Home » vasireddy seeta devi novels » Matti Manishi
పసిగుడ్డుగా వున్నప్పట్నించీ, ఇంట్లో ఉన్నా, పొలంలోవున్నా సాంబయ్య కనుసన్నల్లోనే పెరిగాడు వెంకటపతి. ఇప్పుడు వాడు స్కూలుకు వెళ్ళడంతో సాంబయ్యకు తన కొడుకు, తననుంచి దూరమౌతున్నట్లనిపించేది. ఒకొక్కప్పుడు దిగులుగాకూడా వుండేది.
మధ్యాహ్నం ఇంటినుంచి కొడుకుకోసం స్కూలుకు వచ్చేవాడు. స్కూల్లో వున్న కొడుకుని ఎత్తుకొని పొలం తీసుకుపోయేవాడు.
ఒకోసారి పంతులు మొత్తుకొనేవాడు. "సాంబయ్యగారూ! కుర్రాణ్ణి మధ్యలో స్కూలునుంచి తీసుకెళ్ళటం మంచిదికాదు. వాడికి బడిమీద శ్రద్ద తగ్గిపోతుంది" అనేవాడు.
పంతులు అలా అన్నప్పుడల్లా "ఇవ్వాల్టికే లెండి. వీడు కళ్ళముందు లేకపోతే గుబులెత్తుతుంది" అని సమాధానం చెప్పి, కుర్రాడ్ని భుజాన వేసుకొని అదేపోత పోయేవాడు సాంబయ్య.
7
వెంకటపతికి తొమ్మిదేళ్ళు నిండాయి. కుర్రాడు బాగా తేలాడు. వాడు పరుగెత్తుతుంటే భూమి గతగతలాడేది.
శేషావతారం దగ్గిర తెచ్చిన అప్పు తీరి సాంబయ్య ఒడ్డున పడ్డాడు. ఆరేళ్ళ శ్రమ - తొమ్మిదెకరాల మాగాణిలో పండిన పంట అంతా ఆ శేషావతారం ఇంటికే చేరింది. మూడెకరాల గరువులో పండిన మెట్టపంటతోనే తనూ, తన కొడుకూ బతికారు. లేకపోతే ఏనాడో తన మాగాణి శేషావతారం వడ్డీలు, ఇరక్కోతలూ కడ్తూ, ఏడువేల అప్పు, ఆరేళ్ళలో తీర్చగలిగిన సాంబయ్య పట్టుదలనూ, ఓపికనూ లోలోపలే మెచ్చుకోక తప్పలేదు. నాలుగేళ్ళనాడు నిలవడబ్బున్న బలరామయ్య ఇప్పుడు అడపా దడపా అప్పులు చేస్తున్నాడు. ఇద్దరు కొడుకులు బస్తీలో చదువుతున్నారు. పెద్దకూతురు పెళ్ళిచేసి తిరిగి చూసుకొనేసరికి బలరామయ్యకు నిలవడబ్బు హరించుకుపోగా పదివేలదాకా అప్పు అయింది. ఇప్పటికే రెండేళ్ళ వడ్డీ దానిమీద పేరుకుపోయింది. మరో రెండేళ్ళలో తీర్చకపోతే ఇరవై ఎకరాలన్నా అమ్మాల్సివుంటుంది. వచ్చే ఆదాయం కొడుకుల చదువులకూ, అల్లుడి మర్యాదలకూ చాలడంలేదు. అతని ఆస్తి కర్పూరంలా హరించిపోసాగింది.
బలరామయ్య ఆఖరుకొడుకు వెంకటపతి ఈడువాడు. కడగొట్టు కూతురు వెంకటపతికంటే ఆరేళ్ళు చిన్నది. బలరామయ్య ఇంటికి దగ్గర్లోవున్న రామలింగేశ్వరాలయంలో, సాయంత్రంపూట ఊళ్ళో పిల్లలు ఆడుకొంటూ వుంటారు. వెంకటపతి సాయంత్తం అయేసరికి ఆ వూరి పిల్లలతో చేరి ఆడుకొంటూండేవాడు.
ఓరోజు బలరామయ్య కొడుకు, కూతురుతో కలిసి వెంకటపతి కోతికొమ్మచ్చి ఆడటం చూశాడు సాంబయ్య. క్షణకాలం ఆనందంలో మునిగిపోయాడు తనకొడుకు పెద్ద అంతస్థుగల బలరామయ్య పిల్లలతో ఆడుకోవటం సాంబయ్యకు గర్వంగానే అనిపించింది. కాని సాంబయ్యను ఏదో తెలియని భయం ఆవహించింది. వెంటనే వెంకటపతి చెయ్యి పుచ్చుకొని ఇంటికి లాక్కొచ్చాడు.
"ఇక నుంచి నీవా పిల్లలతో ఆడొద్దు."
"ఆడుకుంటే ఏం?"
"చెడిపోతావ్. వాళ్ళు చెడ్డవాళ్ళు."
సాంబయ్య కొడుక్కు అంతకంటే వివరంగా చెప్పలేకపోయాడు. వెంకటపతి అలాటివాళ్ళతో కలిసిమెలిసి తిరిగితే వాళ్ళ బుద్దులే అలవడుతయ్యనే ఖచ్చితమైన అభిప్రాయాని కొచ్చాడు సాంబయ్య. వాళ్ళకు వున్నది ఖర్చుపెట్టడం, మంచీ, చెడూ తెలియకుండా దుబారా చేయటం తప్ప మరొకటి తెలియదు. వాళ్ళ వంశంలో వాళ్ళు వళ్ళొంచి పనిచేసే రకం కాదు. అలాంటి పిల్లల స్నేహం పడితే వెంకటపతి తప్పక చెడిపోతాడు. వాళ్ళనుంచి దూరంగా వుంచాలి తన కొడుకును.
వెంకటపతి చదువు అంతంత మాత్రంగానే సాగుతోంది. తీరా చూస్తే వాడు బడికెళ్ళి నేర్చుకుంటున్న మంచికంటే చెడే ఎక్కువగా వున్నట్టు తోచింది సాంబయ్యకు.
ఓరోజు సాంబయ్య పొలాన్నుంచి వచ్చి ఇంట్లో కొడుకు లేకపోవటం చూసి చిరాకుపడ్డాడు. రాత్రి భోజనసమయం అయినా వెంకటపతి రాకపోయేప్పటికి గాబరాపడ్డాడు. ఊరంతా వెతికాడు. చెరువుఒడ్డునా, గుడిదగ్గరా, ఎక్కడా పిల్లవాడు కన్పించలేదు. ఇద్దరు ముగ్గుర్ని అడిగి చూశాడు. కాని వాడి జాడ తెలియలేదు. బలరామయ్యగారి ఇంటిముందుకొచ్చి నిలబడ్డాడు. లోపలకు వెళ్ళటానికి మనస్కరించలేదు. వీధి అరుగుపక్కన అట్లాగే నిలబడ్డాడు. బలరామయ్య భోజనంచేసి తేపుకొంటూ బయటకు వచ్చాడు. వీధి అరుగుమీద కూర్చొని చుట్ట వెలిగించబోతూ, గోడపక్కన నిలబడ్డ సాంబయ్యను చూసి -
"ఎవరా మనిషి?" అన్నాడు.
"నేనే, సాంబయ్యనండీ!"
"సాంబయ్యవా? ఎందు కట్టా పెడగా నిలబడ్డావ్......రా! వచ్చి కూర్చో!" బలరామయ్య ఎట్లా మాట్లాడినా సాంబయ్యకు తనను చిన్నతనంచేసి మాట్లాడినట్లే అనిపిస్తుంది.
"మా వెంకటపతి కన్పించలేదు. ఇట్టా ఏమన్నా వచ్చాడేమోనని వచ్చా!"
"ఏమిటి? మీవాడుకూడా వెళ్ళాడా ఏమిటి? అంతటోడు అయ్యాడంటయ్యా నీ కొడుకు?" సాగదీస్తూ అన్నాడు బలరామయ్య.
సాంబయ్యకు అసలు విషయం అర్ధం కాకపోయినా తనను ఎద్దేవ చేస్తున్నాడన్నది మాత్రం స్పష్టంగా తెలిసిపోయింది.
"ఎక్కడికి పాయా డింతకీ?" పళ్ళు బిగించి అక్కసును అణచుకుంటూ అడిగాడు.
"సినిమా చూట్టానికి మా పిల్లలు బడి కట్టించుకొని బస్తీకి వెళ్ళారు. మధ్యాహ్నం మీవాడు మా సవారిబండిదగ్గిర తారట్లాడటం చూశాను. వాళ్ళతో వెళ్ళి వుంటాడు."
"వాడిదగ్గిర డబ్బుల్లేవు. సినిమా కెట్టా ఎళ్తాడు?" సాలోచనగా అన్నాడు సాంబయ్య.
"మీ తండ్రి ఈ ఊరు వచ్చినప్పుడు చేతిలో చిల్లికానీ లేదు. కట్టుపంచలతో వచ్చాడు. కాని మనవడు నాలుగెకరాల గడువూ, పదెకరాల మాగాణికీ, డెబ్బైఎకరాల రాయీ రప్ప బీటికీ వారసుడవలా? ఎట్లా అయాడంటావ్?" ఆనాడు చెరువు గట్టుమీద సాంబయ్య అన్న మాటలు బలరామయ్య ఇప్పుడు సాంబయ్యకే తిరిగి అప్పగించాడు. బలరామయ్య తన అక్కసు వెళ్ళగక్కి సాంబయ్య ముఖంలోకి చూశాడు. కాని అప్పటికే సాంబయ్య తలవంచుకొని బలరామయ్య ఇంటిముందునుంచి సాగిపోయాడు.
ఇంట్లోకయినా వెళ్ళకుండా సాంబయ్య ఇంటిముందు బండమీద కూర్చున్నాడు. అవమానంతో అతని గుండెలు దహించుకుపోతున్నాయ్, ఆకలీ, కసీ పెనవేసుకుపోయిన పాముల్లా తిరుగుతున్నాయ్! తొలికోడి కూసేదాకా అలాగే కూర్చున్నాడు.
ఇంట్లోకి పిల్లిలా, అడుగుల్లో అడుగులు వేసుకుంటూ వచ్చిన వెంకటపతి రెక్కపుచ్చుకొని చావబాదాడు. మొదటి రెండుదెబ్బలూ కిక్కురుమనకుండా తిన్న వెంకటపతి, మూడోదెబ్బకు స్పృహతప్పి పడిపోయాడు. తన చేతుల్లోంచి జావలా కిందకు జారిపోతున్న కోడుకు స్థితిని గ్రహించిన సాంబయ్యకు గుండెలు ఆగినంత పనయింది. చెమటలు పట్టాయి. ఇంట్లోకి మోసుకెళ్ళి మంచంమీద పడుకోబెట్టి, కుండలోని నీళ్ళు తెచ్చి మొహంమీద చల్లాడు.
"ఒరే అబ్బాయ్! వెంకటపతీ!" కుర్రాడ్ని మృదువుగా కుదిపి పిలిచాడు. కుర్రాడు కదల్లేదు. పలకలేదు.
"ఒరే నాయనా!" తండ్రి హృదయం బద్దలయింది. సాంబయ్యకు పుట్టిబుద్దెరిగింతర్వాత కళ్ళవెంట నీరు రాలేదు. కాని - కాని, ఈసారి అతని కళ్ళలోని రక్తనాళాలు చిట్లేట్లు ఉన్నాయ్. కొడుకుని భుజాన వేసుకొని వీధిలోకి వచ్చాడు. ఆచార్లు ఇంటికేసి పరుగు తీశాడు. తెలతెలవారుతోంది. చల్లటిగాలి రివ్వున వీస్తోంది. దాదాపు ఆచార్లు ఇంటిదగ్గిర్లోకి వస్తూండగా, తండ్రి భుజానవున్న వెంకటపతి కదిలాడు.
"నాన్నా! ఎక్కడి కెళుతున్నాం?" అన్నాడు కళ్ళు తెరిచి సాంబయ్య కొడుకు తలను నిమిరి తన చెంపలకు హత్తుకొన్నాడు.



