బోనాలు ఎలా జరుగుతాయి?

ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ... పేరు ఏదైతేనేం! తమను చల్లగా చూడాలంటూ గ్రామస్తులు ఒక శక్తిస్వరూపాన్ని ఆరాధించడం ఆనవాయితీ. తమ గ్రామానికి ఎలాంటి ఆపదా రాకుండా, తమ ఇంటికి ఏ కష్టమూ లేకుండా చూడాలని ఆ అమ్మతల్లిని తల్చుకుంటారు. మరి అలాంటి గ్రామదేవతలను ఘనంగా కొల్చుకునేందుకు ఓ సందర్భం ఉండాలి కదా! ఆ సందర్భమే బోనాలు!! భోజనం అన్న పదానికి వికృతే బోనం! ఇలా అమ్మవారికి భోజనం సమర్పించే ఆచారం ఒక్క తెలుగునాట మాత్రమే కనిపిస్తుంది. ఆషాఢమాసం రాగానే తెలంగాణ, రాయలసీమల్లోని ప్రజలు అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు ఒక అనువైన రోజుని ఎన్నుకొంటారు. ఈ రోజున స్త్రీలు రాగి లేదా మట్టికుండలో అమ్మవారి కోసం వంట వండుతారు. చక్కెర పొంగలి, కట్టె పొంగలి, ఉల్లిపాయలు కలిపిన అన్నం.... ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు అమ్మవారి కోసం బోనం తయారుచేస్తారు.

 

 

 

బోనం ఉన్న కుండని పసుపుకుంకుమలతో అలంకరించి, వేపాకులు చుట్టి... దాని మీద జ్యోతిని వెలిగిస్తారు. ఇలా సిద్ధం చేసుకున్న బోనాన్ని తలమీద పెట్టుకుని ఊరేగింపు మధ్య అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. అమ్మవారి ఆలయానికి బయల్దేరే సమయంలో ఒళ్లంతా పసుపు రాసుకుని, తడిబట్టలతో వెళ్తూ తమ భక్తినీ, పవిత్రతనూ చాటుకుంటారు. ఆలయానికి చేరుకున్న భక్తులను అమ్మవారి ప్రాంగణానికి తీసుకువెళ్లేందుకు పోతురాజు తోడుగా ఉంటాడు. ఒళ్లంతా పసుపు రాసుకుని, కాలిగి గజ్జలు కట్టుకుని, ఎర్రటి వస్త్రం ధరించి, కొరడా చేతపట్టుకుని భీకరంగా కనిపించేవాడే పోతురాజు. ఈ పోతురాజుని అమ్మవారికి సోదరునిగా భావిస్తారు. ఈ పోతురాజు కేవలం భక్తికే కాదు, ఆలయం వద్ద ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా చూసుకుంటాడు. ఒకపక్క కోలాహలం చేస్తూనే, మరోపక్క ఆకతాయిలకు భయం కలిగిస్తాడు.

 

 

బోనాలు ఆషాఢం లేదా శ్రావణమాసంలో చేసుకోవడం వెనుక ఒక ఆరోగ్యపరమైన కారణం కనిపిస్తుంది. ఈ కాలంలో వ్యవసాయిక పనులు ఊపందుకుంటాయి. కాబట్టి చక్కగా వర్షాలు పడి, మంచి పంట పండాలని అమ్మవారిని కోరుకోవడం మానవనైజం. దానికి తోడు చలిగాలులు, వర్షాల వల్ల అంటువ్యాధులు ప్రబలుతాయి. ఆ అనారోగ్యాల నుంచి తమని కాపాడమంటూ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడమూ ఆంతర్యంగా కనిపిస్తుంది. బోనాల సమయంలో విస్తృతంగా పసుపు, వేపాకులని వాడటమే ఇందుకు సాక్ష్యం!

 

బోనాల జాతర కేవలం అమ్మవారికి నైవేద్యం అందించడంతో ముగిసిపోదు. గ్రామీణసంబరాలకి సంబంధించిన ప్రతి ఘట్టమూ ఇందులో కనిపిస్తుంది. తొట్టెల పేరుతో అమ్మవారికి కర్రలు, కాగితాలతో చేసిన అలంకారాన్ని సమర్పిస్తారు. రంగం పేరుతో ఎవరన్నా అవివాహితులు భవిష్యవాణిని చెప్పే ఆచారమూ ఈ జాతరలో ఉంటుంది. అమ్మవారిని ఘటం రూపంలో స్థాపించడం, ఆఘటాన్ని నిమజ్జనం చేయడమూ చూడవచ్చు.

ఒకప్పుడంటే బోనాల సమయంలో జంతుబలులు ఉండేవి. కానీ కాలం మారుతున్న కొద్దీ ఈ ఆచారం తగ్గినా అక్కడక్కడా కోళ్లనీ, మేకలనీ బలి ఇవ్వడం కనిపిస్తుంది. బోనాల రూపంలో అమ్మవారికి నివేదన చేసిన భోజనంతో పాటుగా మాంసాహారాన్ని వండుకుని తినడమూ సహజమే! కుటుంబం అంతా ఒక్కచోటకి చేరి చేసుకునే ఈ విందుభోజనంతో అటు భక్తితో పాటు ఇటు బంధాలు బలపడతాయి.

 

సాధారణంగా ఏదన్నా పండుగ వస్తే హైదరాబాద్లో ఉండేవారు తమ సొంత ఊళ్లకు వెళ్లడం సహజం. కానీ బోనాలలో మాత్రం హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేవారు సైతం నగరానికి చేరుకుంటారు. గోల్కొండ ఎల్లమ్మ, సికింద్రాబాదు మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ, జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి... ఇలా నగరంలోని ప్రతి కూడలిలోనూ జరిగే బోనాలు హైదరాబాద్కు వన్నె తెస్తాయి.

- నిర్జర.

 

 


More Bonalu