Home » yerramsetti sai » Nirbhay Nagar Colony


    "గోపాల్రావ్ గారూ! మీ అబ్బాయి కూడా మన సమాజం నిషేదించిన అశ్లీల పుస్తకాలు చదువుతూ పట్టుబడ్డాడని తెలిసింది నిజమేనా!" అడిగాడు శాయిరామ్.
    "అవును!"
    "ఏం పుస్తకం అది?" గోపాల్రావ్ మా మొఖాల్లోకి చూడలేక తలదించుకున్నాడు.
    "భర్తృహరి సుభాషితాలు-సుమతీ శతకం"
    ఆ మాట వింటూనే అందరూ "అయ్యే! అయ్యో- ఇదెక్కడి ఘోరం? మరీ భర్తృహరి సుభాషితాలా! మన రాష్ట్రం సర్వనాశనమయిపోతోంది" అనుకోసాగారు.
    "ఎంతకాలం నుంచి వాడా పుస్తకం చదువుతున్నాడో కనుక్కున్నారా?"
    "చెప్పుకుంటే సిగ్గుచేటు! పదిరోజుల్నుంచీ అవే పుస్తకాలు చదువుతున్నాడట."
    అందరికీ గుండెలవిసి పోయినంత పనయింది.
    "అమ్మో! పదిరోజుల్నుంచే? అన్ని రోజుల్నుంచీ అంత ప్రమాదకరమైన నీతి పుస్తకాలు చదువుతూంటే మీరేం చేస్తున్నారు మరి?" చిరాకుపడ్డాడు చంద్రకాంత్.
    "మాకేం తెలుసు! పైకి కనిపించకుండా యండమూరి వీరేంద్రనాథ్, మల్లాది, యర్రంశెట్టిశాయి నవలల మధ్య పెట్టుకుని చదువుతున్నాట్ట. మేము పై నవలలు చూసి మంచి సాహిత్యమే చదువుతున్నట్లే అనుకుంటున్నాం! తీరా ఓరోజు ఆ పుస్తకం చదువుతూ చదువుతూనే నిదరపోయినప్పుడు లోపలున్న సుమతీ శతకం కిందపడి అసలు రహస్యం బయటపడింది! అప్పుడు పట్టుకుని చావగొడితే భర్తృహరి సుభాషితాలు కూడా చదువుతున్నానని వప్పుకున్నాడు" దిగులుగా అన్నాడు గోపాల్రావ్.
    "ఏం పోయేకాలమొచ్చింది ఈ కాలం పిల్లలకు? ఈనాటి సమాజంలో ఎలా బ్రతకాలో ఎలాంటి అవినీతి అప్నులు చేయాలో నేర్పే ఈ కాలం రచయితల అద్భుత ఉత్తమ సాహిత్యం చదవకుండా అలా నీతి, నియమం, మంచీ నేర్పూ ఆపాతకాలం నాటి బూతు సాహిత్యం చదివితే ఏమయిపోతారు? అడుక్కు తినాల్సిందేగా?" అంది సావిత్రమ్మ.
    ఈ చెత్తపుస్తకాలు చదివే కాబోలు, మావాడు మొన్న కాలేజ్ రోడ్డుమీదో అమ్మాయి ఎదురొస్తే, ఆ అమ్మాయి చెయ్యిపట్టుకోలేదు సరికదా! కనీసం కన్నూ గీటలేదట. మిగతా పిల్లలంతా రాగానే చెప్పారు. ఆ పిల్ల కూడా పాపం ఇంటికెళ్ళి ఒకటే ఏడుపట- వీడు తననలా అవమానపరచాడని! వాళ్ళ నాన్న మండిపడి వీడిమీద పోలీస్ కంప్లెయింట్ ఇస్తానని కూర్చుంటే మిగతా వాళ్ళందరూ సర్దిజెప్పి ఆపారట! ఇంకోసారి కూడా అలాగే నీతిగా ప్రవర్తిస్తే అప్పుడు వీడిపని పడదాం అన్నారట" అంది పార్వతీదేవి. రంగారెడ్డి కోపంగా లేచి నిలబడ్డాడు.
    "వీళ్ళనిలా వదిలితే లాభంలేదు! మిగతా కాలనీ పిల్లలంతా కూడా రేపు అడివిబాపిరాజు పుస్తకాలు, గోపీచంద్, రాచకొండ విశ్వనాథశాస్త్రి సాహిత్యం, యోగి వేమన శతకాలూ, గురజాడ అప్పారావ్ సాహిత్యం, మునిమాణిక్యం, చిలకమర్తివారి సాహిత్యం, కాశీపట్నం, మధురాంతకం రాజారాం కథలు, కొడవటిగంటి కుటుంబరావు నవలలు చదవడం మొదలుపెడితే వాళ్ళ భవిష్యత్తేమయిపోతుంది? ఆ సాహిత్యం ప్రభావం పడి నీతిగా, బుద్ధిగా బ్రతుకుతామని మొండికేస్తే మనమేం చేయగలం?" ఆవేశంగా అన్నాడతను.
    అందరికీ రక్తం ఉడికిపోతున్నట్లయింది. మరోపక్క పిల్లల పరిస్థితి తల్చుకుని భయం.
    "అవును! మనం వీళ్ళనిలా వదిలేస్తే మనకే నష్టం! ఇంకోసారిలాంటి దిక్కుమాలిన లిటరేచర్ చదవకుండా కట్టడిచేయాలి!" అరిచాడు జనార్ధన్.
    మిగతా పదిమంది కుర్రాళ్ళు కూడా ఒక్కరొక్కరే వేదిక మీదకెక్కి ఇంకెప్పుడూ అలాంటి బుద్ధి తక్కువ పని చేయమని చెంపలేసుకున్నారు.
    వాళ్ళల్లో ఒకడు ఓ ప్రముఖ సెక్స్ వార పత్రిక అడ్డుపెట్టుకుని లోపల చందమామ పుస్తకం చదువుతున్నాడట. మరొకడు స్త్రీ అంగాంగాలూ వర్ణిస్తున్న సీరియల్స్ ప్రచురించే మరో తెలుగు వారపత్రిక అడ్డుగా పెట్టుకుని లోపల టామ్ సాయర్, డాన్ క్విక్వాట్, అల్లాడీన్ మాజిక్ లాంప్, ట్రెజర్ అయ్ లెండ్ లాంటి ఇంగ్లీషు పుస్తకాలు చదువుతున్నాడట.
    ఇంకో కుర్రాడు బూతు మాసపత్రిక ఒకటి అడ్డుపెట్టుకుని లోపల పుష్పవిలాసం పద్యాలు చదువుతున్నాడట!
    ఈ గొడవంతా చూసేసరికి ప్రేక్షకుల్లోనుంచి సరస్వతమ్మగారు ఏడుస్తూ వేదికమీద కొచ్చింది.
    "ఈ పిల్లల పరిస్థితి చూస్తేనే గుండె పగిలి పోతోందంటే- మొన్న మా ఆయనేం చేశాడో తెలుసా అన్నయ్యగారూ?" అంటూ మళ్ళీ బావురుమంది.
    "అరె ఏడుస్తావెందుకమ్మా! ఏం జరిగిందో చెప్పు!" ఓదార్చాడు శాయిరామ్.
    "మొన్న-మొన్న నేను మార్కెట్ కెళ్ళి హఠాత్తుగా వచ్చి తలుపులు తెరిచేసరికి-" అంటూ మళ్ళీ వెక్కివెక్కి ఏడవసాగింది.
    "అరె! ఏడవకమ్మా! త్వరగా చెప్పు! ఏం చేశాడో?"
    "నేను తలుపు తెరిచేసరికి- తెరిచేసరికి ఆయన తేనెటీగ, డెత్ సెల్ పుస్తకాలు అడ్డుగా పెట్టుకుని" మళ్ళీ బావురుమందామె.
    "చెప్పమ్మా! అవి అడ్డుగా పెట్టుకుని లోపల ఏం పుస్తకం చదువుతున్నాడు?" అడిగింది పార్వతీదేవి.
    "వాడెవడో జులాయి రచయిత విష్ణుశర్మరాసిన 'పంచతంత్రం' పుస్తకం చదువుతున్నారు" అందరి దృష్టి ఓ మూలగా పాలిపోయిన ముఖంతో కూర్చున్న సరస్వతమ్మ భర్తమీద పడింది. "ఏమయ్యా! పిల్లలకు చెప్పాల్సిందిపోయి ఎద్దులాగుండి నువ్వే అలాంటి క్షుద్ర సాహిత్యం చదువుతున్నావా? నీకేమయినా బుద్ధుందా?" రంగారెడ్డి విరుచుకుపడ్డాడతని మీద.
    అతను ధీనంగా లేచి నిలబడ్డాడు.
    "పొరబాటయిపోయింది. ఇంకెప్పుడూ అలాంటి చెత్త చదవనని ప్రామిస్ చేస్తున్నాను. ఈసారికి నన్ను క్షమించండి!" అన్నాడు తలవంచుకుని. క్షణాల్లో అంతా గందరగోళంగా తయారయింది.
    అతనిని క్షమించడానికి వీల్లేదని కొంతమంది అరవసాగారు. అతను పశ్చాత్తాపం ప్రకటించే వరకూ తులసిదళం నవల పదే పదే చదివిస్తేగానీ తిరిగి దారిన పడడని మరికొంతమంది సలహా ఇచ్చారు. చివరకు శాయిరామ్ జోక్యం చేసుకోక తప్పలేదు. వెంటనే మైక్ దగ్గరకొచ్చాడు.
    "సోదరసోదరీమణులారా! మన సమాజం ఎంతో ప్రగతి సాధించిందని మనం అనుకోవడమేగాని నిజానికి ఎన్ని తప్పుదారులు తొక్కుతోందీ, ఎంత వెనక్కు లాగుతోంది- ఇవాళ ఈ సంఘటనలు ఋజువుచేస్తున్నాయ్. కనుక మనం వ్యక్తుల్ని శిక్షించడం కంటే మరోసారి ఇలాంటి దారుణాలు జరగకుండా చర్యతీసుకోవడం మంచిదని నా అభిప్రాయం. ఈ విషయంలో మీ మా సలహాలు తెలియజేస్తే వాటిల్లో ఆచరణ యోగ్యంగా వున్న వాటిని స్వీకరించి అమలు పరచేందుకు మన ప్రయత్నాలు మనం చేయవచ్చు" అన్నాడతను. అందరూ రకరకాల సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు.
    "ఇకనుంచి అలాంటి పాతకాలం సాహిత్యం చదువుతూ పట్టుబడ్డవాళ్ళని సామాజిక బహిష్కరణ చేయాలి" అన్నాడు బాబు.
    "వాళ్ళమీద మనం కేసులు పెట్టి జైలుకి పంపాలి!" అన్నాడు చంద్రకాంత్.
    "నన్నడిగితే ఈ గొడవంతా పడే బదులు ఆ సాహిత్యాన్ని మన ప్రభుత్వంతో నిషేధింపజేయాలి" అన్నాడు రంగారెడ్డి. మరుక్షణంలో తప్పట్లు మార్మోగిపోయినయ్.
    "రంగారెడ్డి సలహా బాగుంది! వెంటనే మనమంతా గవర్నర్ ఇంటికి ఊరేగింపుగా వెళ్ళి ఆ చెత్త సాహిత్యాన్ని నిషేధించమని అర్జీ సమర్పించుకోవాలి!" అంటూ అరిచారు అందరూ. అప్పటికప్పుడే అర్జీ తయారుచేయడంలో నిమగ్నమయిపోయాం అందరం.

                               *    *    *    *


Related Novels


Cine Bethalam

Kanthi Kiranalu

Nirbhay Nagar Colony

Rambharosa Apartments

More