణంగా.
    అనూరాధకు మరేమీ అడగాలనిపించలేదు. మౌనంగా కూర్చుండి పోయింది.
    "నారాయణరావుగురించి నీ అభిప్రాయం అడిగితే ఏం సమాధానం చెబుతావు?" అంది కృష్ణవేణి.
    "ఏ నారాయణరావు? ఆయన ఏమేమి పుస్తకాలు రాశాడు?" కాళ్ళకందని భూమిమీద నిలబడటానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రశ్నించింది అనూరాధ.
    కృష్ణవేణి విరగబడి నవ్వింది. అనూరాధ పిచ్చిచూపులు చూసింది.
    "నారాయణరావు' నవలపేరు అడివి బాపిరాజుగారు రాశారు." అంది కృష్ణవేణి అతి కష్టంతో వస్తున్న నవ్వును దిగమింగుకుంటూ.
    వెలవెలపోతున్న ముఖంలోకి గాంభీర్యాన్ని తెచ్చిపెట్టుకుంటూ "అవును! చాలాకాలం క్రితం ఆ పుస్తకం చదివినట్టు గుర్తు. బాపిరాజు గారి పేరు నాకు చాలా ఫెమిలియర్ గా వుంది. మరీ అంత అజ్ఞానాన్ని అంటగట్టకు. ఆయన యం. ఎల్. ఏ. కూడా గదూ!" అంది అనూరాధ.
    "నీ తలకాయ!" అప్రయత్నంగానే అనేసింది కృష్ణవేణి.
    అసలే చిన్నగావుంటే అనూరాధ ముఖం మరీ చిన్నదై చింతాకులా కనిపించింది. ఆ ముఖం చూస్తుంటే అనూరాధకు జాలీ, నవ్వూ కూడా కలిగాయి.
    "ఇక నువ్వు రచయితలగురించీ, పుస్తకాలగురించీ ఇతరుల ముందు మాట్లాడకుండా వుంటేనే మంచిది. అడివి బాపిరాజుగారు చనిపోయి చాలాకాలం అయింది. ఆయన రచయితేకాదు, పెద్ద కళాకారుడు కూడా" అంది కృష్ణవేణి.


Related Novels


Prathikaram

Mises Kailasam

Matti Manishi

Idee Katha

More