Home » Yandamuri veerendranath » అతడే ఆమె సైన్యం
"చెప్పడానికేముంది? కోట్ల విలువచేసే వజ్ర వైఢూర్యాలతో చేసిన నగలు. పోయినేడాది ఢిల్లీ మ్యూజియంలో రష్యన్ జార్ చక్రవర్తుల ఆభరణాల ఎగ్జిబిషన్ చూశాను. దాదాపు అలాగే వున్నాయి. ఆకారాలు తేడా" అన్నాను.
"ఛ! వాటికీ, వీటికీ పోలికేమిటి? ఇది దైవ భూషితాలు. పవిత్రమయినవి. సాక్షాత్తు కలియుగ విష్ణువు ధరించేవి" అన్నాడు. నీలకంఠం స్వరంలో రవ్వంత కోపం కదలాడింది.
"అది చూసేవాళ్ళ దృష్టిలో వుంటుందేమో! నేను వాటిని దైవ భూషణాలుగా కాకుండా మామూలు నగలుగానే చూశాను" అన్నాను కవ్వింపుగా.
"ఏరా! ఏమిటిలా నాస్తికుడిగా మారిపోతున్నావు?" అడిగాడు నీలకంఠం.
"నాస్తికుడంటే ఎవరు? అర్ధం ఏమిటి?" అడిగాను.
"దేవుడిని నమ్మినివాడు. అదికూడా తెలియదా, లేక మమ్మల్ని పరీక్షిస్తున్నావా?"
" 'నాస్తికో వేదనిందకః' అన్నాడు మనువు. వేదాలను నిందించినవాడు నాస్తికుడనబడతాడు. నేను వేదాలను నిందించటం లేదు. మీరనే భగవంతుడినీ నిందించడంలేదు."
"మాకు వేదాలు, ఉపనిషత్తులు ఏమీ తెలియవు. మాకు తెలిసింది భగవంతుడు. ఆయన్ని నమ్ముతున్నాం, పూజిస్తున్నాం" అన్నాడు గుర్నాధం కోపంగా.
"కోపం తెచ్చుకోకు గుర్నాధం. ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పు. నీ దృష్టిలో దేవుడంటే దేవుడే. వేంకటేశ్వరుడుగానీ, సింహాచలం అప్పన్నగానీ, కాశీ విశ్వేశ్వరుడుగానీ ఎవరయినా రాముడన్నా, కృష్ణుడన్నా దేవుడే" అన్నాను. తొంభయ్యేళ్ళ వృద్ధుడికి అ ఆ లు నేర్పిస్తున్న ధోరణిలో.
"భగవంతుడు సర్వాంతార్యామి. అదే నాకు తెలిసింది."
"అంటే ఈ కుర్చీల్లో, బల్లల్లో, గది గోడల్లో కూడా దేముడున్నట్లే కదా?" మళ్ళీ రెట్టించి అడిగాను.
"హిరణ్యకశివుడి తర్వాత నీకే వచ్చినట్లుందా అనుమానం. చెప్పమంటావా ప్రహ్లాదుడి సమాధానం? ఇందుగల డందులేడని" రాగం తీశాడు నీలకంఠం వ్యంగ్యంగా. అందరూ నవ్వారు.
"అయితే శర్మా! అయిదు వందల రూపాయల పెన్షన్ కోసం అరవయ్యేళ్ళ ముసలావిడని మూడు రోజులు తిప్పి, చివరకు పదిహేను రూపాయల లంచం తీసుకుని బిల్ పాస్ చేసింది ఆ కుర్చీలో... సారీ భగవంతుడి వడిలో కూర్చునేనన్నమాట. కూతురి పెళ్ళి దగ్గరపడిందని రిటైర్ మెంట్ పెన్షన్ త్వరగా పాస్ చేయించమని ఓ ముసలాయన ఎంతగానో వేడుకున్నాడు నిన్ను. గుర్నాధం! ఆయన కంట తిరిగిన నీటిని చూసి ఒక్క నీ మనసు తప్ప ఈ గదిలో గోడలు, కుర్చీలు, బల్లలూ అన్నీ చెమర్చే వుంటాయి. పది రోజులపాటు ఆయన్ని తిప్పి చివరకు పది శాతం బేరం కుదుర్చుకుని అడ్వాన్స్ గా వెయ్యిరూపాయలు తీసుకున్నది అక్కడ ఆ దేవుడి సమక్షంలోనే కదా! బిల్ పాస్ చేసేముందు అణా పైసలతో లెక్క కట్టి మిగిలింది అడిగి తీసుకుని మరీ బిల్లు ఆయన చేతిలో పెట్టావు. అప్పుడు ఆ దైవం ప్రత్యక్షసాక్షిగా ఉన్నాడని గుర్తురాలేదా?" ఆగాను. ఎవరూ సమాధానం చెప్పలేదు కానీ అందరి కళ్ళలో కోపం చిరాకు.
"పోయిన్నెలలో ఏం జరిగిందో గుర్తుందా విశ్వేశ్వర్?" అడిగాను.
"ఏం జరిగింది?" అతడికి గుర్తుండదని నాకు తెలుసు.
"పోయిన్నెల ఇదే జీతాలరోజు అక్కౌంటెంట్ మీద అందరూ వినేలా అరిచావు గుర్తులేదూ?"
"అవును జీతంలో నాకు ఏడు రూపాయలు తక్కువిచ్చాడు. నాకు న్యాయంగా రావలసింది ఎందుకు వదులుకోవాలని అడిగి లెక్క సరిచేయించి తీసుకున్నాను అది తప్పా?" అడిగాడు కోపంగా.
"తప్పుకాదు. న్యాయంగా నీకు రావలసిన జీతం అది. మరి అదే విధంగా పెన్షనర్లు తమకు న్యాయంగా రావలసింది తీసుకోవడానికేగా మన దగ్గరకు వచ్చేది? వాళ్ళ పని చేయటం కోసమేగా మనకు ఉద్యోగాలిచ్చింది? వాళ్ళకిచ్చే డబ్బు ఉదారంగా మన జేబుల్లోంచి ఇస్తున్నట్లు అందులో కమీషన్ తీసుకోవడం తప్పుకాదా?"
"వాళ్ళ డబ్బు వాళ్ళకిస్తున్నందుకు కాదు వాళ్ళు మాకు యిస్తున్నది. వేగంగా, తొందరగా, ఏ ప్రశ్నలూ వేయకుండా బిల్ పాస్ చేస్తున్నందుకు."
"అది 'లంచం' కాదు. 'బహుమతి' " అన్నాడు నీలకంఠం.
"ఎంక్వయిరీ చేయకుండా మన అకౌంటెంట్ నీకు ఒకటో తారీఖున జీతం యివ్వననీ, అలా ఇవ్వాలంటే తనకీ ఓ 'బహుమతి' కావాలనీ ఓ నాల్రోజులు ఆలస్యం చేస్తే నువ్వు వూరుకుంటావా?"
వాళ్ళు దెబ్బతిన్నట్టు చూశారు.
"మాకు బాధ్యతలున్నాయి. నీలా భార్యాబిడ్డలు లేని ఒంటరి పక్షిగాళ్ళం కాదు. మా కిలాంటివి తప్పవు. తప్పుకాదు" అన్న ధోరణిలో అన్నాడు విశ్వేశ్వర్. ప్రత్యర్ధి బలహీనత మీద దెబ్బ కొట్టడం ఓడిపోతున్నవాడి లక్షణము.
మన దగ్గరకొచ్చే పెన్షనర్లకు బాధ్యతలు లేవా? మనలా పూర్తి జీతాలు కూడా లేవే. నాలుగయిదు వందలతో నేలంతా గడుపుకోవాల్సిన దుస్థితిలో వున్న మనిషి దగ్గర అయిదూ, పదీకొట్టేస్తారే. ఆ అయిదూ, పదే వాళ్ళకెంత అవసరమో ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళెంతమంది దేవుడికి మొరపెట్టుకుంటారో ఎన్ని రకాల శాపనార్ధాలు పెడుతూ వెళతారో గమనించారా? మీరు నమ్మిన దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడని నమ్మితే చాలంటారా? నా ప్రశ్నలకు మీరు నాకు సమాధానం చెప్పాల్సినవసరం లేదు. ప్రతిమనిషికీ అంతరాత్మ అనేది వుంటుంది. ఈసారి పూజలో కూర్చున్నప్పుడు మీ అంతరాత్మ మీద వేసిన అందమైన ముసుగుని తీసేసి భగవంతుడి ముందు నగ్నంగా పరచండి. మీరు చేస్తున్న ఈ పని తప్పో, ఒప్పో విశ్లేషించుకోండి. శాంతాకారం, భుజంగశయనం అని దేవుడిని వర్ణించకండి. భయభయహారం, సర్వలోకైకనాథం అని పొగడకండి దేవుడికి దీపం అవసరంలేదు. చీకట్లో మగ్గుతున్న మీ అంతరాత్మలో దీపం వెలిగించి భగవంతుడిముందు ఆత్మవిమర్శ చేసుకోండి. అప్పటికీ మీలో కళంకం లేదనిపిస్తే అప్పుడు మీరు నిజమయిన దైవభక్తులు."
మరో మాట మాట్లాడకుండా ఫైళ్ళు మూసేసి బయటపడ్డాను. అరగంట తర్వాత అనుపమ వాళ్ళింట్లో వున్నాను.
"మీ మనసేం బావున్నట్లు లేదు. కూర్చుని విశ్రాంతి తీసుకోండి- నేను వేడిగా టీ పట్టుకొస్తాను" చెప్పి లోపలకు వెళ్ళింది అనుపమ.
ఆమె నన్ను చూసింది కేవలం రెండుసార్లే కాని నా ముఖంచూడగానే మనసులోని ఆరాటాన్ని కనిపెట్టగలగడం ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ కూడా వుంది. తల వెనక్కు వాల్చి సోఫాలో పడుకున్నాను. ఎంతో హాయిగా అనిపించింది. ఎంతటి కొత్తవాళ్ళయినా అపరిచిత్వాన్ని మరిపించే స్నేహపూరిత వాతావరణం అది. ఆ ఇంటినిండా ఖరీదయిన వస్తువులున్నాయి. కానీ ఎంతటి బీదవాళ్ళకయినా బెరుకు కలిగించని ప్రశాంతతతో కూడిన పరిసరం.
చల్లటి నీళ్ళు తాగాక మరికాస్త తేరుకున్నాను. అనుపమ యిచ్చిన మసాలా టీ తాగాక టెన్షన్ పూర్తిగా తగ్గిపోయింది.
అనుపమ ఎదురుగా కూర్చుని పుస్తకం తిరగేస్తోంది.
"ఇవ్వాళ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను" అన్నాను ఉపోద్ఘాతంగా.
"మిమ్మల్ని చూడగానే అనుకున్నాను. ఇప్పుడు చెప్పండి ఏం జరిగింది?"
ఆఫీసులో జరిగినదంతా చెప్పాను. "ఎవరికివాడు ఎదుటి వాడితో పోల్చుకుని వాడికంటే నేను తక్కువగానే చేస్తున్నానని తృప్తిపడతాడు. మరొక అవినీతిపరుడితో పోల్చుకుంటాడేతప్ప నీతి, నిజాయితీగల మనిషితో పోల్చుకుని తను చేస్తున్నది తప్పేమోనని ఆలోచించడు. వాడు లక్షలు సంపాదిస్తే నేను వేలు సంపాదించడంలో తప్పేమిటని ప్రశ్నిస్తాడు. మా ఆఫీసులో పరిస్థతి మరీ దారుణం. యాభై రూపాయల ఫించను తీసుకునే ముసలిదాని దగ్గరా రెండు రూపాయలు కొట్టేస్తాడు ఫ్యూన్. అన్నింటికి ఫిక్స్ డ్ రేట్ పై అధికారి నుంచి ఫ్యూన్ వరకు వాటాలు పంచుకుంటారు" అన్నాను.
"నిజమే నేనూ అనుభవించానది. ఆ అవినీతిని అరికట్టే దెవరు? ప్రధానమంత్రి కూడా ఇది 'ఇంటర్నేషనల్ ఫినామినా' అని సమర్ధించుకుంటున్నప్పుడు మామూలు మనిషిని ఏమనగలం? ఏ సంస్థలోనయినా అత్యున్నతస్థాయిలో వున్నవాడు నిజాయితీ పరుడయితేనె తన కిందవాళ్ళను అదుపులో పెట్టగలడు. వాడే గడ్డికరుస్తున్నప్పుడు కిందవాళ్ళను నిజాయితీగా వుండమని శాసించలేడుగా."
"ప్రజలకు ఫామిలీ ప్లానింగు గురించి చెప్పాల్సిన మంత్రిగారికి ఎనిమిదిమంది పిల్లలు. కొడుకు పుట్టాడన్న సంబరంతో ప్రజలనుంచి దోచుకున్న సొమ్ములో కొంత భగవంతుడికి సమర్పించుకున్న దైవభక్తుడు. ఆ రోజు హుండీలో ఐదు లక్షల క్యాష్ దొరికింది. ఎవరినుంచి వచ్చిందో అది అందరికీ తెలుసు. అలాంటి నాయకులు పాలన సాగించే ఈ దేశంలో ధర్మరక్షణ చేసేది ఎవరు?" అన్నాను.
"భక్తంటే దేవుడికి పూజలు చేసి, కొబ్బరికాయలు కొట్టి, వాడితో పచ్చడి చేసుకు తినవచ్చనే ఆలోచనగల ప్రజ మనది. భక్తులంతా అతి మంచివాళ్ళని, పూజలు చేయనివాళ్ళంతా రాక్షసులని సులభంగా నమ్మేస్తారు. నేను వేదాలు, ఉపనిషత్తులు చదవలేదుగాని మా వారు చెపుతుండేవారు. భక్తికంటే దైవంపట్ల భయాన్ని ఎక్కువగా చూపించివుంటే ఈ ప్రజలింతగా దిగజారి పోయేవారు కాదని" అంది అనుపమ.
"అక్షరాలా నిజం. నాకు సంస్కృతం రాదు. దొరికినంత మటుకు వేదోపనిషత్తులు, స్మృతులు, అనువాదాలు చదివాను. నాకయితే చాలావరకు అర్ధంకాలేదు. ఆ రోజుల్లో అవి పండితులకు నిర్దేశించబడ్డవి. స్త్రీలకు, శూద్రులకు వాటిని చదివే అర్హత కూడా లేదు. కాబట్టి అవి కొద్దిమందికే పరిమితమైపోయాయి. మనిషి ధర్మానుసరణకంటే మోక్షప్రాప్తికి మార్గాలు, యజ్ఞయాగాదుల వివరాలు వాటిలో ఎక్కువగా కనిపిస్తాయి. ప్రతి మనిషి మోక్ష సాధనకై కృషి చేయలేడు కదా. సామాన్య మానవుడిలో ఋజు వర్తనకి, దైనందిన నైతిక జీవనానికి అవసరమయిన సూత్రాలు తక్కువ. అవి కూడా ప్రాచుర్యం పొందలేకపోయాయి."
"అంటే మన ప్రాచీన వాఞ్మయంలో నైతిక ప్రవర్తనకి సంబంధించిన అంశాలే లేవంటారా? ఈ స్మృతుల్లో అన్నీ అవే సూత్రాలున్నాయంటారే" అడిగింది అనుపమ.
"లేవనికాదు, ఉన్నాయి. 'దయా సర్వభూతేషు, క్షాంతి, అనసూయాశౌచ, మనాయాసో, మంగళ, మకార్పణం, మస్పృహేతి' అనేవి ఆత్మగుణాలని గౌతముడు చెప్పాడు. ఇవి ప్రతిమనిషి ఆచరించాల్సినవి. మొదటిది- సమస్త ప్రాణులయందు దయ, పరులకి అపకారం చేయకపోవడం, ఇది దయలో ప్రాథమిక అవస్థ. పరులకి ఉపకారం చేయడం రెండవ అవస్థ.
'పాడద్వయేన వక్ష్యామి యదుక్తం గ్రంధకోటిభిః
పరోపకారుడు పుణ్యాయ పాపాయ పరపీడనం' అన్నాడు వ్యాసుడు. కోట్లకొలది గ్రంథములచే చెప్పబడిన విషయాన్ని రెండు పాదాల్లో చెపుతున్నాడు. పరుల కుపకారము చేయుట పుణ్యము, అపకారము చేయుట పాపము. రెండవది- ఆత్మగుణం క్షాంతి. ఎలాంటి బాధనయినా సహించడమే క్షాంతి. భారతంలో ధర్మరాజు చెపుతాడు. ఒక చెయ్యి చందనంలో, రెండో చెయ్యి అగ్నిలో వుంచినపుడు మనసు ఒకేరకంగా వుండాలని.
మూడో ఆత్మగుణం- అసూయ లేకపోవడం, నాలుగవది-శౌచం. శరీరాన్ని, మనసుని కూడా ఎప్పుడూ పరిశుభ్రంగా వుంచుకోవాలి. ఇంద్రియ నిగ్రహం దీనిలో ప్రధానం. అయిదవది ఆత్మగుణం- అనాయాసం, శక్తికి మించిన ధర్మం చెయ్యవద్దు. ఎదుటివారిని మానసికంగా, శారీరకంగా హింసించి ఆనందించడం అమానుషం. అలాగే శక్తికిమించిన ఉపవాసాలు చేసి శరీరాన్ని కృశింప చేసుకోవటం కూడా తగదు. తర్వాత గుణం- మంగళం. ఎప్పుడూ శుభాన్నే కోరాలి. ఏడవది-అకార్పణ్యం. ఎప్పుడూ దైన్యంగా వుండవద్దు. కష్టాల్లో, బాధల్లో సుఖాల్లో ఎప్పుడూ ఒకేరకంగా వుండాలి. దిగులుపడి, ఎదుటివారిని యాచించి, సానుభూతి పొంది తక్కువ కావద్దు. ఎనిమిదవ గుణం- అస్పృహ. అనగా కోరికలు లేకపోవటం. కలలోనయినా పరుల సొమ్ముని ఆశించవద్దు. ఇవి కాకుండా సత్యసంధతకు వేదాలు ప్రాముఖ్యం ఇచ్చాయి.
'సత్యం బ్రూయాత్సృయం బ్రూయాన్న
బ్రూయాత్సత్యమ ప్రియం
ప్రియంచనానృతం బ్రూయదేష ధర్మస్సనాతనః'
అన్నాడు మనువు.



