పండరీపుర విఠలుడు

 

 

భగవంతుడు తన భక్తులని బ్రోవటానికి అనేక చోట్ల అనేక రూపాలతో దర్శనమివ్వటమేగాక, వారి కోరికమీద శాశ్వతంగా అక్కడే స్ధావరమేర్పరుచుకున్నాడు కూడా.  భగవంతుడు అలా ప్రకాశించేవి కొన్నిచోట్లయితే, కొన్నిచోట్ల భక్తులే తమ ఆరాధనకోసం దైవ సన్నిధానాలను ఏర్పాటు చేసుకున్నారు.  అలాంటి దేవుని నిలయాలే దేవాలయాలు. ప్రాంతాన్నిబట్టీ, ప్రజల ఆచారాలనిబట్టీ, భగవంతుడు వేరు వేరు రూపాలతో, వేరు వేరు పేర్లతో కొలువైయున్నాడు.  రాముడు, కృష్ణుడు, పండరీనాధుడు, మహా శివుడు, మల్లికార్జునుడు, ఇలా ఎన్నో పేర్లు వున్నా భగవంతుడు మాత్రం ఒకరేనని, ఆయన భక్తికి మాత్రమే లొంగుతాడని చాలామంది భక్తులు విశ్వసిస్తారు.  ప్రస్తుతం మనం భక్తునికోసం దివినుండి భువికి దిగివచ్చి, భక్తుని కోరికమేరకుమొగలిపువ్వంటీ మొగుణ్ణివ్వవే  భువిలో ఇటుకరాయిమీద నుంచున్న పాండురంగ విఠలుని గురించి తెలుసుకుందాం.

 

శ్రీమహా విష్ణువు మరో పేరే పాండురంగ విఠలుడు, విఠోబా.  విఠలుడి మందిరాలు మన ప్రాంతంలో తక్కువైనా, మహారాష్ట్రలో ఈ స్వామి మందిరాలు, భక్తులు ఎక్కువ.  వీటిలో ముఖ్యమైనది పండరీపురంలోని పాండురంగడి మందిరం.  పాండురండు అనగానే మనకు గుర్తొచ్చేవి పాండురంగ మహత్యం, సతీ సక్కుబాయి, భక్త తుకారాం సినిమాలు.  వాటిమూలంగానే తెలుగువారిలో ఎక్కువమందికి పాండురంగవిఠలుని చరిత్ర తెలిసింది. భారత దేశంలో శ్రీకృష్ణుడు అనేక రూపాలలో ప్రసిధ్ధి చెందిన ధామాలు ఎన్నో వున్నాయి,   ఉదాహరణకు తూర్పున పూరీ, పడమరలో ద్వారక, ఉత్తరాన మధుర, బృందావనం, బదరీ, దక్షిణాన ఉడిపి, గురువాయూర్, పండరీపురం ప్రఖ్యాతి చెందినవి.  పండరీపురం విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాము.

శ్రీ విఠలుని మందిరం

 

 

నగర మధ్య భాగంలో వుంటుంది ఇది.  వసతి కొంచెం దూరంగా తీసుకున్నవాళ్ళకి, నడవలేకపోతే ఆటో సౌకర్యం వున్నది.  మనిషికి 10 రూ. లు తీసుకుంటారు.  ప్రతి రోజూ రద్దీగానే వుండే ఈ ఆలయంలో రద్దీ తక్కువ వున్న సమయంలో నేరుగా గర్భగుడిలోకి వెళ్ళవచ్చు, లేకపోతే 2, 3 అంతస్తులు ఎక్కి, దిగాల్సి వుంటుంది.  మంచి పూల దండలు తీసుకెళ్తే స్వామికి, అమ్మవార్లకు అలంకరిస్తారు. విఠలుని గర్బగుడిముందువున్న మండపంలో వెండి రేకు తాపడం చేసిన స్తంబం ఒకటి వుంటుంది.  భక్తులు దీనిని కౌగలించుకుని నమస్కారం చేస్తారు.  భగవంతుని కౌగలించుకున్నట్లు, ఆయన ఆశీర్వదించినట్లు భావిస్తారు.  ఈ స్తంబము దగ్గరే పురందరదాసు భజనలు చేస్తూ నుంచునేవాడట.  అందుకే దీనిని పురందరదాసు స్తంబము అనికూడా అంటారు.  గర్భాలయంలో ఎత్తయిన వేదిక మీద, దాదాపు 3 అడుగుల ఎత్తు పాండురంగని విగ్రహం  రెండు చేతులూ నడుము మీద పెట్టుకుని భక్తులకు అభయమివ్వటానికే వున్నానన్నట్లు వుంటాడు.   ఇక్కడ పాండురంగడితో సహా అన్ని దేవతా మూర్తుల పాదాలమీద మన శిరస్సు పెట్టి ప్రణామం చెయ్యవచ్చు.

 

పాండురంగడు రెండు చేతులూ నడుము మీద పెట్టుకుని, ఇటుక మీద నుంచుని దర్శనమిస్తాడు.  ఆ ఇటుక గురించి తెలసుకోవాలంటే పుండరీకుని కధ తెలుసుకోవాల్సిందే.  నడుముమీద పెట్టుకున్న ఆయన ఎడమ చేతిలో శంఖముంటుందిగానీ, వస్త్రాలంకరణలో అది మనకు కనబడదు. స్వామి దర్శనమైన తర్వాత వేరు వేరు ఉపాలయాల్లో వున్న రుక్మిణి, సత్యభామ, రాధాదేవిల దర్శనం చేసుకోవచ్చు.  అతి విశాలమైన ఈ ఆలయంలో అనేక ఉపాలయాల్లో కాలభైరవుడు, సూర్యనారాయణుడు, దత్తాత్రేయుడు, ఏక ముఖ దత్తాత్రేయుడు, మహాలక్ష్మి, వెంకటేశ్వరస్వామి వగైరా దేవతలని దర్శించవచ్చు.

 

పుండరీకుని కధ

పూర్వం ముచుకుందుడనే రాజు అసురులమీద యుధ్ధంచెయ్యటంలో దేవతలకు సహాయం చేయగా, దేవతలు విజయం పొందారు. ముచుకుందుడు  దీర్ఘకాలం యుధ్ధంచేసి అలసిపోవటంవల్ల కొంతకాలం విశ్రాంతి తీసుకోదలచి, తనని నిద్రలేపినవారు తన చూపుతో భస్మమవుతారనే వరం దేవతలద్వారా పొంది ఒక గుహలో నిద్రపోసాగాడు.  శ్రీ కృష్ణుడు కాలయవనుడనే రాక్షసునితో యుధ్ధంచేస్తూ అతడు ఏ ఆయుధంచేతా మరణించడని గ్రహించి, ముచుకుందుడు నిద్రించే స్ధలానికి తీసుకువచ్చాడు.  నిదురిస్తున్నది శ్రీకృష్ణుడేననే ఊహతో కాలయవనుడు ముచుకుందుని నిద్రాభంగము చెయ్యటం, అతని చూపుపడి మరణించటం, ముచుకుందునికి శ్రీకృష్ణ దర్శనంకావటం జరిగాయి.  ఆ ముచుకుందుడే మరు జన్మలో పుండరీకుడిగా జన్మించాడు.

 

పుండరీకుడు ఒకసారి తాను వెళ్ళేదోవలో కుక్కుటముని ఆశ్రమం దగ్గర నల్లగా, అతి వికారంగావున్న ముగ్గురు స్త్రీలు వాకిలి శుభ్రంచేసి, నీళ్ళుజల్లి, ముగ్గులు పెట్టటం, వారలా చేయగానే అత్యంత సౌందర్యవంతులుగా మారి వెళ్ళిపోవటం చూసి ఆశ్చర్యచకితుడై వారిని ప్రశ్నించగా వారు తాము గంగ, యమున, సరస్వతులనే నదులమని, తమలో మునిగినవారి పాపాలవల్ల తమకి ఆ దుస్ధితి వస్తుందని, కుక్కుటమునిలాంటి మహనీయుల సేవలో ఆ పాపాలుపోయి యధా స్ధితికి వస్తామని పేర్కొన్నారు.  కుక్కుటమునికి అంత మహిమ తన మాతాపితరుల సేవతో వచ్చిందనికూడా తెలిపారు.  పుండరీకుడు అప్పటినుంచి తన మాతాపితరులకు అత్యంత భక్తి శ్రధ్ధలతో సేవచేయసాగాడు.

 

ఒకసారి తన భక్తుని పరీక్షించదలచిన పాండురంగడు పుండరీకుడు మాతాపితరుల సేవ చేస్తున్న సమయంలో వచ్చి బయటనుంచి పిలిచాడు.  పుండరీకుడు తానప్పుడు బయటకు వస్తే తన మాతా పితరులకు నిద్రా భంగమవుతుందని, అందుకని కొంతసేపు వేచి వుండమని తన చేతికి అందుబాటులో వున్న ఒక ఇటుకని విసిరి దానిమీద వేచి వుండమంటాడు.  భక్త వశుడైన పాండురంగడు పుండరీకుడు బయటకు వచ్చేదాకా ఆ ఇటుకమీదే నుంచుని వుంటాడు.  పుండరీకుని భక్తికి, మాతా పితరుల సేవాతత్పరతకు మెచ్చి వరముకోరుకోమనగా, అక్కడ ఇటుకమీద నుంచున్నట్లుగానే భక్తులకు దర్శనమిచ్చి బ్రోవమని కోరాడు.  విఠలుడు అనే పేరు విట్టు లోంచి వచ్చిందంటారు.  విట్టు అంటే కన్నడంలో, మరాఠీలో ఇటుక.

 

ఇతర భక్తులు

 

పుండరీకుడేకాదు … ఇక్కడ స్వామిని కొలిచి, స్వామితో ఆడి, పాడి, సహపంక్తి భోజనం చేసి తరించిన భక్తులు ఎందరో. వారిలో కొందరు ..  శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు, జ్ఞానేశ్వర మహారాజ్, జనాబాయి, నామదేవుడు, గోరా కుంభారుడు, సక్కుబాయి, తుకారాం, సమర్ధ రామదాసు, పురందరదాసు మొదలగువారు ఎందరో.  జగద్గురువు శ్రీ శంకరాచార్యులు ఇక్కడికి వచ్చి పాండురంగాష్టకం రచించారు.


భీమా నది (చంద్రభాగానది)

ఆలయ సమీపంలోనే భీమానది ప్రవహిస్తూవుంటుంది.  దీనికీ కధ వున్నది.  ఒకసారి శివ పార్వతులు ఈ ప్రాంతంలో విహరిస్తూండగా, పార్వతీదేవికి దాహం వేసింది.  పరమశివుడు తన త్రిశూలంతో భూమిని చీల్చి పాతాళంలోని భోగవతి నీటిని భూమిమీదకి తీసుకొచ్చాడు.  ఆ స్ధలమే భీమానదీ తీరంలో పుండరీకుని మందిరం ముందుండే లోహదండ తీర్ధము.  దీనికి లోహదండ తీర్ధమని పేరు రావటానికి ఇంకొక కధ.  ఇంద్రుడు గౌతమ మహర్షి శాపంవల్ల సహస్రాక్షుడై, శాప నివారణకు మహావిష్ణువుని శరణుజొచ్చాడు.  విష్ణువు ఇంద్రుడికి ఒక ఇనుపదండాన్నిచ్చి, ఏ తీర్ధములో ఈ ఇనుప దండము తేలుతుందో, అక్కడ స్నానం చెయ్యటంతో నీ శాపంపోతుందని చెప్తాడు.  ఇంద్రుడు భూలోకంలో అనేక తీర్ధాలు తిరిగాక ఇక్కడికివచ్చిఇనుప దండాన్ని నీటిలో వేసినప్పుడు అది నీటిపై తేలింది.  ఇంద్రుడు సంతోషంతో అక్కడ స్నానం చేసి తన శాపాన్ని పోగొట్టుకున్నాడు.  ఇంద్రుడు మహావిష్ణువుకు ఈ విషయాన్ని చెప్పగా ఆయన రవి చంద్రులున్నంతకాలం ఈ తీర్ధం లోహదండ తీర్ధంగా ప్రసిధ్ధి చెందుతుందని వరమిచ్చాడు.  అప్పటినుంచీ అది లోహదండ తీర్ధమయింది.

 



శంకరుడు త్రిపురాసురులమీద యుధ్ధం చేసేటప్పుడు అతని స్వేదం ధారగా కారి భీమాశంకరంలో భీమానదిగా మారింది.  ఆ నది ఇక్కడ లోహదండ తీర్ధముతో కలిసి, ముందుకు పారిన తర్వాత కృష్ణానదిలో కలుస్తుంది. భీమానదిని ఇక్కడివారు చంద్రభాగానది అని పిలవటానికి కారణం ఈ నది ఇక్కడవున్న వంతెన దగ్గరనుంచి, విష్ణుపాదాలదాకా చంద్రవంకలాగా వంకర తిరిగి వుంటుంది.  అందుకే చంద్రభాగ అన్నారు. ఈ నదికి ఇక్కడ 11 ఘాట్ లు వున్నాయి.  ఆలయం ఎదురుగా వున్న ఘాట్ లో పుండరీకుని మందిరం, పుండరీకుని తల్లిదండ్రుల సమాధి, ఇంకా కొందరి భక్తుల మందిరాలు వుంటాయి.  నది ఒడ్డున అనేక భక్తుల మందిరాలుకూడా వున్నాయి.  నదిలో వెళ్తే నారదముని స్నానం చేసే స్ధలమని చెప్పబడే ఒక చిన్న మందిరం నీళ్ళల్లో మునిగి వుంటుంది.  రుక్మిణి, కృష్ణుల మధ్య తంపులు పెట్టిన కారణంగా నారదుని మందిరం మునిగి పోవాలని కృష్ణుడు శాపం ఇచ్చాడని, అందుకే అలా వుంటుందని పడవ నడిపే ఆకాశ్ అన్నాడు.

 

ఇక్కడ తప్పక చూడవలసినవి విష్ణుపాదాల గుడి.  నీళ్ళల్లోంచి వెళ్ళాలి.  పడవలో, ఆటోలోకూడా వెళ్ళవచ్చు.  ఒడ్డున వేరే ఆలయాలుకూడా వుంటాయి.  పడవలో వెళ్తే వాటిని చూడటానికి మెట్లు ఎక్కి వెళ్ళాలి.  ఆటోలో వెళ్తే ముందు ఆ ఆలయాలు చూసి మెట్లు దిగి విష్ణుపాదాలు చేరుకోవచ్చు.  ఇక్కడ ఒక మండపంమధ్యలో కృష్ణుడు వేణువునూదే భంగిమలో పాదాలు, మామూలుగావున్న పాదాలు, వేణువు, గోవుల పాదాలు వుంటాయి.  ఇక్కడవున్న రెండు రాళ్ళమీద కూర్చుంటే అక్కడనుంచి కదలబుధ్ధికాదు.

 

 

వసతి: గజానన్ మహరాజ్ మందిరంలో వసతి సౌకర్యం వున్నది.  అతి విశాలమైన ఆవరణలో, అందమైన గజానన్ మహరాజ్ మందిరం, ధ్యాన మందిరాలతో చాలా బాగుంది.  నాన్ ఎ.సి. డబల్ బెడ్ రూమ్ 250 రూ. లు.  ఇక్కడ ఇంకా అనేక రకాల వసతి సదుపాయాలు వచ్చే మనుష్యుల సంఖ్యనిబట్టి వుంటాయి.  అయితే రాత్రిపూట వెళ్తే గదులు ఇవ్వమన్నారు.  ఇంకా ముఖ్యం తప్పనిసరిగా ఫోటో ఐడెంటిటీ కార్డు వుండాలి.  ఇంకా అనేక వసతి సౌకర్యాలు దేవాలయంవారివి, ప్రైవేటువారివి వున్నాయి. ఆలయంలోకి సెల్ ఫోన్లు, కెమేరాలు, ఒక్కొక్కసారి స్త్రీల హేండ్ బాగ్ లుకూడా (కొంచెం పెద్దగా వుంటే) అనుమతించరు. ఆలయానికి ఎడమవైపునుంచి వెళ్తే తుకారాం మందిరంలో మధ్యాహ్నం 2-30 దాకా ఉచిత భోజన వసతి వున్నది.

పండుగలు: ప్రతి ఏకాదశికీ భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.  ముఖ్యంగా ఆషాఢమాసం, కార్తీక మాసాలలో శుధ్ధ ఏకాదశిలలో పెద్ద ఉత్సవాలు జరుగుతాయి.  ఈ ఏకాదశిలకు ముందు ఒక వారం రోజులనుంచీ పౌర్ణమి వెళ్ళేదాకా భక్తులు చాలా అధిక సంఖ్యలో వుంటారు.  ఇక్కడ వసతి సౌకర్యాలు అనేకం వున్నప్పటికీ ఈ ఉత్సవ సమయాల్లో వసతి దొరకటం కష్టం.

రవాణా సౌకర్యం: హైదరాబాదునుంచి       కి.మీ.ల దూరంలో షోలాపూర్ జిల్లాలోవున్న ఈ క్షేత్రానికి అన్ని ప్రధాన పట్టణాలనుంచి రోడ్డు రవాణా సౌకర్యాలున్నాయి.  కురడేవాడినుంచి, మిరాజ్ నుంచి మీటరు గేజ్ రైళ్ళున్నాయి.

 

 


 పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)


More Punya Kshetralu