Home » Yandamuri veerendranath » అతడే ఆమె సైన్యం


    "వాదనలతో అభిప్రాయాలు మారవు. నా అభిప్రాయాలు వెలిబుచ్చడం వల్ల అనవసర వాదనలు. కామెంట్స్ మొదలవుతాయి. అందుకే ఎదుటివాడి మనసు నొప్పించకుండా మాట్లాడడం ఉత్తమమైన మార్గం అనుకునేవాడిని."

    "వాదనలతో అభిప్రాయాలు మారవు నిజమే. కానీ మీ వాదన పదిమంది వింటే అందులో ఒక్కరిలోనయినా ఆలోచన పుడుతుంది కదా! మన ఆలోచనలు మనలో సమాధి చేసుకోవడం కంటే ఒకరిద్వారా మరొకరికి వ్యాపించడం వల్ల కొంచెమైనా ప్రయోజనం కలుగుతుందని నా నమ్మకం."

    "అంటే నన్ను స్నేహితుడిగా మీరు అంగీకరిస్తున్నారన్నమాట. చాలా థాంక్స్!" అన్నాను.

    "స్నేహంలో మొదటి సూత్రం ఎదుటివారి అభిప్రాయాలను నిష్పక్షపాతంగా విశ్లేషించడం. వితండవాదంతో నేను చెప్పేది కరెక్టు. అది ఎదుటివాడు ఒప్పుకోవాలనడం స్నేహానికి వర్తించని సూత్రం. ఏ ఇద్దరి అభిప్రాయాలు ఎప్పుడూ ఒకటి కావు. కొన్ని పట్టు విడుపులతో, అండర్ స్టాండింగ్స్ తో వుంటేనే అది నిలబడుతుందని నా అభిప్రాయం"

    మరి కాసేపు కూర్చుని శెలవు తీసుకుని వచ్చేశాను. ఎప్పుడైనా వాళ్ళింటికి రావచ్చని, సంకోచపడవద్దని చెప్పింది అనుపమ.

    ఆ రాత్రి నా ఆలోచనలలో అనుపమ చోటుచేసుకుంది. నా యాభై ఏళ్ళ వయసులో అంతట ఉన్నత వ్యక్తిత్వం గల స్త్రీని నేను చూడటము ఇదే మొదటిసారి. తనొక అనాధనని చెప్పినప్పుడు... భర్త, కొడుకు పోయారని చెప్పినప్పుడు... ఆమె ముఖం ఎంత భావరహితంగా వుందో, తనొక డబుల్ ఎమ్.ఏ డిగ్రీ హోల్డర్నని గోల్డు మెడలిస్టునని చెప్పినప్పుడు కూడా అంత భావరహితంగా వుంది. ఆ స్థితప్రజ్ఞత ఎంతో మెచ్యూరిటీ వుంటేగాని రాదు.

    ఆ రోజు నేనొక పాఠం నేర్చుకున్నాను. అనుభవాలను, అభిప్రాయాలను ఇతరులతో పంచుకోవాలనుకునే వాడు బావిలో కప్పలా వుండకూడదు. నలుగురి దగ్గరకూ వెళ్ళాలిగాని, నలుగురు తన దగ్గరకు వస్తారని ఆశించకూడదు.


                        4


    "నమస్కారం సార్!" పేపరు చదువుతున్న నేను సత్యం రాకని గమనించనేలేదు.

    "రా సత్యం కూర్చో! ఏమిటి విశేషాలు?" ఆహ్వానించాను.

    "మీ దయవల్ల ఇల్లు పూర్తయింది. ఈ శనివారం గృహప్రవేశం చేసుకుంటున్నాం."

    "బావుందయ్యా! నేను చేసింది కాస్తంత ఆర్ధిక సహాయం. కష్టపడింది నువ్వు. రాత్రి పగలు అని చూడకుండా కృషి చేశావు. ఫలితం లభించింది."

    "మీరేమీ అనుకోనంటే...." సందేహంగా ఆగాడు సత్యం.

    "ఏమిటి డబ్బు సరిపోలేదా?" అడిగాను.

    "అబ్బే అదేమీ కాదండీ. గృహప్రవేశం కదా మీ కోసం బట్టలు తీసుకున్నాను. ముందుగా ఇస్తే కుట్టించుకుంటారని ఇచ్చి రమ్మన్నారు నాన్నగారు."

    "నాకు బట్టలు కొనడమేమిటి సత్యం? ఇది నాకు నచ్చదు" అన్నాను. ఇచ్చిన డబ్బుకి నేను వడ్డీ తీసుకోను కాబట్టి ఈ రకంగా ఏదో ఇవ్వాలని భావిస్తున్నాడు. అది నన్నెంతగా అవమానించి నట్టవుతుందో ఆలోచించడంలేదు.

    "మీరు బాధపడతారని నాన్నగార్కి చెప్పాను. కాని ఆయన వినిపించుకోలేదు" అన్నాడు సత్యం దిగులుగా.

    "అవును సత్యం! నువ్వు మీ నాన్నగారి మనసు నొప్పించలేవు. నేను నీకేమీ కాను కాబట్టి నన్ను అవమానించగలవు కదూ?"

    నా దగ్గరనించి ఇలాంటి జవాబుని అతడు వూహించలేదు. దెబ్బతిన్నట్లు చూశాడు. నా మనస్సు నొచ్చినా ఎదుటివాడి మనసు నొచ్చుకోకూడదనే విధంగా ప్రవర్తించే వెంకట్ మాత్రమే తెలుసు వాళ్ళకు.

    "మీరలా భావించకండి. మిమ్మల్ని ఒక పెద్దన్నగారిగా భావించి ఒక శుభసందర్భంలో ఏదో ఇవ్వాలనుకున్నాం అంతే."     

    "నేను నీకు పెద్దన్నయ్యనే అయితే ఈ రకమయిన అనవసరపు ఖర్చుకి అయిదువేలు అప్పుగా ఇచ్చేవాడినే కాదు సత్యం. సింపుల్ గా ఫంక్షను చేసుకొమ్మని 'శాసించే' వాడిని. ఈ అప్పు తీర్చడానికి నువ్వెన్ని నెలలు అవస్థ పడాలో నాకు తెలుసు" అన్నాను తీవ్రంగానే.

    "మీరన్నది నిజమే! కాని నాన్నగారు పెద్దవారు. సంప్రదాయాలకు విలువనిచ్చేవారు. ఈ వయసులో ఆయన్ని ఎదిరించడం, మనసు నొప్పించడము భావ్యం అంటారా? నేనిప్పుడు కాదంటే తండ్రి కోరిక తీర్చలేని దుర్మార్గుడిగా అందరూ నన్నే అనరా?"

    " 'తత్సర్వ పతిశ్రుతి, ప్రతక్షతో బలవతి, నశ్ఫతి మాత్రమ్' అన్నాడు భామతి. ఏదయితే సహేతుకంగా వుంటుందో అంతమాత్రమే స్వీకరిస్తే చాలు. మొత్తం సంప్రదాయాన్ని కాదు. ఒకనాటి మన సంప్రదాయాలను ఈనాడు సంపూర్ణంగా ఆచరించగలుగుతున్నామా? లేదే! కాబట్టి మన పరిస్థితులను బట్టి సంప్రదాయాన్ని సడలిస్తే తప్పేమిటి?"

    "అనుకున్నంత సులభంకాదు వెంకట్ గారూ! ముఖ్యంగా నాలాంటివాడికి- వాళ్ళను ఎదిరించి బతకడం రోజు రోజు నరకమే అవుతుంది. నన్ను క్షమించండి."

    "సరే! నిన్ను నేను శాసించడంలేదు సత్యం. ఆలోచించమన్నానంతే!"

    "ఈ బట్టలు బలవంతంగా ఇచ్చి మిమ్మల్ని అవమానించను. కాని శనివారం ఉదయం గృహప్రవేశం తర్వాత సత్యన్నారాయణవ్రతం. మీరా రోజంతా అక్కడే వుండాలి మర్చిపోకండి."

    "క్షమించు. నేను రాను. ఏమీ చెయ్యొద్దని నిన్ను నేను బలవంతం చెయ్యను. అలాగే నన్ను రమ్మని బలవంతం చెయ్యకు. నిజం చెప్పాలంటే నాకలాంటి పూజల్లో, వ్రతాల్లో నమ్మకం లేదు" స్థిరంగా చెప్పేశాను. మొదటిసారిగా నా మనసు విప్పి చెప్పాను. తృప్తిగా అనిపించింది.


                 *    *    *    *


    "ఏమిటి సార్! ఈ రోజు కూడా ఇంత కష్టపడి పనిచేస్తున్నారు" అని అడిగాడు శర్మ.

    "ఏం జీతాలొచ్చే రోజు పని చేయకూడదా?" అడిగాను.

    "అలా కాదనుకోండి. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నెలలో మొదటి రోజునించి చివరి రోజువరకు ఒకేలా పనిచేస్తారు. ఈ రోజు ఎవరూ పనిచెయ్యరుకదా. కాస్త కబుర్లు చెప్పవచ్చుగా" అన్నాడు. అతడు అఫెండ్ అయినట్లు గ్రహించాను. పెన్ను మూసేసి పక్కన పెట్టాను.

    "కూర్చో శర్మా" నేను అనగానే కుర్చీ లాక్కుని కూర్చున్నాడు.

    "చెప్పు, నీ కుటుంబం గురించి చెప్పు. వింటాను"

    "వాడినేం అడుగుతారు సార్! డి.ఐ.జి." విశ్వేశ్వర్ వచ్చి మరో కుర్చీలో కూర్చుంటూ అన్నాడు.

    "డి.ఐ.జి.యా అంటే?"

    "డబుల్ ఇన్ కం గ్రూప్. వాళ్ళావిడ టీచర్. ఇద్దరే పిల్లలు సుఖవంతమైన కుటుంబం" అన్నాడు.

    "నే భార్య ఉద్యోగం చెయ్యదా?" విశ్వేశ్వర్ ని అడిగాను. కొన్నేళ్ళుగా ఒకే ఆఫీసులో పనిచేస్తున్నా వాళ్ళ కుటుంబాల గురించి నా కంతగా తెలియదు. అంతగా పట్టించుకోలేదు. ఇన్నాళ్ళు నా తత్వం అంతేనని అందరూ సరిపెట్టుకున్నారు. శర్మ కొత్తగా వచ్చినవాడు కాబట్టి ఆగలేక నన్ను సంభాషణలోకి దింపాడు.

    "చెయ్యదండీ! తనకిష్టం వుండదు" అన్నాడు విశ్వేశ్వర్.

    "నీ కెంతమంది పిల్లలు?"

    "నలుగురు"

    "నాలుగురా?" ఆశ్చర్యంగా అడిగాను. ఈ రోజుల్లో నలుగురి పిల్లల భారం అంటే మామూలు మాటలు కాదు.

    "వాళ్ళావిడ ఓపిక్కి మెచ్చుకోవాలి సార్! ఇద్దరు పిల్లల్ని సంబాళించుకు రావడమే మాకు కష్టం అనిపిస్తోంది. ఒక్కరితో సరి పెట్టుకునుంటే బావుండేదని అనుకుంటూంటాం" అన్నాడు శర్మ.

    "ఏం చేస్తాం సార్! మొదటి ముగ్గురూ ఆడపిల్లలు." "అదృష్టం! నాలుగోసారయినా బాబు పుట్టాడు. లేకపోతే ఇంకా ఎంతమందిని కనాల్సి వస్తుందేమో అనుకున్నాను." అని నవ్వి వూరుకున్నాడు.

    "తిరుపతిలొ మన ఆరోగ్యశాఖా మంత్రిగారిని చూశాను. ఏడుగురు ఆడపిల్లల తర్వాత మగపిల్లవాడు పుట్టాడని కళ్యాణం చేయించారు" అన్నాను.

    "పుత్రుడుంటే తప్ప పున్నామ నరకంనించి తప్పించుకునే మార్గంలేదు కదండీ. ఏం చేస్తాం" అన్నాడు గుర్నాధం. అతడి కలాంటి నమ్మకాలు చాలా వున్నాయి.

    "అంటే నరకం నాకు తప్పదన్నమాట" అన్నాను. అందరూ దెబ్బతిన్నట్లు చూశారు.

    "ఛ! మీరలా అనుకోకండి. మీలాంటి పుణ్యాత్ములకు నరకం ఏమిటండీ? ఎంతమంది కొడుకుల్ని కన్నా మేము చేసిన పాపాలకు నరకం తప్పదు" అన్నాడు శర్మ.

    "అలాంటప్పుడు కొడుకులే కావాలన్న నియమం లేదుగా- మరి అన్నీ తెలిసి కూడా పాపాలు ఎందుకు చేస్తున్నారు?" అడిగాను.

    "ఏం చేస్తాం చెప్పండి! నాకు నలుగురు పిల్లలే కాదు. మా అమ్మ జబ్బు మనిషి. నా దగ్గరే వుంటుంది. కేవలం నాకొచ్చే జీతంతో ఏడుగురి కడుపులు నింపడం సులభం కాదుగా" అన్నాడు విశ్వేశ్వర్.

    "నీ సంపాదన ఎంతో తెలిసినవాడివి మరి నలుగురు పిల్లల్నెందుకు కన్నావ్?" అడిగాను.

    "నాకూ, నా భార్యకూ ఆపరేషన్ అంటే భయం. ఎవరు చేసుకోవాలో నిర్ణయించుకునే లోపలే నలుగురు పుట్టేశారు" తేలిగ్గా అనేశాడు.

    "అయితే మీ భయానికి ఫెనాల్టీ మన దగ్గరకొచ్చే ముసలి పెన్షనర్లు చెల్లించాలన్నమాట" అన్నాను. అంతా నిశ్శబ్దం. విశ్వేశ్వర్ కూడా ఏం సమాధానం చెప్పాలో తెలియనట్లుండి పోయాడు. నా ప్రశ్న ఎవరికీ రుచించలేదని నాకు తెలుసు. నేను సీరియస్ గా ఫైల్సు చూడటంలో మునిగిపోయాను.

    నా ఆఫీసు మెట్లమీద చనిపోయిన ముసలమ్మ దృశ్యం యింకా నాలో సజీవంగా వుంది.

    "హలో వెంకట్! ఆరోగ్యం ఎలా వుంది?" అంటూ వచ్చాడు నీలకంఠం. అతడు చాలా ఏళ్ళుగా మా దగ్గరే పనిచేసి ఈ మధ్యనే మరో బ్రాంచికి ట్రాన్స్ ఫరయి వెళ్ళాడు.

    "బాగానే వుంది. థాంక్స్" అన్నాడు.

    "ఇంతకీ తిరుపతి ప్రయాణం ఎలా జరిగింది? దర్శనం అదీ బాగా జరిగిందా?" అడిగాడు నీలకంఠం.

    "చాలా బాగా జరిగిందట. మినిష్టర్ గారి బృందంతో వెళ్ళి అన్నీ చూసివచ్చారు. స్వామివారి ఆభరణాల గురించి సరిగ్గా చెప్పనేలేదు మాస్టారూ! కాస్త వివరంగా చెప్పండి" అన్నాడు శర్మ.


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More