బెట్ ద్వారక

 

 

పురాతనమైన ఆలయం - శ్రీ కృష్ణుడు నివసించిన రాజప్రాసాదం ద్వారకా మహత్యం గురించి స్కంద పురాణంలో ఏడవ ప్రభాస కాండంలో   వివరంగా చెప్పారు.  ద్వారకాదీసుడైన శ్రీ కృష్ణుడు నివసించిన ప్రదేశం బెట్ ద్వారక.  ఆ స్థల విశేషాలు..... 

 

బెట్ ద్వారక  ఒక  చిన్న ద్వీపం.  ద్వారకా పట్టణానికి ఉత్తరంగా, ముఫై కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రానికి ఒడ్డున  ఓకా పట్టణం  వుంది.  అక్కడి నుంచి  ఫెర్రీ ల ద్వారా   బెట్  ద్వారకా   చేరుకోవచ్చు.  బెట్  ద్వారక అంటే  శ్రీ కృష్ణుడి చిన్ననాటి గురుకుల స్నేహితుడు సుదాముడు (కుచేలుడు) బెట్ అంటే  బహుమతిని ఇచ్చిన ప్రదేశం అని.  పేదవాడైన కుచేలుడు గుప్పెడు అటుకులని శ్రీకృష్ణుడికి కానుకగా సమర్పించినది,  కుచేలుడి పాదాలు కడిగి సాదరంగా ఆహ్వానించిన ప్రదేశం  ఇక్కడే...  బెట్  ద్వారక శ్రీ కృష్ణుడు తన కుటుంబంతో  పరివారం తో నివసించిన ప్రదేశమని కూడా. గోమతి  ద్వారకా పట్టణం లో శ్రీకృష్ణుడు తన దర్బారుని  నడిపించాడని రాత్రికి ఇక్కడికి తిరిగి వచ్చేవాడని అంటారు. ఇది  చాలా పవిత్రమైన ప్రదేశం.

 

 

 
            అలనాడు శ్రీ కృష్ణుడి నిర్యాణానంతరం అసలైన ద్వారక సముద్ర గర్భంలో కలిసిపోగా మిగిలిన చిన్న భూభాగమే  ఈ బెట్ ద్వారక.  ప్రధాన ఆలయమైన ద్వారక లో వున్న ద్వారకాధీశుడి విగ్రహం లాగానే ఈ బెట్ ద్వారకా లో కుడా ఉంటుంది.  ఈ రెండు విగ్రహాలాలో  చేతిలోని గద ధారణలో మాత్రం మార్పు వుంటుంది.  సైజు లో కూదా కొంచెం చిన్నగా  వుంటుంది విగ్రహం.
     శ్రీ కృష్ణుడి భక్తుడైన వల్లభాచార్య   దీన్ని నిర్మించినట్లు చెబుతారు. శ్రీకృష్ణుడి తో పాటు  ఆలయం లో ప్రద్యుమ్నుడు, పురుషోత్తముడు,   దేవకీ ఆలయాలు వున్నాయి.  ఉత్తర, దక్షిణ  దిశలో గరుడుడి ఆలయం ఉంది.  కృష్ణుడి ఆలయం సమీపంలో,  తూర్పున  సాక్షి గోపాలుడి ఉత్తరాన రుక్మిణి, రాదా దేవి  ఆలయాలు, జాంబవతి, మొదలైన  మూర్తుల ఆలయాలు కూడా వున్నాయి.

 

 

ఇక్కడ చాలా మంది భక్తులు  గోధుమపిండి, ఇతర ఆహారపదార్ధాలు దానంగా ఇస్తారు.  బెట్ ద్వారక  ఆలయంలో మధ్యాహ్నం 1 గంటకి మహా ప్రసాదం గా    భక్తులకి భోజనం పెడతారు
    బియ్యం పళ్ళెంలో  దక్షిణ పెడితే  కొంచెం బియ్యం చేతిలో  ప్రసాదం గా ఇస్తారు.  ఆ బియ్యాన్ని ఇంట్లోని  బియ్యం లో కలుపుకోమని చెబుతారు.  బియ్యాన్ని ప్రసాదం గా ఇవ్వటం ఇక్కడే కనిపించింది.
ఇక్కడ పెద్ద గోశాల కూడా  వుంది.

 భౌగోళికంగా ....

బెట్ ద్వారక పురాణాల కాలం నుంచీ ఎంతో ప్రసిద్ది చెందింది.  ప్రస్తుత యుగం లో ఆ స్థల ప్రాశస్త్యాన్ని గురించి అనేక పరిశోధనలు జరిగాయి... జరుగుతున్నాయి.ఈ అతి ప్రతి ప్రాచీనమైన బెట్ ద్వారకాలో పురా వస్తు  శాఖ వారు,  నిర్మాణ  శాస్త్ర  నిపుణుల బృందాల పరిశోధనా ఫలితాల ద్వారా  ఈ బెట్ ద్వారకలో వాణిజ్య వ్యాపారాలు విస్తృతంగా జరిగేవని తెలిసాయి.  ఇక్కడ లభించిన మృణ్మయ పాత్రలు, నాణేలు, రాగి చేపల గాలాలు,  రాతి లంగర్లు, హరప్పన్ ల కాలం నాటి మట్టి పాత్రలు పాత్రలు  ఇంకా ఇతర పాత్రలు లభించాయి.  అంతే కాదు ఈ బెట్ ద్వారక ద్వీపం, దాని చుట్టు పక్కల ప్రదేశాలు  సముద్ర తీవ్రత మూలంగా భూమి ఊచకోతకు గురయింది.

 

 

ఇక్కడ  లభించిన రక రకాలైన రాతి లంగర్లు అక్కడ లభించే రాళ్ళతో చేసినట్లు తెలుస్తోంది.  లబించిన  సత్తు బిళ్ళలు, సత్తు లంగర్లు, ఇంకా లభించిన  నౌకా  అవశేషాలను బట్టి అక్కడ రోమన్  వ్యాపార సంబంధాలు తెలియ జేస్తున్నాయి.    బెట్ ద్వారక పురాతనమైన,  ప్రధానమైన రేవు పట్టణం అని తెలుస్తోంది.  ఈ బలమైన రాతి లంగర్ల వాళ్ళ నౌకలు కొట్టుకు పోకుండా ఆపేవి. అత్తర్లు, ద్రాక్షరసం వంటి వ్యాపారాలు క్రీ.పూ.4 వ శతాబ్దం నుంచి క్రీ.శ. 4 వ. శతాబ్దం వరకూ కూదా విస్తృతంగా జరిగేవని అక్కడ లభించిన సీలు వేసిన కూజాలు, నౌకా అవశేషాలు చూస్తె  తెలుస్తుంది .  ద్వారకా నగరం లోని జామ్ నగర్ జిల్లాలో  సముద్ర మట్టం లో వుంది. ఇక్కడికి రాజ్ కోట్  వరకు  కాని, అహ్మదాబాద్ వరకు కాని రైల్ లో వచ్చి అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా ద్వారక చేరుకోవచ్చు.  ద్వారక నుంచి రానూ పోనూ మాట్లాడుకుని  ప్రైవేట్ వాహనాల ద్వారా ఒఖా చేరుకోవచ్చు.  అక్కడినుంచి సముద్రంలో ప్రయాణించి బెట్ ద్వారక చేరుకోవచ్చు.  ఈ ఆలయం సముద్రమట్టానికి కొద్దిగా ఎత్తులో గుట్ట మీద వుంటుంది.
 
మా అనుభవం :

ద్వారకా నగరి  నుండి మేము చుట్టుపక్కల ప్రదేశాలు చూడటానికి పది మంది అక్కడి లోకల్ ట్రాన్స్ పోర్ట్ వెహికల్ లో బయలు దేరి ముందుగా గోపితలాబ్, నాగేశ్వర్ చూసి, బెట్ ద్వారక చేరుకున్నాము. రోడ్డు మీద నుంచి  10 ని. నడిచాక సముద్రపు పడవలు వుండే ప్రదేశానికి చేరుకున్నాము. అక్కడ 20 ని.లు వెయిట్  చేసాక ఆవలి ఒడ్డున వున్న బెట్ ద్వారక ద్వీపానికి ఫెర్రీ లో చేరుకున్నాము. ఇక్కడ సముద్రం మీద ఎగిరే పక్షులు యాత్రికులని ఆహ్లాద పరుస్తాయి.  ఒక్కో ఫెర్రీ లో వంద మంది పైగా వుంటారు.  ఫెర్రీ లు కూదా ఒక పద్ధతిలో ఒకదాని వెంట ఒకటి వెడతాయి.  ఖాళి అని ఎవరూ వేరే వాటిల్లో  ఎక్కరు.  బోటు నెం. చెబితే అందులోనే  ఎక్కాలి.  ఎక్కే ముందు   తోపులాట జరిగింది. అందరికీ ఆత్రమే... ఎక్కాలని.   ఏమాత్రం ఏమరుపాటుగా వున్నా కింద నీళ్ళలో  పడిపోటాము. పట్టుకోడానికి ఏమి వుండవు.  రిటర్న్ తిరిగి వచ్చేటప్పుడు ప్రత్యేకంగా బోటు మాట్లాడుకుని ఎక్కువ పే చేసి మా గ్రూప్ మాత్రమే ఎక్కి  వచ్చాము.

 

 

మేము ఓకా రేవు మీదుగా సముద్రంలో బెట్ ద్వారక  వెళ్ళినపుడు నౌకలు, ఫెర్రీలు, బోటు లు చాల కనిపించాయి. చాలా మంది బోటు ఎక్కే ముందు మరుమరాల  పాకెట్ లు కొన్నారు. బోటు బయలు దేరాక ఎక్కడి నుంచో సముద్ర పక్షులు, కొంగలు మాతో పాటు వచ్చాయి.  అందరూ తమ వద్ద నున్న మరుమరాలు వేస్తుంటే అవి కింద పడకుండా క్యాచ్ పట్టుకుంటున్నాయి.  15 ని. జరిగిన సముద్ర  ప్రయాణంలో అవి అక్కడ ప్రయాణించే ఇతర ఫెర్రీ ల వద్దకు తిరుగుతూ ఆహ్లాదాన్ని  పంచాయి.  మేము తిరిగి వచ్చేటప్పుడు సూర్యాస్తమయం కావటంతో సముద్రం మీదనుంచి  సూర్య బింబం లేలేత ఎరుపు రంగులో కనువిందు చేసింది.  మా బెట్ ద్వారకా యాత్ర ఒక మరపురాని అనుభవం ....

 

 

 

 

....Mani Kopalle
 


More Punya Kshetralu