Home » yerramsetti sai » Nirbhay Nagar Colony


    మర్నాడు మీటింగ్ లో కొంతమంది కలిసి కర్నాటకలోని ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళి పరిస్థితేమిటో స్వయంగా కనుక్కోవాలని నిర్ణయించుకున్నాం.
    హైదరాబాద్ కు దగ్గరగా వుంది గుల్బర్గా కనుక అక్కడికి చేరుకున్నాం అందరం. రైలు దిగగానే ఆటోవాళ్ళు "ఓరే ఖాజా! ఆంధ్రాస్ ఆయేరే! ఆంధ్రాస్ ఆయే" అని అరుచుకుంటూ మా చుట్టూ మూగారు.
    "మేమంతా హోటల్ కెళ్ళాలి. ఎంత కావాలి?" అడిగాడు రంగారెడ్డి.
    "టూ హండ్రెడ్ సర్"
    అందరం అదిరిపడ్డాం.
    "అంటే నువ్వనేది మా అందరికీ కలిపా?"
    "కాద్సార్! ఒక్క ఆటో! అంటే ముగ్గురికి-"
    "మరి మూడొందలంటావేమిటి?"
    "మరి రెండొందలే మూలకి సార్! ఒక పూట మందు ఖర్చులేదు."
    "ఏమిటి? ఒక పూట మా మందు ఖర్చు రెండొందలా? ఏయ్- సంవత్సరానిక్కూడా అంత ఖర్చవదయ్యా మాకు! మీటింగ్ రీడింగ్ ప్రకారం వస్తావా రావా?"
    ఆటోవాళ్ళందరూ మొఖాలు చూసుకున్నారు.
    "వీళ్ళు ఆంధ్రాస్ కాదురా! ఇంకెవరో అయివుంటారు. ఆంధ్రాసైతే ఇలా బేరాలాడరు మస్తు పైసలుంటయ్ ఆళ్ళదగ్గర" అన్నాడొకడు.
    "అచ్చం ఆంధ్రాస్ లాగా భలే ఫోజ్ కొట్టార్లే" అన్నాడు ఇంకొకడు. అందరూ మమ్మల్ని వదిలేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.
    మేము నడుస్తూ దగ్గర్లో వున్న ఒక లాడ్జికి చేరుకున్నాం.
    "మాకు ఆరు డబుల్ రూమ్స్ కావాలి" అన్నాడు రంగారెడ్డి.
    "ఎక్కడి నుంచి వచ్చారు మీరు?"
    "హైదరాబాద్"
    అతను ఆశ్చర్యపోయాడు.
    "అంటే మీరు ఆంధ్రాసా?"
    "అవును!"
    "మరి మీ కార్లేవి!"
    "కార్లా? కార్లేమిటి?"
    "ఆంధ్రాస్ అయితే కార్లలో వస్తారు కదా! మీరు ఆంధ్రాస్ కాదు కదూ?"
    "ఆంధ్రాసేనయ్యా! అయినా మేమెవరయితేనేం? రూమ్స్ వున్నాయా లేవా?"
    "ఉన్నయ్ లెండి! అరే దస్తగిర్! వీళ్ళకు మామూలు రూమ్స్ ఇవ్వరా! ఆంధ్రాస్ ఇంకా రాలేదు. ఈ రాత్రికి వస్తారేమో! ఆ డీలక్స్ రూమ్స్ ఖాళీగానే వుండనీయండి"
    మాకు వళ్ళు మండిపోయింది గానీ మధ్యలో తల దూర్చడమెందుకని ఊరుకున్నాం. త్వరగా రడీ అయి అందరం ఇంజనీరింగ్ కాలేజీకి బయల్దేరాం.
    హోటల్ ఆవరణ దాటి రోడ్ మీద కొచ్చేసరికి ఓ కారు రివ్వుమంటూ వచ్చి మాముందాగింది. అందులో మంచి ఓ సూట్ వాలా దిగాడు.
    "హలో సార్! నమస్తే- ఆంధ్రాస్ కదూ!" చిరునవ్వుతో పలకరించాడు.
    "అవును!"
    "నేనిప్పుడే అనుకున్నాను! వెరీ గ్లాడ్ టు మీట్ యూ! ఇలా పక్కకు రండి!" అన్నాడతను.
    పక్కకు ఎందుకు రమ్మంటున్నాడో, అసలతను ఎవరో మాకేం అంతుబట్టలేదు.
    ఏం జరుగుతుందో చూద్దామని రోడ్ పక్కనున్న చెట్టుకిందకు వెళ్ళి అతని చుట్టూ మూగాము.
    "బ్రహ్మాండమయిన స్టాండర్డ్ సార్! ఫారిన్ స్టాండర్డ్! కారు చవక! ఎన్ని కావాలి?" అడిగాడతను. మాకు అర్థమయిపోయింది వాడెవరో స్మగుల్డ్ సామాన్లమ్మేవాడని!
    వెంటనే శాయిరామ్ కుతూహలంగా అతని దగ్గరకు జరిగాడు.
    "జపాన్ వాచీలున్నాయా? ఎలక్ట్రానిక్ వి"
    "నాకు త్రీ ఇన్ వన్ కావాలి! దొరుకుతుందా?" అడిగాడు గోపాల్రావ్.
    అతను ఆశ్చర్యంగా చూశాడు మావేపు.
    "అదేమిటి? నేను స్మగుల్డ్ సామాన్లమ్మే వాడిననుకుంటున్నారా?"
    మేము తెల్లబోయాం.
    "కాదా? అయితే మరి ఇందాక మీరు దేన్ని గురించి మాట్లాడారు?"
    "ఇంజనీరింగ్ అండ్ మెడికల్ సీట్స్ గురించి సార్! అదురుపాటు స్టాండర్డ్ వున్న కాలేజీలు! కారు చవక! ఎన్ని సీట్లు కావాలి?"
    మాకు మతిపోయినంత పనయింది.
    కర్నాటకలో ఇంజనీరింగ్ కాలేజీలు బోలెడున్నాయని తెలుసుగానీ మరీ ఇంత చవకలో- ఇలా వాళ్ళే మన దగ్గరకొచ్చి సీట్లు అమ్ముతారని తెలీదు.
    "ఒక్క నిమిషం!" అని అతనితో చెప్పి మేమంతా అతనికి దూరంగా జరిగి మాలో మేము గుసగుసలాడుకోసాగాం.
    "ఏయ్! మనం చౌకగా వస్తోందికదా అని తొందరపడి సీట్లు కొనేయకూడదు. మనకేం ఆసక్తి లేనట్లు కొంచెం బేరాలాడదాం! వాడు ధర తగ్గిస్తే తగ్గించవచ్చు!" అన్నాడు రంగారెడ్డి.
    మళ్ళీ అందరం అతని దగ్గరకు నడిచాము.
    "ఇదిగో చూడబ్బీ, ఒకో ఇంజనీరింగ్ సీట్ కి మూడువేలిస్తాం, ఇస్తే ఇవ్వు లేకపోతేలేదు" అన్నాడు అప్పలాచారి.
    ఆ వ్యక్తి మా వంక విచిత్రంగా చూశాడు.
    "నీయమ్మ- నాకప్పుడే డౌటొచ్చింది- ఆంధ్రాస్ అయితే ఇలా అడుక్కుతినే వాళ్ళలాగా వుండరే అని! పైగా కార్లులేవు! మీరు టమిళియన్స్ గానీ, కేరళైట్స్ గానీ అయుంటారు కదూ" అడిగాడు అతను.
    "కాదు! మేము ఆంధ్రాసే" కోపంగా అన్నాడు గోపాల్రావ్.
    "ఆంధ్రాసయితే ఇంత గీసిగీసి బేరాలడగరే! ఒకవేళ మీ ఫోర్ ఫాదర్స్ మద్రాస్కిగానీ, కేరళాగానీ చెంది వుంటారు"
    అతను కార్లో వెళ్ళిపోయాడు.
    తిన్నగా మేమందరం ఓ ఇంజనీరింగ్ కాలేజీకి చేరుకున్నాం.
    ప్రిన్సిపాల్ రూమ్ చేరుకోగానే ప్యూన్ వినయంగా వంగి నమస్కారం చేసి తలుపు తెరిచి పట్టుకున్నాడు.
    మాకు మతిపోయినంత పనయింది.
    "అదేమిటి? ప్రిన్సిపాల్ గారి పర్మిషన్ తీసుకున్నావా?"
    "మీరు ఆంధ్రాసే కద్సార్! పర్మిషన్ అక్కర్లేదండి! మీ కోసమే మా కాలేజీ కమిటీ మెంబర్లందరూ రెండ్రోజుల్నుంచి వెయిట్ చేస్తున్నారు సార్!"
    మేము లోపలికి నడిచాం. మమ్ముల్ని చూడగానే లోపల అందరూ ప్రేమగా చిరునవ్వు నవ్వారు.
    "రండి! వెల్ కమ్ టు కర్నాటకా- ఇండియాలో మిగతా రాష్ట్రాలన్నిటికి విద్యాదానం చేస్తున్న మా రాష్ట్రానికి స్వాగతం" అన్నాడు ప్రిన్సిపాల్.
    అందరం నమస్కరించి కూర్చున్నాం.
    "ఎన్ని సీట్లు కావాలి?" అడిగాడు ప్రిన్సిపాల్.
    "పన్నెండు"
    "ఒండర్ ఫుల్! మీ బ్రీఫ్ కేస్ లేవీ!"
    మేము అదిరిపడ్డాం.
    "బ్రీఫ్ కేస్ లేమిటి?"


Related Novels


Cine Bethalam

Kanthi Kiranalu

Nirbhay Nagar Colony

Rambharosa Apartments

More