Home » Yandamuri veerendranath » అతడే ఆమె సైన్యం
ఇల్లు కనుక్కోవడం కష్టమేం కాలేదు. చాలా ఖరీదయిన లోకాలిటీ అది. వీధిలో అది చివరి ఇల్లు. చాలా పెద్ద స్థలంలో అధునాతనంగా కట్టబడ్డ బిల్డింగ్. రెండు పెద్ద గేటులున్నాయి. ఇంటిముందు పెద్ద ఖాళీస్థలం. ఒక ప్రక్కంతా లాన్ వేశారు. రెండోవైపు రకరకాల మొక్కలు.
ఇలాంటి ఖరీదయిన వాతావరణం నాకు అలవాటు లేదు. ఇబ్బందిగా ఫీలవుతాను. వెనక్కు తిరిగి వెళ్ళిపోదామా అనిపించింది. కాని వెళ్ళలేకపోయాను. ఈ అవకాశాన్ని వదులుకోవద్దని అంతరాత్మ వేధిస్తోంది.
ధైర్యం చేశాను. గేటు తీసి లోపలకు అడుగుపెట్టాను. చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా వుందా ప్రాంతం. రకరకాల పువ్వులు, తివాచీలా పరుచుకున్న గడ్డీ, దాని మధ్యలో పెద్ద స్టాండింగ్ ఉయ్యాలా, పక్కనే సన్నజాజి తీగపందిరి.
ఇంటిముందు పోర్టికో. పక్కనే వరండా. వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాను.
ఇరవై ఏళ్ళ అమ్మాయి వచ్చి తలుపు తీసింది.
"అనుపమగారు?" ఆగిపోయాను.
"లోపలున్నారు రండి పిలుస్తాను" ఆహ్వానించింది. లోపలకు వెళ్ళి సోఫాలో కూర్చున్నాను.
డైనింగ్ రూం కూడా అందంగా అలంకరించబడి వుంది. ఖరీదైన సోఫాసెట్టు, షాండిలియర్లు, కాళ్ళకింద మెత్తటి తివాచీ, ఒక పక్క పెద్ద పుస్తకాల బీరువా, మరోపక్క గోడనంతా ఆక్రమించుకున్న అందమైన సీనరీ సినిమా సెట్టింగులా వుంది. డబ్బుతో అందాన్నే కాదు, ఆహ్లాదాన్ని కూడా కొనుక్కోవచ్చునని అప్పుడే అర్ధం అయింది.
"నమస్తే! నేనే అనుపమని. మీరు?"
తలతిప్పి చూశాను. ఆమెకు దాదాపు నా వయసే వుండవచ్చు. అందంకంటే హుందాగా వుంది. ఎలాంటి మేకప్ లేక పోయినా ఒక రకమైన హుందాతనం, ఠీవి కనిపిస్తున్నాయి.
"నమస్తే! నా పేరు వెంకట్. ఎక్స్ ప్రెస్ లో ప్రకటన ఇచ్చింది నేనే" అన్నాను లేచి నిలబడి నమస్కరిస్తూ.
"ఓ, కూర్చోండి" ఉత్సాహంగా ఎదురుగా సోఫాలో కూర్చుంది. "మీ ప్రకటన వచ్చినప్పుడు ఢిల్లీ వెళ్ళాను. వచ్చాక చూశాను. జవాబిచ్చి పదిరోజులు దాటిపోయింది. మీకు కావలసిన నేస్తం దొరికి వుండవచ్చునని అనుకుంటున్నాను" అంది కలుపుగోలుగా. ఆమె మాటల్లో ఎలాంటి భేషజం లేదు.
"నేనీ రోజే మీ ఉత్తరం చూశాను. మీరలా అనుకుంటుండ వచ్చనే వెంటనే వచ్చేశాను."
"మీ ప్రకటన నన్ను ఆశ్చర్యపరిచింది. మీరు వాడిన ఆ AGNOSTIC అనే పదం నన్నాకర్షించింది. అస్తిత్వం, నాస్తికత్వం అంటూ కొట్టుకునే వాళ్ళనే ఇన్నాళ్ళూ చూశాను. కాని మానవత్వానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే స్నేహితులు కావాలని మీరడగడం నాలో కుతూహలాన్ని రేకెత్తించింది. మీరు స్నేహరాహిత్యంలో బాధపడుతున్నానన్నారు. స్నేహితులు లేని మనుషులుంటారా అనిపించింది. నిజం చెప్పాలంటే ఈ క్యూరియాసిటీ తోటే నేనా ప్రకటనకి జవాబిచ్చాను" అంది.
అవును! ఆ ఇల్లు, హోదా చూడగానే నాకు అర్ధం అయింది. ఆమెకు జీవితంలో నాలాంటి తోడు అవసరం లేదని, కానీ స్నేహాన్ని పంచే హృదయం ఆమెకుందని అర్ధమవుతోంది. లేకపోతే నా ప్రకటనకి జవాబివ్వాల్సిన అవసరం ఆమెకు లేదు.
తలుపు తెరిచి నన్నాహ్వానించిన అమ్మాయి ట్రేతో వచ్చింది.
"నా కూతురు విద్య" పరిచయం చేసింది అనుపమ. "ఎమ్.ఏ. చదువుతోంది" ఆ అమ్మాయి వినయంగా నమస్కరించి లోపలకు వెళ్ళిపోయింది. టీ తీసుకునే వరకు ఇద్దరం మాట్లాడుకోలేదు.
"మీ గురించి చెప్తారా, నా గురించి చెప్పమంటారా?" అడిగింది అనుపమ.
"నా గురించి చెప్పేందు కెక్కువగా ఏమీలేదు. ఎవరూ లేనివాడిని. భార్య, ఒక్కగానొక్క కూతురు చనిపోయి ఇరవై సంవత్సరాలవుతోంది. అప్పటినుంచీ ఒంటరిగానే వుంటున్నాను. ప్రపంచాన్ని చదువుతున్నాను. అంతులేని ఆలోచనలు ప్రశ్నలు నాలో రగులుతుంటాయి. ఎవరితో పంచుకోవాలో తెలియక ఆ ప్రకటన ఇచ్చాను" అన్నాను.
"ఇంకే ఉత్తరాలు మీకు రాలేదా?" అడిగింది. వచ్చినవాటి గురించి చెప్పాను.
"ఇంతకాలంగా ఒంటరిగా ఎందుకుంటున్నారు? అప్పుడే పెళ్ళెందుకు చేసుకోలేదు?"
"ఇప్పటికీ నాకో జీవిత సహధర్మచారిణి కావాలని అనుకోవటం లేదు అనుపమగారూ! నాకు కావలసింది అలాంటి తోడు కాదు. నా భావాలని అర్ధం చేసుకుని పంచుకునే స్నేహం కావాలి. అది చాలు నాకు."
"మరి ఇన్నాళ్ళు ఎందుకు ఆగారు?"
"ఈ మధ్యన తిరుపతి వెళ్ళాను. అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు నన్ను చాలా బాధపెట్టాయి. అవి పంచుకోవడానికి నా పరిధిలో నాకున్న స్నేహితులలో ఎవరూ అర్హులుగా అనిపించలేదు."
"మీరు తిరుపతి వెళ్ళారా! ఎందుకు?" సూటిగా అడిగింది.
"మొక్కు తీర్చుకోవడానికో, దేవుడిని పూజించడానికో కాదు. పరిసరాలు నాకు ఇష్టం. ఎలాంటి పండుగలు, పుణ్యతిధులు లేని సమయం చూసుకుని వెళ్ళి వారంరోజులు వుండి వస్తాను. అదొక హాలిడే ట్రిప్ అనుకోండి. ఇరవై ఏళ్ళ తర్వాత గర్భగుడిలోకి అడుగు పెట్టాను. కేవలం నాతో వచ్చిన వాళ్ళని చదవడానికే కాని ఆ విషయం ఎవరితోటి చెప్పలేదు. చెప్పలేను కూడా. ఎందుకంటే నేను చెప్పినా అర్ధం చేసుకునేవాళ్ళు మా వాళ్ళలో ఎవరూ లేరు. పైగా నాకు దైవదర్శనం లభించిందనగానే ఆనందించి, ఆరాధించి అసూయగా చూసేవారే అంతా."
"అంటే మీలో ఇలాంటి భావాలున్నాయని ఇంతవరకు మీరు ఎవరితోటి చెప్పనేలేదా?" అడిగింది ఆశ్చర్యంగా.
"చెప్పి ప్రయోజనం లేదండి. ఎవరికీ అర్ధంకాదు. నన్నో పిచ్చివాడిగా జమ చేసేస్తారు. వెలివేస్తారు. అలాంటి భక్తబృందం మధ్య నేను బ్రతుకుతున్నది."
అనుపమ కాసేపు మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తున్నట్లనిపించింది. నాలో భావాలని భాషలో సరిగ్గా వ్యక్తం చేయలేకపోయానేమో? నా గురించి ఆలోచించి నవ్వుకుంటుందేమో.
"మీ గురించి నాకు కొంతవరకు అర్ధమయింది. నిష్కర్షగా చెప్తాను. ఏమీ అనుకోరుగా" అంది.
"ఫర్వాలేదు చెప్పండి. అసలీ మాత్రం నోరు విప్పింది నేను మీ దగ్గరే. ఇన్నాళ్ళు నోరుండి మూగవాడిగానే బ్రతికాను" అన్నాను.
నా మీద నేను జాలిపడి కూడా చాలా ఏళ్ళయింది.
"మీరొక ఇంట్రోవర్టు. అతిసాధారణ స్థితినించి పైకెదిగారు. మీలో ఒక రకమైన ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ చిన్నప్పటినుంచే స్థిరంగా నిల్చిపోయింది. ఒక రకమైన పిరికితనం మీలో వుంది. దానికి తోడు జీవితంలో విషాదం మిమ్మల్ని కృంగదీసింది. వీటినుంచి బయట పడటానికి సరయిన పరిస్థితులుగాని స్నేహితులుకాని లేకపోవడం మీ దురదృష్టం."
ఆమె మాటల్లో నిజాన్ని గురించి ఆలోచించడంలో మునిగిపోయాను.
ఆమె అన్నది. "పరిశీలించి చూస్తే ప్రతి మనిషి జీవితం ఒక కథే అవుతుంది వెంకట్ గారూ! ఎవరికి వారు తమ కథలో విషాదంపాలు ఎక్కువని, అది మోయలేని బరువనే అనుకుంటారు. ఏది పెద్దగీతో, ఏది చిన్న గీతో చెప్పలేని అనంతమైన సమస్య ఇది."
"మీ జీవితం అలాంటిదే అంటారా?" అడిగాను.
"విన్నాక మీరే చెప్పండి. నేనొక అనాధను. రాధాకృష్ణాహోం పేరు వినే వుంటారు. పిల్లలులేని ఒక మహారాష్ట్ర దంపతులు స్థాపించారు. నన్ను ఎవరో చిన్నప్పుడే వాళ్ళింటి గుమ్మం దగ్గర వదిలేసి వెళ్ళారుట. వాళ్ళే నన్ను పెంచి పెద్దదాన్ని చేశారు. పదో తరగతి వరకు చదువు చెప్పించారు. టైప్ కూడా నేర్చుకుని చిన్న ఉద్యోగంలో చేరాను. మా వారు డాక్టర్. లండన్ రిటర్న్ డ్. అభ్యుదయ భావాలు గల వ్యక్తి. ఎంతమంచి ప్రాక్టీసు వున్నా సంఘసేవకు కొంత సమయం కేటాయించేవారు. ఆశ్రమంలో ఒక పాపకి జబ్బుచేస్తే చూడడానికి వచ్చినప్పుడు నన్ను చూశారు. వాళ్ళ వాళ్ళందర్నీ ఎదిరించి నన్ను వివాహం చేసుకున్నారు. పెళ్ళయ్యాకే నేను నిజంగా మనిషినయ్యాను. నన్ను చదివించారు. భర్తగా కంటే స్నేహితుడిగా నాతో కలిసి జీవించారు. నా అభిప్రాయాల్ని మార్చారు. ఉదయం కావడంతోటే దైవప్రార్ధన చేయడం నాకు అలవాటు. కాని ఆయనకు అలాంటి నమ్మకాలు లేవని, ఏం చెయ్యాలన్నా సంశయించేదాన్ని. ఆయన తన ఆశయాలకు అనుగుణంగా నేను మారాలని ఆంక్షలు ఎప్పుడూ పెట్టలేదు. కాని నాకాయనపట్ల వున్న కృతజ్ఞతాభావంతో ఏమీ చెయ్యలేకపోయేదాన్ని. ఆ విషయం ఆయన గ్రహించారు. ఒకరోజు ఉదయం నేను లేవగానే తనూ లేచారు. వెంటనే పాలుకాచి ఒక కప్పు ఓవల్టీన్ కలిపి తీసుకురమ్మన్నారు. సాధారణంగా నేను స్నానం చెయ్యకుండా వంటగదిలోకి వెళ్ళేదాన్ని కాదు. కాని ఎన్నడూలేంది ఆయనలా అడగగానే సంతోషంతో వెళ్ళి పాలుకాచి పట్టుకొచ్చాను. ఆయన నా చేతిలో ఒక మందుబిళ్ళ పెట్టి "ఈ ఓవల్టీన్ నాకోసం కాదు. మన తోటమాలి జ్వరంతో పడుకున్నాడు. ఇవి అతడికి ఇచ్చిరా" అన్నారు. నేను వెళ్ళి అతడిని లేపి ఇచ్చాను. 'అమ్మగారు మీరా' అంటూ కృతజ్ఞతతో రెండు చేతులు జోడించాడు. ఎందుకో నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. తిరిగి వచ్చాక ఆయన అన్నారు. 'దైవభక్తి కంటే మానవసేవ గొప్ప తృప్తినిస్తుంది నాకు. నువ్వెలా ఫీలవుతున్నావు' అనడిగారు. ఆ రోజునుంచి నేను మారిపోయాను. అప్పటివరకూ దైవభక్తిలో దొరికే ప్రశాంతతలో కూడా నాకు స్వార్ధం కనిపించసాగింది. 'సెల్ఫ్ సెంటర్ డ్' అంటారే అలా అన్నమాట" ఆమె నవ్వింది.
"విద్య ఒక్కతే మీ కూతురా?" అడిగాను.
"విద్య నా స్వంత బిడ్డ కాదు. రాధాకృష్ణ హోంలో వున్న ఒక అనాధ. బాగా చదువుతుంది. తెచ్చి నా దగ్గర పెట్టుకుని చదివిస్తున్నాను. మాకు ఒక్కడే కొడుకు. ఆర్మీ కెప్టెన్. రెండేళ్ళ క్రితం పీస్ కీపింగ్ ఫోర్స్ లో శ్రీలంక వెళ్ళాడు. అక్కడ యుద్ధంలో చనిపోయాడు."
"ఐయామ్ సారీ" నిజంగానే బాధేసింది.
"ఫర్వాలేదు. అవన్నీ జీవిత సత్యాలు. మావారంటుండేవారు. గతం తిరిగి రాదు. జరిగినదాని గురించి విచారిస్తూ కూర్చోవటం అవివేకమని. మనిషి చివరి క్షణంవరకూ కాలక్షేపంగా కాక జీవితాన్ని జీవిస్తూ గడపాలని. అన్నేళ్ళ ఆయన సహచర్యం నన్ను స్థిరచిత్తురాలిగా చేసింది."
"అంటే ఆయన- మీరు" సందిగ్ధంగా ఆగిపోయాను. నా దృష్టి ఆమె నుదుటి బొట్టుమీద నిల్చిపోయింది.
"అవును. ఆయన పోయి అయిదేళ్ళయింది. ఒక యాక్సిడెంట్ లో పోయారు. యుగయుగాలుగా స్త్రీలకు ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఆయన నిరసించేవారు. ఆయన ఆశయాల మేరకు నేను ఎలాంటి క్రియలూ జరిపించలేదు. నా నుదుటిబొట్టునీ చెరపలేదు. ఆ విషయంలో నేనెవర్నీ లెక్కచేయలేదు."
అంతటి మహోన్నత వ్యక్తిత్వంగల ఆ స్త్రీ ముందు నేనొక అల్పప్రాణి ననిపించింది. ఆమె దుఃఖం ముందు నా బాధ ఎంత?
"నేను ఒంటరినని ఏనాడూ బాధపడలేదు. వెంకట్ గారూ! అనాధాశ్రమంలో పిల్లలంతా నన్ను 'అమ్మా' అనే పిలుస్తారు. ఏదో నాలుగు రకాలుగా నాకు చేతనయినంత సాయం పదిమందికి చేస్తుంటాను. అందులో వున్న తృప్తి అనుభవిస్తేగాని తెలియదు."
"నిజమేనండి నేనలా ఆలోచించలేకపోయాను. మీరన్నట్లు నాలో సంకోచం, ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ తో నిండిన పిరికితనం నన్ను బంధించేశాయి. అందుకే ఒంటరిగా మిగిలిపోయాను."
"మీలోని భావాలను మీలోనే దాచుకున్నందువల్ల ఎవరికీ ప్రయోజనంలేదు. 'ఎదుటివాళ్ళు ఇష్టపడరు. మెచ్చరు' అన్న ఆలోచన మిమ్మల్ని డామినేట్ చేయకూడదు. ఎవరి భావాలు వాళ్ళవి. మనిషి తనకోసం తాను బ్రతుకుతూ ఎదుటివారికోసం కూడా బ్రతకాలి కాని ఒక అల్ట్రాయిస్టుగా మిగిలిపోకూడదు. నా భర్త ప్రభావం నా మీద చాలా వుంది. కాని ఆయన తన అభిప్రాయాలు పూర్తిగా నా మీద రుద్దలేదు. చెప్పాల్సింది చెప్పేవారు, నా అంతట నన్ను ఆలోచించి నిర్ణయాలు తీసుకొమ్మనేవారు. తనకు నచ్చని పని నేను చేస్తే విమర్శించేవారు కాదు. కాని నా ఇష్టంకోసం, తృప్తికోసం తనకు నచ్చనిపని చేసే వారు కూడా కాదు. 'మనిద్దరం ఇద్దరు వ్యక్తులం. నీ వ్యక్తిత్వం నీది. నా వ్యక్తిత్వం నాది. ఇద్దరం వాటిని నిలుపుకుంటూ బ్రతకాలి" అనేవారు. మీలో తప్పుల్ని ఎంచుతున్నట్లుగా మీరు భావించకండి. మీ అంతట మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి" అంది అనుపమ.



