Home » Dr Muktevi Bharathi » Mukthdevi Bharathi Khadhalu
నింగినుండి నేలకి
విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో యూనివర్సిటీ ఫస్టు వచ్చి, గోల్డుమెడల్ అందుకున్న చిట్టిబాబులో ఆ క్షణంనుంచే చిత్రమైన మార్పు వచ్చేసింది. ఇంట్లో అందరూ ఆ గోల్డుమెడల్ చూసి మురిసిపోతుంటే, ఓ మాటు ఛాతీ విరుచుకుని, జుట్టు సరిచేసుకుని, నల్లని మీసాలు అద్దంలో మరొక్కసారి చూసుకుని, ఇవాళ్టినుంచి 'చిట్టిబాబు ది గ్రేట్' - అంతే - తనలో తనే నవ్వుకున్నాడు, ది గోల్డు మెడలిస్ట్ చిట్టిబాబు!!
ఇద్దరన్నయ్యలు, ముగ్గురు చెల్లెళ్ళు, రవిబావ, అత్త, బామ్మ, అమ్మ, నాన్న - అంతా వుండే ఆ చిన్న పెంకుటింట్లో పుట్టి పెరిగాడు చిట్టిబాబు. వీథి గుమ్మంలో చదువుకుంటుంటే, ఇంకెవరో వచ్చేవారు. 'చిట్టీ, లోపలకెళ్ళి చదువుకో' - నాన్న గొంతు వినిపించడం ఆలస్యం - చిట్టిబాబు పుస్తకాల సంచి గబగబా చంకనెత్తుకుని వంటింటి గుమ్మంలోకి పరిగెత్తేవాడు. "ఒరేయ్ చిట్టీ, ఆ చారణా కరివేపాకు తీసుకురా" - వంటింట్లోంచి అమ్మ కేక పెట్టేది. లాగు దులుపుకుని సందు చివర కూరలమ్మి దగ్గర కరివేపాకు తెచ్చి వంటింటి గుమ్మంలో విసిరేవాడు. "నా రబ్బరు ఏదిరా అన్నయ్యా" బుజ్జి ఏడుపు ముఖంలో చిట్టి పక్కన కూచునేది. ఎక్కడో వెతికి ఓ చిన్న రబ్బరు తెచ్చి చెల్లికి ఇచ్చేవాడు - ఇంకేముంది! గడియారం గంటలు కొట్టడం, చిట్టిబాబు స్కూలుకి పరిగెత్తడం! 'ఒక్క పది నిముషాలు ఆగరా అన్నం పెడతాను' - వంటింట్లోంచి తల్లి కేక వినపడే లోపలే చిట్టిబాబు వీథిలో కొచ్చేసేవాడు - ఇంచుమించుగా చిట్టిబాబు స్కూలుకి రోజూ ఇలాగే వెళ్ళేవాడు - అలాగే కాలేజీ చదువూ పూర్తయింది.
డిగ్రీ అయింది కదా, ఇక మనం పై చదువులు చెప్పించలేము అని తండ్రి నిశ్చయించినా, చిట్టిబాబు అన్నలు మాత్రం చాలా పట్టుపట్టారు - చిట్టిబాబుకి ఎలాగైనా పెద్ద చదువు చదివించాలని. చదువు ఖర్చంతా మేమే భరిస్తాం అన్నారు.
చిట్టిబాబు యూనివర్సిటీ చేరిపోయాడు. హాస్టల్ లో చేరాడు. నెలనెలా ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా అన్నలిద్దరూ డబ్బు పంపుతున్నారు. చిట్టిబాబు ఎంతో శ్రద్ధగా చదువుకుంటున్నాడు.
సెలవలకి చిట్టిబాబు ఇంటికొచ్చాడు. తల్లి అన్నం వడ్డిస్తూ పక్కనే కూచుంది. "ఒరేయ్ చిట్టీ, అన్నయ్యలిద్దరూ మంచి మనసుతో నిన్ను పెద్ద చదువు చదివిస్తున్నారు - వాళ్ళ చిన్న జీతాలలో నీ కోసం కూడబెట్టి నెలనెలా పంపిస్తున్నారు. నీ చదువు పూర్తయ్యాక, అన్నయ్యలని ఎలా ప్రేమగా, గౌరవంగా చూసుకుంటావో ఏమో.... డబ్బు సంపాదించగలం కానీ ప్రేమలు, ఆప్యాయతలు సంపాదించలేం తెలుసా?" అంది మజ్జిగ పోస్తూ.
"అమ్మా! నేను నిజంగా గొప్ప పదవి సంపాదించుకుని, నిజంగా చాలా గొప్పవాణ్ణయిపోతే, నా వాళ్ళంతా గొప్పవాళ్ళుకారా - ఏమిటమ్మా నీ భయం? అన్నయ్యలు నాకు చేస్తున్న మేలుమరిచిపోతాననా?" నవ్వాడు, అమ్మ పమిటకొంగుతో చేయి తుడుచుకుంటూ.
* * *
కాలం ఆగకుండా పరిగెడుతోంది. అదృష్టంతో పాటు ఎక్కడో దాగివున్న అహం ఒక్కసారి తన్నుకు బయటికొచ్చేసింది చిట్టిబాబుకి.
ఆ రోజు ఐ.ఎ.ఎస్. ట్రయినింగ్ కి బయలుదేరుతున్న చిట్టిబాబుకి దిష్టి తీసింది తల్లి. "ఏమిటిదంతా, నాన్సెన్స్" విసుక్కున్నాడు. తల్లి చెప్తున్న మాటలు వినటానికి చిరాగ్గా వున్నాయి. వినకుండానే సరే, సరే అంటున్నాడు చిట్టిబాబు.
చిట్టిబాబు పూర్తిగా మారిపోయాడు. అదివరకిటిలా నవ్వుతూ అందరితో మాట్లాడడు. న్యాయాన్యాయాల గురించి, ధర్మధర్మాల గురించి చర్చించడు ఇప్పుడు. తనతో గోళీలు ఆడుకున్న చిన్ననాటి స్నేహితుల గురించి, తనతోపాటు గాలిపటాలు ఎగరేసిన రవిబావ గురించి, పక్కింటి స్కూలు టీచరు ఇందిరక్క గురించి, పోలియో వచ్చి అవిటికాలున్న చిన్నన్నయ్య గురించి ఎప్పుడూ తల్చుకోడు. ఒకవేళ వాళ్ళెవరయినా గుర్తొస్తే వెంటనే మనసు మరల్చుకుని టి.వి. చూస్తూ కూచుంటాడు చిట్టిబాబు.
అదృష్టం వెంటబడితే ఆగకుండా తరుముకొస్తుందంటారు కదా! ఓ శుభ ముహూర్తాన చిట్టిబాబు ఐశ్వర్యవంతునికి అల్లుడయి పోయాడు. లీలారాణిని చేపట్టిన మరుక్షణం మంచి చిట్టిబాబు లోకం ఇంకా పూర్తిగా కొత్తదారి తొక్కింది - డబ్బుంటే చాలు లోకంలో ఎన్నైనా చేజిక్కించుకోవచ్చు. డబ్బుంటే చాలు మరేమీ లేకపోయినా ఫరవాలేదు - డబ్బే లోకం, డబ్బే జీవం, డబ్బే తను! చిట్టిబాబు నింగి వైపే చూస్తున్నాడు. కాళ్ళకిందున్న నేలను మరిచిపోయాడు.
* * *
చెల్లాయిలు పంపే పుట్టినరోజు గ్రీటింగ్ కార్డులు, అన్నయ్యలు రాసే ఉత్తరాలు చూడటానికే విసుగు చిట్టిబాబుకి. "ఇదిగో రాణీ - వాటికి ఏదో సమాధానం రాసేయి - కింద సంతకం చేస్తాను-" చిట్టిబాబు రాణీ ఎర్రని పెదాలవంక చూస్తూ అన్నాడు.
"మీ పెద్దన్నయ్య పంపిన మీ బర్త్ డే గ్రీటింగ్ కార్డు - చూడండి ఒక్కసారి" - రాణి గ్రీటింగ్ కార్డు చిట్టిబాబు చేతి కందించింది .... గోళ్ళకున్న ఎర్రని పాలిష్ నిగనిగా మెరుస్తోంది. రాణి పెదాలు ఎర్రగా, రాణి బుగ్గలకు వేసుకున్న రంగు ఎర్రగా, రాణి కట్టుకున్న చీర ఎర్రగా, చెవుల దిద్దులు ఎర్రగా .... చేతి కెంపుల గాజులు ఎర్రగా - చిట్టిబాబు గ్రీటింగ్ కార్డు చూడడం లేదు...
"రాణీ, నిన్ను ఇంత అందంగా ఎందుకు సృష్టించాడో"__
"మీ కోసమే" - చిట్టిబాబు కౌగిలిలో ఉక్కిరిబిక్కిరయింది లీలారాణి.
"ఈ రాత్రికి నేను ఊఋ వెడుతున్నా!"
"నేనూ వస్తా."
"నేను ఆ రూట్ మీదుగా వెళ్ళి ఓ రెండు గంటలు మా ఇంట్లో.... అదే మా ఊళ్ళో ఆగుతాను .... ఎన్నేళ్ళయిందో ఆ ఊరెళ్ళి" - చిట్టిబాబు రాణి వంకే చూస్తున్నాడు.
"మరింకేం, నేనూ వస్తాను....అందరినీ చూస్తా."
"నువ్వా, ఒక్క పది నిముషాలు అక్కడ ఉండలేవు - నేను ఆ ఇంట్లో ఓ గంట ఉండలేను - ఓ, ఆ చిన్న ఇల్లు, ఆ బావి, ఆ ఇంటి ముందర కాలువ - అమ్మో - ఇంపాసిబుల్ - నువ్వేం వస్తావు" నవ్వాడు చిట్టిబాబు.
* * *
కారు గుమ్మంలో ఆగగానే పిల్లలంతా మూగారు చుట్టూ. 'అన్నయ్యొచ్చాడు', 'బాబాయ్యొచ్చాడు' - ఇంట్లో అంతా గబగబా బయటికొచ్చారు.
ఫుల్ సూట్ లో, అందంగా, దర్జాగా, ఠీవిగా వెలిగిపోతున్న చిట్టిబాబు లోపలకొచ్చాడు....ఇల్లంతా కలయచూశాడు - ఏమిటో ఎంతో కొత్తగా అనిపిస్తోంది....ఎవరితో ఏం మాట్లాడాలో తెలియటంలేదు....అబ్బ వీళ్ళంతా ఈ చిన్న ఇరుకు కొంపలో ఎలా జీవిస్తున్నారో! అన్నయ్యా, ఒదిన అలాగే వున్నారు. ఏ మార్పులేదు. చిట్టిబాబు అటు చూస్తున్నాడు - ఈ ఇంట్లోనేనా తను ఇరవై నాలుగేళ్ళు గడిపింది? ఈ ఇంట్లోనేనా తను బి.ఎ. వరకు చదువుకుని ఫస్టుక్లాసు తెచ్చుకున్నది? గోడలకేసి చూశాడు చిట్టిబాబు - తాతగారు, బామ్మవున్న పెద్ద ఫోటో - మరోవైపు సీతారామ లక్ష్మణ హనుమంతుల ఫోటో - ఇంకోవైపు సత్యనారాయణస్వామి పటం - ఓ పక్కన అన్నయ్య పెళ్ళిఫోటో - చిట్టిబాబుకి నవ్వొచ్చింది.
"అమ్మాయిని కూడా తీసుకురా లేకపోయావా?" తండ్రి గొంతు గంభీరంగా వినిపించింది చిట్టిబాబుకి.
"ఊ....టైము లేదుకదా, నేను కూడా ఓ పది నిముషాల్లో వెళ్ళిపోతాను." చిట్టిబాబు ఎటో చూస్తున్నాడు.
"భోజనం చేసి వెళ్ళు - అయినా ఒక్క నాలుగు రోజులు ఉండేట్టు వస్తే-" తల్లి వంటింటి గుమ్మంలో నుంచుంది. చిన్నన్నయ్య ఫక్కున నవ్వాడు.
"అమ్మా - వాడు ఒక్క పది నిముషాలు వుండటం కోసం వచ్చాడు - నువ్వు నాలుగు రోజులుండటం గురించి అంటుంటే - అదే నాలుగు రోజులు అంటే ఎన్ని పది నిముషాలో లెక్కేస్తున్నా-" మళ్ళీ నవ్వాడు చిన్నన్నయ్య.
"నే వెడతానమ్మా....గెస్ట్ హౌస్ లో నా స్నేహితుడు నా కోసం వెయిట్ చేస్తుంటాడు."
"పెద్దాడి కూతురి పెళ్ళి పై నెలలో. నువ్వు, మీ ఆవిడ రావాలి మరి....ఇదిగో, అందరినీ నువ్వు చూసినట్టూ వుంటుంది...."
"ఆ చూద్దాంలే - వీలుండాలిగా....అయినా డబ్బు ముఖ్యం ఆ సమయంలో - మీరు ఊరికే బంధువులని, ఇరుగు పొరుగులనీ డబ్బు అనవసరంగా తగలేయకండి....అన్నయ్యకి నేను ఉత్తరం రాస్తా తర్వాత - మరి నేను వెడతాను...." చిట్టిబాబు లేచాడు. చేతిలో వున్న కాఫీ గ్లాసు కింద పెట్టాడు.
"ఒరేయ్ - ఇది నీకు ఇష్టం - తీసికెళ్ళు, పెళ్ళికొస్తావుగా మళ్ళీ పెట్టి ఇస్తాను" - వంటింట్లోంచి గబగబా తెచ్చిన నిమ్మకాయ సీసా అందించింది.
"ఈ మాటొస్తాగా - అప్పుడు తీసుకుంటాను...... బాగ్ లో ఇది పెడితే - ఆ - నో, వద్దులే." చిట్టిబాబు ఆ చిన్న సీసా బల్లమీద పెట్టేసి కారులో కూర్చున్నాడు.
కారు కదిలిపోతుంటే నీళ్ళు నిండిన కళ్ళు ఒత్తుకుంది తల్లి రహస్యంగా.
"మనవాడు చాలా ఎదిగిపోయాడే" గుమ్మంలో కూచున్న చిన్నన్నయ్య అంటుంటే,
"ఆ....చాలా, చాలా" - గదిలో అటు ఇటు తిరుగుతూ తండ్రి గొంతు కలిపాడు.
బాబాయి వేసుకున్న సూట్ బాగుందని, పెట్టుకున్న కళ్ళజోడు ఎంతో ఖరీదైందని, బూట్లు ఎంతో నిగనిగలాడుతూ చక్కగా వున్నాయని, బాబాయి చేతికున్న వాచీ ఫారిన్ దేనని - ఇలా ముచ్చట్లు చెప్పుకుంటూ మురిసిపోయారు ఆ ఇంట్లో వున్న పిల్లలు.
* * *
చిట్టిబాబు బంగ్లా దీపాలతో ధగధగలాడిపోతోంది. ఖరీదయిన కార్లు బారులు తీరివున్నాయి. ఆఫీసర్లు, వారి భార్యలు, వారి పిల్లలు, ఆ పిల్లలను ఎత్తుకుని ఆడించే పనిపిల్లలు - ఆ బంగ్లా ఎంతో సందడిగా వుంది. అందమైన బట్టలతో, ఆభరణాలతో అక్కడున్న ఆడవాళ్ళంతా వెలిగిపోతున్నారు. ఏమిటా హడావిడీ? చిట్టిబాబు వంశోద్దారకుడు దిలీప్ పుట్టిన రోజు పండుగ!
"ఎన్నిసార్ల నుంచో అనుకుంటున్నాను - ఆ గోల్డు మెడల్ చూడాలని" - మిసెస్ మీనన్ పైట పిన్ను సరిచేసుకుంటూ అంది. గబగబా లోపల కెళ్ళింది లీలారాణి.
"ఆల్ హిజ్ ప్రైడ్ ఈజ్ దిస్" - లీలారాణి ఓ అందమైన చిన్న ప్లాస్టిక్ పెట్టె తెచ్చింది ఉత్సాహంగా - ధగధగా మెరుస్తోంది బంగారు పతకం!
ఆ బంగారు పతకంపైనే అందరి కళ్ళు.
"మా వారికి భయం - నేను ఆ గోల్డు మెడల్ చెరిపించి గాజు చేయించుకుంటానేమోనని" - రామలక్ష్మి గలగలా నవ్వింది. పెట్టెలోంచి బయటికి తీసి అందరూ చూశారు ఆ బంగారు పతకాన్ని.
"నిజంగా గోల్డుమెడలా అమ్మమ్మా....మా నాన్న కొచ్చింది వెండి మీద గోల్డుపూత అని చెప్పావు." అనిత ఆ గోల్డు మెడల్ అటు ఇటు తిరగేస్తూ చూస్తోంది.
లీలారాణి, చిట్టిబాబు వచ్చిన అతిథులతో కబుర్లుచెబుతూ వున్నారు. గోల్డుమెడల్ పెట్టెలో పెట్టి, ఆ పెట్టె బ్యాగ్ లో పడేసుకుంది లీలారాణి.
నిద్రపోతున్న పసివాణ్ణి గదిలో పడుకోబెట్టి, హాండ్ బాగ్ పక్కన పెట్టి, తలుపు దగ్గరగా వేసి వచ్చింది లీలారాణి. పసివాడు గాఢనిద్రలో మునిగిపోయాడు.
"బాబుని చూసుకో" లీలారాణి అక్కడున్న నౌకరుతో చెప్పి ముందు హాలులోకి వచ్చేసింది.
పార్టీ అద్భుతంగా సాగింది. పిల్లలు రికార్డు డాన్సులు చేశారు. కొందరు జోక్స్ చెప్పారు. అందరు హాయిగా భోజనాలు చేశారు.
అలసిపోయిన చిట్టిబాబు ఆవులిస్తున్నాడు. ఎక్కడివాళ్ళు అక్కడ వెళ్లేసరికి రాత్రి పన్నెండు కావచ్చింది. అలిసిపోయిన ఆలుమగలు మంచంపై వాలిపోయారు. పసివాడు గాఢనిద్రలో వున్నాడు.
ఒక్కసారి చిట్టిబాబుకి మెలకువ వచ్చింది. అటుఇటు ఒత్తిగిల్లాడు. ఒక్క పొరపాటు చేశాడు తను- ఎన్నో వేలు ఖర్చు చేశాడు. ఎందరో వచ్చి భోంచేశారు. కానీ....కానీ....ఒక్క నిముషం గొంతు తడారినట్టు అనిపించింది చిట్టిబాబుకి- మంచినీళ్ళు తాగాడు.
తనకి చదువు చెప్పించి, అనుక్షణం తన క్షేమంకోరేవాళ్ళనే తను మరచిపోయాడు కదూ!
"రాణీ, రాణీ...." కదిలించాడు.
"అబ్బ! ఏమిటండీ?" అటు ఒత్తిగిలి పడుకుంది లీలారాణి.
"అమ్మనైనా రమ్మని రాయాల్సింది కదూ!" మాటలు తడబడ్డాయి.
"ఏమోనండీ....అబ్బ, ఇవి చాలా బరువుగా వున్నాయి-తీసేస్తాను." నిద్ర కళ్ళతోనే చెవులకున్న పెద్ద పెద్ద వజ్రాల దుద్దులు తీసి దిండుకింద పెట్టి మళ్ళా నిద్రపోయింది లీలారాణి. చిట్టిబాబుకి నిద్ర పట్టలేదు. యాష్ ట్రే సిగరెట్టు నుసితో నిండిపోయింది.
"ఆ_ ఎవరి అదృష్టం వాళ్ళది." చిట్టిబాబు స్వగతం చెప్పుకుని క్షణంలో తృప్తిగా నిద్రపోయాడు మళ్ళీ!
* * *
తొమ్మిది దాటాక నిద్ర లేచారు లీలారాణి, చిట్టిబాబు. ఆ పని ఈ పని అయిపోయింది. పిల్లాడికి స్నానం చేయించి, పాలు పట్టి తెచ్చింది ఇంట్లో పనిమనిషి.
"ఈరోజు హోటల్ లో భోంచేద్దాం." లీలారాణి చీర కుచ్చెళ్లు సర్దుకుంటోంది.
ఊ-రాణీగారి మాటకి ఎదురేముంది?"
అద్దంలో చూసుకుంటున్న లీలారాణి వంకే చూస్తున్నాడు చిట్టిబాబు.
లిప్ స్టిక్ పెదాలు, సన్నని కనుబొమలు, పల్చని చెక్కిళ్ళు, భుజాల వరకు కత్తిరించిన జుట్టు-అలానే చూస్తున్నాడు చిట్టిబాబు-తల్లిలా కనిపించకూడదనే తాపత్రయం!
ఎందుకో నవ్వొచ్చింది చిట్టిబాబుకి.
"కొత్తగా చూస్తున్నా రేమిటి?" బాగ్ భుజాన తగిలించుకుంటూ అంది లీలారాణి.
* * *
హోటల్లోన కూర్చున్నాక, పక్కనున్న మెనూ కార్డు చూస్తూ, "ఈరోజు మీకు నేను లంచ్ ఇస్తున్నాను-ఏం కావాలో మీరే ఎన్నుకోండి." కార్డు భర్తకి అందించింది. చిట్టిబాబు కార్డు చూస్తున్నాడు. పెదాల లిప్ స్టిక్ టచ్ చేసుకోడానికి బాగ్ తెరిచింది లీలారాణి - చిన్న అద్దం కోసం. ఠక్కున గుర్తొచ్చింది - రాత్రి ఆ బాగ్ లోనే గోల్ మెడల్ వున్న చిన్న పెట్టె పడేసిన విషయం. లీలారాణి గబగబా బాగ్ అంతా కలియచూసింది. చిన్న పెట్టె ఎక్కడా కన్పించలేదు. ఖంగారుగా బాగ్ లోంచి ఒక్కొక్కటి బైటికి తీసింది. పూల పూల రుమాలు, పక్క పిన్నులు, నైల్ కట్టర్, ఏరోగ్రాములు, తలనొప్పి మాత్రలు, వందల నోట్లు - ఇలాంటివి మరెన్నో ఎన్నో బాగ్ బోర్లించింది. అన్ని వైపులవున్న జిప్ లు తెరిచి మరీ మరీ చూసింది. ఏదీ....ఏదీ తన భర్త జీవితమార్గాన్నే మార్చేసిన గోల్డుమెడల్! తన భర్త అహానికి ఆయువుపట్టయిన గోల్డ్ మెడల్ ఏదీ!
లీలారాణి ముఖమంతా చెమట - కళ్ళలో నీళ్ళు-శ్రద్ధగా గాడ్రెజిలో పెట్టి తాళ్ళం వేసి వుంటే!
చిట్టిబాబు, ది గోల్డుమెడలిస్ట్ కి అర్థమైపోయింది. దేన్ని చూసి ఇంత కాలం గర్వపడిపోయాడో, తను చాలా తెలివైనవాడని తక్కిన వాళ్ళని ఎంత తేలిగ్గా తీసిపారేశాడో, దేన్ని అమితంగా ప్రేమించి అందర్నీ దూరం చేసుకున్నాడో, దేన్ని చూసుకుని అహం నింపుకుని నింగి వరకు ఎదిగిపోయానని అహంకరించాడో- అదే, ఆ గోల్డ్ మెడల్ ఏదీ ఏదీ!
ఇల్లంతా వెతికారు. మూల మూలలా గాలించారు. చిట్టిబాబు గుండె పట్టులెక్కడో కదిలాయి. కన్నీళ్ళంటే అసహ్యించుకునే చిట్టిబాబు దిండులో తలదాచుకుని నిశ్శబ్దంగా రోదించాడు.
ఆ ఇంట్లో ఏదో అశాంతి నిండిపోయింది. భార్యాభర్తల మనసు లెందుకో చిన్నపోయాయి. ఆనాడు స్నాతకోత్సవంలో మోగిన కరతాళ ధ్వనులు చెవుల్లో మారుమ్రోగాయి చిట్టిబాబుకి. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిచిపోయాయి- చిట్టిబాబుకి తన బాల్యం, తను పెరిగిన వాతావరణం, తన ఇల్లు, తన అన్నయ్యలు, చెల్లెళ్ళు, తన రవిబావ - కళ్ళముందు కదలాడుతుంటే, చిట్టిబాబు మనసు ప్రశ్నించింది- ఇంతవరకు తను పోగొట్టుకున్నవి ఎన్ని, వాటి విలువ ఎంత?
తనను ప్రేమించి, చదివించిన అన్నలను తను ఇంతకాలం మరిచిపోయాడా, తన చిన్ననాటి స్నేహితులని గుర్తుంచుకున్నాడా, తన బంధువులని తను ఆప్యాయంగా పలకరించాడా నిజానికి ఎన్నిటికో దూరమయిపోయి, హోదా ముసుగులో, ఐశ్వర్యపు అహంతో జీవించిన తను వాళ్ళందరికన్నా ఏ విధంగా గొప్పవాడు?- చిట్టిబాబు మనసు ఆవేదనలో మునిగిపోయింది. మనిషి ఆనందాన్ని పంచుకుందుకు ఎందరుండాలో, మనిషి ఆవేదనని పంచుకుందుకు అందరుండాలి అని అమ్మ ఎప్పుడూ అనేమాట గుర్తొచ్చింది చిట్టిబాబుకి. తన వాళ్ళంతా తనను ఎందుకు వదిలేశారు?- చిట్టిబాబు ఈ లోకంలో ఒంటరివాడయిపోయినట్టుగా బాధపడిపోయాడు. నింగినుండి నేలకు పడిపోయాడు. ఎవరి ఆప్యాయతలు లేకుండా మనిషి జీవించగలడా? ఏ విలువలూ లేకుండా జీవితం గడిపేయగలడా? చిట్టిబాబుకి సమాధానం దొరకలేదు.
తన గోల్డుమెడల్ పోయింది. ప్రాణానికి ప్రాణంగా దాచుకున్నది పోయింది. ఈ విషయం తెలిస్తే ఎవరు తనపై జాలిపడతారు? ఎవరు తనని ఓదారుస్తారు?
నెల రోజులు గడిచాయి. ఆ రోజు చిట్టిబాబు ఆఫీసు నుంచి ముందరే వచ్చేశాడు.
"నా గోల్డుమెడల్ పోయింది. ఏ గర్వంతో మీ అందరి ఆప్యాయతల్ని కాలదన్నానో, ఇప్పుడు తల్చుకు సిగ్గుపడుతున్నాను. నన్ను క్షమించరా"- ఒకనాడు తనని ప్రేమించిన వాళ్ళకి, దీవించిన వాళ్ళకి, కన్న వాళ్ళకి, ఆడుకున్న వాళ్ళకి ఎందరెందరికో ఉత్తరాలు రాశాడు చిట్టిబాబు.
రోజూ పోస్టుమాన్ కోసం ఎదురు చూస్తూనే వున్నాడు ఆ రోజునుంచీ-
ఎవరికి పట్టిందీ ఆ వుత్తరానికి వెంటనే సమాధానం రాయటానికీ?
చాలా రోజులకి ఒకే ఒక్క ఉత్తరం చిట్టిబాబుకి అందింది. ఆనందంతో ఉక్కిరి బిక్కిరై కళ్ళకద్దుకున్నాడు. అది అమ్మ ఉత్తరం! ఆ ఉత్తరం కింద నాన్న రెండు వాక్యాలు- "మానవ విలువలు పోగొట్టుకోటం తేలిక, నిలబెట్టుకోవటం కష్టం."
నిజమే! పోగొట్టుకున్న ఆప్యాయతల్ని తిరిగి ఎలా పొందగలడు, ఏ విద్యతో సాధించగలడు, ఏ ధనంతో కొనగలడు, ఏ ప్రలోభంలో పెట్టి చేజిక్కించుకోగలడు- నిజమే! తనకెవరూ లేరా- చిట్టిబాబు ఎటో చూస్తున్నాడు. ఒళ్ళోవున్న అమ్మ ఉత్తరంపై ఆగని కన్నీళ్ళు బొట్టు బొట్టుగా జారిపడ్డాయి.*



