Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
దమయంతి విదర్భ చేరినది. తన బిడ్డలను ముద్దాడినది. కౌగిలించుకున్నది. తల్లిదండ్రులకు వందనము చేసినది. సోదరుని తల నిమిరినది. ఆమెలో ఆనందము పొంగినది. ఎంతో కాలముగా ఆమె నవ్విన జాడ లేదు. నవ్వుచు మాట్లాడినది. దమయంతి తన ఇంటికి వచ్చినది.
దమయంతి ఆనందము ఎన్నో రోజులు నిలువలేదు. ఆమెకు అన్నీ ఉన్నవి. భర్తలేడు. భర్త విషయమున ఆమెకు ఆతురత హెచ్చినది. దేహ సౌఖ్యములు విడిచినది. మురికి బట్టనే కట్టినది. వ్రతములతో కాలము వెళ్లబుచ్చ సాగినది.
దమయంతి ఒకనాడు తల్లితో "అమ్మా! నా భర్తజాడ లేకున్నది. ఇట్లు నేను ఎంతకాలము ఉందును? నలుని వెదకుటకు విప్రులను పంపుము. అతని జాడ తెలియకున్న నేను ప్రాణములు విడుతును" అన్నది. ఆ మాటలు విన్న భీమరాజు సమర్థులయిన బాపలను పిలిపించినాడు. వారిని నలుని వెదకుటకు నియమించినాడు. దమయంతి ఆ విప్రులను చూచి "విప్రోత్తములారా! నలుని రాజ్యము పోయినది. సంపద బాసిన నల మహారాజు అజ్ఞాతముగా కాలము గడుపుచుండవలె. రూపమువలన కూడ అతనిని గుర్తించుట కష్టము కావచ్చును. కాబట్టి మీరు వెళ్లిన రాజసభలందు "రాజా! ధర్మపత్నిని అడవిలో విడుచుట ధర్మముకాదు. భర్త అనగా భరించువాడు. అట్టి భార్యను నిర్దయగా, ఒంటరిగా నట్టడవిలో విడుచుట ధర్మముకాదు" అని ప్రకటించుడు. మీ మాటలు సహించలేక వచ్చినవాడు నలుడగును. ఆవిధముగా అతనిని గుర్తించి ఇచటికి తీసుకొని రావలయును అని చెప్పినది.
దమయంతి చెప్పినది విన్నారు విప్రులు. వారు నానా దేశములకు వెళ్లినారు పర్ణాదుడు అను బ్రాహ్మణుడు అయోధ్యకు వెళ్లి వచ్చినాడు. దమయంతికి వివరించినాడు. "అమ్మా! అయోధ్యకు వెళ్లినాను. నీవు చెప్పిన రీతిగా ప్రకటించినాను. ఋతుపర్ణునివద్ద బాహుకుడు అను సేవకుడు ఉన్నాడు. అతను పొట్టి చేతులవాడు. వికార రూపము గలవాడు. అతడు నేను చేసిన ప్రకటన విన్నాడు. నన్ను ఏకాంతమునకు పిలిచినాడు వెలవెల నవ్వినాడు. నిట్టూర్పులు విడిచినాడు. "విప్రోత్తమా! నీ ప్రకటన బాగున్నది. భార్య అనునది భర్తయందలి లోపములను సహించవలెను. అట్టి ఓర్పు గల భార్య మరు జన్మమునందయినను తన పురుషునితో సుఖించగలదు. ధర్మబుద్ధి కలిగి ఉండును" అని చెప్పినాడు. అతనిని గురించిన వివరములు తెలుసుకున్నాను. అతడు అశ్వవిద్యయందును, పాకశాస్త్రమునందును మిగుల సమర్థుడని తెలిసినది. నలుని జాడలు మాత్రము అతనిలో కనిపించలేదు".
దమయంతి బాపడు చెప్పినదంతయు విన్నది. అతనిని పంపినది. ఆలోచించినది. ఎందుకో బాహుకుడే నలుడని ఆమెకు అనిపించినది. వెదకి తెచ్చిన సుదేవుని పిలిపించినది "సుదేవా! చేది పట్టణమున నన్ను కనుగొన్నావు. అట్లే నీవు నాభర్తను కనుగొనవలసి ఉన్నది. నీవు అయోధ్యకు వెళ్లుము. ఋతుపర్ణుని దర్శించి నలుని జాడ కనిపించనందున దమయంతికి రెండవ స్వయంవరము ప్రకటించినారు. అది రేపు జరుగనున్నది. అందుకు భూమండలమందలి రాజులు వచ్చుచున్నారు. నీవుకూడ రావలెను అని చెప్పుము" అని సుదేవుని అయోధ్యకు పంపినది. దమయంతి చెప్పినట్లు సుదేవుడు అయోధ్యకు వెళ్లినాడు. ఋతుపర్ణుని దర్శించినాడు. చెప్పినాడు. ఋతుపర్ణుడు అది విన్నాడు. బాహుకుని పిలిపించినాడు. "రేపు విదర్భలో దమయంతి స్వయంవరము జరుగనున్నది. నీవు ఆశ్వవిద్యా నిపుణుడవు. నన్ను రేపటి వరకు విదర్భ చేర్చవలెను" అన్నాడు.
నలుడు ఋతుపర్ణుడు చెప్పినది విన్నాడు. రేపటి వరకు విదర్భ చేర్తునన్నాడు. అచటి నుంచి వచ్చినాడు. నలుని మనసు వికలము అయినది. "నేను దమయంతిని వంచించినాను. నట్టడవిలో విడిచి వచ్చినాను. అందుకు ఆమె కోపించి యుండును. మరల వివాహము చేసికొనదలచి ఉండును. స్త్రీ స్వభావము చంచలము. అది ఎరుగుట దుర్లభము. స్త్రీలను నమ్మిన పురుషులు వ్యర్థులు, పిచ్చివారు. అయినను దమయంతి అందరు స్త్రీలవంటిది కాదు. ఉత్తమురాలు. పతివ్రత. నాయందు ప్రాణస్నేహము కలది. పుత్రవతి దమయంతి మరొక వివాహము తలపెట్టి ఉండదు. చూడవలె పరిస్థితులేమిటో! ఎట్లయినను విదర్భ వెళ్లవలె అని నిశ్చయించుకున్నాడు. నలుడు రాజ్యము పాలించుచుండినపుడు అతనికి రథ సారథి వార్ష్ణేయుడు. నలునకు రాజ్యము పోయిన తరువాత వార్ష్ణేయుడు ఋతుపర్ణుని వద్ద కొలువునకు చేరినాడు. ఇప్పుడు అతడు నలునకు సాయకుడు. నలుడు వార్ష్ణేయుని పిలిచినాడు రథము సిద్ధము చేయమన్నాడు. రథము సిద్ధమయినది. ఋతుపర్ణుడు ఎక్కినాడు. గుఱ్ఱములు మొగ్గినవి. రథము వాలినది. ఋతుపర్ణుడు అది చూచినాడు. "బాహుకా! గుఱ్ఱములు బలహీనముగా ఉన్నట్లున్నవి విదర్భ చాల దూరము ఇవి చేరగలుగునట్లు లేవు. వేరు గుఱ్ఱములను కట్టుము" అన్నాడు. "మహారాజా! ఈ గుఱ్ఱములు వాయు వేగము గలవి సూర్యాస్త సమయమునకు పూర్వమే విదర్భ చేర్చగలను. అది విన్న ఋతుపర్ణుడు. నీవు అట్లు చేసిన నీ అశ్వవిద్యా సామర్థ్యమునకు తగిన రీతి నీకు ఇష్టసిద్ధి కలిగింతును" అన్నాడు.
నలుడు ఋతుపర్ణుని మాటలు విన్నాడు రథమును సాగించినాడు. బాహుక, వార్ష్ణేయులు, ఋతుపర్ణుడు రథమున ఉన్నారు. రథము వాయు వేగమున సాగినది. దూరముగా కనిపించిన వృక్షాదులు క్షణములో దగ్గరికి వచ్చినవి. మరు క్షణమున రథము దాటి కనిపించకుండా పోయినవి.
రథము వాయు వేగమున పోవుచున్నది. అది చూచి ఋతుపర్ణుడు ఆశ్చర్యపడినాడు. బాహుకుని సామర్థ్యమునకు ఆశ్చర్యపడినాడు. ఇది తన రథమా! సూర్యుని రథమా! అనుకున్నాడు. తన సారథి బాహుకుడా? అనూరుడా? అతనికి అర్థము కాలేదు.
నలుని సారథ్యము చూచి వార్ష్ణేయుడు చకితుడు అయినాడు. ఇతడు శాలిహోత్రుడో, మాతలియో, నలుడో అర్థము కాకున్నది. విద్యాతిశయము ఇతడు నలమహారాజును గుర్తుకు తెచ్చుచున్నది. ఆ మహారాజు ఈ వేషమున ఎందుకు ఉన్నాడో తెలియరాకున్నది. మహాత్ములు పరులకు తెలియకుండ ప్రవర్తించగలరు. మహాత్ములను తెలుసుకొనుట అసాధ్యము అనుకున్నాడు.
నలుని సామర్థ్యమును రథమున గల ఇద్దరూ మెచ్చుకొనుచున్నారు. నలుడు ఏకాగ్రముగా రథము నడిపించుచున్నాడు. రథపు వేగమునకు ఋతుపర్ణుని ఉత్తరీయము ఎగిరిపోయినది. అదిచూచిన ఋతుపర్ణుడు "బాహుకా! రథపు వేగము తగ్గించుము. వార్ష్ణేయుడు ఉత్తరీయము తెచ్చును" అన్నాడు. "మహారాజా! ఉత్తరీయము రాదు. అప్పుడే మనము ఆమడలు దాటినాము" అన్నాడు బాహుకుడు. ఋతుపర్ణుడు బాహుకుని సామర్థ్యమునకు మరింత ఆశ్చర్యపడినాడు. మనమున బాహుకుని మరింత పొగడినాడు.
నలుడు రథమును సాగించుచున్నాడు. అది వాయువేగ, మనోవేగములతో సాగుతున్నది. ఋతుపర్ణుని మనసు ఉప్పొంగుచున్నది. అతడు బాహుకుని చూచి అన్నాడు:-
"బాహుకా! విద్యలు సముద్రమువంటివి. వాటిలోతు ఎరుగుట సాధ్యపడదు. విద్యలు ఆకాశము వంటివి. వానిని అందుకొనుట దుర్లభము. అయినను ఒక్కొక్కరు ఒక్కొక్క విద్యను అభ్యసింతురు. నేను అక్షవిద్యను అభ్యసించినాను చూచినంత మాత్రమున వస్తువుల సంఖ్యను చెప్పగలను. అని దూరముగా కనిపించు తాండ్ర చెట్టు నందలి ఆకుల, పండ్ల సంఖ్యను చెప్పినాడు. నలుడు తాండ్ర చెట్టువద్ద రథమును ఆపినాడు. ఆకులను, పండ్లను లెక్కించినాడు. ఋతుపర్ణుడు చెప్పిన దానికి సరిపోయినవి. ఈసారి ఆశ్చర్యపడుట నలునివంతయినది. నలుడు ఋతుపర్ణుని సామర్థ్యమును పొగడినాడు. అక్షవిద్య తనకు ఉపదేశించివలసినదని ప్రార్థించినాడు. ఋతుపర్ణుడు "బాహుకా! ఇది అక్ష హృదయమను జూద విద్య. ఈ విద్యను విధి పూర్వకముగా ఎరిగినవాడు చూచిన మాత్రమున సంఖ్యా ప్రమాణమును తెలియగలడు. ఇది అభ్యసించినవాడు సకల పాపములను పోగొట్టుకొని, విషములనుండి విముక్తుడగును అతడు సకల సద్గుణములచేత ప్రకాశితుడు అగును. ఇది సకల జనులకు మేలు కలిగించును. నీకు శుభము కలుగును" అని అక్ష విద్యను ఉపదేశించినాడు.



