Home » yerramsetti sai » Nirbhay Nagar Colony


                            ఉత్తమ సాహిత్యం జిందాబాద్

    కాలనీ వాళ్ళందరం పిల్లలతో సహా వేదిక దగ్గర సమావేశమయ్యాము.
    సాధారణంగా ఇలాంటి సమావేశాల్లో కనిపించే ఉత్సాహం, హడావుడి, అరుపులూ, కేకలూ- ఏమీ కనిపించడం లేదారోజు.
    అంతా అతి భయంకరమైన నిశ్శబ్దం అలుముకుని వుంది.
    అందరి ముఖాల్లోనూ వ్యాకులత, భయం, దిగులు అలుముకుపోయినాయ్. నేనూ రంగారెడ్డి, గోపాల్రావ్, యాదగిరి, జనార్ధన్, చంద్రకాంత్ విచారంగా ఓ పక్కన కూర్చున్నాం. శాయిరామ్ నెమ్మదిగా వచ్చి వేదిక ఎక్కి మైక్ ముందు నిలబడ్డాడు ధీనంగా.
    చిన్న చిటికె వేసినా వినిపించేత నిశ్శబ్దం.
    "సోదర సోదరీమణులారా! ఇవాళ మనకు చాలా విచారకరమయిన రోజు. మన కాలనీలోని డజనుమంది టెన్త్ విద్యార్థులు- పెద్దలకు తెలీకుండా- రహస్యంగా అతి జుగుప్సాకరమయిన సాహిత్యం చదువుతుండగా పట్టుబడ్డారు. పన్నెండుమందీ కూడా భయంకరమయిన చెడు మార్గంలోనే ప్రయాణిస్తున్నారంటే కాలనీలోని మిగతా పిల్లలు కూడా ఇదే త్రోవలో నడుస్తున్నారని వేరే చెప్పడం అనవసరం అని నా అభిప్రాయం. కనీసం ఇప్పటికయినా మన కాలనీ పిల్లలు ఎలాంటి పుస్తకాలు చదువుతున్నారో వారి తల్లిదండ్రులతో పాటు ఇతరులు కూడా తెలుసుకుంటే భవిష్యత్తులో వారు అలాంటి తప్పు మార్గంలో వెళ్ళకుండా నివారించడానికి అవకాశం ఉంటుందని నా ఆశ. అందుకే ఈ రోజు ఈ అత్యవసర సమావేశం ఏర్పాటుచేయవలసి వచ్చింది."
    ఇంతవరకూ చెప్పి అందరివంకా ఓసారి చూశాడు శాయిరామ్. అందరి చూపులు తనమీదే నిలచివుండడంతో మరింత విచారంగా ఫోజు ఇస్తూ మళ్ళీ ప్రారంభించాడతను.
    "ముందుగా యాదగిరినీ, అతని కొడుకు శంకర్ ని వేదిక మీదకు రావలసిందిగా కోరుతున్నాను" అన్నాడతను.
    యాదగిరీ! మీ అబ్బాయి ఏ పుస్తకం చదువుతుండగా పట్టుబడ్డాడో ఒకసారి మన వాళ్ళందరికీ చెప్పు!" అన్నాడు శాయిరామ్.
    యాదగిరి ఏదో మాట్లాడాలని తలెత్తి పెదాలు కదపడానికి ప్రయత్నించి కుదరక మళ్ళీ తల దించుకున్నాడు అవమానంతో.
    "నేను చెప్పలేను. ఆడినే అడగండ్రి" అన్నాడు సిగ్గుతో.
    "ఏరా శంకర్! నువ్ ఓవర్ హెడ్ టాంక్ కింద ఎవరికీ కనబడకుండా కూర్చుని చదువుతున్న పుస్తకం ఏమిట్రా" అడిగాడు శాయిరామ్.
    "ఇంకెప్పుడూ చదవనంకుల్! నన్నొదిలేయండి" భయపడిపోతూ అన్నాడు వాడు.
    "నిన్నేమీ చేయలేం! పుస్తకమేదో చెప్పు!"
    వాడు ఓ క్షణం తటపటాయించి చెప్పేశాడు "సత్యహరిశ్చంద్ర"
    ఆ పేరు వింటూనే అందరూ ఉలిక్కిపడ్డారు.
    చాలామంది తమకు తెలియకుండానే హాహాకారాలు చేశారు.
    "అయ్యో! అయ్యో! వింటిరా? ఎంత పన్జేసిండో- సత్యహరిశ్చంద్ర చదివిండట! భగవంతుడా! ఇదేం కిరికిరి తెచ్చినావ్ స్వామీ-" అంటూ యాదగిరి భార్య భోరున ఏడ్చేయసాగింది. అందరూ ఆమెను అతికష్టం మీద ఓదార్చసాగారు.
    "జరిగిన నష్టమేదో జరిగిపోయింది కదమ్మా! ఆ పిల్లాడిని ఎలా మళ్ళీ మంచి మనిషిగా చేయాలో ఆలోచించాలి గానీ ఏడుస్తే ఏం లాభం?" అంది సావిత్రమ్మ.
    "ఊరుకోమ్మా! కాలం అలాంటిది! పిల్లల్నని ఏం లాభం? ఆ దిక్కుమాలిన పుస్తకాలు అమ్మినవాడిననాలి! ఎంత లాభసాటి వ్యాపారమయితే మాత్రం చిన్నపిల్లలని కూడా చూడకుండా అలాంటి బూతు పుస్తకాలమ్ముతాడా?" విరుచుకుపడింది పార్వతమ్మ.
    "ఇంతకూ ఆ పుస్తకమంతా చదివేశాడా ఆ కుర్రాడు?" అడిగింది ఇంకొకామె.
    శాయిరామ్ యాదగిరి వేపు చూశాడు.
    "ఏమిరా! ఎన్ని దినాల కెళ్ళి సదువుతున్నావీ ఫాల్తూ పుస్తకం?" అడిగాడతను కోపంతోనూ బాధతోనూ.
    "పదేను దినాలకెళ్ళి!"
    అందరూ మళ్ళీ హాహాకారాలు చేశారు. "అయితే మొత్తం చదివేసి వుంటాడు! ఇంకెలా బాగుపడతాడు వీడు?" అంది సావిత్రమ్మ.
    "అందులో కథంతా సదివినావురా?" అడిగాడు యాదగిరి మళ్ళీ.
    "అవ్! అంతా సదివినా!"
    "గంటే- హరిశ్చంద్రుడు 'సత్యం' కోసం భార్యను అమ్మేసుకొనుడు, కాటికాపరిగా పనిచేసుడు అన్నీ సదివినావులే!" మరింత గాబరాగా అడిగాడు.
    "అవ్! కథ మొత్తం చదివినా! పాపం హరిశ్చంద్రుడు బాకీ పైసలు తీర్చనని ఎంత పరేషానయిండో మంచిగా రాసిండు నాయనా?"
    అందరూ మరింత జాలిగా చూశారు వాడివేపు.
    "అదంతా చదివినాంక ఇప్పుడు నీకేమనిపిస్తుందిరా?"
    వాడు భయపడుతూ అందరివేపూ చూశాడు.
    "చెపితే నన్ను కొడతావు నువ్వు!" అన్నాడు అనుమానంగా.
    "కొట్టడులే! కొడితే అడ్డుకునే పూచీనాది! చెప్పెయ్" అన్నాడు శాయిరామ్.
    "నేను గూడా ఎన్నటికీ నిజమే మాట్లాడాలని వున్నదే" భయంగా అన్నాడు.
    అందరూ నిర్ఘాంతపోయారు. వాళ్ళమ్మ బిగ్గరగా ఏడ్చేయసాగింది.
    "నా బిడ్డ పూరా ఖరాబయిపోయిండు దేవుడో! ఈ దినాల్ల 'నిజం' పలుకుతే ఏమయిపోతాడు దేవుడో! ఈడ్నింకెవరు బచాయిస్తరు దేవుడో!" అందరూ కలసి ఆమెను ఓదార్చసాగారు.
    "ఏం చేస్తామమ్మా! నీ ఖర్మ అది! వాడా పుస్తకం పూర్తిగా చదివేశాక ఇంక ఎవరేం జేయగలం చెప్పు! వాడి ఖర్మ వాడనుభవించాల్సిందే"
    శాయిరామ్ మైక్ దగ్గర కొచ్చాడు మళ్ళీ.
    "సోదరసోదరీమణులారా! యాదగిరి కొడుకు చదివిన దారుణమయిన సాహిత్యం గురించి, దానివల్ల సంభవించిన అనర్ధం గురించీ విన్నారు. ఇప్పుడు గోపాల్రావ్ కూడా వాళ్ళబ్బాయిని అలాంటి సాహిత్యమే చదువుతూండగా రెడ్ హాండెడ్ గా పట్టుకున్న విషయం గురించి వివరంగా వివరిస్తారు" అన్నాడు.
    మరుక్షణం గోపాల్రావ్ ధీనంగా వేదికమీదకొచ్చాడు.


Related Novels


Cine Bethalam

Kanthi Kiranalu

Nirbhay Nagar Colony

Rambharosa Apartments

More