Home » Dr Muktevi Bharathi » Mukthdevi Bharathi Khadhalu
అంతస్తుకి అటు ఇటు
విమానం కదలగానే రాజారాం కారు స్టార్టు చేశాడు. క్లబ్బు కెళ్ళాలనుకున్నాడు, కాని ఎందుకో వెళ్ళాలనిపించలేదు. ఒక క్షణం అలోచించి ఇంటిదారి పట్టాడు.
"వెళ్ళిందా అమ్మాయి?" పక్కకు ఒత్తిగిల్లుతూ అడిగింది రాధారాణి.
"ఆ" సిగరెట్టు పొగ గాలిలోకి వదలుతూ భార్యపక్కన కుర్చీలో కూలబడ్డాడు రాజారాం.
* * *
"ఆయనకి ఇష్టం ఉండదు నాన్నా.... నాన్నా! కొన్ని నెలలు పోయాక చిన్నబాబుని తీసుకువస్తాను కాదూ.... ఏం నాన్నా!" చిట్టితల్లి నెమ్మదిగా చెవిలో చెప్పిన మాటలు మళ్ళా మళ్ళా ధ్వనిస్తూ మనసును ముక్కలు ముక్కలు చేస్తున్నాయి. సింహం లాంటి రాజారాం, సముద్రంలా గంభీరమైన రాజారాం, డబ్బుతో కొనలేనిది ప్రపంచంలో లేదని దృఢంగా నమ్మే రాజారాం కళ్ళలో తిరిగిన నీళ్ళు మొదటిసారిగా తుడుచుకున్నాడు.
* * *
అందాల బొమ్మలా వుండే ఇందిరని పెళ్ళి చేసుకోవాలని ఎందరో అనుకున్నారు. మరెందరో ఇంటికి తామే వచ్చి అడిగారు. కాని ఇందిర పెళ్ళి గురించి ఆలోచిస్తుందో లేదో కాని రాజారాం ఒక్కసారి కూడా అమ్మాయి పెళ్ళి గురించి మనసులో అనుకోలేదు. తనకున్న ఒక్క కూతురికి పెళ్ళిచేసి పంపేస్తే ఇల్లు చిన్నబోదూ_
'అయితే పిల్లకి పెళ్ళి చేయరా?' అంటుంది రాధారాణి లిప్ స్టిక్ పెదాలు తుడుపుకుంటూ.
"ఒకవేళ పెళ్ళిచేస్తే-ఆ అబ్బాయి ఈ ఊళ్ళోనే వుండాలి. మా చిట్టి తల్లిని ఎప్పుడు పంపమంటే అప్పుడు పంపాలి- ఒక్క పని చేయించ కూడదు. ఒక్కమాట అనకూడదు. విన్నావా? అది ఎవరి కూతురను కున్నావ్? రాజారామ్ స్ డాటర్?" రాజారాం గర్వంగా చిట్టితల్లికేసి చూసాడు "యస్ డాడీ!" ఫెమీనా తిరగేస్తూ, భుజాలమీదపడ్డ జుట్టు ఓసారి సరిచేసుకుంటూ తండ్రికేసి చూసింది ఇందిర.
* * *
అదృష్టం అనుకోకుండా కలసివచ్చేసింది. చాలా గొప్పవారి సంబంధం ఇందిరకి ఖాయమైంది. పిల్లవాని తాత జడ్జి పదవిలో ఎన్నో ఏళ్ళు చేసి రిటైరయ్యాడు. పిల్లవాని తండ్రి మిలటరీలో పెద్ద ఆఫీసరు. పిల్లాడు ఓ పెద్ద కంపెనీలో మేనేజరు. వాళ్ళకున్న ఆస్తి,అంతస్తు సందేహం లేకుండా చాలా పెద్దవి. ఎంతోమంది కావాలని కోరుకునేవి.
"వాళ్ళ అంతస్తుకి మనం తగం నిజంగా. కాకపోతే పిల్ల అదృష్టం ఎన్నో పెద్ద పెద్ద సంబంధాలు వస్తే కాదనుకుని మన పిల్లని చేసుకోటం...." రాధారాణి మాట పూర్తి కాకుండానే__
"అంతస్తంటే?" రాజారాం విసుగ్గా రాధారాణికేసి చూశాడు. "అదే- అంతస్తంటే- అదేనండి- మనకన్నా వాళ్ళు చాలా గొప్పవాళ్ళేనా మరి...."
రాజారాం మనసును సమాధానపరుచుకో ప్రయత్నిస్తున్నాడు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు - అయితే మాత్రం, మా అమ్మాయి ఎంత అందమైందీ! అందుకే వచ్చి అడిగి, నన్ను ఒప్పించి మరీ వెళ్ళారు - రాజారాం నల్లని మీసాలు ఓసారి సరిదిద్దుకుని గర్వంగా నవ్వుకున్నాడు. అంతస్తు మాత్రం ఏం తక్కువని తన్ను తానే ప్రశ్నించుకున్నాడు.
* * *
ఇందిర పెళ్ళి చాలా గొప్పగా జరిగింది. కాని కేవలం ఇందిర లాంటి అందమైన పిల్ల కోడలు కావాలని వాళ్ళు తనతో సంబంధం కలుపుకున్నారు అని రాజారాం మనసుకి దృఢంగా తెలిసిపోయాక ఎక్కడ నుంచో కిందకు పడిపోయినట్లు కృంగిపోయాడు.
అమ్మాయిని చూడ్డానికి రాజారాం రెండు మూడుసార్లు వెళ్ళాడు. తన రాకపోకలు గుర్తించనట్లే వుండేవాడు అల్లుడు. "పోన్లే-నా పిల్లకోసం నేను వస్తున్నానంతే" పేలవంగా నవ్వుకుంటూ మెట్లెక్కేవాడు రాజారాం చాలాసార్లు.
* * *
రాజారాం ఎదురుగా బల్లమీద ఉత్తరం రెపరెప లాడుతోంది. ఈ ఉత్తరం రాయబట్టి వెళ్ళి అమ్మాయిని ఎయిర్ పోర్టులో చూడనైనా చూడగలిగాడు. ఒక్క వారం రోజులయినా తనదగ్గరుంచమని రాస్తే, ఇంచుమించుగా బతిమాలుతున్నట్టుగా రాస్తే- విమానం విమానాశ్రయంలో కొద్దిసేపు ఆగుతుంది కాబట్టి అక్కడికి వచ్చి చూసి వెళ్ళండనే సమాధానం!
మళ్ళా ఓమాటు ఆ ఉత్తరం చదువుకుని పళ్ళు కొరుక్కుని, కాసేపు గదిలో అటూ ఇటూ పచార్లు చేసి ఆ ఉత్తరాన్ని చెత్తకాగితాల బుట్టలో విసిరేశాడు రాజారాం. తన తాహతు వాళ్ళకి తగదు. మొన్నా అల్లుడు పనిమీద ఈ వూరొచ్చి హోటల్లో దిగి వెళ్ళిపోయాడు - ఏమిటీ అహం - డబ్బు, డబ్బు! రాజారాంకి క్షణంమతిపోయినట్లే అనిపించింది.
విమానం ఎక్కి వెళ్ళిపోయే అమ్మాయి వెనక్కి తిరిగి నాన్నని చూసి పేలవంగా నవ్వటం, 'ఆయనకీ ఇష్టంలేదు నాన్నా!' గొంతు తగ్గించి నెమ్మదిగా చెప్పటం ఎంత మరచిపోవాలన్నా మరిచిపోలేకపోయాడు రాజారాం. ఆ నిమిషంలో ప్రపంచం అంతా అంధకారంగా అనిపించింది. మనిషి అంతస్తే కొలబద్ద అయితే ఈ ప్రపంచంలో రకరకాల మనుషులు ఎలా బతికిపోతున్నారు హాయిగా? రాజారాం ఆ చీకటి గదిలో అలాగే కూర్చుండిపోయాడు.
* * *
చిన్న వీధి బడి మాష్టారు కొడుకుగా పెరిగాడు రాజారాం. చిన్న పెంకుటింట్లో అమ్మ, నాన్న, తాత, బామ్మ, ఇద్దరన్నయ్యలు, ఇద్దరు చెల్లెళ్ళు, తను - అంతా వుండేవారు. అమ్మ పెట్టిన చద్ది అన్నం తిని పలక పట్టుకుని లాగు ముడి వేసుకుంటూ వీధిబడికి పరిగెత్తేవాడు. చిన్న లాంతరు ముందు కూచుని చదువుకున్నాడు. బాగా చదువుకుంటున్నాడని తాతయ్య మెచ్చుకునేవాడు. "ఏం చదువో - వాడి కడుపుకి వాడు సంపాదించుకుంటే చాలు" అనేది తల్లి ఏ నూతి దగ్గరో పనిచేసుకుంటూ.
అలా అలా చిన్నపల్లెటూరిలో, చిన్న ఇంట్లో, చిన్న బడిలో, మరీ చిన్న బతుకులో కొంచెం కొంచెం పెరిగాడు.
మామయ్య తనకి కాలేజీ చదువు చెప్పిస్తానని పట్నం తీసుకొచ్చే వరకు పట్నం ఎలా వుంటుందో తెలియదు. చాలా కష్టపడి చదువుకున్నాడు. అదృష్టం కలసివచ్చింది-అంతే,
జీవితం కొత్తమలుపు తిరిగింది. మంచి ఉద్యోగంలో ప్రవేశించడం ఆలస్యం, పిల్లనిస్తామంటూ వెంటబడ్డ వాళ్ళెందరో! రాధారాణి తండ్రి జానకిరామయ్య తన గురించి విని, వారం రోజులు తిరగకుండా పెళ్ళి సంబంధం కుదిర్చేసాడు. తనని కొనేసుకున్నాడు.
తను ఇంకో మెట్టు పైకి వెళ్ళిపోయాడు. గొప్పవాడైన మామగారు- ఆరోజు తనని వెంట బెట్టుకుని మరీ పెద్ద హోటలులో డిన్నరిచ్చినపుడు, తనవాళ్ళందరూ నిత్యం తినే తిండి, తనవాళ్ళ బ్రతుకులు కళ్ళముందు నిలిచి, అక్కడ తియ్య తియ్యని పదార్థాలు గొంతు దిగక తికమకపడ్డ రోజు ఎలా మరిచిపోగలడు? మొదట్లో కొన్ని రోజులు తల్లితండ్రులకి నెలనెలకి డబ్బు పెంపేవాడు. వారం వారం ఉత్తరం రాసేవాడు కాని, తర్వాత తర్వాత పూర్తిగా మారిపోయాడు రాజారాం. 'తన అదృష్టం తనది' అని సర్ది చెప్పుకుంటూ బతికేయడం అలవాటు చేసేసుకున్నాడు. తన ఇంటిచుట్టూ పూలమొక్కలు, పెద్ద బంగళా, మరీ పెద్దకారు, తన కోసం చుట్టూ చుట్టూ తిరిగే రకరకాల మనుష్యులు, తన అంతస్తు - ఓహో - గొప్ప గొప్పవాళ్ళే తన ఆత్మీయులని నమ్మేస్తూ, తన డబ్బుతో ఈ ప్రపంచాన్ని కొనేయగలనని గాఢంగా నమ్మేస్తూ - ఓహో - ఎన్నేళ్ళు, ఎన్నెన్నేళ్ళు బతికేశాడు తను! మనిషి ప్రేమకి, ఆప్యాయతకి, త్యాగానికి - ఇలాటి ఎన్నిటికో ప్రపంచంలో కొంతైనా విలువ వుందని గుర్తించాల్సిన అవసరమే లేకుండా హాయిగా బతికేశాడు. చుట్టరికాన్ని, స్నేహాన్ని కూడా అంతస్తుల తూకంలో తూచి ఖరీదు కట్టేశాడు - ఓహో ఎంత పెరిగిపోయాడు తను!!
కానీ మరీ పెరిగిపోయిన రాజారాం, హాయిగా నవ్వడం, కళ్ళు మూసుకు సుఖంగా నిద్రపోవడం మరిచిపోయాడు. నిజానికి తను మనిషిగా బతకడమే మరిచిపోయాడు - కానీ బతికేసాడు - ఎన్నేళ్ళు - ఎన్నేళ్ళు!!
* * *
తన వాళ్ళని తలుచుకోగానే రాజారాం కళ్ళు చెమర్చాయి. తను చిన్నప్పుడు పెరిగిన ఇల్లు. తనతోబాటు ఒకే కంచంలో తిన్న అన్నయ్య, తన చిన్నారి చెల్లాయి - రాజారాం ఒళ్ళు పులకించింది. తనకోసమే ఎదురుచూసే వాళ్ళంతా ఏరీ? ఎవరు దొంగో, ఎవరు దొరో తెలియలేని ఇన్ని వేల అనుబంధాల మధ్య తనవాళ్ళేరీ!?
ఇంత పెద్ద రాజారాం చీకట్లో కన్నీళ్ళు తుడుచుకున్నాడు. పెద్ద బంగళా, మరీ పెద్ద కారు, పూలతోట - ఇంకా ఎన్నో ఎన్నో తననే వెక్కిరిస్తున్నాయనిపించి కదలిపోయాడు.
చిట్టి తల్లిని అల్లుడు పంపలేదని కృంగిపోయిన తను ఎన్ని అనుబంధాల్ని తేలిగ్గా వదిలేశాడు ఇంతవరకు! రాజారాం దీర్ఘంగా నిట్టూర్చాడు. హోదా మనిషిని పెద్దవాణ్ణి చేస్తుంది. కాని, దానితోబాటు మనసుకూడా పెరిగితేనే. అలా కాకపోతే - ఎన్ని ఉన్నా అన్నీ వృధా వృధా!!
డబ్బు మనిషయిపోయి తను బతికిన బతుకు అసహ్యంగా, భయంగా కనిపించి కళ్ళు గట్టిగా మూసుకున్నాడు రాజారాం.
ఆ రోజు,
"ఊరెడుతున్నాను" సూట్ కేసులో బట్టలు సర్దుకుంటూ రాజారాం.
"ఊరేమిటి" ఆశ్చర్యపోయింది రాధారాణి. "అమ్మాయి దగ్గరకా?"
"కాదు - అమ్మ దగ్గరికి!" రాజారాం రాధారాణి ముఖం చూశాడు.
"బాగుంది మీ హాస్యం. అమ్మాయి కోసం బెంగపడుతున్నారు అసలే - దీనికితోడు ఆ ఊరెళ్ళి ఆ కారాలు తింటూ కూచుంటే ఇంక మీ ఆరోగ్యం-" రాధారాణి మాట పూర్తికాలేదు.
"అక్కడుండి తిన్నంతకాలం మనిషిలాగే ఉన్నాను. అవన్నీ మానేశాక ఇలా మారిపోయాను" విరాగిలా ఓ నవ్వు నవ్వి గబగబా ముందుకు అడుగులేశాడు రాజారాం.
* * *
తను చదువుకున్న చిన్న వీధి బడి దాటిపోతుంటే ఒళ్ళు గగుర్పొడిచింది. గబగబా నడిచి ఇంటిముందు ఆగాడు రాజారాం. కిటికీలోంచి తొంగిచూశాడు. అమ్మ దొడ్లో తులసికోట దగ్గర తలపెట్టుకు నిద్రపోతోంది. నాన్న ముందు వరండాలో గురకతీసి నిద్రపోతున్నాడు. రాజారాం అదేపనిగా చూస్తున్నాడు లోపలికి. దీపపు వెలుగులో పక్కగా ఏదో చదువుతున్న అన్నయ్య కనిపిస్తున్నాడు. రాజారాం ఇక ఆగలేక గబగబా తలుపు తట్టాడు.
"ఎవరు కావాలండీ?" తియ్యని చిన్న గొంతు విని పులకించి పోయాడు.
"మీరంతా!" అప్రయత్నంగా అనేశాడు.
ఇంట్లో అందరూ రాజారాం చుట్టూ మూగారు. అనుకోకుండా రాజారాం రావటం అందరికీ ఆశ్చర్యంగానే వుంది.
"ఇలా కూచో." మంచం చూపించాడు తండ్రి.
"మీ ఆవిడ కులాసాయేనా?" అంది అమ్మ.
రాజారాం నవ్వాడు.
క్షణంలో ఇంట్లో అందరూ ఏదో హడావిడి పడుతున్నారు. అమ్మ రహస్యంగా అన్నయ్యకి ఏదో చెప్తోంది చిన్నవాడు దొడ్డిగుమ్మంలోంచి వెళ్ళి మళ్ళా లోపలకొచ్చాడు.
రాజారాం అన్నీ గమనిస్తూనే ఉన్నాడు. తనకి అతిథి మర్యాదలు చేయడానికి వాళ్ళు పడుతున్న తాపత్రయం - రాజారాం కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
'చల్లారిపోయిన అన్నం మీలాగ నేనూ తినగలనని, నేనూ మీలాగ నేలమీద పడుకోగలననీ, నేనూ మీ అందరిలో ఒకడనేనని, అందరిలా ఒకడనేనని - గట్టిగా అందరికీ చెప్పాలి చెప్పాలి' అనుకుంటూ, గుండె గొంతుకలో కొట్లాడుతుంటే, గుడ్లప్పగించి చూస్తూ వుండిపోయాడు రాజారాం.
తనని వీళ్ళు ఎందుకు ప్రత్యేకంగా చూస్తున్నారు - తనూ వీళ్ళ రక్తం పంచుకున్నవాడేనే - అందరూ ఒకటైనట్లు, తనొక్కడూ ఒక్కటైనట్లు అనుకున్న రాజారాంకి ప్రపంచమంతా శూన్యంగా వికారంగా కనిపించింది.
వారం రోజులు అక్కడే గడిపిన రాజారాం బయలుదేరుతుంటే బుట్టనిండా అరిసెలు సద్ది పెట్టింది అమ్మ. తనకి ఇవి యిష్టమని అమ్మ మరిచిపోలేదా ఇంకా?!
'బాబాయ్ - మళ్ళీ రా!' చిన్న తియ్యని గొంతు - 'ఒక ఉత్తరం ముక్క రాయరా బాబూ' - నీళ్ళు నిండిన కళ్ళతో అమ్మ చూపు - కదిలిపోతున్న రాజారాంని క్షణం కట్టివేశాయి. ఈ ఆప్యాయతలు తను భరించలేకపోతున్నాడు - ముందుకేస్తున్న అడుగులో మార్గం కనిపించకుండా కన్నీళ్ళు అలుముకున్నాయి. 'ఈ ఆప్యాయతల్ని ఏ డబ్బుతో కొనుక్కోగలను?!' - లక్షాధికారి రాజారాం దీర్ఘంగా నిట్టూర్చి ఆ నిశీధిలో కలసిపోయాడు. *
తన అల్లుడు తన అంతస్తును లెక్క పెట్టడు - తనో!!
అంతస్తుకి అటు ఇటు-
చిత్రం, భళారేవిచిత్రం - రాజారం విరాగిలా నవ్వుకున్నాడు. తనలో తను కూనిరాగం తీస్తూ.*



