Home » Yandamuri veerendranath » అతడే ఆమె సైన్యం
ఇరవై రోజులుగా సెలవులో ఉన్న నేను ఆ రోజే జాయినయ్యాను. సూపరింటెండెంట్ గా సంతకాలు చేయాల్సిన బాధ్యత నామీదుంది. నేను సెలవులో ఉంటే పెన్షనర్లను మళ్ళీ మళ్ళీ రమ్మని తిప్పుతారు మా వాళ్ళు. అందుకే కాస్త నీరసంగా ఉన్నా చేరిపోయాను. రాజేంద్ర కూడా ఆ రోజే జాయినయ్యాడు. పదిహేను రోజులుగా అతడు సెలవులో వున్నాడు. శబరిమలై వెళ్ళొచ్చాడు.
ఆఫీసులో పనెంత ఎక్కువగా వున్నా సంభాషణకి మాత్రం ఫుల్ స్టాప్ పడదెప్పుడూ.
"ఏమోయ్! యాత్ర బాగా జరిగిందా?" ఎవరో రాజేంద్రని అడిగారు.
"బ్రహ్మాండంగా జరిగింది. అయ్యప్పస్వామి దయవల్ల ఎక్కడా ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. ఎంతయినా స్వామి మహిమ చాలా గొప్పది. స్వామియే శరణం" రెండు చేతులు జోడించి భక్తిగా అన్నాడు రాజేంద్ర.
"అందరూ డిసెంబరు చివర్లోనే లేకపోతే సంక్రాంతికి వెళతారు కదా. నువ్వు ముందుగానే వెళ్ళి వచ్చేశావేం?"
"అప్పుడు రష్ బాగా ఎక్కువగా వుంటుంది. లక్షల సంఖ్యలో వస్తారు జనం. సౌకర్యంగా వుండదు. భద్రత అసలుండదు. అందుకే ముందుగా వెళ్ళొచ్చేశాను. అయినా ఇప్పుడు అలాంటి కండిషన్ లు కూడా లేవు." అవును. ఇప్పుడు ఎలాంటి నియమ నిష్టలుకూడా పాటించనవసరం లేదు. అసలా దీక్ష ఎందుకు పెట్టినట్లు? నలభై రోజులపాటు మనిషి సాత్త్వికాహారం సేవిస్తూ సాత్త్విక గుణాలను అలవర్చుకుంటూ కష్టాలకు అలవాటు పడుతూ నీతిగా నియమంగా దీక్ష సాగిస్తే అది అలవాటుగా మారి మనిషి రుజువర్తనుడౌతాడని. కాని జరుగుతున్నదేమిటి? అన్ని నియమాలను సడలించి పూజలను కూడా ఆధునీకరించి పదిమందిలో గొప్ప చూపించుకోడానికి అదొక అవకాశంగా మారుతోంది. ఇది కూడా ఒక వ్యాపారమై పోయింది.
నా పిచ్చిగాని నలభై రోజుల దీక్షవల్ల ఎంతమందిలో మార్పు వచ్చుంటుంది? ఎంత మందిలో కోపం నశించి వుంటుంది? మద్యం ధూమపానం పట్ల ఎవరికి వెగటు కలుగుతోంది? నోములు, వ్రతాలు, దీక్షలు మనిషి ఐహికవాంఛలకు అడ్డుకట్ట వేసి సన్మార్గంలొ నడవడానికి నిర్దేశించబడ్డవి అనుకుంటే వాటిని పాటించి ఎంతమంది మంచి మార్గంలో నడుస్తున్నారన్నది వివాదాస్పదమే.
ఈ రాజేంద్ర విషయం నాకు బాగా తెలుసు. అనవసరంగా ఒక్క పైసా తన కష్టార్జితంలోంచి ఖర్చు పెట్టడు. ఉచితంగా వచ్చే పైసా వదులుకోడు. అందుకే ఆఫీసులో డబ్బులు ఎక్కువగా రాని సమయం చూసుకొని వారంరోజులు దీక్షపట్టి సరిగ్గా సమయానికి వచ్చి జాయినయ్యాడు. ఈ సాయంత్రం అతను బార్ లొ కలుస్తాడు. వచ్చే ఆదివారం నాడు రేసుకోర్సులో వుంటాడు.
"అన్నట్లు వెంకట్ గారూ మీ ప్రయాణం బాగా జరిగిందా? మీరు తిరుపతి నుంచి వచ్చాక నేను కలవడం ఇదే మొదలు" అన్నాడు రాజేంద్ర.
"ఆయనకేం. బ్రహ్మాండమైన దర్శనభాగ్యం లభించింది." నాకంటే ముందుగా శర్మ అందుకుని వివరాలన్నీ చెప్పేశాడు.
"ఎంతయినా మీరు పుణ్యాత్ములండీ. ఆ విషయం భగవంతుడికి కూడా తెలుసు కాబట్టి అలాంటి అవకాశం కల్పించాడు" అన్నాడు రాజేంద్ర.
వాళ్ళలా నేను లంచాలు తీసుకోను కాబట్టి నేను పుణ్యాత్ముడినని అనుకుంటున్నారు- అంటున్నారు. కాని నాతోపాటు గర్భగుడిలోకి వచ్చిన గుంపులో రెండు హత్యలుచేసి బెయిల్ మీద వున్నవాడు, వీళ్ళకంటే అవినీతికరమైన పనులు చేసి ఉద్యోగంలో వున్నవాడు, వీళ్ళకంటే అవినీతికరమైన పనులుచేసి ఉద్యోగంలో నుంచి వూడబెరకబడినవాడు వున్నాడని వీళ్ళకు తెలియదు. ఒకవేళ నేనామాట అంటే వీళ్ళ సమాధానం కూడా వూహించగలను. "వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్న సుకృతం" అంటారు.
పూర్వజన్మ పుణ్యఫలం ఈ జన్మలో అనుభవిస్తున్నామని నమ్మినవాడు ఈ జన్మలో చేసిన పాపం వచ్చేజన్మలో అనుభవించవలసి వస్తుందని ఎందుకు ఆలోచించడు?
నాకు మా ఆఫీసు మెట్లమీద మరణించిన ముసలమ్మా గుర్తొచ్చింది.
ఆ సాయంత్రం నేను ఇంటికి వచ్చేసరికి సత్యం వచ్చాడు. అతడు మా వీధిలోనే వుంటాడు. మంచివాడు. రైల్వేలో పనిచేస్తున్నాడు. ఏ విధంగానూ ఎవరినీ ఇబ్బంది పెట్టడు. లోను తీసుకుని ఇల్లు కట్టాడు. లోన్ సమయానికి అందక పని ఆగిపోతే నేనే సహాయం చేశాను. చాలావరకు తీర్చేశాడు.
"ఇంటిపని పూర్తయిందా సత్యం" అడిగాను.
"చాలావరకు అయినట్లేనండి. ప్లోరింగ్ పని జరుగుతోంది" అన్నాడు.
అతడి మొహం చూస్తే దేనికో మొహమాట పడుతున్నాడనిపించింది.
"ఏమిటి సత్యం చెప్పు డబ్బు కావాలా?" అడిగాను.
"అవునండీ! ఇప్పటికే మీకు కొంత ఇవ్వాలి. అడగాలంటే సిగ్గుగా వుంది."
"ఎంత కావాలి?"
"అయిదువేలు. ఇల్లు అద్దెకిచ్చి కొద్దికొద్దిగా తీర్చుకుంటాను."
"అదేమిటి? అంత యిష్టంగా కట్టుకున్నవాడివి అందులో వుండబోవడం లేదా?"
"లేదండీ! చాలా అప్పయిపోయింది- జీతంలో అన్నీ కటింగ్సే. కొన్ని సంవత్సరాలు అద్దెకిస్తే తప్ప అప్పులు తీరవు."
సత్యం తండ్రి మాట జవదాటలేడు. భార్యని నొప్పించలేడు. ఆ బలహీనత ఆధారంగా తీసుకుని ఇద్దరూ కలిసి అతడి చేత అనుకున్నదానికంటే ఎక్కువ ఖర్చు పెట్టించారు.
"పదిహేను రోజుల్లో మంచి ముహూర్తం ఉందట. గృహప్రవేశం చేసుకోవాలి. నేను మళ్ళీ వచ్చి చెప్తాను. మీరు తప్పకుండా రావాలి" అన్నాడు సత్యం.
"ఏదో సింపుల్ గా చేసుకో సత్యం. అందర్నీ పిలిచి ఆర్భాటం చెయ్యకు" సలహా యిచ్చాను.
"నేనూ అలాగే అనుకొన్నానండీ. కాని నాన్నగారు ఒప్పుకోవటం లేదు. అక్కచెల్లెళ్ళందర్నీ పిలవాలి. బట్టలు పెట్టాలి. వ్రతం చేసుకుని భోజనాలు పెట్టాలి. ఇప్పుడప్పుడే ఇంకో సందర్భం లేదు/ ఇది జరిగి తీరాలన్నారు. కాదనలేకపోయాను. అందుకే మిమ్మల్ని డబ్బడిగాను" అన్నాడు.
మర్నాడు వచ్చి తీసుకొమ్మని పంపాను.
"నేనూ ఆర్భాటాలకోసం డబ్బు ఇవ్వను. నువ్వింక అప్పుల పాలవడం నాకిష్టంలేదు" అని గట్టిగా ఎందుకు చెప్పలేకపోయాను?
సత్యం అతి మంచివాడు. నేను ఇవ్వనంటే బాధపడడు. తండ్రి కోరిక తీర్చేందుకు మరెక్కడయినా వడ్డీకి అప్పుచేసి పట్టుకొస్తాడు తప్ప తండ్రిని ఎదిరించలేడు. నా ఆదర్శాలవల్ల అలాంటి వాడు బాధపడడం నాకే బాధ కలిగిస్తుంది.
ఏమిటీ జీవితాలు? బిడ్డలు అప్పుల పాలయినా తమ కోరికలు తీర్చాలనే తల్లిదండ్రులు, కష్టపడి పెంచి పెద్దచేసి జీవితంలో కావలసినవన్నీ సమకూర్చి పెట్టిన తల్లిదండ్రుల్ని చివరి దశలో సరిగ్గా చూడని బిడ్డలు, భార్యాబిడ్డల సుఖం కోసం తన సుఖాన్ని వినోదాన్ని వదులుకోలేని భర్తలు, అర్ధంలేని ఆడంబరాలకు పోయి భర్తల్ని హింసించే భార్యలు.
మానవ సంబంధాలు ఎందుకింత క్షీణిస్తున్నాయి? ఆత్మకు అంతరాత్మకు ఎంతో ప్రాముఖ్యం యిచ్చిన పవిత్ర గ్రంథాలకు వారసులం. మనం వాటిని గౌరవించి పవిత్రతను ఆపాదించి పూజించి తృప్తిపడుతున్నాము తప్ప వాటిలో అంతరార్థాన్ని ఏమాత్రం అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించి అజ్ఞానులం.
* * * *
వారం రోజుల తర్వాత వెళ్ళిచూస్తే నా ఉత్తరానికి రెండు జవాబులు వచ్చాయి. ఒకటి ఇంటర్ చదువుతున్న ఒక అబ్బాయి వ్రాశాడు. "మీ భావాలతో నేనేకీభవిస్తున్నాను. నన్ను దగ్గరుంచుకుని చదివిస్తానంటే వచ్చేస్తాను" అని వ్రాశాడు. ఎవరో చెప్పి వ్రాయించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. రెండో ఉత్తరం పూర్తిగా తిట్లతో నిండి వుంది. నాలాంటి భావాలున్నవాళ్ళు పెరిగిపోతున్నందువల్లే దేశం దౌర్భాగ్యస్థితిలోకి దిగజారిపోతోందని వాపోతూ ఎవరో వ్రాశారు. కోపం రాలేదు- నవ్వొచ్చింది.
ఆ ప్రకటన గురించి పూర్తిగా మరచిపోవడం మంచిదనిపించింది. ఇంటికి తిరిగి వస్తుంటే వీధిచివర సందడి కనిపించింది. చూస్తే అక్కడ చిన్న గుడి కడుతున్నారు!
అక్కడంతా ఖాళీస్థలం. కొద్దిరోజుల క్రితం డ్రైనేజీ లైన్ వేస్తున్నప్పుడు ఒక లేబరర్ ఎలక్ట్రిక్ షాక్ తగిలి అక్కడ చనిపోయాడు. ఆ ప్రాంతంలో పామొకటి కనిపించిందట. నాలుగు రోజుల్లో అక్కడో దీపం కనిపించింది- ఇప్పుడది గుడిగా మారుతోంది. అజమాయిషీ చేస్తున్నవాడు ఆ ప్రాంతంలో పేరుమోసిన రౌడీ. దగ్గరలోనే అతడికో సారాకొట్టుంది. ఇప్పుడీ ప్రాంతం కూడా అతడి ఆధీనంలోకి వెళుతోంది.
"గుడి" అనగానే వచ్చే భక్తులకి కొదవలేదు. పక్కనే సారా కొట్టున్నా ప్రజలకి అభ్యంతరం లేదు. త్వరలో అక్కడ నవరాత్రి ఉత్సవాలు, గణపతి పూజలు, మహంకాళి జాతరలు కూడా మొదలవుతాయి. ఆ రౌడీగారి ఖజానా నిండుతుంది. ఆ తర్వాత అతడు రాజకీయ నాయకుడవుతాడు.
ఈ రౌడీ గురించి వీలైతే తరువాత చెపుతాను.
3
దాదాపు ఇరవై రోజులు గడిచాయి.
ఆఫీసులో పనెక్కువగా వుంది. సీరియస్ గా పని చేస్తున్నాను.
"వెంకట్ గారూ మీకు ఫోన్" గురుమూర్తి అరిచాడు.
"నాకు ఫోనా? ఫోన్ చేసి ఆత్మీయంగా కుశల ప్రశ్నలడిగే స్నేహితులు నాకెవరూ లేరే." అనుమానంగానే వెళ్ళి రిసీవర్ అందుకున్నాను.
"వెంకట్ గారేనా?" నేను ఎక్స్ ప్రెస్ ఆఫీసునుంచి మాట్లాడుతున్నాను" అన్నాడతను.
"అవును నేనే వెంకట్ ని."
"మీరిచ్చిన ప్రకటనకి ఒక ఉత్తరం వచ్చింది. పది రోజులయిపోయింది. మీరు రాకపోయేసరికి ఫోన్ చేశాను."
"క్రితం సారి వెళ్ళినప్పుడు అక్కడ క్లర్కుకి, నా ఫోను నంబరు అడ్రసు యిచ్చి రావడం కూడా మర్చిపోయాను."
"మీరు వచ్చి తీసుకుంటారా? రీ డైరెక్ట్ చెయ్యమంటారా?"
"నేను వస్తాను. థాంక్స్" చెప్పి పెట్టేశాను.
పని చేస్తున్నా ఆలోచనలు ఆ ఉత్తరం మీదే వుంది. ఇంత ఆలస్యంగా ఎవరు వ్రాసుంటారు? ఈ ఉత్తరం ద్వారానైనా నాకో నేస్తం దొరికే అవకాశం కలుగుతుందా?
పని పూర్తికాగానే ఆటో తీసుకుని ఎక్స్ ప్రెస్ ఆఫీస్ కి వెళ్ళాను. క్లర్కు చిరునవ్వుతో కవరు అందించాడు. అందుకుని మరోసారి థాంక్స్ చెప్పి బయటకు వచ్చాను.
ఉత్తరం మీద అడ్రసు నీట్ గా వ్రాసివుంది. చూడగానే స్త్రీ దస్తూరీ అని తెలిసిపోతోంది. ఆగలేక అక్కడే విప్పాను.
"చాలా రోజులుగా వూళ్ళో లేకపోవటంవల్ల మీ ప్రకటన ఆలస్యంగా చూశాను. ఈ ఉత్తరం మీకు అందితే వీలయినప్పుడు ఈ క్రింది అడ్రసుకి రండి. వివరంగా మాట్లాడుకోవచ్చు. సాయంత్రం వేళల్లో ఇంట్లోనే వుంటాను."
_ అనుపమ.
అని వుంది. అడ్రసు ఆదర్శనగర్. దగ్గర్లోనే వుంది. ఉత్తరం వ్రాసి పదిరోజులు దాటింది. కాబట్టి నేనింకా రానని అనుకుంటుందేమో, మరింకేం ఆలోచించకుండా ఆటో ఎక్కి అడ్రస్ చెప్పాను.



