సంపూర్ణ కార్తీక మహాపురాణము

ఇరువది ఎనిమిదవ రోజు పారాయణము

 

 

పంచవింశోధ్యాయః
   
శ్రీకృష్ణుడు చెబుతున్నాడు: సత్యభామా! నారద ప్రోక్తాలైన సంగతులతో ఆశ్చర్యమానసుడయిన పృథువు ఆ ఋషుని పూజించి, అతని వద్ద సెలవు తీసుకున్నాడు. ఆ కారణంగా ఈ మూడు వ్రతాలూ కూడా నాకు అత్యంత ప్రీతిపాత్రాలయి వున్నాయి. మాఘ, కార్తీక వ్రతముల వలెనే తిథులలో ఏకాదశి, క్షేత్రములలో ద్వారక - నాకత్యంత ప్రియమైనవి సుమా! ఎవరయితే వీటిని విధివిధానంగా ఆచరిస్తారో వాళ్ళు నాకు యజ్ఞాదిక్రతు కర్మకాండలు చేసిన వారి కంటే కూడా చేరువ సన్నిహితులవుతున్నారు. అటువంటివాళ్ళు - నా కరుణాపూర్ణులై పాపభీతి లేని వాళ్ళవుతారు.
   
శ్రీకృష్ణ వచనామృత శ్రవణజాత విస్మయమైన సత్యభామ - 'స్వామీ! ధర్మదత్తునిచే ధారబోయబడిన పుణ్యం వలన 'కలహ' కు కైవల్యం లభించింది. కేవలం కార్తీక స్నానపుణ్యం వలన రాజద్రోహాది పాపాలు పటాపంచలయిపోతున్నాయి. స్వయంకృతాలో, కర్తల నుండి దత్తములో అయినవి సరే! అలా కాకుండా మానవజాతికి పాపపుణ్యాలేర్పడే విధానమేమిటి? దానిని వివరించు' అని కోరడంతో - గోవిందుడిలా చెప్పసాగాడు.
   
పాప-పుణ్యములు ఏర్పడు విధానము
   
    శ్లో||     దేశ గ్రామకులానిస్యు ర్భోగభాంజికృతాదిషు|
              కలౌతు కేవలంకర్తా ఫలభక్పుణ్య పాపయోః||

 

 

Sampoorna Karthika Maha Purananamu 28th Day Parayanam

'ప్రియా! కృతయుగంలో చేయబడిన పాపపుణ్యాలు గ్రామానికీ, ద్వాపరయుగం లోనివి వారివారి వంశాలకీ చెందేవి. కలియుగంలో చేయబడిన కర్మఫలం మాత్రం కేవలం ఆ కర్తకొక్కడికే సిద్ధిస్తుంది.

సంసర్గ - రహిత సమాయత్తములయే పాపపుణ్యాలను గురించి చెబుతాను విను. ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించటం వలన, ఒక స్త్రీతో రమించడం వలన కలిగే పాప-పుణ్యాలను తప్పనిసరిగానూ, సంపూర్తిగానూ అనుభవిస్తున్నాడు.

వేదాది బోధనల వలన, యజ్ఞము చేయడం వలన పంక్తి భోజనం వలన కలిగే పాప-పుణ్యాలలో నాలుగవ వంతును మాత్రమే పొందుతున్నాడు. ఇతరులచే చేయబడే పాప-పుణ్యాలను చూడడం వలన, తలంచుకోవడం వలన- అందులోని వందవ భాగాన్ని తాను పొందుతున్నాడు. ఇతరులను దూషించేవాడూ, తృణీకరించేవాడు, చెడుగా మాట్లాడేవాడు, పితూరీలు చేసేవాడూ - వీడు ఇతరుల పాపాలను తాను పుచ్చుకుని పుణ్యాన్ని జారవిడుచుకుంటున్నాడని తెలుసుకో - తన భార్య చేతనో, కొడుకు చేతనో, శిష్యుని చేతనో తప్ప, ఇతరుల చేత సేవలు చేయించుకొన్నట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యమును యిచ్చి తీరాలి. అలా ఈయనివాడు తన పుణ్యంలో సేవానురూపమైన పుణ్యాన్ని ఆ యితరులకు జారవిడుచుకున్న వాడవుతున్నాడు. పంక్తి భోజనాలలో, భోక్తలలో ఏ లోపం జరిగినా- ఆలోపం యెవరికి జరిగిందో వారు - యజమానుల పుణ్యంలో ఆరవ భాగాన్ని హరించినవారవుతున్నారు. స్నాన, సంధ్యాదుల నాచరిస్తూ ఇతరులను తాకినా, ఇతరులతో పలికినా - వారు తమ పుణ్యంలో ఆరవవంతును, ఆ యితరులకు కోల్పోతారు. ఎవరి నుండి అయినా యాచనచేసి తెచ్చిన ధనంతో ఆచరించిన సత్కర్మవలన కలిగే పుణ్యం ధనమిచ్చిన వానికే చెందుతుంది. కర్తకు కర్మఫలం వినా మరేమీ మిగలదు. దొంగిలించి తెచ్చిన పరద్రవ్యంతో చేసే పుణ్య కర్మ వలన పుణ్యం ఆ ధనం యొక్క యజమానికే చెందుతుంది తప్ప -ఈ కర్మఠునికి దక్కదు.
   

 

 

Sampoorna Karthika Maha Purananamu 28th Day Parayanam

 

ఋణశేషం వుండగా మరణించిన వారి పుణ్యంలో శేషఋణానికి తగినంత పుణ్యం ఋణదాతకు చెందుతూ వుంది. పాపంగాని, పుణ్యంగాని - ఫలానా పని చేయాలనే సంకల్పం కలిగినవాడూ, ఆ పని చేయడంలో తోడుపడేవాడు, దానికి తగినంత సాధన, సంపత్తిని సమకూర్చినవాడు, ప్రోత్సహించేవాడు తలా ఒక ఆరవవంతు ఫలాన్నీ పొందుతారు. ప్రజల పాప -పుణ్యాలలో రాజుకు, శిష్యుని వాటిలో గురువుకు, కుమారుని నుండి తండ్రికి, భార్య నుండి భర్తకు ఆరవభాగం చేరుతుంది. ఏ స్త్రీ అయితే పతిభక్తి కలదై, నిత్యం తన భర్తను సంతోషపెడుతుందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యంలో సగభాగానికి అధికారిణి అవుతుంది. తన సేవకుడో, కొడుకో గాని ఇతరుని చేత ఆచరింపచేసిన పుణ్యాలలో తనకు ఆరవ వంతు మాత్రమే లభిస్తుంది. ఈ విధంగా ఇతరులెవరూ మనకి దానం చేయకపోయినా, మనకే నిమిత్తమూ లేకపోయినా వివిధ జనసాంగత్యాల వలన - పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తించిన తప్పడము లేదు. అందువలనే సజ్జన సాంగత్యం చాలా ప్రధానమని గుర్తించాలి. ఇందుకుదాహరణగా ఒక కథ చెబుతాను విను.
   
 పంచవిశోధ్యాయ స్సమాప్తః (ఇరువది అయిదవ అధ్యాయము సమాప్తము)
   
 షడ్వింశోధ్యాయః
 ధనేశ్వరుడి కథ - సత్సాంగత్య మహిమ

 

 

Sampoorna Karthika Maha Purananamu 28th Day Parayanam

 

బహుకాలం పూర్వం అవంతీపురంలో ధనేశ్వరుడనే బ్రాహ్మణుడుండేవాడు. సహజంగానే ధనికుడయిన అతగాడు కులాచార భ్రష్టుడయి పాపాసక్తుడయిచరించేవాడు. అసత్యభాషణం, చౌర్యం, వేశ్యాగమనం, మధుపానం - ఇత్యాది దుష్కర్మలలో చురుకుగా పాల్గొనడమేగాక షడ్రసాలూ, కంబళ్ళు చర్మాలు మొదలైన వర్తకాలు కూడా చేసేవాడు.

వర్తకం నిమిత్తము ఒక దేశము నుంచి మరొక దేశానికి వెళ్ళడం అతని అలవాటు. అదేవిధంగా ఒకసారి మహిష్మతీనగరం చేరాడు. ఆ నగర ప్రాకారం చుట్టూ నర్మదానది ప్రవహిస్తూ వుంది.

ధనేశ్వరుడు ఆ పట్టణంలో వర్తకం చేసుకుంటూ వుండగానే - కార్తీకమాసం ప్రవేశించింది. దానితో ఆ వూరు అతి పెద్ద యాత్రాస్థలిలా పరిణమించింది. వచ్చేపోయే జనాల రద్దీ వలన వర్తకం బాగా జరుగుతుంది గదా! ధనేశ్వరుడా నెలంతా అక్కడనే వుండిపోయాడు. వర్తక లక్ష్యంతో ప్రతిరోజూ నర్మదా తీరంలో సంచరిస్తూ అక్కడ స్నాన - జప, దేవతార్చనా విధులను నిర్వహిస్తున్న వారిని చూశాడు. నృత్యగాన మంగళవాద్యయుతంగా హరికీర్తనలనూ - కథలనూ ఆలాపించేవారూ, విష్ణు ముద్రలను ధరించిన వాళ్ళూ, తులసి మాలలతో అలరారుతున్న వాళ్ళూ అయిన భక్తులను చూశాడు. చూడటమే కాదు, నెల పొడుగునా తానొక్కడే మసలుతూండటం వలన వారితో పరిచయం కలిగింది. వారితో సంభాషిస్తూండే వాడు. ఎందరో పుణ్యపురుషులను స్వయంగా స్పృశించాడు. తుదకు ఆ సర్జన సాంగత్యం వలన అప్పుడప్పుడు విష్ణు నామోచ్చరణం కూడా చేసేవాడు.

నెల రోజులూ ఇట్టే గడిచిపోయాయి. కార్తీకోద్యాపనా విధినీ, విష్ణు జాగరాన్నీ కూడా దర్శించాడా ధనేశ్వరుడు. పౌర్ణమినాడు గో బ్రాహ్మణపూజల నాచరించి, దక్షిణ భోజనాదులను సమర్పించే వ్రతస్థులను చూశాడు. పిదప సాయంకాలం శివ ప్రీత్యర్ధం చేయబడే దీపోత్సవాలను తిలకించాడు. సత్యభామా! నాకు అత్యంత ప్రీతికరమైన కార్తీకమాసంలో శివారాధన దేనికా అని ఆశ్చర్యపడకు సుమా!
   
  శ్లో|| మమరుద్రస్యయః కశ్చి దంతరం వరికల్పయేత్
        తస్య పుణ్య క్రియాస్సర్వానిష్ఫ లాస్స్యుర్న సంశయః||

Sampoorna Karthika Maha Purananamu 28th Day Parayanam

 

   
ఎవరైతే నన్నూ, శివుణ్ణీ భేదభావంతో చూస్తారో, వారి యొక్క సమస్తమైన పుణ్యకర్మలూ కూడా వృధాయైపోతాయి. అదీగాక ఆ శివుడు కార్తీక పౌర్ణమినాడే త్రిపుర సంహారం చేసినవాడవడంచేత కూడా, ఆయన నారోజున ఆరాధిస్తారు. ఇక, ధనేశ్వరుడీ పూజా మహోత్సవాల నన్నింటినీ ఎంతో ఆశ్చర్యంతోనూ, వాంఛతోనూ చూస్తూ అక్కడక్కడే తిరుగుతున్నాడు. కాని, ఆ సమయంలోనే కాలవశాన ఒక కృష్ణసర్పం అతనిని కాటు వేయటం, తక్షణమే స్పృహ కోల్పోవడం, అపస్మారకంలో వున్న అతగాడికి భక్తులు తులసి తీర్ధాన్ని సేవింప చేయడం - ఆ అనంతరం క్షణంలోనే ధనేశ్వరుడు దేహ త్యాగం చేయడం జరిగింది.

 మరుక్షణమే యమదూతలు వచ్చి అతని జీవుని పాశబుద్దుడిని చేసి, కొరడాలతో మోదుతూ యముని వద్దకు తీసుకువెళ్లారు. యముడు అతని పాప-పుణ్యాల గురించి విచారణ నారంభించగా చిత్రగుప్తుడు - 'హే ధర్మరాజా! వీడు ఆగర్భ పాపాత్ముడే గాని, అణువంతయినా పుణ్యం చేసినవాడుకా'డని చెప్పాడు. ఆ మాట మీద దండధరుడు తన దూతల చేత ధనేశ్వరుడి తలను చితుగగొట్టించి, కుంభీపాక నరకంలో వేయించాడు.

 

 

Sampoorna Karthika Maha Purananamu 28th Day Parayanam

 

కానీ, ధనేశ్వరుడు ఆ నరకంలో పడగానే, అక్కడి అగ్నులు చప్పగా చల్లారి పోయాయి. ఆశ్చర్యపడిన దూతలీ విషయాన్ని కాలునికి విన్నవించారు. అంతకంటే అబ్బురపడిన నరకాధీశుడు తక్షణమే ధనేశ్వరుని తన కొలువుకు పిలిపించి పునర్విచారణను తలపెట్టుతూండగా అక్కడికి విచ్చేసిన దేవర్షియైన నారదుడు - 'ఓ యమధర్మరాజా! ఈ ధనేశ్వరుడు తన చివరి రోజులలో నరక నివారకాలయిన పుణ్యాల నాచరించాడు. గనుక, ఇతనిని నీ నరకం యేమీ చేయలేదు. ఎవరైతే పుణ్య పురుష దర్శన, స్పర్శన, భాషణలకు పాత్రులో వారా సజ్జనుల యొక్క పుణ్యంలో ఆరవభాగాన్ని పొందుతూ వున్నారు. అటువంటిది ధనేశ్వరుడు ఒక నెలపాటు కార్తీక వ్రతస్థులయిన యెందరెందరో పుణ్యాత్ములతో సాంగత్యంచేసి విశేష పుణ్యభాగాలను పొంది వున్నాడు. కార్తీక వ్రతస్థుల సహజీవనం వలన యితను కూడా సంపూర్ణ కార్తీక వ్రతఫలాన్ని ఆర్జించుకున్నాడు. అదీగాక అవసానవేళ హరిభక్తులచేత తులసి తీర్ధమును పొందాడు. కర్ణపుటాలలో హరి నామస్మరణం జరుపబడింది. పుణ్య నర్మదా తీర్ధాలతో వీని దేహము, సుస్నాతమయ్యింది. అందరు హరిప్రియుల ఆదరణకు పాత్రుడయిన ఈ విప్రుడు నరకానుభవానికి అతీతుడేనని తెలుసుకో, ఇతగాడు దేవతావిశేషుడు. పుణ్యాత్ముడైన యీ భూసురుడు - పాప భోగాలయైన నరకమందుదుండేందుకు అనర్హుడు' అని బోధించి వెళ్ళాడు.ఏవం శ్రీ పద్మ పురాణాంతర్గత కార్తీక మహత్మ్యమందలి
   
 ఇరువది అయిదు, ఇరువదియారు- అధ్యాయములు

 

Sampoorna Karthika Maha Purananamu 28th Day Parayanam

 

28 వ రోజు

నిషిద్ధములు        :- ఉల్లి, ఉసిరి, సొర, గుమ్మడి ,వంకాయ

దానములు         :- నువ్వులు, ఉసిరి

పూజించాల్సిన దైవము     :- ధర్ముడు

జపించాల్సిన మంత్రము     :- ఓం ధర్మాయ, కర్మనాశాయ స్వాహా

ఫలితము         :- దీర్ఘకాల వ్యాధీహరణం

 

ఇరువది ఎనిమిదవ (బహుళ త్రయోదశి) రోజు పారాయణము సమాప్తము


More Kartika Maha Puranam