Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam


    నలుడు అందుకు అంగీకరించినాడు. అన్నాడు:-    
    "దమయంతీ! నీవు చెప్పినది నిజము. నీవు నా ప్రాణమువంటి దానవు. నిన్ను విడువను, విడువను. భయపడకుము" అని దమయంతిని వెంట పెట్టుకొని జన శూన్యము అయిన అడవికి వెళ్లినాడు. అక్కడ ఒక పాడుపడిన ఇల్లు కనిపించినది. అది దుమ్ముతో నిండి ఉన్నది. దాని నిండ ముళ్లున్నవి. అక్కడనే నల దమయంతులు పడుకున్నారు. దమయంతి నిద్రించినది. నలునకు నిద్రరాలేదు. అతడు లేచి కూర్చున్నాడు. అతని పాదముల వద్ద దమయంతి పడుకొని ఉన్నది. ఆమెను చూచినాడు. అతని మనసు కరిగినది. "దమయంతి సుకుమారి. పూర్వము పట్టుపాన్పులందు పవళించినది. అనేకమంది పరిచారికలచే ఉపచారములు చేయించుకున్నది. ఇప్పుడు ధూళితో నిండిన నేలమీద పరుండినది. ఈమె నా భార్య అగుటయే ఇందుకు కారణము. నేను ఈమె బాధలు చూడలేను. నేను ఈమెను విడిచి వెళ్లిన తనవారి వద్దకు చేరి సుఖించును" అనుకొని దమయంతి చీర సగము చించుకొని దమయంతి నిదురలో ఉండగా నలుగు వెళ్లిపోయినాడు.
    దమయంతి లేచినది. చూచినది. నలుడు కనిపించలేదు. ఆమె గుండె పగిలినది. అటు ఇటు ఉరికినది. చూచినది చెట్లు, పొదలు వెదకినది. కనిపించలేదు. ఆమెకు దుఃఖము పొంగినది. "నన్ను విడువనని మాట ఇచ్చి ఎక్కడికి పోయినావు? ఆయుధము ధరించి సకల భూమండలమును రక్షించినావే! నన్ను కాపాడలేక పోయినావా? నాలుగు వేదములు చదువుటకన్న ఒక్క సత్యవాక్యము చెప్పుట మేలు కదా! మాట ఇచ్చి వెళ్లి పోయినావు" అని నలుని తలచుకొని ఏడ్చినది.
    దమయంతి రాణి. సుకుమారి. అది కారడవి. ఆమెకు దుఃఖము వచ్చినది. తాను ఒంటరి ఆడది. ఆసమయమందునను ఆమె నలుని గురించి ఆలోచించినది. అతని ఒంటరి తనమును గురించి విచారించినది. నలుని వెదకుటకు బయలుదేరినది.
    దమయంతి ఒంటరిగా అడవిలో బయలుదేరినది. ఆమెకు సాయము లేదు. అది కీకారణ్యము. దుఃఖము, శ్రమ, కాళ్లకు ముండ్లు గుచ్చుకొనుచున్నవి. క్రూరమృగముల అరుపులు వినిపించుచున్నవి. ఆకలి దప్పులకు అలమటించి పోవుచున్నది. అన్నింటిని భరించి సాగుచున్నది. నలుని వెదకుచు వెళ్లుచున్నది. పడుచు, లేచుచు నడచుచున్నది. అట్లు పోవుచుండగా ఒక మహాసర్పపు తోక తొక్కినది. ఆ సర్పము దమయంతిని చుట్టివేసి పట్టుకున్నది. దమయంతి విడిపించుకోలేక పోయినది. గింజుకున్నది. బాధ భరించలేక నలుని గురించి అరచినది. కేకలు పెట్టినది.
    దమయంతి కేకలు విన్నాడు ఒక ఎరుకలవాడు. ఉరికి వచ్చినాడు. ఆమె దశను చూచినాడు. దయదలచినాడు తన చేతనున్న కత్తితో సర్పరాజము తల నరికినాడు. రాహువు విడిచిన చంద్రుని వలె దమయంతి బయటపడినది. ఎరుకలవాడు ఆమెను ఊరడించినాడు. సమీపమున గల సరస్సు చూపినాడు. ఆమె స్నానము చేసినది. అప్పుడు ఆమె అందము విరబూసినది. ఎరుకలవాడు పండ్లు ఫలములు తెచ్చి ఇచ్చినాడు. తిన్నది. ఆమె సేద తీరినది. తన కథ సాంతము వినిపించినది.
    దమయంతి సుందరి. వయసున ఉన్నది. స్నానము చేసి కడిగిన ముత్యమువలె ఉన్నది. ఉరముపొంగి ఉన్నది. గమనము మందముగా ఉన్నది. చూపు సొగసుగా ఉన్నది. ఆమెను చూచి ఎరుకల వానికి కామము కలిగినది. అతడు సహింపలేక పోయినాడు. తన కోరికను దమయంతికి తెలియపరచినాడు.
    దమయంతి అగ్నిశిఖ. ఆమెను తాకుటగాని చెడు చూపు చూచుట కాని అన్యులకు సాధ్యపడదు. ఎరుకలవాని మాట విని దమయంతి మండిపడినది. ఆమె ముఖము అగ్ని జ్వాల అయినది. ఆమె కనులు నిప్పులు కక్కినవి. ఆమె మనసులో మంటలు రేగినవి. "నేను పతివ్రతను ఈ దుర్మార్గుడు నన్ను కోరినాడు. వీడు వెంటన చావవలె, చచ్చుగాక, చచ్చుగాక" అని శపించినది.
    దమయంతి శాపము అగ్ని అయి ఎరుకలవానిని కాల్చినది. వాడు కార్చిచ్చు అంటిన చెట్టువలె కాలి, కూలినాడు. దమయంతి మరల అడవిలో బయలుదేరినది. చెట్టును గుట్టను అడుగుచు బయలుదేరినది. ఆమె ధ్వనియే వెనుదిరిగి వచ్చినది కాని, నలుని జాడ తెలియలేదు. ఎండకు మాడుచు, వానకు తడయుచు, చలికి వడకుచు దమయంతి అడవిలో సాగినది. నలుని వెదుకసాగినది.
    దమయంతి ఆ విధముగా తిరుగుచుండగా ఆమెకు ఒక మునిపల్లె కనిపించినది. అది ఒక నదీ తీరమున ఉన్నది. వృక్షలతాగుల్మాదులతో అందముగా ఉన్నది. అక్కడి మునులు కంద మూలములు తినుచు, జలములు త్రాగి, వాయువును భక్షించుచు తపము చేయుచున్నారు. మునిపల్లెను చూచి దమయంతి ప్రాణములు లేచి వచ్చినవి. ఆమె ఆశ్రమము చేరినది. మునులకు నమస్కరించినది. వారు ఆమెను చూచి ఆశ్చర్యపడినారు. "అమ్మా! నీవు ఎవ్వరవు? దేవకన్యవా? నాగకన్యవా? గంధర్వాంగనవా? అప్సరసవా? ఈ అడవిన తిరుగుటకు కారణమేమి? ఇచ్చటికి ఏల వచ్చితివి?" అని అడిగినారు.
    "మునులారా! నేను దమయంతిని. నల మహారాజు భార్యను. నా భర్త పుణ్యపురుషుడు, సత్యవాది. అనేక యజ్ఞములు చేసినాడు. అనంతమయిన కీర్తిని ఆర్జించినాడు. దైవము అనుకూలించనందున నా భర్త నన్ను ఈ వనమందు విడిచిపోయినాడు. నేను అతనిని వెదుకుచు తిరుగుచున్నాను. నా భర్త నలుడు మీ తపోవనమునకు వచ్చినాడా? మీ పాదములకు నమస్కరించి వెళ్లినాడా? అతడు వెళ్లిన మార్గము మీకు తెలిసిన నాకు చెప్పుడు. కొద్ది దినములలో అతడు కనిపించకున్న నా ప్రాణములు విడుతును" అని కన్నీరు రాలగా దీనురాలయిన దమయంతి మునులను ప్రార్థించినది".
    "అమ్మా! దమయంతీ!" అక్కడి మునులు ఆమెను ఊరడించినారు" కొలది రోజులలోనే నీవు నలుని చూడగలవు. అతడు తిరిగి ఎప్పటివలె రాజ్యము పొందగలడు. నీవు దుఃఖింపకుము. నీకు శుభము కలుగును మేము తపోదృష్టితో చూచి చెప్పుచున్నాము".
    దమయంతి వారి మాటలు విన్నది. తలవంచి పాదాభివందనము చేసినది. తలెత్తి చూచువరకు ఆశ్రమము లేదు, మునులు లేరు. లతాగుల్మాదులు లేవు. నదిలేదు. కారడవి కనిపించినది. అది కలయో, నిజమో, ఆమెకు అర్థము కాలేదు. కాని కొంత ధైర్యము వచ్చినది. మరల నడక సాగించినది.
    దమయంతి అడవిలో సాగినది. అలసినది. శ్రమకు శుష్కించినది. ఆ విధముగా కొంత దూరము వెళ్లగా ఒక వర్తకుల గుంపు కనిపించినది. ఆ గుంపులోని వారు దమయంతిని చూచినారు ఎవరీమె? అలసి, సొలసిన దేవతవలె కనిపించుచున్నది. ఈమెకు నిద్రాహారములు ఉన్నట్లులేవు. చీర సహితము సగమే ఉన్నది. అది కూడ మురికిపట్టి ఉన్నది, అనుకున్నారు.
    దమయంతిని చూచి కొందరు పిశాచి అనుకొని భయపడినారు. కొందరు పిచ్చిది అనుకొని నవ్వినారు. కొందరు దేవతగా భావించి నమస్కరించినారు.
    దమయంతి దేనిని గమనించలేదు. మహారణ్యమున మనుష్యుల గుంపు కనిపించినది. అందుకు సంతోషించినది. ఇది మునిజనుల దీవనల ఫలితమనుకున్నది. ఆమెకు ప్రాణములు లేచివచ్చినవి. ఆమె గుంపును చేరినది. ఆమెను వారు వర్తక ముఖ్యుని దగ్గరకు తీసుకొని వెళ్లినారు. అతని పేరు "శుచి".  
    "అయ్యా!" దమయంతి దీనురాలయి అడిగినది "నేను నలమహారాజు భార్యను. అతడు నన్ను ఒంటరిగ అడవులలో వదలి వెళ్లినాడు. నేను అతని కొఱకు వెదకుచు, ఇదిగో ఈవిధముగా అడవులందు తిరుగుచున్నాను. మీకు దైవసముడగు నలుడు కనిపించినాడా? కనిపించిన అతని జాడ చెప్పి పుణ్యము కట్టుకొనుడు".


Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More