Home » vasireddy seeta devi novels » Matti Manishi
"ఓ రావమ్మా! ఎక్కడ సచ్చావ్?" అంటూ సాంబయ్య ఇల్లంతా వెతికాడు. పడమటింట్లో పిల్లవాడు ఆదమరిచి నిద్రపోతున్నాడు. ముసలమ్మ అక్కడా లేదు. సాంబయ్యకు వళ్ళుమండిపోయింది. ఇది ఈ పాటప్పుడు ఎక్కడ చచ్చినట్లు? గొడ్లసావిట్లోకి వచ్చి చూశాడు. అక్కడా లేదు. సాంబయ్య మనసులో అనుమానం తుమ్మముల్లులా గుచ్చుకుంది. ఈ ముసల్ది ఇంట్లో బియ్యం ఉప్పూ, పప్పూ బయటకు చేరవేయటంలేదుగదా? అందుకే తన యిల్లు గుల్లయిపోతుంది.
సావిట్లోకి వచ్చిన సాంబయ్యను చూసి ఎద్దులు ముట్టెలుచాచి గుంజుకొన్నాయి. అరెరే! ఎద్దులకు మేతవేయటంకూడా తను మర్చిపోయాడు. ఈ రోజంతా తన చుట్టూ పిశాచాలు చిందులు తొక్కుతున్నట్టుగా వుంది. ఎద్దుల మేతకోసం వాములదొడ్లోకి వచ్చిన సాంబయ్యకు పిడకలగూటి కానుకొని కూర్చొన్నట్టుగా వున్న ఓ ఆకారం కన్పించింది. పరకాయించి చూశాడు. అడుగు ముందుకు వేస్తూ - "ఎవరా మడిసీ?" కేక వేశాడు.
గబగబా అడుగులు ముందుకు వేశాడు. రాములమ్మ లాగుంది ఇంత రాత్రప్పుడు పిడకలగూటిదగ్గరేం చేస్తున్నట్టు? ఇంట్లో దొంగిలించిందంతా మూటగట్టి ఇక్కడ దాచి, వీలు చూసుకొని దాటేస్తున్నట్లుంది! దొంగముండ! దీన్ని నమ్మి తను ఇంతకాలం ఇంట్లో పెట్టుకొన్నాడు.
పిడకలగూటి దగ్గర కెళ్ళిన సాంబయ్య వంగి ముసలమ్మ ముఖంలోకి ముఖంపెట్టి చూశాడు. ముసలమ్మ ఉలకలేదు. పలకలేదు. అంతా దొంగెత్తువేస్తుంది. పట్టుబడేసరికి ఈ ఎత్తు వేస్తుంది ముసలమ్మ. జబ్బపట్టుకొని ఊపాడు. రామమ్మ అమాంతం సాంబయ్య చేతిమీద వాలిపోయింది. సాంబయ్య గాబరాపడ్డాడు. ముక్కు దగ్గర వేలుపెట్టి చూశాడు. గాలి పీలుస్తూనే వుంది. బతికే వుంది.
"రావమ్మా! రావమ్మా! ఏమయిందంట?"
ముసలమ్మ కళ్ళు తెరిచింది. సాంబయ్య ముఖంలోకి జాలిగా చూసింది. నోరు తెరిచింది. మూతి ఓ పక్కకు తోసుకుపోయింది. మాట బయటికి పెగిలిరాలేదు. చేతులాడించటానికి ప్రయత్నించింది. ఓ చెయ్యి కదల్లేదు.
సాంబయ్య ముసలమ్మని ఇంట్లోకి చేర్చాడు. ఆవిడను కుక్కి మంచంలో పడేసి రామాచారి దగ్గరికి పరిగెత్తాడు.
రామాచారి ముసలమ్మను పరీక్షచేసి "పక్షవాతం! లాభంలేదు" అన్నాడు.
"అయితే ముసలమ్మ లేచి తిరగలేదన్నమాటేగా?" తన అభిప్రాయాన్ని ప్రశ్నరూపంలో వదిలాడు సాంబయ్య.
"ఆహా! అక్షరాలా!" అని ఆచారి నాలుగు మాత్రలూ, రెండు పొట్లాలూ ఇచ్చి సంచి చుట్టుకొని లేచి నిలబడ్డాడు.
"బియ్యం నిండుకున్నె రేపు ఓ అర బస్తా పంపించండి సాంబయ్యగారూ!"
"అరబస్తా ధాన్యమా? ఇప్పుడు ఇబ్బందిగా ఉందే? ఉన్నవి మా తిండికే సరిపోయేట్టులేవుమరి!" సాంబయ్య నసుగుతూ అన్నాడు.
"అదేమిటి సాంబయ్యగారూ? ఈ సంవత్సరంలో మీరిచ్చిందేమిటి? తుమ్మినా దగ్గినా వస్తున్నానా? పిల్లాడికి సుస్తీ చేసినా, ముసలమ్మకు జబ్బు చేసినా చూస్తున్నానా? మందులు మాకు మాత్రం ఊరికినే వస్తాయా?" రామాచారి కటువుగా అన్నాడు.
సాంబయ్య మెత్తబడ్డాడు. పిల్లవాడిమాట ఎత్తేటప్పటికి సాంబయ్య గుండెలు బితుక్కుమన్నాయి.
"ఆఁహా! అదిగాదు ఆచార్లుగారూ! ఇవ్వననటం లేదు. ఉన్న పరిస్థితి చెప్పాను, అంతే. రేపు పంపిస్తాలే అరబస్తా. తరుగూ బొరుగూ అయితే ఆ తర్వాత నేను సర్దుకుంటానులే."
"ఈ పొట్లాలూ, గుళికలూ అయ్యాక ముసలమ్మకు ఎట్లాగుందో చెప్పండి. తగ్గకపోతే పట్నంనుంచి మందులు తెప్పించాల్సి వుంటుంది." పిడుగులాంటి మాటను సాంబయ్యమీదకు విసిరి ఆచారి చక్కాపోయాడు.
నిద్రలోవున్న వెంకటపతి కలవరిస్తూ లేచి కూర్చొని బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టాడు. సాంబయ్య కొడుకును భుజానవేసుకొని సముదాయించసాగాడు. ఓ అరగంట ఏడ్చి వెంకటపతి తండ్రి వడిలో నిద్రపోయాడు. తొలికోడి కూసింది. సాంబయ్య తల బరువుగా తూలిపోతోంది. కొడుకు పక్కనే మేను వాల్చాడు.
తనకేదో శని పట్టుకొంది. కొడుకు అదృష్టజాతకుడనుకొన్నాడు. కాని వాడికి ఒకో ఏడువస్తుంటే తనకు ఇబ్బందులు పెరుగుతూనే వున్నాయ్. తన కష్టార్జితమంతా శేషావతారం మిల్లులో పోస్తున్నాడు. ముసలమ్మ ఆసరాగా వుంటుందనుకొంటే అది కాస్తా మంచాన పడ్డది. ఇప్పుడు దానికిచ్చే ధాన్యం, పెట్టే తిండీ అంతా దండగే. పైగా మందులకూ, మాకులకూ ఖర్చు. అదంతా ఎవడు భరిస్తాడు? దానిక్కూడా కాచిపోసేదెవరు?
ఇంకా బాగా చీకటి వుండగానే మాలపల్లెకువెళ్ళి ఏసోబును లేపి, ముసలమ్మ సంగతి చెప్పి, ఆమెను వచ్చి తీసికెళ్ళమని అత్తవారికి కబురు పంపాడు.
తెల్లవారి చాకలిరత్తి పిల్లవాడికి నీళ్ళుపోసి ఇంటి పైపనులన్నీ చూసుకుంది. సాంబయ్య స్వయంగా ఇంతవండి పిల్లవాడికి పెట్టి, తను తిన్నాడు. ముసలమ్మ నోరు తెరచుకొని అలాగే పడివుంది.
రెండోరోజు ఉదయానికల్లా, ముసలమ్మ కూతురూ, సాంబయ్య పెద బావమరిదీ వచ్చారు.
సాంబయ్యకు బావమరిది తన తండ్రి చెప్పిన సలహా వినిపించాడు.
ముసలమ్మ కూతురు సుబ్బమ్మ ఇంట్లో వుండేట్టూ, తల్లినీ, పిల్లడ్నీ, చూసుకొంటూ ఇంటిపనులన్నీ చేసుకొనేట్టూ, అందుగ్గాను ఇంకో సలకగింజలు అదనంగా సాంబయ్య ఇస్తే సరిపోతుందనీ మామగారి సలహా.
సాంబయ్య జెర్రిగొడ్డులా లేచాడు.
"ఆ ముసల్దానితో కానీ, దాని కూతురితో కానీ నాకేం పనిలేదు" అంటూన్న సాంబయ్య కళ్ళు అప్రయత్నంగానే సుబ్బమ్మమీద పడ్డాయి! సుబ్బమ్మ ఓరగా చూసి, పైట సర్దుకొని, తల పక్కకు తిప్పుకొంది. సాంబయ్య గుండెలు గుబగుబలాడాయి. ముక్కుల్లోనుంచి వేడిగాలి బయటకొచ్చింది.
"అయితే ముసలమ్మకు రావాల్సిందేదో పడేయ్! నీకు చేసే చాకిరి ఇంకో ఊర్లో చేసుకుంటారు. మునిగిపోయిందేమీ లేదు." రుస రుసలాడుతూ అన్నాడు సాంబయ్య బావమరిది.
"ఏంటిరా రావాల్సింది? నిరుటేడుది ఎప్పుడో ఇచ్చేశాను. పోతే జరిగే ఏడాదిలో ఒక్కనెలేగా ఆ ముసలమ్మ చేసింది? మొన్నటినుండీ మంచానే పడివుండే! ఆవార మందూ మాకూ ఇప్పించాను. దాని కదే సరిపోయింది. నేనివ్వాల్సిందేమీ లేదు. మీరు ముసలమ్మను తీసుకెళ్ళొచ్చు."
సాంబయ్య ముఖంలోకి తలెత్తి నేరుగా చూసింది సుబ్బమ్మ. సుబ్బమ్మ కళ్ళలోకి చూసిన సాంబయ్యకు రోమాలు నిక్కపొడిచినట్టయింది. తను తొందరపడి మాట జారాడు. సుబ్బమ్మలాంటిది ఇంట్లో వుంటే అన్నిటికీ ఉపయోగమే!
"ఇదేంది బావా? ఇంతన్యాయమా? ముసలమ్మకు ఓపిక వున్నన్నినాళ్ళూ ఊడిగం చేయించుకొని, ఇప్పుడా మనిషి మంచాన పడగానే తోసేస్తున్నావ్? ఇప్పుడేమయిపోవాలా మడిసి? ఏ వజాన బతకాలి?" యీసడింపుగా మాట్లాడాడు బావమరిది.
సాంబయ్య ఆలోచించాడు. ఆ ఆలోచనలలో సగభాగం, వాడిపోతూ తొంగిచూస్తోన్న సుబ్బమ్మ యవ్వనం చుట్టూనే తిరిగాయి.
"ఇదిగోరా! నువ్వు చెప్పావని ఒప్పుకుంటున్నా! సుబ్బమ్మను ఇంట్లో పెట్టుకోవటానికి ఒప్పుకొంటున్నా. ఆ ముసలమ్మ కిచ్చిందే ఈ మనిషికీ ఇస్తాను. ముసలమ్మను నువ్వు తీసుకెళ్ళి, మీ ఇంట్లో పెట్టుకొని చూసుకోండి." రాజీగా అన్నాడు సాంబయ్య.
సాంబయ్య బావమరిది నొసలెగరేసి చూశాడు. సుబ్బమ్మ బిగిసిపోయి సాంబయ్యకేసి చూసింది.
"ఏంట్రా! అట్టా మిటకరించుకొని చూస్తావ్? కావాలంటే సుబ్బమ్మకు సాలు చివరకు ఏదో రూపంలో అదనంగా ముట్టజెపుతాను. అది నాకు వదిలేయండి!" తన మాటలకు తనే ఆశ్చర్యపోయినట్టు మొహం పెట్టాడు సాంబయ్య. అందులో ఏదో లౌక్యం, గూడార్ధం స్ఫురింపజేసినట్టు సాంబయ్య భావించాడు. దాని ఫలితం కోసం సుబ్బమ్మ కళ్ళలోకి గుచ్చి గుచ్చి చూశాడు.



