Home » yerramsetti sai » Nirbhay Nagar Colony
"అదే! ఆంధ్రాస్ బ్రీఫ్ కేస్ లో నోట్లకట్టలు తెస్తారు కదా!"
మేము నవ్వేశాం.
"మా దగ్గర అలాంటివేమీ లేవండి! మేము మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళం"
అతను ఆశ్చర్యపోయాడు.
"ఆంధ్రాస లో మిడిల్ క్లాసువాళ్లుకూడా వుంటారా?"
"ఎందుకు వుండరండి? మేము ప్రత్యక్షంగా కనబడుతూనేవున్నాం కదా!"
ప్రిన్సిపాల్ వెంటనే ఎక్కడికో ఫోన్ చేశాడు.
"త్వరగారండి! ఇక్కడ కొంతమంది ఆంధ్రాస్ వచ్చారు! వాళ్లు బీదాళ్ళట! తమాషాగా లేదూ. రండి వాళ్ళను చూద్దురుగాని" అని కన్నడలో చెప్పి ఫోన్ పెట్టేశాడు.
మాకు వళ్ళు మండిపోతోంది- మమ్మల్ని 'జూ'లో జంతువుల్లా అతను ట్రీట్ చేయడం.
"ఇంతకూ డొనేషన్ ఎంతో చెప్తే మేం ఆలోచించుకుంటాం" అన్నాడు రంగారెడ్డి కోపంగా.
"డొనేషన్ మామూలే! ముప్ఫయివేలు. అదిగాక నాలుగేళ్ళ ఫీజు కూడా ముందే కట్టాలి"
"ఫీజెంత?"
"సంవత్సరానికి పన్నెండున్నరవేలు చొప్పున యాభయివేలు"
మాకు గుండాగినంత పనయింది.
"అదేమిటి? ఫీజు సంవత్సరానికి ఎనిమిదివేలే అన్నారు కదా"
"అది జనతా ప్రభుత్వం రోజుల్లో- ఇప్పుడు గవర్నర్ రూల్ కదా! ఆమాత్రం పెరగదేమిటి?"
మేము మాట్లాడకుండా లేచి బయటికొచ్చాం.
రోడ్ మీద కొచ్చేసరికి నలుగురు వ్యక్తులు మా చుట్టూ మూగారు.
"ఇంజనీరింగ్ మెడికల్ సీట్లుసార్! అయిదువేలు డొనేషన్- బెంగుళూరు, బీజాపూర్, తుంకూర్, కోలార్, హుబ్లి, ధార్వాడ్, ఖార్కి, బీదర్" అన్నాడొకతను.
"అయిదువేలేనా?" ఆశ్చర్యంగా అడిగాడు శాయిరామ్.
"అవున్సార్! కేవలం అయిదువేలు! ఎన్నిమ్మంటారు?"
"పన్నెండు కావాలి? మొత్తం మీద ఏమయినా తగ్గిస్తావా?" అడిగాడు రంగారెడ్డి.
"నాలుగువేలు సీటుచొప్పున ఇవ్వండిసార్- తలో అయిదొందలు అడ్వాన్స్ కట్టండి చాలు"
"మరి ఫీజుకూడా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కడతాం"
"ఏం ఫర్లేదు సార్! అంతా మీ ఇష్టం"
మేము డబ్బు లెక్కపెడుతుంటే అతనిపక్కనున్న రెండోవాడు ఘోల్లున నవ్వాడు.
"గోవిందా! గోవిందా! వాడు చెప్పిన కాలేజీల్లో చేరారో మీ పిల్లల భవిష్యత్తు గోవిందా గోవిందా!"
మేము కంగారుగా డబ్బు లెక్కపెట్టడం ఆపి వాడివేపు చూశాం.
"ఏమిటి నువ్వనేది?"
"ఆ కాలేజీలో చేరిన పిల్లలందరూ బెంగుళూరు కెంప్ గౌడ రోడ్ లో ఫుట్ పాత్ పక్కన పడివుంటారు చూళ్ళేదా?"
"అదేమిటి? ఎందుకలా పడివుండడం?"
"ఎందుకేమిటి సార్! డ్రగ్స్! అంతా డ్రగ్ ఎడిక్ట్స్ అయిపోతారు. ఆ తరువాత ఇంకేముంది గోవిందా, గోవిందా-"
మాకు గుండె ఆగిపోయినంత పనయింది.
"అంచేత నా దగ్గరున్న లిస్ట్ లోని కాలేజీల్లోనే చేరండి! ఫీజు యాభయ్ వేలు కడితే చాలు! నో డొనేషన్" మాకు ఎక్కడలేని ఆనందం కలిగింది.
"డొనేషన్స్ అస్సలు లేవా?"
"అస్సల్లేద్సార్-"
"మరి అక్కడ డ్రగ్స్ లేవా?"
"డ్రగ్స్ అస్సల్లేవు! మోస్ట్ డిసిప్లిన్డ్ ఇన్ స్టిట్యూషన్స్! సీటుకి రెండొందలు చొప్పున అడ్వాన్స్ కొట్టండి చాలు-"
మేము తలో రెండొందలూ పోగుచేస్తుండగా మూడోవాడు ఘోల్లున నవ్వాడు.
"డ్రగ్స్ లేవనగానే బోల్తాపడిపోయారు సార్! కానీ ఆ కాలేజీల్లో స్టాఫ్ లేరుసార్! ప్రొఫెసర్లంతా డిప్లొమా హోల్డర్స్- లాబొరేటరీళు లేవు. వర్క్ షాప్ లేదు ఇంక మీ పిల్లలు చూస్కోండి! తాపీ మేస్త్రీలవుతార్సార్! ఇంజనీర్లు కాదు-"
మాకు ఏడుపొచ్చేసింది. రెండోవాడివేపు కోపంగా చూశాం.
"అతను చెప్పేది నిజమేనా?"
"అంతా అబద్ధం! మొన్నే ఒక కంప్యూటర్ కి కూడా ఆర్డరిచ్చారు మావాళ్ళు. మీ కుర్రాళ్ళు ఫైనలియర్ కెళ్ళే లోపల వచ్చేస్తుందది"
"మరి ఈలోగా ఏం చేస్తారు?"
"మరి ఈలోగా బోర్డ్ మీద బొమ్మలు గీసి చెప్తారు. కంప్యూటర్ రియల్ ఫోటోలు చూపిస్తారు- అంతకంటే ఇంకేం కావాలి?"
మాకు పిచ్చెక్కినట్టయింది.
ఈలోగా ఇంకోడెవరో దూరం నుంచి అరిచాడు.
"ఒరే మందారా! త్వరగా రా! అసలీ ఆంధ్రాస్ వస్తున్నారిక్కడ- త్వరగా రా రియల్ ఆంధ్రాస్ డబ్బుకట్టల్తో వచ్చారు-"
ఆ మాట వింటూనే వాళ్ళంతా పరుగుతో వెళ్ళిపోయారు.
మేం బ్రతుకు జీవుడా అని అక్కడినుంచి బయల్దేరాం.
వారం రోజులపాటు పాతిక కాలేజీలకు వెళ్ళి వివరాలన్నీ వాకబు చేసుకుంటూ డొనేషన్ ళు బేరాలాడుకుంటూ చివరకు ఓ ఊళ్ళోని కాలేజీలో సీట్లు కొనేశాం.
"హమ్మయ్యా!- ఎలాగైతేనేం మన మధ్యతరగతి పిల్లలు కూడా ఇంజనీరింగ్ చదివే అవకాశం మనకిచ్చిన కర్నాటక ప్రజలకు జై" అన్నాడు రంగారెడ్డి.
అప్పుడె ప్రిన్సిపాల్ గదిలోకి ఓ వ్యక్తి పరుగెత్తుకెళ్ళాడు.
"మా డబ్బు మాకిచ్చేయండి సార్- మా వాడిక్కడ చదవనంటున్నాడు-" అంటూ బ్రతిమాలడం వినిపించింది మాకు.
"ఒకసారి కట్టిన డబ్బు ఏ పరిస్థితుల్లోనూ తిరిగి ఇవ్వబడదు అని బోర్డు పెట్టాం కద్సార్."
పావుగంటసేపు బ్రతిమాలి అతను కళ్ళవెంబడి నీరు పెట్టుకుంటూ బయటికొచ్చేసాడు.
మేమంతా అతనిచుట్టూ మూగాం.
"ఏమిటి? ఎందుకు డబ్బు వాపస్ అడుగుతున్నారు?"
"ఈ కాలేజీకి యూనివర్సిటీ రికగ్నిషన్ రాలేదంట సార్! కిందటి సంవత్సరం స్టూడెంట్స్ ని పరీక్ష రాయనీలేదట"
మా గుండెలవిసిపోయాయ్.
"రికగ్నిషన్ లేకుండా కాలేజీ పెడితే గవర్నమెంట్ ఎలా ఊరుకుంది?"
"గవర్నమెంట్ కేం సంబంధం? వాళ్ళు కాలేజీ పెట్టడానికి పర్మిషన్ ఇచ్చారు- అంతే! యూనివర్సిటీ ఎఫ్లికేషన్స్ తెచ్చుకోవడం కాలేజీ వాళ్ళ తలనొప్పి ఇక"
"మరి యూనివర్సిటీ ఛాన్సెలర్ లింగాయత్ కమ్యూనిటీకి చెందినవాళ్ళు- కాలేజీ ఓనర్ గౌడా కమ్యూనిటీకి చెందినవాళ్ళూ. అంచేత తన కంఠంలో ప్రాణం వుండగా ఇవ్వనని ఛాన్సెలర్ పట్టు పట్టాడట."
మాక్కూడా ఆ మాట వినేసరికి ఏడుపొచ్చింది.
అందరం మళ్ళీ ప్రిన్సిపాల్ దగ్గరకు పరుగెత్తాం. ఇప్పటికే మరో పాతికమంది మాలాంటి పేరెంట్స్ మూగిపోయి వున్నారతని చుట్టూ.
"నేను చెప్తున్నాను కదా. మీకేం ఫర్లేదు. మన కాలేజీకి ఇంకోవారం రోజుల్లో ఎఫ్లికేషన్ వచ్చేస్తుంది. మన కేసు సుప్రీంకోర్ట్ కి కూడా వెళ్ళింది- ఒకవేళ రాకపోతే అప్పుడు మీ డబ్బు మీకు వాపస్! సరేనా?"
చేసేది లేక తలూపి బయటపడ్డాం.
బస్ లో తిరిగి హైదరాబాద్ బయల్దేరాం. బస్ లో అందరూ మాలాంటివాళ్ళే. ఇంజనీరింగ్, లా, ఫార్మసీ, పాలిటెక్నిక్ చదవటానికి వచ్చిన వాళ్ళు. కొద్దిసేపటి తర్వాత కర్నాటక రాష్ట్రంలోనుంచి ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించింది మా బస్.
రోడ్డుకి అడ్డంగా కట్టిన ఆర్చీమీద "ఆంధ్రప్రదేశ్ మీకు స్వాగతం చెప్తోంది" అని రాసి వుంది.
దానిమీద తాటిచెట్టంత ఎత్తున ముఖ్యమంత్రి బొమ్మ చిరునవ్వుతో చేతులు జోడిస్తోంది.
"నీయవ్వ ఆంధ్రప్రదేశ్! థూ! చదువుల కోసం పక్క రాష్ట్రాల కెళ్ళి నానా అవస్థలు పడాల్సి వచ్చిన పనికిమాలిన రాష్ట్రం!" అన్నాడు రంగారెడ్డి.
"పనికి మాలిన రాష్ట్రమేమిటి? అడుక్కుతినే రాష్ట్రం! మనం దీపం వెలిగించుకోవాలన్నా కూడా పొరుగు రాష్ట్రాన్ని కరెంట్ అడుక్కోవాలి" అన్నాడు శాయిరామ్.
"ఆఖరికి కిలో రెండ్రూపాయలు బియ్యం కావాలన్నా కేంద్రాన్ని అడుక్కోవాలి!" అన్నాడు గోపాల్రావ్.
ఆ తరువాత మన రాష్ట్రం ఇంకా ఏమేం విషయాల్లో ఇతర రాష్ట్రాల్ని అడుక్కుతింటోందో మాలో అందరూ తలోటీ చెపుతుంటే మాకే సిగ్గేసింది. ఆ పక్కనే వినబడుతోంది. "మా తెలుగు తల్లికి మల్లెపూదండ-" అనే పాట-
* * * * *



