Home » Dr Muktevi Bharathi » Mukthdevi Bharathi Khadhalu


                                                     సుశీల మనసు
    "హమ్మయ్య! యింక గెలిచిపోయాను" అనుకున్నాడు ప్రకాష్, సుశీల నెల తప్పిందని తెలిసిన మరుక్షణంలో. "హమ్మయ్య! మళ్ళా బతికాను" అనుకుంది సుశీల తాను నెల తప్పిందని, గ్రహించగానే.
    ఆ సాయంత్రం ఎన్నో స్వీట్సు, పళ్ళు యింటికి తెచ్చాడు ప్రకాష్.
    "సెలెబ్రేట్ చేస్తున్నాను" అన్నాడు నవ్వి సుశీలతో. "అవును సెలెబ్రేట్ చెయ్యాల్సిందే" - సుశీల - చీరపైనున్న ఎంబ్రాయిడరీ పూలు చూసుకుంటూ!
    "ఒక్కోసారి సమస్యలు వాటంతట అవే విడిపోతాయి కదూ" - సుశీల ప్రకాష్ కళ్ళలోకి చూస్తూ.
    ప్రకాష్ చూపులు ఎక్కడో - క్షణం సుశీల కళ్ళనిండా భయం!
    "ఏమిటీ-మళ్ళా మూడ్ మారిపోయిందా_"
    "ఆ ఏం లేదు" - చేతిలో సిగరెట్టు కిటికీలోంచి విసురుతూ ప్రకాష్.
    "ఈ రోజు ఆయన్ని కలసి చెప్పేస్తాను - నేను కనిపించి కూడా ఎన్నో నెలలైంది."
    "నేను చెప్తాగా ఎప్పుడెళ్ళాలో - ఇద్దరం కలసే వెడదాం - సరేనా?" సుశీల ప్రకాష్ మాటలు వింటూ తలూపింది.
    కాలం గడుస్తుంటే సుశీల మనసూ మారింది. ప్రకాష్ చాలా మంచివాడు - అన్నగారి మాటలు విని అలా అయిపోయాడు - అంతే - యిప్పటికైనా మంచి రోజులొచ్చాయి - సుశీల రాబోతున్న మంచి రోజుల్ని గురించి ఆలోచిస్తోంది.
                                                  *    *    *
    సుశీల తల్లి కూరగాయలమ్మేది. సుశీల మిషన్ కుట్టేది. తండ్రి రైల్వేలో లైన్ మన్. చిన్న నౌకరీలో ఉన్న ప్రకాష్ ఆఫీసరు గారింటి కొచ్చేవాడు ఏదో పని చేయడానికి. ఆ ఇంట్లోనే వెనుక చిన్న గదిలో ఉంటున్న సుశీల కుటుంబంతో ప్రకాష్ కి పరిచయమైంది. ఆ పరిచయం అలా పెరిగి పెళ్ళివరకు వచ్చేసరికి సుశీలకి, తల్లిదండ్రులకి కూడా భయమేసింది. "చూడు నాయనా, మీ పెళ్ళికి మీవాళ్ళు ఒప్పుకోరు - తరువాత పేచీలూ అవీ బావుండవు .... నువ్వేమో రిజిష్టరు పెళ్ళి చేసుకుంటానంటున్నావు - బాగుండదు- మాకూ యిష్టం లేదు - మీ వాళ్ళని ఒప్పించి ...." సుశీల తల్లి మాటలకి ఓ నవ్వు నవ్వాడు ప్రకాష్.
    "మా వాళ్ళు నా విషయం పట్టించుకోడం మానేసి చాలా ఏళ్ళయింది - నేను శ్రద్ధగా చదువుకోలేదని, బుద్ధిగా లేనని మా వాళ్ళు పూర్తిగా నా ఖర్మకి నన్ను వదిలేశారు - కాబట్టి వాళ్ళని గురించి మీకేం భయం వద్దు - కాకపోతే మీకు, ముఖ్యంగా సుశీలకి యిష్టం లేకపోతే .... సరే" - ప్రకాష్ సుశీలకేసి చూస్తూ అన్నాడు.
    ఆ తర్వాత కొద్ది రోజులకే ప్రకాష్ సుశీలల వివాహం అయిపోయింది, నువ్వు లేకపోతే నేను బతకలేనని. నువ్వు బతికితేనే నేను బతికేదని మైమరచి మాట్లాడుకున్న మధుర క్షణాలు గడిచిపోయాయి. అంతే!
    యుగాలు క్షణాలుగా గడిచిన రోజులయి పోయాక - క్షణాలు యుగాలుగా గడవటం మొదలు పెట్టాక - ప్రకాష్ గతాన్ని గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు - తను చేసిన పనివల్ల తనకు వచ్చిన నష్టాలు లెక్క వేసుకోటం మొదలయిందప్పుడే!
    తన ప్రవర్తనంటే యిష్టంలేకపోయినా తన వాళ్ళందరికీ తనంటే ప్రేమ లేకపోలేదు - మరి - తనని చిన్నప్పుడు తల్లి తండ్రులు చేసిన గారాబం! తన అన్న తనని ఎంత ముద్దుగా చూసేవాడో - తన వాళ్ళందర్నీ వదిలి తనొక్కడయి పోయాడు - తన వివాహం విషయం విన్న అమ్మ కళ్ళల్లో నిండిన నీళ్ళు, మూగవేదన తనెలా మరచిపోతాడు - తనెందుకీ పొరబాటు చేసాడు - ఏమో - ప్రకాష్ మొదటి సారిగా తన వివాహాన్ని గురించి తల్చుకుని పశ్చాత్తాప పడటం మొదలెట్టాడు- "ఇప్పుడైనా వాళ్ళు తనని క్షమిస్తారు ...."
                                                  *    *    *
    ఓ రోజు డబ్బు తీసికెళ్ళిన మర్నాడే వచ్చింది.
    "ఏం - ఈరోజు కూడా మళ్ళా డబ్బిస్తాడనుకున్నావా?" అన్నాడు నవ్వుతూ రామనాథం.
    "కాదండి...." కొంచెం జంకింది సుశీల.
    "ఏమిటి మరి-"
    "నిన్న మా యింటికొచ్చారు-"
    ఉలిక్కిపడ్డాడు రామనాథం.
    "నిన్న వచ్చాడా - చూడమ్మా - ఒక్కసారి కూడా రానీయకు - ఒక్క నిమిషం కూడా ఉండనీయకు - తెలిసిందా?" సుశీల మాట్లాడలేదు.
    "నిర్మొహమాటంగా చెప్పేయి- రావద్దని - నాతో వచ్చి ఏమన్నా చెప్పాల్సింది ఉంటే చెప్పమను-" చాలా గంభీరంగా ఉన్న రామనాథం ముఖం చూడ్డానికి భయమేసింది సుశీలకి.
    ఇంటికొచ్చి మాట్లాడితే తప్పేముండి - మనసులో అనుకుంటూ "సరేనండి" - నెమ్మదిగా వెళ్ళిపోయింది సుశీల.
    ఆ రాత్రంతా రామనాథం ఇదే ఆలోచిస్తున్నాడు. ప్రకాష్ మొదట ఇంటికొస్తాడు - తర్వాత! తర్వాత - సుశీల భవిష్యత్తు గాఢాంధకారంగా కనిపించింది రామనాథానికి.
                                                  *    *    *
    సుశీల కొన్ని నెలలు కనిపించలేదు రామనాథానికి. ప్రకాష్ రామనాథం దగ్గరకొచ్చి డబ్బు యివ్వటం మానేశాడు - వాళ్ళిద్దరూ ఏమయ్యారు - బహుశ పెద్దలెవరయినా రాజీ చేసారేమో! అనుకున్నాడు రామనాథం ఒకటి రెండుసార్లు.
                                                  *    *    *
    లోపలనుంచి వచ్చిన రామనాథం ఆఫీసు గదిలో కూచున్న సుశీలను చూసి విస్తుపోయాడు.
    "ఎలా గడుపుతున్నావు? డబ్బు తెచ్చి యివ్వటమేలేదు" అన్నాడు సుశీలను చూస్తూ.
    సుశీల చటుక్కున తలెత్తి చూసి, నాలుక కరుచుకుంది. "ఇంటికి తెచ్చి యిస్తున్నాడు-" ముసి ముసిగా నవ్వుతోంది. "ఇంటికొచ్చి యిస్తున్నాడా- అలా తీసుకోవద్దని చెప్పానుగా! కోర్టులో కేసున్నంతవరకు యింటికి రానియ్యవద్దని యింతకు ముందు కూడా చెప్పాను నీకు." రామనాథం ముఖం కోపంతో జేవురించింది.
    "ఇందులో పెద్ద కుట్ర వుంది" - గబగబా సిగరెట్టు ముట్టించాడు.
    సుశీలకి రామనాథం మాటలు చాలా కోపాన్ని కలిగించాయి.
    "ఇందులో కుట్ర ఏముంది - మీకిచ్చి మీరు నాకిచ్చినా అతనే నాకిచ్చినా రెండూ ఒకటేగా?" అంది. వెంటనే "ఒకటి కాదు-అవి రెండు" అరిచాడు రామనాథం.
    ఈ ప్లీడర్లంతా యింతే - కలసివచ్చే సమయానికి చెడగొడతారు. ఏం, యింటికొచ్చి డబ్బిస్తే? ఏమో-ఏ నిముషంలోనైనా అతని మనసు మారొచ్చుగా? నిజానికి ప్రకాష్ మంచి వాడే ఆ క్షణంలో రామనాథం పరమ కిరాతకునిలాగ, ప్రకాష్ - హృదయమున్న గొప్పవ్యక్తి. పరిస్థితులకి తలొగ్గి దీనుడై పోయినట్లు అనిపించింది సుశీలకి.నెమ్మదిగా లేచి నిలబడింది. ఒక్క నిముషం ఆగి రెండడుగు లేసింది.
    "వాణ్ణి పొరబాటున కూడా నీ యింట్లో అడుగు పెట్టనీయొద్దు- ఈ నెల డబ్బిస్తే తీసుకోకు - యిక్కడికే తెచ్చి యిమ్మను. నువ్వు వచ్చి తీసుకెళ్ళు - నేను అనుభవంతో మాట్లాడుతున్నాను - ఎన్నో మోసాలుంటాయి - అర్థమయిందా?-" రామనాథం మాటలు విని, "ఆ" అంటూ గబగబా బయటకు నడిచింది సుశీల.
    "ఏమిటిది - డబ్బిచ్చేది నేనేగా - రాత్రి వస్తాను, పగలు వస్తాను- నా యిష్టం" అంటాడు ప్రకాష్ - అతను రావటం తనకీ యిష్టమే - ఈ మధ్య యిక్కడే ఉండిపోతున్నాడు-మనిషి ఎంతగా మారిపోయాడు! సుశీల నడుస్తోంది.
    "ఇదేమిటి మరి - 'నేను అనుభవంతో చెప్తున్నాను - అతన్ని రానియ్యద్దు. యిందులో ఏదో వుంది' అంటాడు రామనాథం - ఏముంది-కొన్ని రోజులయ్యాక డబ్బు యివ్వటం మానేస్తాడు - పోనీ, మనిషే తనవాడవుతుంటే డబ్బు యివ్వడం, ఇవ్వక పోవటం ఏమిటి?" - సుశీల నడుస్తోంది.
    తను, భర్త ఒకటైపోయినట్లు, హాయిగా కాపురం చేసుకుంటున్నట్లు, కోర్టుకెళ్ళి ప్రకాష్ కేసు కొట్టించేసినట్టు వూహిస్తూ గబగబా నడిచింది.
    వీధి గుమ్మంలో ప్రకాష్ సైకిల్ కనబడింది, అప్పుడే వచ్చాడే- ఏమన్నా కానీ యింక యీ ప్లీడరు దగ్గరకెళ్ళను - నన్నేం చేస్తారేం! సుశీల చాలా హుషారుగా యింట్లోకి అడుగు పెట్టింది.
    సుశీల ప్లీడరు దగ్గరకెళ్ళటం పూర్తిగా మానేసింది. ప్రకాష్ పూర్తిగా సుశీల యింట్లోనే వుండిపోతున్నాడు.
    రోజులు గబగబా గడుస్తున్నాయి. సుశీలకి నెలలు నడుస్తున్నాయి. సుశీలకీ చాలా గర్వంగా సంతోషంగా వుంది. ఈ మాటు ప్లీడరుగారి ఆఫీసుకి నా బాబుని ఎత్తుకు వెడతాను - ఏం చేస్తారో? నవ్వుకుంది.
                                                  *    *    *
    పక్కలో వున్న పసి కందుని గుండెలకి హత్తుకుంది సుశీల. ఈ కోర్టులు, సాక్షులు, ప్లీడర్లు-ఏమన్నా కాని-నేనూ, నా బాబు".... సుశీల ఆనందం ఆకాశాన్ని అంటకముందే క్షణంలో చీకట్లు ముసిరాయి. పసికందు కళ్ళుతెరిచినట్లే తెరిచి శాశ్వతంగా కళ్ళు మూసుకున్నాడు.
    "ఈ వానలో మళ్ళా పుస్తకం ఎక్కడ తెచ్చేది-ఆ మూల పాతిపెట్టు!" అన్నాడు వల్లకాటి గుమస్తా ఆ రాత్రి సుశీల తండ్రితో, జోరున వాన కురుస్తుంటే ఇలా పుట్టి అలా వెలిగి, పేరన్నా లేకుండా మట్టిలో కలసిపోయిన పసివాణ్ణి తల్చుకుని గొల్లున ఏడ్చింది సుశీల ఒంటరిగా!
    తనని హాస్పటల్ లో చేర్పించి, పిల్లాడు పుట్టినట్లు రిజిస్టరులో రాయించానని చెప్పిన ప్రకాష్ ఏడీ? సుశీల మనసు విలవిల్లాడి పోయింది- రాకేం చేస్తాడు- పిల్లాడు లేని దుఃఖం అతన్ని పీడిస్తోంది - అంతే! సుశీల మనసులోనే వూరట చెందింది. కానీ ఆ వూరట మనసులోనే అణిగి పోయింది. మళ్ళా చూడలేదు ప్రకాష్ ని సుశీల అప్పట్లో!
    రోజులు పరిగెడుతున్నాయి.
    కళా కాంతి లేకుండా, జీవచ్చవంలా సుశీల రామనాథం ఆఫీసులో కూర్చొనివుంది తలొంచుకుని.
    "ఇదిగో చూడు"__సుశీల వైపు విసిరాడు నోటీసు కాగితం రామనాథం. అతని కళ్లు, ముఖం ఎర్రబడ్డాయి. "చదువు!" గర్జించాడు.
    సుశీల తలెత్తలేదు.
    "నీ క్లయింటు వ్యభిచారి__ ఫలానా హాస్పటల్లో పురుడు పోసుకుంది__ కొడుకుని కంది__మనోవర్తి రద్దు చేస్తున్నాను" అంటున్నాడు.
    "ఏం సమాధానం చెప్తాం__" రామనాథం అరిచాడు. ప్రపంచం నిండా మోసం, ప్రపంచం నిండా అన్యాయమే వున్నట్టు అర్థమయిపోయిన సుశీలకు కన్నీళ్ళాగలేదు.
    అతనొచ్చినప్పుడు తనెందుకు రానిచ్చింది?
    తనకీ అతను కావాలనిపించింది__యిప్పటికి కావాలి__
    మరి అతనికో__ ప్రకాష్ తలపుకు రాగానే సుశీల కన్నీళ్ళాగకుండా ఒళ్లో వచ్చి పడ్డాయి.
    ఆ పిల్లాడే వుంటే__ వుంటే__ తనని రక్షించేవాడా!__ సముద్రంలో కొట్టుకుపోతూ గడ్డిపోచకోసం చూడటం యిదే!
    సుశీల చాలాసేపు రామనాథం ఆఫీసులో కూర్చుంది. "మరి- నేను...." సుశీలకి గొంతు పెగలటంలేదు. "నేనేం చేయలేను- తీసుకెళ్ళు-" రామనాథం ఫైలు బయటకి తీశాడు.
    "ఇప్పుడర్ధమయిందా ఎందుకు రానియ్యవద్దన్నానో?" సుశీల కేసి చూశాడు. సుశీల తలెత్తింది. ఆ చూపులో నీవే తప్ప ఇతఃపరంబెరుగ నన్న దీనత్వం__కళ్ళనిండా నీళ్ళు__
    పాపం__పిచ్చిపిల్ల__అంత పెద్ద వకీలు రామనాథమూ క్షణంలో కరిగిపోయాడు.
    సుశీల కూర్చునే వుంది.
    "సరే - ఆలోచిద్దాం__వెళ్ళు" అన్నాడు తాను కుర్చీలోంచి లేస్తూ. రామనాథానికి తెలుసు సుశీలకి ప్రకాష్ అంటే ఇష్టమని__ ప్రకాష్ చాలా అందంగా వుంటాడు. ఆకర్షణీయంగానూ వుంటాడు. సుశీల ప్రకాష్ ని నమ్మేసి, అతనికి లొంగిపోవటంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు__కాకపోతే యిప్పుడీ అమాయకురాల్ని రక్షించటం ఎలా__ నిజం చెప్పి యీ కేసు గెలవటం సాధ్యమా?!
    ధర్మాధర్మాల సంఘర్షణలో రామనాథం మనసు కొట్టుమిట్టాడింది.
    ఉన్నట్టుండి మెరుపులాంటి ఆలోచన ఒకటి రామనాథం మెదడులో మెరిసింది. మనసు చాలా తేలికపడింది.
    సుశీల వ్యభిచారి కనుక మనోవర్తి రద్దు చెయ్యాలని ప్రకాష్. ధరలు పెరిగాయి కాబట్టి మనోవర్తి పెంచాలని సుశీల కోర్టులో కేసులు దాఖలు చేశారు.
    ఆ కేసులు విచారణ కొచ్చాయి.
    ప్రకాష్ వకీలు హాస్పటల్లో సుశీలకి పురుడు పోసిన డాక్టరు చేత, పిల్లాడి బర్త్ సర్టిఫికెట్ సంతకం చేయించిన ఆమెచేత కోర్టులో సాక్ష్యమిప్పించాడు. సుశీల గజగజ వణికిపోయింది భయంతో.
    ఇంక ఆ డాక్టర్ని క్రాస్ ఎగ్జామిన్ చేయడం వుంది.
    మధ్య మధ్య చాలా గర్వంగా చూసే ప్రకాష్!
    మధ్య మధ్య చాలా బేలగా చూసే సుశీల!
    రామనాథం చాలా గంభీరంగా ఉన్నాడు.
    "డాక్టరుగారూ! మీ హాస్పటల్లో మీ దగ్గరకి కాన్పులకు వచ్చే వాళ్ళందరినీ మీరు గుర్తుపట్టగలరా?" రామనాథం ప్రశ్నకి డాక్టరు నవ్వింది.
    "చాలా కష్టం__ ఎవరెవరో వస్తారు. వెడతారు__ అంతే."
    "అయితే, మీ రికార్డుల్లో వున్న అమ్మాయి పురుడుపోసుకుని ఎంత కాలమైందో ఇప్పుడు చెప్పగలరా?" డాక్టరు క్షణం ఆలోచించింది.
    "రికార్డు చూసి మాత్రమే చెప్పగలను."
    "మంచిది_చూడండి." రామనాథం డాక్టరుకి రికార్డు అందించాడు.
    "సుమారు మూడు నెలలు దాటింది."
    వెంటనే రామనాథం అన్నాడు "ఈ మూడు నెలల్లో మీరు ఎన్ని కేసులు చేశారు?"
    బహుశా కొన్ని వందలు." డాక్టరు నవ్వింది.
    "డాక్టరుగారూ__ క్షమించాలి__ మిమ్మల్ని విసిగిస్తున్నాను. ఈ మూడు నెలలుగా వచ్చివెళ్ళినవారి ముఖాలు, పేర్లు గుర్తుపట్టగలరా?"
    "సాధ్యం కాదు."
    "అయితే మీ రికార్డు ప్రకారం సుశీల అనే అమ్మాయి మీ దగ్గర పురుడు పోసుకున్నానని చెప్తే మీరు ఆ అమ్మాయిని గుర్తించగలరా?"
    "ఇంపాసిబుల్" __ డాక్టర్ గట్టిగా చెప్పింది. రామనాథం చాలా హుషారుగా వున్నాడు.
    "మీరు సాక్ష్యమిస్తున్న కేసులో సుశీల, మీ రికార్డులో పురుడు పోసుకున్నట్టుకున్న వున్న సుశీల ఒకరేనని చెప్పగలరా?"
    "చెప్పలేను. కానీ__ప్రకాష్ భార్యని, సుశీల నా పేరు_- అని చెప్పుకుని మా హాస్పటల్ లో పురుడు పోసుకున్న సంగతి చెప్పగలను"__ డాక్టర్ కొంచెం ఖంగారుపడుతోంది. వెంటనే రామనాథం, "ఎవరైనా అమ్మాయి తన పేరు సుశీలని, ప్రకాష్ భార్యనని అబద్ధం చెప్పి పురుడు పోసుకు వెళ్ళచ్చుగా ?"
    "ఆ__అలాటివి జరగవచ్చు....
    "అంటే- అసలు పేరు చెప్పకుండా, యింకో పేరు చెప్పుకుని హాస్పటల్లో చేరవచ్చు__అవునా?"
    "అవును__కొన్ని సందర్భాలలో అలాటివి జరుగుతుంటాయి."
    రామనాథం డాక్టరు సమాధానానికి చాలా ఆనందపడ్డాడు. "థాంక్యూ డాక్టర్!"
    నిజంగా సుశీలే ప్రకాష్ ఆరోపణల ప్రకారం హాస్పటల్లో చేరితే ఆమె పేరు మార్చుకొనే చెప్పేదని, అప్పటికే కేసు జరిగి మనోవర్తి పుచ్చుకుంటున్న సుశీల తన నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నమే చేసేదని, ప్రకాష్ కేవలం సుశీలకిచ్చే మనోవర్తి ఎగ్గొట్టే నిమిత్తం యీ నిందారోపణ చేసాడని, యీ కేసులో వున్న సుశీల, సుశీల అనే పేరుతో పురుడు పోసుకున్న అమ్మాయీ ఒకరే అనటానికి ఏమాత్రం రుజువు లేదని, సుశీల పట్ల విముఖత ప్రకాష్ కి వుందనటానికి రికార్డు ఆధారం చాలా వుందని, మనోవర్తి ఎగ్గొట్టే ప్రయత్నంలో యీ కుట్ర పన్నాడని చాలా గట్టిగా గొంతు చించుకుని మరీ మరీ చెప్పాడు రామనాథం కోర్టులో.
                                                   *    *    *
    రెండు రోజుల తర్వాత తీర్పు వినటానికి వచ్చిన సుశీల గుండె దడదడలాడుతోంది. మేజిస్ట్రేటు చాలా హుందాగా కాగితాలు తీసి చదవటం మొదలుపెట్టాడు.
    సుశీల గర్భవతే కాలేదని, పురుడే పోసుకోలేదని, కేవలం ప్రకాష్ మనోవర్తి ఎగ్గొట్టడానికే యీ తప్పుడు కేసు దాఖలు చేశాడు కనక యీ కేసు డిస్ మిస్ చేస్తున్నానని తీర్పు చెప్పాడు.
    సుశీల ముఖంలో ఒక్కసారి కొత్త వెలుగు వెలిగింది. గుండె బరువు తీరింది. గబగబా లేవబోయిన సుశీలని కూర్చోమని సైగ చేశాడు రామనాథం.
    యాంత్రికంగా కూచుంది సుశీల.
    మేజిస్ట్రేటుగారు రెండో జడ్జిమెంటు చదవటం మొదలుపెట్టాడు.
    నిత్యం ధరలు పెరుగుతున్న విషయం అందరికీ తెలుసు. పైగా - సుశీల తను స్వయంగా సంపాదించుకోలేదు కనుక నెలకు ఏభై రూపాయలు అదనంగా మంజూరు చేస్తున్నానని సుశీల దాఖలు చేసిన కేసులో తీర్పు చెప్పాడు.
                                                  *    *    *
    ఆ రోజు రామనాథం ఆఫీసులో కూర్చుని ప్రకాష్ పంపిన నోటీసు చూసి నిర్ఘాంతపోయింది సుశీల. నోటమాట రాలేదు. తను నెల తప్పటంలో ఉన్న అధర్మమేమిటో అర్థం కాలేదు. ధర్మాధర్మాల సంఘర్షణలో కొట్టుమిట్టాడింది సుశీల మనసు అప్పుడు!
    ఈ రోజు సత్యాసత్యాలతో సంబంధం లేకుండా తను కేసు గెలవటం గొప్ప ధర్మంగా, న్యాయంగా అనిపించింది సుశీలకి.
    ఒక్కసారి న్యాయస్థానాన్ని తలెత్తి చూసి, ముందుకు నడిచింది సుశీల!*


Related Novels


Tarigonda Venghamambha

Mukthdevi Bharathi Khadhalu

Mamatha

Malli Vachhina Vasantham

More