Home » vasireddy seeta devi novels » Matti Manishi


    "ఇట్టాంటి వ్యవహారాల్లో జాగుచెయ్యటం మంచిది కాదు. పరమయ్య మనవడి మెట్ట బేరం చేయ్!"
    కనకయ్య ఆశ్చర్యపోయాడు. సాంబయ్య ఇంత మెలుకువతో వుంటాడని ఇంతవరకు గ్రహించలేదు.
    "ఏమిటి సాంబయ్యా, నీ చాదస్తం? ఐదొందల్తో ఎంత కొంటావయ్యా? కొంటే ఓ ఏభయ్ ఎకరాలు కొనిపడెయ్యాలి. నువ్వు ఐదూ పదీ కొంటానికి తాపత్రయపడితే ఏం జరుగుద్దో తెలుసా?"
    "ముందుగా కొనగలిగినంత కొనేస్తే మేలుకదా అని!"
    "కొంపలారిపోతాయ్! నువ్విలా కక్కుర్తిపడితే బలరామయ్య పసికట్టేస్తాడు. ఇందులో ఏదో వుందని అందరూ ఎగబడతారు. అప్పుడు నీకు అమ్మేవాడుకూడా దొరకడు."
    "మళ్ళీ పంటవచ్చి మనచేతిలోకి పైకం వచ్చేదాకా యీ కాలువ సంగతి బయటపడకుండా వుంటుందంటే నాకు నమ్మకంలేదు" అంటూ సాంబయ్య కనకయ్య కళ్ళ లోకి చూశాడు. అసలు సాంబయ్యకు కనకయ్యమీదే నమ్మకంలేదు. తన దగ్గర గుంజవలసిందేదో ముందే గుంజుకొన్నాడు. రేపోమాపో ఆ బలరామయ్యకూ, తోటపాలెం వెంకట్రామయ్యకు కూడా చెప్పి డబ్బు గుంజుకుంటాడు. ఇట్టా వాళ్ళిద్దర్నీ తనమీద పోటీపెడితే తను తట్టుకోలేడు. వాళ్ళు మోతుబరి ఆసాములు. లంకెబిందెల్లో లక్ష్మి మూలుగుతోంది. వాళ్ళతో తనేం పోటీ పడగలడు! డబ్బు చేతిలో పడ్డాక కనకయ్య మనిషికాడు. అసలు అతడు తన ఇంటిచాయలకన్నా రాడు. కనకయ్యను ఆదమరిచి ఉండటానికి వీల్లేదు. తనపని అయ్యిందాకా కనకయ్యను వెన్నాడాల్సిందే మరి.
    "ఏంది సాంబయ్యా! ఏదో గట్టి ఆలోచనే పెట్టుకొన్నావ్!" చెంబులో నీళ్ళు పుక్కిలించి ఉమిసి అరుగుమీదనుంచి లేచి నిలబడి అన్నాడు కనకయ్య.
    "మొనగాడి చేక్కలన్నీ ఏరిపెట్టాను. మొత్తం ఏభై ఎకరాల పైచిలుకుంది. ఎకరం వందలోపు పడుతుంది ఇప్పుడయితే!"
    "నీ సోది పాడుగానూ! అదంతా నిజమేనయ్యా! అంత డబ్బెక్కడుందయ్యా కొనటానికి?" చిరాగ్గా అన్నాడు కనకయ్య.
    "ఆ శేషావతారం వున్నాడుగా? కాకపోతే నాలుగైదేళ్ళ పంట ఇద్దాం! చూడు మరి కనకయ్యా!"
    కనకయ్య బిత్తరపోయాడు. సాంబయ్య తెగువ చూస్తుంటే కనకయ్య కాళ్ళు వణికాయి.
    "ఇదిగో సాంబయ్యా! బాగా ఆలోచించే మాట్లాడతున్నావా? తొందరపడకు." పై పంచతో ముఖం తుడుచుకొనే నెపంతో తన ముఖంలోని భావాలను కప్పుకున్నాడు కనకయ్య.
    "నేనంతా ఆలోచించే వచ్చా ఇక నీదే ఆలస్యం." తన నిర్ణయాన్ని స్పష్టంగా ప్రకటించాడు సాంబయ్య.
    కనకయ్య ఇంట్లో పెళ్ళి పనులయేముందు సాంబయ్య తన వ్యవహారాలన్నీ పూర్తిచేసుకున్నాడు. శేషావతారంచేత అప్పు ఇప్పించి, సాంబయ్యచేత డెబ్బై రెండెకరాల మెట్టపొలం కొనిపించాడు కనకయ్య. సాంబయ్య గుండెలు తేలికపడ్డాయి. ఆ లావాదేవీల్లో కనకయ్యకు బాగానే ముట్టింది. వీలు చిక్కినప్పుడల్లా కొత్తగా కొన్న పొలంకి వెళ్ళి రాయీ రప్పా ఏరిపారేసి వస్తూండేవాడు సాంబయ్య. ఊళ్ళో అందరికీ ఆశ్చర్యం వేసింది - సాంబయ్య యీ పనికిరాని పొలం ఎందుకు కొన్నాడా అని! ఐదారుగురు సాంబయ్య మొహానే అడిగేశారు. సాంబయ్య ముభావంగా "ఏదో పడివుంటుందిలే! అవతలవాళ్లకు డబ్బు అవసరం అని గొంతుమీద కూర్చుంటే కొన్నా!" అంటూండేవాడు.
    వాళ్ళు సాంబయ్య అటువెళ్ళగానే "కనకయ్య ఈయనకి టోపీ వేశాడు. తన ఇంట్లో పెళ్ళి పబ్బం గడుపుకొన్నాడు" అని నవ్వుకొనేవారు.
    కనకయ్య కూతురి పెళ్ళి బాగానే జరిపించాడు. సాంబయ్య పెళ్ళిలో ఇంకా ఏదైనా ఇస్తాడని ఆశపడ్డాడు కనకయ్య. కాని, సాంబయ్య కానీ రాలనివ్వలేదు.
    "నా దగ్గిరేముంది ఇంకా? తలవరకూ మునిగి వున్నా" అన్నాడు.
    సాంబయ్య తను శేషావతారం దగ్గర డబ్బు తెచ్చింది ఇంకా ఎవరికీ తెలియదనే భ్రమలోనే వున్నాడు.
    సంక్రాంతి పండగ వచ్చింది. సాంబయ్య ధాన్యం శేషావతారం మిల్లుకు తోలాడు. శేషావతారం డబ్బు లెక్కకట్టి నోటుమీద పన్నెండొందలకు నలభైనాలుగు తక్కువగా చెల్లువేశాడు. రెండువేలు అప్పుతీరిపోతుందని అంచనా వేసుకొని వచ్చిన సాంబయ్య బిత్తరపోయాడు. మొత్తం ఏడువేలకూ రూపాయి వడ్డీ కట్టి, వడ్డీ మినహాయించిన వైనం చెప్పాడు శేషావతారం.
    "బస్తాకు అర్ధరూపాయి ఇరగ్గోసుకుంటున్నావుగా? ఇంకా ఈ వడ్డీ గిడ్డీ ఏమిటి?" దురుసుగా అడిగాడు సాంబయ్య.
    శేషావతారం నోరుతెరిచి సాంబయ్యకేసి చూశాడు. "ఏమిటయ్యా ఇది కనకయ్యా!" అని అరిచాడు.
    అప్పటికే కనకయ్య మిల్లు ఆవరణలోనుంచి వెళ్ళి ఐదునిముషాలయింది.
    "ఇదుగో నోటు. కావాలంటే చదివించుకో!" అంటూ సాంబయ్య మొహంమీద ప్రోనోటు ఆడించాడు శేషావతారం.
    ఆ పట్టు వసరగా వారంరోజులు కనకయ్య సాంబయ్యకు చిక్కలేదు. సాంబయ్యపని కుడితిలోపడ్డ ఎలుక చందమయింది. ఈ లెక్కన ఎన్నేళ్ళకు అప్పుతీరుతుంది? పొలం సాగుకు ఎప్పుడు వస్తుంది? వచ్చే ఏడన్నా కాలువ పడితే రెండేళ్ళల్లో తను అప్పుతీర్చుకొని నిలతొక్కుకోగలడేమో?
    
                             5
    
    వెంకటపతికి నాలుగో ఏడు వచ్చింది. అటూ ఇటూ పరుగులు తీస్తూ నడుస్తున్నాడు. మాట్లాడుతున్నాడు. కొడుకు ముద్దూ ముచ్చటా చూస్తూ తన్మయత్వం పొందాల్సిన సాంబయ్య, పరధ్యాన్నంగా పిల్లవాడికేసి చూసీచూడనట్టు చూసేవాడు. మనిషికి మనేదు ఎక్కువయింది. ఆ ఏడు పైరుమీద వుండగా గాలివాన వచ్చి పంటంతా దెబ్బతింది. కూలిగింజలకు, తిండిగింజలకు బొటాబొటిగా సరిపోయింది. మరుసటేడు పంటకు తెగులు సోకింది. ధాన్యం సగానికి సగమే రాలింది. ధాన్యం అమ్మగా వచ్చిందాంట్లో మూడోవంతు వడ్డీకే సరిపోయింది. మూడేళ్ళపంట, గింజ బీరుపోకుండా శేషావతరానికి ఇచ్చాడు. అయినా యింకా ఐదువేలకు పైచిలుకు అప్పు చూపిస్తున్నాడు శేషావతారం. ఇంకో సంవత్సరం ఇలాగే దెబ్బతింటే తను అప్పుతీర్చలేడు. మాగాణి పోల శేషావతారానికే కట్టపెట్టాల్సివస్తుంది. ఈనగాచి నక్కలను పెట్టినట్టయింది. దురాశకుపోయి ఋణభారాన్ని నెత్తికి ఎత్తుకున్నాడు. అదంతా ఆ కనకయ్యగాడు చేసిన మోసం! వాడు తన కొంప నిలువునా తీశాడు. ఇప్పటికి రెండేళ్ళుగా "ఇదిగో కాలువ, అదిగో వస్తుంది" అంటూ నమ్మిస్తున్నాడు.
    ఇంకా ఏం కాలువ? వాడి శార్ధం! సాంబయ్యకు వళ్ళు మండిపోయింది. ముసలమ్మ పళ్ళెంలో అన్నం పెట్టింది. అన్నం ముందు కూచోబోయినవాడు, ఏదో పూనినట్టు లేచి కర్ర చేతపట్టుకొని కనకయ్య ఇంటిమీద పడ్డాడు.
    అప్పుడే అన్నంతిని తేపుకుంటూ బయటకు వచ్చిన కనకయ్య సాంబయ్య వాలకం చూసి బెదిరిపోయాడు.    
    "ఏదయ్యా కాలువ? వస్తదీ వస్తదీ అంటూ నా కొంప నిలువునా కూల్చావ్?" నిలదీసి అడిగాడు సాంబయ్య.
    "తొవ్వేవాణ్ణి నేనా ఏంటి? మా బావమరిది తమ్ముడు చెప్పాడు. నీ మీద అభిమానంతో అ ఆమాట నీ చెవున వేశాను." కనకయ్యమాట పూర్తికాకముందే సాంబయ్య చేతిలోని బాణాకర్ర గాల్లోకి రివ్వున లేచింది.
    కనకయ్య తలవంచి పక్కకు దూకాడు. చెవులను రాచుకుంటూ వసారా గుంజకు తగిలింది కర్ర. కప్పులోనుంచి జలజలా గుల్ల రాలింది. కిందపడ్డ బల్లి కదలకుండా నేలకు కరచుకుపోయింది! మళ్ళీ సాంబయ్య కర్ర పైకెత్తేసరికి కనకయ్య బజార్నపడ్డాడు. సాంబయ్య గోచి బిగించి కనకయ్య వెంటపడ్డాడు. కనకయ్య షావుకారు బలరామయ్య ఇంట్లోకి జొరబడటం కన్పించింది. కసిగా కర్ర బలరామయ్య ఇంటిముందు రోడ్డుమీద బాది ఇంటికొచ్చాడు సాంబయ్య.
    వంటింట్లో అన్నంమీద బోర్లించిన బుట్టను తోసేసి పళ్ళెంలో అన్నం కుక్క తినడం కనిపించింది సాంబయ్యకు. పిచ్చికోపంతో కుక్కను బాదాడు. పళ్ళెం ఎగిరి అంతదూరంలోపడి చొట్టబోయింది. గదంతా అన్నం మెతుకులు చెల్లాచెదురుగా పడ్డాయి. నోటికాడికూడు కుక్కలపాలైంది. తనను శనేశ్వరం చుట్టుకొంది. ఆ ముసల్ది ఎక్కడ చచ్చింది? ఇట్టా, వడ్డించిన అన్నం కుక్కలపాలు చేస్తూ తనేం చేస్తున్నట్టు? తన తిండి తింటూంటే ఆ ముసలిదానిక్కూడా వళ్ళు బలిసినట్టుంది. ముప్పూటలా తిండి, సంవత్సరానికి రెండు జతలు పొడుం పంచలు - పైగా పందుం గింజలు! ఈ ముండ చేసేదేమిటి? పైగా ఇట్టాంటి పనులా?


Related Novels


Prathikaram

Mises Kailasam

Matti Manishi

Idee Katha

More