Home » vasireddy seeta devi novels » Matti Manishi
"మా అమ్మను ఎవరిపంచనో పడేసి నేను ఇక్కడెందుకుండాలి? మంచాన పడినదాన్ని నేను చూడకపోతే ఎవరు చూస్తారూ?" సాగదీస్తూ అంది సుబ్బమ్మ.
"బావా! కూతురు నీకు ఊడిగం చేస్తుంటే తల్లిని మేం చూసుకోవాలా?" పరుషంగా అడిగాడు బావమరిది.
"ఊరికే చేస్తుందేమోటిరా? ఈవిడకిచ్చే ధాన్యం మీరు తీసుకొని ముసలమ్మను పోషించండి. మీకు మాత్రం కష్టమేముంది? ఆ ముసల్ది ఇంకా ఎంతకాలం బతుకుద్ధి కనకా?"
కుక్కిమంచాన పడివున్న రామమ్మ కళ్ళు సాంబయ్య వైపుకు తిరిగాయి. ఆ కళ్ళలోని క్రోధమూ, జుగుప్సా సాంబయ్యకు స్పష్టంగా కన్పించాయి. ముసలమ్మ బలవంతాన మంచంమీదనుంచి లేవబోయి కిందకు దొర్లింది. సుబ్బమ్మా, సాంబయ్య బావమరిదీ వెళ్ళి లేవదీశారు. రామమ్మ మళ్ళీ ఆ మంచంమీద పడుకోమంది. కూతుర్ని చూసి బయటకు నడవమని సైగ చేసింది. సాంబయ్య బావమరిదికి రామమ్మ దూరపుచుట్టమే! అతని పెద్దమ్మ తోటికోడలు. అతనిమీద ఒరిగిపోయి ముసలమ్మ గొంతు పెకలించుకొంది. ఆ వున్న ఓ చెయ్యీ కాలూ ఆడిస్తూ సాంబయ్యకేసి చింతనిప్పుల్లా కళ్ళు చేసుకొని చూసింది. నాలుక మెలి తిరిగిపోతుండగా, శాపనార్ధాలు పెట్టేందుకు చెయ్యి ముందుకు చాచి "నా- ఉసురు....నీ-నీకు-కొ-ట్టా..." మిగతామాటలు గొంతులోనే లుంగచుట్టుకుపోయాయి. ఊగిపోతున్న తల్లిని పట్టుకొని గడప దాటించింది సుబ్బమ్మ. వెనక్కు తిరిగి సాంబయ్య ముఖంలోకి సూటిగా చూసి "మా అమ్మ ఉసురు నీకొడతదిలే! ఇంతన్నాయం చేసినోడిని, నువ్వేం బాగుపడతావ్? ఆ భగవంతుడు చూట్టంలా! నీ కాలూ, చెయ్యీ ఇరగ! నీ నోట్టో పురుగులు పడవూ?" పెటీపెటీమని మెటికలు విరిచి, ఖాండ్రించి గోడమీద ఊసి, తల్లిని తీసుకొని రోడ్డెక్కింది సుబ్బమ్మ. సాంబయ్యకు ఒళ్ళు తెలియని కోపం వచ్చింది. తాటిమట్ట తీసుకొని నడిబజార్లో సుబ్బమ్మ తాట వలవాలనిపించింది.
"తప్పుడు ముండల్లారా? ఫోండి నా ఇంటిముందునుంచి!" బావమరిదికేసి చూస్తూ మళ్ళీ అరిచాడు సాంబయ్య. "ఇంకా ఎందుకోయ్ అత్తా నిల్చున్నావ్? కదులు ముందు. మీరెవరూ ఇక నా గడప తొక్కొద్దు!"
"నా చెల్లెలు దుర్మమ్మ గొంతుకోశావు! ముసలమ్మను అన్నాయం చేశావు. నువ్వేం మడిసివి! బుడ్డోడి మీద ఆపేక్ష చంపుకోలేక ముసలమ్మను పంపించాం. ఇహ బుద్దొచ్చింది. నీ గడపతొక్కితే చెప్పుచ్చుక్కొట్టు!" అంటూ విసురుగా వెళ్ళిపోయాడు సాంబయ్య బావమరిది.
వాళ్ళు వెళ్ళాక సాంబయ్యకు నెత్తిమీదనుంచి పెద్ద బరువు దించినట్టయింది. వచ్చినప్పుడు ఓరచూపులు చూసిన సుబ్బమ్మకూ, వెళ్ళేప్పుడు నోటికొచ్చినట్టు కూసిన సుబ్బమ్మకూ ఎంతో తేడా కన్పించింది. సుబ్బమ్మను ఇంట్లో పెట్టుకోవటానికి తను ఆశపడిన మాట నిజం! కాని తప్పుడు ముండ! ఎట్టా వాగింది? ఒకవేళ దాన్ని ఇంట్లో పెట్టుకొని అలుసు ఇచ్చివుంటే, తన కొంప నిలువునా కూల్చేది. తన పరువు బజారుకు ఈడ్చేది కదూ?
జరగనిదాన్ని గురించి ఊహించుకుంటూ మనస్సును కుదుటపెట్టుకున్నాడు చేజేతులా సుబ్బమ్మను పోగొట్టుకున్నానేమోననే బాధను, పరిపరివిధాల అనర్ధాలను ఊహించుకొని, అవి తప్పించుకొన్నాననే సంతృప్తిని తెచ్చిపెట్టుకొని, అణచుకున్నాడు.
ఏది ఏమయినా ఒక్క ఆలోచన మాత్రం సాంబయ్య మనస్సుకు ఊరట కలిగించింది. సుబ్బమ్మమీద మోజుతో ముసలమ్మను కూడా ఇంట్లో పెట్టుకోవటానికి ఇష్టపడితే, తల్లీ కూతుళ్ళ తిండిబట్టలూ, పైగా వాళ్ళకిచ్చే ధాన్యమూ, అంతా కలిసి బోలెడు ఖర్చయేది. దానికితోడు సుబ్బమ్మకు ఓసారి తను లొంగిపోయాడో, తన పరువుతోపాటు ఇల్లుకూడా దోచేసేది? వెళ్ళేముందు దాని ధోరణి చూస్తే అలాగే కన్పించింది. ఈ అప్పుల భారంతో ఆ తల్లీ కూతుళ్ళను కూడా నెత్తిన వేసుకొంటే, నేల కరవటం మాట వాస్తవం. ఎలా అయినా తన తండ్రీ తనూ కష్టపడి సంపాదించిన ఆస్తిని కాపాడుకోవాలి. తన కోర్కెలూ, తన సుఖమూ ఆస్తిని హరించేవేగాని పెంచేవిగావు. తను కోర్కెల్ని చంపుకొంటాడు. ఆస్తిని కాపాడుకోవటమే తన జీవితధ్యేయం. తన కొడుకును - తన వంశాంకురాన్ని - ఆస్తిపరుణ్ణి చెయ్యాలి.
6
వెంకటపతికి ఐదేళ్ళు నిండి ఆరోఏడు వచ్చింది. అప్పటికి సాంబయ్య అప్పు చాలా వరకు తీరిపోయింది. కలిసొస్తే వచ్చేఏటికి అప్పు పూర్తిగా తీరిపోతుంది. తన కష్టం అక్కరకొచ్చింది. కనకయ్యలాటి మోసగాళ్ళు, శేషావతారంలాంటి దురాశాపరులూ కూడా తనను తన భూమినుంచి దూరం చెయ్యలేకపోయారు. తను తన రెక్కలమీద ఆధారపడ్డాడు. తను నేలను నమ్ముకొని బతుకుతున్నాడు. అహర్నిశం పొలంలో శ్రమించాడు. రాత్రిళ్ళు పొలాన పడుకోవాల్సి వచ్చినప్పుడు పసివాణ్ణి కూడా తనతోపాటే పడుకోబెట్టుకొంటున్నాడు.
ఆయేడు కుప్పనూర్పిళ్ళ ఎద్దడిలో తెల్లవారుఝామున నిద్రపోతున్న కొడుకుని భుజానవేసుకొని పొలంపోయాడు. మూడురోజులపాటు ఇంటికికూడా రాలేదు. పొలానే అన్నం వండించుకుతిన్నాడు. రెండో రోజు బాగా మురికిపట్టిన వెంకటపతిని చెరువులో కడిగి తుడిచి ఎండలో నిలబెట్టాడు. వెంకటపతి పెంపుకు తగినట్లే దృఢంగా వున్నాడు. పసిముఖం ఎడంకుమాడి, గాలికివాడి మొద్దుబారినట్లుండేది. కేరింతలు కొడుతూ, పొలాన కల్లంలో దూడలవెంట తిరుగుతున్న వెంకటపతిని చూసి సాంబయ్య హృదయం ఆనందంతో పరవళ్ళుతొక్కేది. కాని కూలిజనం వెంకటపతిని చూసి జాలిపడేవారు.
"తల్లిలేనిబిడ్డ, పాపం! ఇంట్లో మనిషినికూడా పెట్టకుండా ఆదా చేస్తున్నాడు. బిడ్డడు పోషణలేక బండబారిపోతున్నాడు." అలా మాట్లాడుకుంటూ సాంబయ్య కన్పించగానే అంకిళ్ళు నొక్కుకుంటూ ఆగిపోయేవారు ఆడకూలీలు.
ఊళ్ళో జనం సాంబయ్యనుగురించి చెప్పుకోవడంకూడా వృధా అనేదశకు వచ్చారు. ఎన్ని అన్నా ఆ మనిషికి చీమ కుట్టదు." నన్ను ముట్టకు నా మాలకాకి" అన్నపద్దతిలో వున్నా సాంబయ్యమీద ఊళ్ళో చాలామందికి ఏవగింపుగా వుండేది. ఎప్పుడైనా సాంబయ్య ఎదురుపడితే కనకయ్య మొహం చాటేసి పక్కవాటున వెళ్ళేవాడు. కనకయ్య చేసిన ప్రచారంతో సాంబయ్యకువున్న కాస్త పరపతికూడా పోయింది. అంతా ఆకట్టుకొందామనే దురాశతో సాంబయ్యే ఊబిలో దిగాడనీ, అందులో తన ప్రమేయం ఏమీ లేదనీ, అడిగిన వాళ్ళకూ, అడగనివాళ్ళకూ చెప్పాడు. ఏదో రోజున ఆస్తంతా వడ్డీలకింద శేషావతారంకు జమ అవుతుందని కనకయ్య రూఢిగా చెప్పటంతో, షావుకారు బలరామయ్యకు సాంబయ్య పొలంమీద కన్నుపడింది.
పాతికా పరకా చేబదులుగా ఇస్తూ కనకయ్యను చేరదీశాడు. ఎలాగయినా శేషావతారంమీద వత్తిడితెచ్చి సాంబయ్య పొలం వేలానికి తెప్పిస్తే కనకయ్య కష్టం తను వుంచుకోనని వాగ్దానం చేశాడు బలరామయ్య.
"ఇహ జరగబోయేది అదేగా!" చూస్తూవుండు. ఆరునెలల్లో అది జరక్కపోతే నన్ను పేరుపెట్టి పిలవొద్దు" అని చెపుతూ బలరామయ్య దగ్గర కనకయ్య తన పబ్బం గడుపుకుంటూ రాసాగాడు. అలాంటి ఆరు నెలలు ఆరుగడిచి పోయాయి. అయినా సాంబయ్య పొలం వేలానికి రాలేదు. ఇంతకు ముందుకంటే సాంబయ్య ధైర్యంగా కన్పిస్తున్నాడు. వచ్చే ఏటితో తన అప్పులుతీరి ఒడ్డున పడ్తానని సాంబయ్య అంటున్నాడని, ఆనోటా, ఆనోటా బలరామయ్యకు తెలిసింది. కనకయ్యకు కబురు పంపితే ఇంట్లో వుండీ ఊరెళ్ళాడని చెప్పిపంపించాడు.
ఓ రోజు పొలం వెళుతున్న సాంబయ్య చెరువుగట్టుమీద బలరామయ్యకు ఎదురైనాడు. సాంబయ్య ఎదురైతే చూసీ చూడనట్టే వెళ్ళే బలరామయ్య ఆగి పలకరించాడు:
"ఏం సాంబయ్యా, దమ్ము పూర్తయిందా?"
బలరామయ్య మాట వింటూనే సాంబయ్య ఠక్కున ఆగి పక్కకు తొలగి నిల్చున్నాడు. బలరామయ్య కుటుంబం అంటే సాంబయ్యకు భయం భక్తీ రెండూ వున్నాయి. సాంబయ్య తండ్రి వెంకయ్య, బలరామయ్య తండ్రి భద్రయ్య దగ్గర పాలికాపు నౌకరి చేసినవాడు. అది సాంబయ్య నరాల్లో జీర్ణించుకుపోయింది. ఆ కుటుంబం అంటే మనసులో తెలియని అక్కసుకూడా వుండేది. కాని మళ్ళీ ఆ కుటుంబంవాళ్ళు ఎవరైనా యెదురుపడితే నీరుకారిపోతాడు.
బలరామయ్య సాంబయ్య ఎదురు పడితే మాట్లాడ్డం జరిగితే అదీ అతిగర్వంగా "నువ్వు ఆ వెంకయ్య కొడుకువే"నని గుర్తుచేస్తున్నట్లు మాట్లాడేవాడు. కాని ఈరోజు బలరామయ్య గొంతులో కొంత ఆప్యాయత ధ్వనించింది. అది తెచ్చిపెట్టుకొన్నదే కావచ్చు. అవతలివాడికి ముఖ్యం పలకరింపులోని ఆదరణ, ఆపేక్షా అంతే!



