పరమ పవిత్రమైన త్రి గయా క్షేత్రాలు

 


                                                                             
ఇదేమిటి కొత్త పేరు అనుకుంటున్నారా  కొత్త పేరేమీకాదండీ.  పురాణకాలంనుంచీ వున్న క్షేత్రాలే.. వీటిగురించి తెలియాలంటే మీకోకధ చెప్పాలి.  అనగనగనగా….

 

పూర్వం గయాసురుడనే రాక్షసుడుండేవాడు.  ఆయన రాక్షసుల్లో తప్పబుట్టాడు.  ఆయనకి దైవ భక్తి చాలా ఎక్కువ.  ఒకసారి గయాసురుడు చేసిన తపస్సుకి విష్ణుమూర్తి సంతసించి ప్రత్యక్షం కాగా, గయాసురుడు పృధ్వీ మండలంమీద వున్న అన్ని తీర్ధములకన్నా తన శరీరము పవిత్రంగా వుండే వరాన్ని కోరుకున్నాడు.  విష్ణుమూర్తి వరాన్ని ఇచ్చాడు.  దానితో గయాసురుని సందర్శించినవారి పాపాలన్నీ పటాపంచలయి మరణించినతర్వాత అందరూ స్వర్గానికి పోసాగారు. గయాసురుడు చేసిన యాగాలవల్ల ఆయనకి ఇంద్ర పదవి లభించింది.  గయాసురుడు మంచివాడయినా, అతని అనుచరులు  రాక్షసకృత్యాల చేసేవారు.  దానితో యజ్ఞయాగాదులకు అంతరాయాలు కలగటంవల్ల దేవతలు శక్తిహీనులయ్యారు.   వర్షాలు కురవక, పంటలు పండక ప్రజలు అవస్త పడసాగారు.  పదవీచ్యుతుడైన ఇంద్రుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల గురించి తపస్సు చెయ్యగా వారు ప్రత్యక్షమయ్యారు.  ఇంద్రుడు వారికి పరిస్ధితి వివరించి,   గయాసురుని వధించి, దేవతలకు అండగా నిలిచి,  సామాన్య ప్రజలను రక్షించమని కోరాడు.  

 

 

దానికి అంగీకరించిన త్రిమూర్తులు గయాసుర సంహారానికి ఒక పధకం వేశారు.  వారు ముగ్గురూ బ్రాహ్మణుల రూపంలో గయాసురుని దగ్గరకు వెళ్ళి విశ్వ శాంతి కోసం తాము తలపెట్టిన యజ్ఞానికి సహాయపడమని అడిగారు.  దానికి గయాసురుడు ఏమి చెయ్యవలెనో తెలుపమనగా, త్రిమూర్తులు  పుణ్య క్షేత్రాలన్నీ మానవుల పాపాలతో కలుషితమవుతుండటంతో యజ్ఞాన్ని ఆ క్షేత్రాలలో చేయలేమనీ,  ఏడు రోజులు జరిగే  ఆ యజ్ఞాన్ని  భూమండలం భరించలేదుగనుక, గయాసురుడి శరీరం అన్ని పుణ్యక్షేత్రాలకన్నా పవిత్రమైనదిగనుక ఆయన అంగీకరిస్తే ఆయన శరీరంమీద యజ్ఞం చేస్తామన్నారు.

 

 

దానికి గయాసురుడు సంతోషంగా అంగీకరించాడు.  అయితే త్రిమూర్తులు ఏడు రోజులు జరిగే ఆ యజ్ఞం పూర్తయ్యేవరకూ గయాసురుడు కదలకూడదనీ, కదిలినచో యజ్ఞం అసంపూర్తిగా వుంటుందనీ అలా అయితే తాము గయాసురుణ్ణి సంహరిస్తామనీ చెప్పారు. అందుకు ఒప్పుకున్న గయాసురుడు తన శక్తిచేత తన దేహాన్ని యజ్ఞానికి అనువుగా వుండేటట్లు పెంచాడు.  అప్పుడా శరీరం తల బీహారు రాష్ట్రంలోని గయలోను,  నాభి ఒరిస్సా రాష్ట్రంలోని జాజ్ పూర్లోను,  పాదములు ఆంధ్ర రాష్ట్రంలోని  పిఠావురంలోనూ వున్నాయి.  అలా పెంచిన శరీరంమీద యజ్ఞాన్ని ప్రారంభించమన్నాడు.

 

 

విష్ణుమూర్తి తల భాగమందు, బ్రహ్మ నాభి ప్రాంతమునందు, పరమేశ్వరుడు కాళ్ళ భాగములో వుండి యజ్ఞము ప్రారంభించారు.  గయాసురుడు యోగవిద్యచే తన శరీరాన్ని కదల్చకుండావుంచి, ప్రతి రోజూ కోడికూతనుమాత్రం వింటూ ఎన్నిరోజులయిందో లెక్కపెట్టుకునేవాడు.  అలా ఆరు రోజులు గడిచాయి.  ఏడవ రోజు గయాసురుని సంహరించే ఉద్దేశ్యంతో శివుడు కోడిరూపము ధరించి తెల్లవారుఝాముకాకుండానే  కొక్కొరకో అని కూశాడు.  ఈ విషయం తెలియని గయాసురుడు  యజ్ఞం పూర్తయిందని సంతోషంగా కదిలాడు.  అప్పుడు త్రిమూర్తులు యజ్ఞం పూర్తికాకుండా గయాసురుడు కదిలాడుకనుక అతనిని వధిస్తామన్నారు. గయాసురుడు అసలు సంగతి తెలుసుకుని త్రిమూర్తుల చేతిలో మరణము ముక్తిదాయకమన్నాడు.  త్రిమూర్తులు వరం కోరుకోమనగా తన శరీరంలోని మూడు ముఖ్య భాగములూ తనపేరున త్రిగయా క్షేత్రములుగా ప్రసిధ్ధిపొందేటట్లూ,ఆ క్షేత్రాలలో త్రిమూర్తులు ముగ్గురూ మూడు క్షేత్రాలలో నివసించి భక్తులను కరుణించాలనీ, ఆ మూడు క్షేత్రాలూ శక్తి నివాసాలుకావాలనీ, మానవులు చనిపోయిన తమ పితరులకు  చేసే కర్మకాండలు వగైరాలు ఈ క్షేత్రాలలో చేస్తే వారికి మోక్షం ప్రసాదించమనీ కోరుకున్నాడు.  పూర్వం మహానుభావులు కోరే కోర్కెలన్నీ మానవోధ్ధరణకోసమే.  అందుకే గయాసురుడు సకల మానవ సంక్షేమంకోసం ఆ కోరికలు కోరుకున్నాడు.  త్రిమూర్తులు తధాస్తు అన్నారు.

 

గయాసురుడి శిరస్సు వున్న  ప్రదేశం శిరోగయ.  ఇది బీహారు రాష్ట్రంలో వున్న గయ.  ఇది విష్ణు నివాసం.  ఇక్కడ ఫల్గుణా నదీ తీరంలో విష్ణుపాద ఆలయం వున్నది.  పితృ దేవతలకు ఇక్కడ పెట్టే శ్రాధ్ధం గయా శ్రాధ్ధంగా ప్రసిధ్ధి చెందింది.  అవకాశమున్న ప్రతి ఒక్కరూ గతించిన తమ పితృ దేవతలకు ఇక్కడ శ్రాధ్ధ కర్మలు నిర్వహించాలనుకుంటారు..వాటితో వారు ఉత్తమగతులు పొందుతారనే నమ్మకంతో.  గయలోనే అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన  మంగళ గౌరీదేవి ఆలయం వున్నది.
ఒరిస్సా రాష్ట్రంలో కటక్ దగ్గరవున్న జాజ్ పూర్ నాభిగయా ప్రదేశం.  ఈ ప్రదేశంలో యజ్ఞం చేసిన  బ్రహ్మదేవుడు ఇక్కడ కొలువుతీరాడు.  అయితే బ్రహ్మదేవునిమూర్తికి పూజలులేవుగనుక ఇక్కడ యజ్ఞవేదికా స్వరూపంగా వున్నాడు.    ఇక్కడా పితృకార్యాలు నిర్వహిస్తారు.    ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన గిరిజాదేవి శక్తి పీఠం వున్నది.  ఇక్కడివారు ఈవిడని విరజాదేవి, బిరజాదేవి అంటారు.  ఈ ఆలయంలోనే ఒక బావిలాంటిది వుంటుంది.  దానినే బ్రహ్మదేవుడి యజ్ఞ కుండము అంటారు.  

 

ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురంలో గయాసురుడు పాదాలుంచినచోట పాదగయ అయింది.  ఇక్కడ ఈశ్వరుడు ప్రధాన దైవం. కుక్కుటం రూపంలో యజ్ఞభంగంగావించిన ఈశ్వరుడు, గయాసురుడి కోరిక ప్రకారం ఇక్కడ కుక్కుటేశ్వరుడిగా వెలిశాడు. అష్టాదశ శక్తి పీఠాలలో ఇక్కడవున్నది 10వ  శక్తి పీఠము పురూహూతికాదేవిది.త్రిగయా క్షేత్రాలలో పాదగయ శ్రేష్టమయిందంటారు.

 

గయాసురుడి కోరికమీద శివుడు కుక్కుటేశ్వరుడుగా ఇక్కడ విరాజిల్లుతున్నాడు.  అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి.  ఇక్కడ అమ్మవారికి ఇరుపక్కలా సుబ్రహ్మణ్యస్వామి, వినాయకుడు వుంటారు.
శ్రీ దత్తావతారమైన శ్రీపాద శ్రీవల్లభులు సుమతి, రాజశర్మ అను బ్రాహ్మణ దంపతులకు జన్మించింది ఇక్కడే.  ఆయన జన్మస్ధానం దర్శనీయ క్షేత్రం.

 

పాదగయాక్షేత్రానికి  క్షేత్రపాలకులు శ్రీ కుంతీ మాధవస్వామి.  ఆయనని దర్శించనిదే పిఠాపుర యాత్రాఫలితం వుండదు. ఇంద్రునిచే ప్రతిష్టించబడిన ఈయనని శ్రీ కృష్ణుని మేనత్త కుంతీదేవి పూజించింది కనుక కుంతీమాధవస్వామి అయ్యాడు. అసురుడైనా గయాసురుడు తన భక్తి ప్రపత్తులవల్ల భారత దేశంలోని మూడు ప్రదేశాలలో తన పేరు శాశ్వతంగా నిలబెట్టుకోవటమేకాదు, భవిష్యత్తరాలకోసం త్రిమూర్తులనుంచి ఎన్ని వరాలు సంపాదించాడో చూడండి. 

 

 

 

 

 

.. పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)

 


More Punya Kshetralu