Home » vasireddy seeta devi novels » Matti Manishi
"ఆ! - పూర్తయింది. ఎల్లుండి నాటు వేద్దామని నారుకూడా తయారుగా వుంది."
"అయితే ముందెత్తునే నాటు పడుతుందన్నమాట ముందెత్తునాటు ఇరగపండాలి మరి!"
"ఏ ముంపో రాకుండా వుండాలిగదా?" ఆకాశంకేసి చూస్తూ అన్నాడు సాంబయ్య.
"ఇదుగో చూడు సాంబయ్యా! ఆ మెట్టపొలం ఎందుకట్టా పాడుపెట్టటం? చొప్పో, గిప్పో ఏస్తే గొడ్లమేతకన్నా వస్తదిగదా?" విషయం మార్చి అన్నాడు బలరామయ్య.
సాంబయ్యకు కాళ్ళు భూమిలోకి దిగిపోయినట్లయింది, మెట్టపొలం సంగతి రాగానే అది తన తెలివితక్కువకు నిదర్శనంగా బీడుపడివుంది. అందులో వ్యవసాయం చేసే ఖర్చులు కూడా గిట్టవని సాంబయ్యకే కాదు. బలరామయ్యకు కూడా తెలుసు.
"ఏదీ! వెసులుబాటు చిక్కటంలా ఈ పాటికి అట్టాగేవుంచి వచ్చేఏటికి ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నా." పరువు నిలుపుకోవటానికన్నట్టు మాట్లాడి "మరి వస్తా!" అంటూ వెంకటపతి చెయ్యిపట్టుకొని ముందుకు సాగాడు సాంబయ్య.
"అరెరే! ఆ బుడ్డోడు మీవాడా ఏంటీ? ఆ పక్కన ఆడతావుంటే ఏ అలగావాళ్ళ పిల్లాడో అనుకున్నా పేరేంటి?" బలరామయ్య మీసాలకింద విషపునవ్వు కదిలింది.
ముందుకు నడిచిన సాంబయ్య ఆగి నిలబడ్డాడు. గిర్రున వెనక్కు తిరిగి బలరామయ్య ముఖం చితకపొడవాలనిపించింది. కాని ఆ పని చెయ్యగల అంతస్తుగానీ, సాంఘిక బలంగానీ తనకు లేదని తెలుసుకున్న సాంబయ్య "నీ కళ్ళకు అలగావాడిలాగా కనిపించినవాడే ఎనభై ఎకరాల గరువుకూ, పదెకరాల మాగాణికి వారసుడు. వీడు నా కొడుకు. వెంకటపతి!" అన్నాడు. సాంబయ్య కంఠం కంచుగంటలా మోగింది.
కొడుకు నెత్తుకొని, చెరువు గట్టంతా కదంతొక్కుతూ వెళ్ళిపోయాడు సాంబయ్య.
బలరామయ్యకు నసాళానికి అంటింది. కాళ్ళల్లో జంకు పుట్టింది. వంకెకర్ర ఆడించుకుంటూ, సాంబయ్యను చూపు కందినంతవరకూ చూస్తూ నిల్చున్నాడు.
మాగాణి గట్టుమీద కొడుకుని దింపి వాడికేసి కొత్తగా చూసినట్టు చూసుకొన్నాడు. వంటికి అతుక్కుపోయివున్న మురికిలాగు మినహా వెంకటపతి వంటిమీద ఏమీలేదు. గిరజాలు తిరిగిన నల్లటి జుట్టూ, గుబురు కనుబొమలూ వెంకటపతి తండ్రికి నిజంగా పూటకూటికి లేనివాడింట్లో పెరుగుతున్నవాడిలాగే కన్పించాడు. సాంబయ్య హృదయం మొదటిసారిగా చిత్తడినేల అయింది. వెంకటపతిని గుండెలకు హత్తుకొని వళ్ళంతా నిమిరాడు.
"నువ్వు అలగావాడి బిడ్డవు ఎలా అవుతావురా? తొంభై ఎకరాల ఆసామి బిడ్డవు!"
ఆమాటే మనస్సులో మళ్ళీమళ్ళీ అనుకున్నాడు సాంబయ్య.
ఇహ తన కొడుకుని అలా పెంచటానికి వీల్లేదు. మంచి బట్టలు కుట్టించాలి. బళ్ళో వెయ్యాలి. వేళ్ళమీద లెక్కకట్టి వెంకటపతికి ఐదేళ్ళు దాటాయని తెలుసుకున్నాడు.
పొలం పనిలో వున్న సాంబయ్య మనసు, గనెంమీద నత్తగుల్లలతో ఆడుకుంటున్న కొడుకుమీదే లగ్నమయింది. వాడ్నిగురించే ఆలోచన. వాణ్ణి ఎంతవాన్ని చెయ్యాలి? బలరామయ్య కొడుకులకంటే తన కొడుకె పెద్ద ఆస్తిపరుడు కావాలి! బలరామయ్య నలుగురు కొడుకులూ, ముగ్గురు ఆడపిల్లలూ పెరిగి పెద్దవాళ్ళయి, పెళ్ళిళ్ళయి ఆస్తిపంచుకుంటే తలా ఏభై ఎకరాలు రాదు. ఆ రోజుకు తను ఈ ఆస్తి ఇబ్బడి చేస్తాడు. తనకొడుకు వెంకటపతి - వెంకయ్య మనుమడు వెంకటపతి, వీరభద్రయ్య మనమళ్ళకంటే ఆస్తిపరుడౌతాడు. వాళ్ళకంటే పెద్దస్థాయిలో వుంటాడు. అప్పుడే బలరామయ్యను తనూ చూస్తాడు. అతని ముఖం మీదే తనూ అనగలడు. తప్పకుండా అలాగా వాడెవడని అడగ్గలడు!
వెంకటపతికి కొత్త లాగూ చొక్కా కుట్టించాడు. పురోహితుడ్ని అడిగి మంచిరోజు తెలుసుకొన్నాడు. తలంటిపోసి, కొడుక్కు కొత్త లాగూ చొక్కా తొడిగి, బడికి తీసుకెళ్ళాడు. పంతులు త్రిపురయ్య వరండాలో పిల్లోడితో నిలబడ్డ సాంబయ్యనుచూసి గబగబా దగ్గిర కొచ్చాడు.
"కుర్రాడ్ని బడిలోవేస్తున్నారా? శుభం! కబురుపెడ్తే నేనే వచ్చి అక్షరాభ్యాసం చేయించి బడికి తీసుకొచ్చేవాణ్ణిగా?" అన్నాడు.
అక్షరాభ్యాసం తంతులాంటిది చేస్తే నాలుగు డబ్బులు రాలేని త్రిపురయ్యకు ఆ ఖర్చు తప్పించుకోటానికే సాంబయ్య సరాసరి పిల్లవాణ్ణి బడికి తీసుకొచ్చాడు.
"తల్లిలేని పిల్లాడు! ఇప్పుడేం బడిలే అని సాచాత చేశాను. పిల్లాడికి నాలుగు అచ్చరంముక్కలు అబ్బితే మంచిదని ఆలోచించాను. మీ కష్టం వుంచుకోనులెండి. పిల్లాడ్ని మీరు కనిపెట్టి వుండాలి."
"పేరూ?" కుర్రాడిచెయ్యి పట్టుకొని అడిగాడు త్రిపురయ్య.
"వెంకటపతి!"
"వెంకటపతి! బాగుంది!" అంటూ పంతులుగారు వెంకటపతిని లోపలికి తీసుకెళ్ళటానికి ప్రయత్నించాడు. వెంకటపతి తండ్రిచెయ్యి వదిలిపెట్టకుండా గింజుకొన్నాడు. త్రిపురయ్య గద్దించేసరికి వెంకటపతి బావురుమన్నాడు. సాంబయ్య కరిగిపోయాడు.
"పోనీ ఇవ్వాళ్టికి ఊరుకోండి. రేపు వస్తాల్లే!" అన్నాడు సాంబయ్య.
"కొత్తలో పిల్లలందరూ ఇలాగే చేస్తార్లే. ఇవ్వాళ మంచిరోజు - శ్రీకారం చుట్టిస్తాను. ఏదీ, పలకా బలపం తెచ్చారా?" అడిగాడు త్రిపురయ్య.
సాంబయ్య బుర్ర గోక్కున్నాడు.
"ఇదిగో, ఇప్పుడే తెస్తా!" అంటూ సాంబయ్య కోమటికొట్టుకు ఆదరాబాదరాగా పరుగెత్తుకెళ్ళాడు. కోమటి రెండురకాల పలకలు చూపించాడు. ఒకటి బేడరకం, రెండోది అణారకం. చిన్నపిల్లవాడికి బేడపలక అనవసరం అని, అణా ఇచ్చి పలకా, కాణీ ఇచ్చి రెండు బలపాలూ కొన్నాడు. సాంబయ్య తిరిగి స్కూలుకొచ్చి త్రిపురయ్యకు పలకా బలపం ఇచ్చాడు. సాంబయ్య చూస్తుండగానే త్రిపురయ్య వెంకటపతికి అక్షరాలు దిద్దిపెట్టాడు. సంతృప్తిగా కొడుకుని చూసుకొని, అటునుంచే పొలం వెళ్ళాడు.
సాయంకాలం పొలంనుంచి ఇంటికి వచ్చిన సాంబయ్యకు ఇంటిముందు ఒంటరిగా ఆడుకొంటూ కొడుకు కన్పించాడు. కొడుకుని ఎత్తుకొని లోపలకు తీసుకెళ్ళాడు. డబ్బాలోనుంచి వేయించిన శనగలు తీసి ఇన్ని వాడిజేబులో పోశాడు. వెంకటపతి కేరింతలు కొడుతూ, శనగలు తింటూ ఆడుకొంటున్నాడు. కొడుకును చూస్తుంటే హఠాత్తుగా గుర్తొచ్చింది.
"ఒరేయ్! అబ్బాయ్ పలకా, బలపం ఏవిరా?"
"పోయింది."
"ఎక్కడరా పారేశావ్?" తండ్రిగొంతు కర్కశంగా వుంది.
"బలపం పోయింది. పలక పోలా."
"మరదెక్కడ పెట్టావ్! చూపించు?"
వెంకటపతి ఇంటి ముందు రాళ్ళ కుప్పలో దాచిన పలకతెచ్చి తండ్రి చేతికిచ్చాడు. ఒకపక్క బందులు జారిపోయాయి. పలక అడ్డంగా పగిలివుంది.
"అయ్యో కొత్తపలక! అణాకానీ దండగయింది. రోజు కొక పలక పగలగొడ్తే, వీడి చదువుకె పుట్టెడుగింజలు అమ్మాలి" అనుకున్నాడు, సాంబయ్య.
"అరే అబ్బాయ్! ఇట్టా పలకలు పగలుకొట్టకూడదు. చదువురాదు."
"రాకపోతే ఏం?"
వెంకటపతి సమాధానం తండ్రిని ఆలోచనలో పడేసింది. అవును! చదువు రాకపోతే ఏం? తనకు చదువు వచ్చా? అందుకని నష్ట మేమొచ్చింది?
"ఛ! అట్టా అనకూడదు. బాగా చదువుకో!"
"చదువుకొంటే ఏం వస్తది?"
"గొప్పోడి వవుతావ్!"
"అంటే నీ అంత ఔతానా?" చేతులు బారలుజాపుతూ అన్నాడు. వెంకటపతి. కొడుక్కు చెప్పటానికి సాంబయ్యకు సమాధానం దొరకలేదు.
ఉన్న కుటుంబాల పిల్లలతో సమానంగా నిలబెట్టాలనే కాంక్షతోనే సాంబయ్య కొడుకును బడికి పంపాడు. భూస్వామి కుటుంబాలలోని పిల్లలంతా బడికి వెళ్తున్నారు. మంచిబట్టలు వేసుకొంటున్నారు. తన కొడుకుకూడా మంచిబట్టలు వేసుకొని బడికి వెళ్ళాలి. అంతే, అంతకంటే తనుకోరేది ఏమీలేదు. ఆ బలరామయ్య తన కొడుకును చూసి ఎద్దేవ చేశాడు. ఊళ్ళో ఎవరూ తనకొడుకును వేలెత్తి చూపటానికి అవకాశం ఇవ్వకూడదు.



