Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
"అమ్మా! నిన్ను చూచిన జాలివేయుచున్నది. ఈ అడవులలో ఏనుగులను చూచినాము, సింహములను చూచినాము, పులులను చూచినాము. నానావిధ మృగములను చూచినాము. నల మహారాజును మాత్రమే చూడలేదు. తల్లీ! ఇది దుర్గమారణ్యము. ఈ అరణ్యమున ఆడదానివి ఒంటరిగా ఏల తిరిగినావో అర్థము కాకున్నది. మేము చేది దేశపు రాజగు సుబాహుని పట్టణమునకు వెళ్లుచున్నాము. నిన్ను కంటికిరెప్ప వలె కాపాడుచు మావెంట తీసుకొని వెళ్ళెదము. మావెంట రమ్ము" అన్నాడు శుచి.
దమయంతికి శుచి మాటలు చల్లగా తోచినవి. ఆమెకు కొంత ధైర్యము వచ్చినది. వారి వెంట వెళ్లుటకు సమ్మతించినది. శుచి ఆమెకు స్నానాదులకు ఏర్పాట్లు చేసినాడు. ఆహారము తీసుకొని, దమయంతి సేదదీరి వారివెంట బయలుదేరినది.
వర్తకుల బిడారు సాగినది. వారు గుట్టలు దాటి, చెట్లు దాటి సాగినారు. దమయంతి వారి వెంట సాగినది. వారు పగలంతయు ప్రయాణించి, రాత్రి విశ్రమించువారు. ఒకనాడు ప్రయాణమున చాలా అలసినారు. సాయంకాలము ఒక సరస్సు ఒడ్డున విడిసినారు. వంటలు, భోజనములు అయినవి. ఆ రాత్రి పడుకున్నారు. అర్ధరాత్రి అయినది. నీరు త్రాగుటకు ఏనుగుల గుంపు అక్కడికి వచ్చినది. వాటి తొక్కిడికి, అరుపులకు జనులు లేచినారు. ఏనుగులను చూచి ఉరికినారు తప్పించుకొనుటకు యత్నించినారు. ఎటు చూచినను ఏనుగులే. ఏనుగులు మనుషులను చూచి బెదరినవి. అవి మరింత అల్లరి చేసినవి. ఏనుగుల కాళ్లక్రిందపడి కొందరు చచ్చినారు. ఏనుగులు తొండములతో అందుకొని నేలకు కొట్టి కొందరిని చంపినవి. కొందరు ఏనుగులను చూచి అరచి చచ్చినారు. ఆవిధముగా అవివేకుని సంపదవలె వర్తకుల గుంపు నశించినది.
దమయంతికి మాత్రము ఏమాత్రము అపకారము జరుగలేదు. అపాయము రాలేదు. ఆమె తెల్లవారి లేచినది. ఏనుగుల వలన చచ్చిన వారందరు జీవితము మీద ఆశగలవారు. దైవము నిర్దయుడయి వారిని హతమార్చినాడు. నేను మరణమును కోరుకొనుచున్నాను. దైవము నన్ను చంపుటను మరచినాడు. దైవము మందబుద్ధి గలవాడు. నేను జీవించుట నా పూర్వజన్మ ఫలమయి ఉండును. నా స్వయంవరమునకు ఇంద్రాది దేవతలు వచ్చినారు. నన్ను కోరినారు. వారి ఎదుటనే నేను నలుని వరించినాను. వారు అందుకు కోపించి నాకిన్ని కష్టములు కలిగించుచున్నారేమో!" అనుకున్నది. అయినను మునుల మాట తలచుకున్నది. మిగిలిన వర్తకులతో బయలుదేరి చేది పట్టణము చేరినది.
దమయంతి సుబాహుని రాజధాని అయిన చేది పట్టణపు రాజమార్గమున సాగుచున్నది. రాజమాత రాజ గృహపు మేడ మీది నుండి దమయంతిని చూచినది. దమయంతి పగటి కాలపు చంద్రరేఖ వలె తేజోహీనమయి ఉన్నది. రాజమాత ఒక దాసిదానిని పిలిచినది. మార్గమున పోవు దమయంతిని పిలిపించినది. దమయంతి వచ్చినది.
రాజమాత దమయంతిని "పిల్లా! నీవెవ్వరవు? ఎందుకు దుఃఖించుచున్నావు. చూడగా రాజవంశమున పుట్టినట్లున్నావు. నీ దశ ఏమి? ఇందులకు కారణమేమి?" అని అడిగినది.
రాజమాత సాంత్వన వాక్యములతో దమయంతి దుఃఖము పొంగినది. ఆమె డగ్గుత్తుకతో అన్నది:- "అమ్మా! నేను నల మహారాజు భార్యను, దమయంతిని. ఇది నా దురదృష్టము. నేను ఈ దశలో ఉన్నాను. నా భర్త జూదమాడి రాజ్యసంపద పోగొట్టుకున్నాడు. అతని వెంట నేను అడవులకు వెళ్లినాను. నా భర్త నన్ను వంచించినాడు. అర్ధరాత్రి నన్ను వదలి వెళ్లినాడు. నా భర్తను వెదకుచు అడవులన్నియు తిరిగినాను. కాని నాకు చావు రాలేదు. భర్త లభించలేదు. విధి నన్ను మీవద్దకు తెచ్చినది" అని జలజల కన్నీరు రాల్చినది.
రాజమాత దమయంతి మాటలు విన్నది. ఆమె గుండె కరిగినది. ఆమె దమయంతిని దగ్గరకు తీసుకున్నది. తల నిమిరి "అమ్మా! విచారించకు. విధి నిన్ను తగిన చోటునకే తెచ్చినది. నీవు నావద్ద ఉండుము. నీభర్తను వెదికించుటకు బ్రాహ్మణులను పంపుదును" అన్నది.
రాజమాత మాటలు విన్నది. "తల్లీ! చల్లని మాట చెప్పినావు. మా అమ్మవలె ఉన్నావు. నేను "సైరంధ్రి" వ్రతమున ఉన్నాను. ఒకరు తినగా మిగిలినది ముట్టను. పాదములను శుద్ధిచేయను. నాభర్తను వెదకుటకు వెళ్లు బ్రాహ్మణులతో తప్ప మగవారితో మాట్లాడను. అందుకు నీవు అంగీకరించిన నీ వద్ద నేనుందును" అని విన్నవించినది దమయంతి.
రాజమాత అందుకు అంగీకరించినది. దమయంతిని తన కూతురు సునందకు అప్పగించినది. సునంద దమయంతి విషయమున స్నేహము చూపినది. ఆమెకు అన్ని సౌకర్యములు కలిగించినది. దమయంతి పుణ్యవ్రతములు చేయుచు, నలునికై నిరీక్షించుచు కాలము గడపసాగినది.
ఇక నలుని వృత్తాంతము ఏమైనదనిన నలుడు దమయంతిని విడిచి కారడవిలో సాగినాడు. అతడు ఆ విధముగా సాగుచుండగా అడవికి నిప్పు అంటుకున్నది. అడవి జాజ్వల్య మానముగా వెలుగుచున్నది. భగ భగ మండుచున్నది. మంటలు నాల్కలు చాచి ఆకసమును అంటుచున్నవి. ఆ మంటలకు అడవి జంతువులు అటు ఇటు ఉరుకుచున్నవి. కేకలు వేయుచున్నవి. ఆక్రందనలు చేయుచున్నవి.
నలుడు ఆదారిన సాగుచున్నాడు. "మహారాజా! రక్షింపుము రక్షింపుము" అను కేకలు వినిపించినవి. నలుడు ఆ కేకలు విన్నాడు. ఆగినాడు. చూచినాడు. ఒక నాగ కుమారుడు చుట్ట చుట్టుకొని ఉన్నాడు. మంటలు విసరుచున్నవి. సెగలు సోకుచున్నవి. అతడే కేకలు వేసినది. "నల మహారాజా! ఒక మునిని అవమానించి ఈ దశకు వచ్చినాను. కదలలేకున్నాను. బ్రతుకుమీద ఆశ ఉన్నది. చావదలచలేదు. నన్ను ఒక చెరువు గట్టునకు తీసుకొని వెళ్లుము. నన్ను రక్షించిన నీకు మేలు కలిగింతును" అని ఆక్రోశించినాడు.
నలుడు నాగేంద్రుని మాటలు విన్నాడు. మంటలలోనికి దూసుకొని వెళ్లినాడు. కర్కోటకుని తీసుకున్నాడు. బయటపడినాడు. సరస్సువద్దకు చేరినాడు. కర్కోటకుని దించబోయినాడు. మరొక పది అడుగులు నడచి మరొక చెరువు వద్ద దింపుము" అన్నాడు కర్కోటకుడు. నలుడు పది అడుగులు నడచునంతలో కర్కోటకుడు నలుని కరచినాడు.
నలుడు కర్కోటకుని విడిచినాడు. తనను చూచుకున్నాడు. రూపము మారిపోయినది. వికృత రూపము వచ్చినది. నలుడు వికృత రూపము దాల్చినాడు. అప్పుడు కర్కోటకుడు పాము రూపము విడిచినాడు. నిజ రూపము దాల్చినాడు అన్నాడు:-
"మహారాజా! నీవు నాకు ఉపకారము చేసినావు. మంటల నుండి కాపాడినావు బ్రతికించినావు. నీకు నేను అపకారము చేసితినని తలచకుము. నీవు నిజ రూపమున ఉన్న నీకు అపకారము కలుగు ప్రమాదమున్నది. అందువలన నిన్ను కరచి వికార రూపము కలిగించినాను. నా విషము నీ శరీరమున ఉన్నంత కాలము నీకు విష, సర్ప, రాక్షస, పిశాచ, శత్రు భయములుగాని ప్రమాదములుగాని ఉండవు. నీవు నిజ రూపము కావలెననుకున్నపుడు నన్ను తలచుము. ఈవస్త్రము నీవద్దకు వచ్చును. దానిని ధరించిన నీకు నిజ రూపము వచ్చును. నీకు శుభము కలుగనున్నది. నీ భార్య నీకు లభించును. యుద్ధమున విజయము కలుగును, నీ రాజ్యము నీకు వచ్చును".
నలుడు కర్కోటకుడు చెప్పిన మాటలు విన్నాడు. ఎదుట కర్కోటకుడు ఉన్నాడు. నలునకు అంతయు ఆశ్చర్యముగా ఉన్నది. "మహారాజా!" కర్కోటకుడు మరల అన్నాడు "ఇక్ష్వాకులలో ఋతుపర్ణుడను రాజు ఉండును. అతడు అయోధ్యను ఏలుచున్నాడు. మిగుల ప్రసిద్ధుడు. అతని వద్దకు వెళ్లుము. అతనికి అశ్వ హృదయము బోధించుము. అతని వలన అక్ష హృదయము పొందుము. 'బాహుకుడు' అను పేరుతో ఋతుపర్ణుడనకు సారథివి అయి ఉండుము. నీకు మేలు కలుగును" అని చెప్పి కర్కోటకుడు అంతర్ధానుడు అయినాడు.



