Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
నలుడు కర్కోటకుని మాటలు విన్నాడు. అతనికి నమ్మకము కలిగినది. అయోధ్య చేరినాడు. ఋతుపర్ణుని దర్శించినాడు. మహారాజా! నేను బాహుకుడను. వంటలలో విశారదుడను. అశ్వ శిక్షణలో నేర్పరిని. నిన్ను సేవించుటకు వచ్చినాను" అన్నాడు. ఋతుపర్ణుడు బాహుకుని మాటలు విన్నాడు. బాహుకుడు సమర్థుడని తెలుసుకున్నాడు. కొలువున ఉంచుకున్నాడు. నలుడు వార్ష్ణేయ జీవలులను సాయముగాగొని వంటలు చేసి ఋతుపర్ణుని మెప్పించినాడు. కొంటె గుఱ్ఱములను లొంగదీసి వాటిని శిక్షించినాడు. ఋతుపర్ణునకు బాహుకుని విషయమున విశ్వాసము ఏర్పడినది. ఆ విధముగా కాలము గడుపుచున్నాడు నలుడు. ఏకాంతముగా ఉన్నపుడు నలుడు దమయంతిని తలచుకొని దుఃఖించువాడు. నిద్రలో పలవరించువాడు.
నలుని బాధ జీవలుడు కన్నాడు. "బాహుకా! నీవు విచారముగా ఉన్నావు. మధ్య మధ్య భార్యను తలచుచున్నావు నీకును, నీ భార్యకును వియోగము కలుగుటకు కారణమేమి?. నీ భార్య నిన్ను విడుచుటకు కారణమేమి?" అని అడిగినాడు.
నలుడు జీవలునితో "నా రూపము చూచినావు కదా! నాకు భార్య అగుటకు ఏ ఆడది అంగీకరించును? పూర్వము చంద్రప్రజ్ఞుడనువాడు భార్యను విడిచినాడు. తదుపరి దుఃఖించినాడు. ఆ తరువాత ఆమెను వెదుక సాగినాడు. అతని కథ తలచుకొనిన బాధ అనిపించుచున్నది. అతనిని తలచుకొని బాధపడుచున్నాను" అన్నాడు.
దమయంతి చేది పట్టణము చేరినది. నలుడు అయోధ్య చేరినాడు. వీరి వర్తమానము తెలియక విదర్భలో భీమరాజు విచారించినాడు. నలుడు రాజ్యము ఓడినాడు. అడవుల పట్టినాడు. దమయంతి అతనివెంట వెళ్లినది. ఈవార్త తెలిసినది. అటు తరువాత జాడ తెలియలేదు. భీమరాజు కూతురు అల్లుని విషయమున బాధపడినాడు. వారిజాడ తెలుసుకొన దలచినాడు. విద్వాంసులయిన బ్రాహ్మణులను పిలిపించినాడు. నలదమయంతుల జాడ తెలుసుకొనుటకు నియమించినాడు. నల దమయంతుల జాడ తెలుసుకున్న వారికి అనేక అగ్రహారములు, గోవులను ఇత్తునని ప్రకటించినాడు.
భీమరాజు పంపిన విప్రులు అనేక పట్టణములకు నగరములకు వెళ్లినారు. అట్లు వెళ్లిన వారిలో సుదేవుడు అనువాడు చేది దేశము చేరినాడు. అక్కడి రాజగు సుబాహుని పురోహితులతో స్నేహము చేసినాడు. అంతఃపురమున ప్రవేశము సంపాదించినాడు. అంతఃపురము ప్రవేశించిన సుదేవునకు ఒకనాడు దమయంతి కనిపించినది. ఆమె నివురు కప్పిన నిప్పువలె ఉన్నది. మబ్బు కప్పిన చంద్రరేఖవలె ఉన్నది. బురదలో కూరిన తామర తూడువలె ఉన్నది. అయినను దమయంతి కనుబొమల నడుమ ఉన్న పద్మము వంటి గురుతును సూక్ష్మముగా చూచినాడు సుదేవుడు. దమయంతిగా గుర్తించినాడు. దమయంతితో అన్నాడు:-
"అమ్మా! దమయంతీ! నేను సుదేవుడను. నీ సోదరునకు మిత్రుడను. విదర్భ నుంచి వచ్చినాను. భీమరాజు మిమ్ములను వెదకుటకు అనేక దేశములకు విప్రులను పంపినాడు. నేను ఇచటికి వచ్చినాను".
దమయంతి సుదేవుని మాటలు విన్నది. అతనిని గుర్తించినది. స్వజనము కనిపించగా దుఃఖము పొంగినది "సుదేవా! చూచినావా! నేను ఇట్లున్నాను. విదర్భలో నా బిడ్డలు, నా తలిదండ్రులు క్షేమముగా ఉన్నారా? నన్ను తలచుచున్నారా? నా భర్తజాడ ఏమయిన తెలిసినదా?" అని కన్నీరు రాల్చుచు అడిగినది. దమయంతికి దుఃఖము ఆగలేదు. ఏడుపు వచ్చినది.
దమయంతి వద్దకు వచ్చుచున్న సునంద దమయంతి ఏడ్పు విన్నది. రాజమాత దగ్గరకు ఉరికినది. ఆమెను వెంట పెట్టుకొని వచ్చినది. ఆమె వెంట అనేకమంది పరిచారికలు వచ్చినారు.
రాజమాత దమయంతి వద్దకు వచ్చినది. చూడగా సుదేవుడు కనిపించినాడు. దమయంతి కన్నీరు తుడుచుకొని, దుఃఖము దిగమింగి జరిగి నిలుచున్నది. "విప్రోత్తమా! నీవు ఎవరవు? ఈమె ఎవరు? ఎందుకు ఏడ్పించుచున్నావు? ఈమె దుఃఖమునకు కారణమేమి?" అని అడిగినది.
రాజమాత అడిగినది విన్నాడు సుదేవుడు. ఒళ్లు జల్లుమన్నది. రాజమాతకు చేతులు జోడించినాడు. సవినయముగా "అమ్మా! నేను విదర్భవాడను. ఈమె తండ్రి భీమరాజు ఈమెను వెదకుటకు నన్ను పంపినాడు. నా పేరు సుదేవుడు. మీ పురోహితులకు మిత్రుడను. ఈమె భీమరాజు కూతురు దమయంతి. నల మహారాజు భార్య. నలుడు జూదమున రాజ్యము ఓడినాడు. అడవులకు వెళ్లినాడు. అతని వెంట దమయంతి వెళ్లినది. ఆ తరువాత వారి జాడ తెలియలేదు. వారి జాడ తెలుసుకొనుటకు భీమరాజు అనేకమంది విప్రులను పంపినాడు. వారిలో నేను ఒకడను. ఈమె కనుబొమల మధ్య ఉన్న పద్మపుగుర్తు చూచి ఈమెను గుర్తించినాను. దమయంతి నన్ను గుర్తించినది. పుట్టింటి మాట విని ఏడ్చుచున్నది. ఇందు నా దోషమేమియు లేదు" అన్నాడు.
రాజమాత సుదేవుని మాటలు విన్నది. కనుబొమల మధ్య పద్మాకారము చూచినది. ఆమెలో వాత్సల్యము పొంగినది. 'దమయంతీ! నీవు నా బిడ్డవు' అని కౌగిలించుకున్నది. "అమ్మా! నేను, మీ తల్లి అక్కచెల్లెళ్లమమ్మా! నీవు నా కూతురవు. ఇంట ఉన్న బిడ్డను గుర్తించలేకపోయినాను. ఇది నీ పుట్టిల్లు తల్లీ! నీ ఇంటనే నీవు పరాయిదానివలె ఉన్నావు. సుదేవా! నీవు నాకు గొప్ప ఉపకారము చేసినావు" అని దమయంతి తల నిమిరినది.
రాజమాత మాటలు విని దమయంతి కడుపు చెరువు అయినది రాజమాత పాదములంటి వినయముగా మ్రొక్కినది. "అమ్మా! నాకు నీవు అమ్మవే. విదర్భయు చేది పట్టణమును పుట్టిళ్లే. నన్ను కాపాడినదానవు నీవు. కడుపులో దాచుకున్నావు. నాకు పుట్టింటికన్న నీ ఇల్లే మిన్న. అయినా అమ్మా! విదర్భలో నాబిడ్డలున్నారు వారు ఎట్లున్నారో తెలియక కలకాలమయినది. వారిమీద మనసు గుంజుచున్నది. విదర్భ వెళ్లివత్తును. అనుమతి నిత్తువా?" అని దీనముగా అడిగినది. ఆమె మాటలలో వాత్సల్యము జాలువారినది.
రాజమాత దమయంతి వాత్సల్యధార కన్నది. ఆమెలో వాత్సల్యము పొంగినది. దమయంతిని లేవనెత్తినది. ముద్దు పెట్టుకున్నది. జీరవోయిన గొంతుతో "బిడ్డా! నేను బిడ్డలను కన్నతల్లినే. నీ బాధ ఎరుగనా! తల్లిగా నిన్ను అడుగుచున్నాను. బిడ్డగా నీవు కొన్నాళ్లు ఇక్కడ ఉండి వెళ్లిన మంచిది" అన్నది.
రాజమాత మాటలు దమయంతి విన్నది. తనలో పొరలుచున్న వాత్సల్యమును నిగ్రహించుకున్నది. రాజమాత వాత్సల్యమును గుర్తించినది. కొన్ని "రోజులు" అక్కడ ఉండుటకు నిశ్చయించుకున్నది రాజపుత్రిగా ఉన్నది.
రాజమాత దమయంతి బాధ గమనించినది. దమయంతి సకల సౌభాగ్యముల మధ్య ఉన్నది. అయినను ఆమె మనసు విదర్భలోనే ఉన్నది. బిడ్డల విషయమున తహతహలాడుచున్నది. ఇచట బందీవలె ఉన్నది. ఆమె సుదేవుని పిలిపించినది. తన కొడుకు సుబాహునితో చెప్పి కొంత సైన్యమిచ్చినది. దమయంతిని రతనాలు పొదిగిన బంగారు పల్లకి ఎక్కించినది. విదర్బకు దమయంతిని సాగనంపినది. దమయంతి వెళ్లిపోయినది. దమయంతి లేని ఇంటిని 'కాలు కాలిన పిల్లివలె' రాజమాత వెదకినది.



