ఒకటే సంక్రాంతి – పది పండుగలు
తెలుగునాట పెద్దపండుగ అంటే తప్పకుండా సంక్రాంతే! మిగతా పండుగల్లాగా తిథులతో దీనికి సంబంధం లేకపోయినా, ప్రత్యేకించి ఏ దేవుడినీ ఈ సందర్భంగా కొలుచుకోకపోయినా... సంక్రాంతికి ఉండే ప్రత్యేకతలే వేరు.
కీడు పండుగ భోగి – భోగిని కీడు పండుగ అంటారు. చలికి పరాకాష్టగా నిలిచే దక్షిణాయపు చివరి రోజైన భోగితో మన ఇంట్లో, ఒంట్లో ఉన్న కీడు అంతా తొలగిపోతుందని నమ్ముతారు. దీనికి సూచనగా పాతబడిన జీవితాన్ని భోగిమంటల్లోనూ, ఒంట్లో పేరుకున్న దిష్టిని భోగిపండ్లతోనూ తొలగిపోయినట్లు భావిస్తారు.
గొబ్బెమ్మల పండుగ – గోపి అన్న మాట నుంచి గొబ్బెమ్మ వచ్చిందంటారు. సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తిని వివాహమాడిన గోదాదేవికి ప్రతిరూపంగా ధనుర్మాసమంతా ఇంటి ముంగిట గొబ్బెమ్మలని నిలుపుతారు. కుదరకుంటే కనీసం సంక్రాంతి రోజుల్లో అయినా వీటిని ఉంచి, వాటి చుట్టూ తిరుగుతూ గొబ్బి పాటలు పాడతారు. గోమయంతో చేసిన గొబ్బెమ్మలు ప్రతిమలుగానే కాదు. ఈ కాలంలో విజృంభించే క్రిమికీటకాలను ఇంట్లోకి రానీయకుండా కూడా కాపాడతాయి.
అల్లుళ్ల పండుగ – అల్లుడిని పిలిచి అతనికి తగిన మర్యాదలు చేయాలంటే చేతిలో కాస్తో కూస్తో ధనధాన్యాలు ఉండాలి. అలాంటి శుభసమయం సంక్రాంతే! వ్యవసాయం మీద ఆధారపడిన మన దేశంలో అల్లుడికి కావల్సిన పంచభక్ష్యాలు అందించేందుకు, కళకళలాడే పల్లె వాతావరణంలో కలియతిప్పేందుకు... సంక్రాంతికి మించిన ముహూర్తం ఏముంటుంది.
దేవతల పండుగ – ఉత్తరాయనం నాడు మేల్కొనే దేవతలకు ఆహ్వానం పలుకుతూ గాలిపటాలను ఎగరవేయాలట. కానీ దీని వెనుక లౌకిక కారణం కూడా కనిపిస్తుంది. సంక్రాంతితో మొదలవుతున్న ఉత్తరాయణంలో ఉష్ణోగ్రతలు నలుగురూ సరదాగా కలిసి గాలిపటాలను ఎగరవేసుకునేందుకు అనువుగా ఉంటాయి. గాలి కూడా మరీ తీక్షణంగా ఉండదు. దాంతో అప్పటి వరకూ పొలం పనులలో పడినవారంతా కాస్త సేదతీరేందుకు వీడియోగేమ్స్, టీవీలు, సినిమాలను మించిన కాలక్షేపం ఈ గాలిపటాలే!
పక్షులకూ పండుగే – కోతలు పూర్తయిన తరువాత రైతులు కొన్ని ధాన్యపు గింజలను తీసి ఉంచుతారు. వీటిని ఇళ్లకి ఉన్న చూర్లకి వేలాడదీస్తారు. అవి ఆ ఇంటిచుట్టుపక్కల తిరిగే పక్షుల కడుపుని నింపుతాయి. తనకు పుష్కలంగా ధాన్యం లభించే సమయంలో అందులో తోటి జీవులకి కూడా కొంత వాటాని అందించడం వెనుక ఎంత ఔన్నత్యం దాగి ఉందో కదా!
ముగ్గుల పండుగ – సంక్రాంతి అంటే గుర్తుకువచ్చేది ముగ్గులే! ముగ్గులని బియ్యంతో చేస్తే అవి చిన్న చిన్న జీవులకి ఆహారంగా నిలుస్తాయి. ఒకవేళ సున్నపురాయి (రాతి ముగ్గు)తో ముగ్గులు వేస్తే గాలిలోని విషవాయువులను పీల్చుకుంటాయి. ఆడవారికి ఒక వ్యాయామంలాగా, వారి సృజనకు ఒక ప్రాంగణంగా, చలికాలంలో బద్ధకాన్ని వదిలించే పనిగా... ఇలా సంక్రాంతి ముగ్గుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే!
పిండివంటల పండుగ – కొత్తబియ్యంతో అన్నం వండుకుంటే అజీర్ణం చేస్తుంది. కాబట్టి చేతికి వచ్చిన ధాన్యాన్ని పిండివంటలుగా చేసుకుంటే వాటి వల్ల అజీర్ణం చేయదు. పైగా ఆ భగవంతునికి కృతజ్ఞత చూపినట్లూ అవుతుంది. అందుకే ఈ కొత్త బియ్యానికి కొత్త బెల్లాన్ని జోడించి అరిసెలో, పొంగలో వండుకుంటారు. లేదా బియ్యపుపిండితో సకినాలు చేసుకుంటారు. పెద్దగా నూనె లేకుండా బియ్యంతో చేసే అరిసెలు, సకినాలు ఎన్ని తిన్నా తేడా చేయదు.
పశువుల పండుగ – సంక్రాంతి మర్నాడు వచ్చే కనుమని పశువుల పండుగ అంటారు. తమకి పంట పనులలో సాయపడినందుకు కృతజ్ఞతగా రైతులు ఈ రోజున పశువులని పూజించుకుంటారు. వాటికి స్నానాలు చేయించి, బొట్లు పెట్టి, దండలు వేసి ముద్దు చేస్తారు. కొమ్ములకి ఇత్తడి తొడుగుల దగ్గర్నుంచీ కాళ్లకి చిరుగజ్జెల వరకూ మనస్ఫూర్తిగా వాటిని అలంకరించుకుంటారు.
పెద్దల పండుగ – సంక్రాంతి రోజున పితృదేవతలకు తర్పణాలను అందించే ఆచారం ఒకటి ఉంది. అప్పటివరకూ దక్షిణాయంలో సంచరించిన పితృదేవతలు ఉత్తరాయణ కాలంలో మనల్ని వీడి పుణ్యలోకాలకు వెళ్లిపోతారు కాబట్టి, వీరికి వీడ్కోలు పలుకుతూ తర్పణాలను అందించాలని అంటారు. తిథులతో సంబంధం లేకుండా పితృదేవతలకు తర్పణాలు వదిలే అతికొద్ది సందర్భాలలో సంక్రాంతి ఒకటి.
బొమ్మల పండుగ – సంక్రాంతి వస్తోందంటే చాలు పిల్లల సంబరానికి అంతు ఉండదు. అప్పటిదాకా మూలమూలలా దాచుకున్న బొమ్మలన్నింటినీ వెలికి తీసి బొమ్మల కొలువులో పేర్చి మురుసుకుంటారు. వీటిని ఎడాపెడా కాకుండా సంప్రదాయబ్ధంగా ఓ పద్ధతిలో పేర్చేందుకు పెద్దలు సాయపడతారు. ఇలా బొమ్మల కొలువు కోసం కొనుగోలు చేసే వస్తువులతో ఏటికొప్పాక, కొండపల్లి వంటి బొమ్మల కళాకారులకు జీవనోపాధి లభిస్తుంది. బొమ్మల కొలువుకి పిలుచుకునే పేరంటాలతో అనుబంధాలూ వెల్లివిరుస్తాయి. పేరుకి ఈ పేరంటం పెద్దలదైనా, ఇందులో పెత్తనమంతా పిల్లలదే!
ఇంతేనా! సంక్రాంతినాడు హరిదాసులు, గంగిరెద్దులు, నదీస్నానాలు, రేగుపండ్లు, బంతిపూలు... ఇలా చెప్పుకుంటూ పోతే సంక్రాంతి పండుగ ఒక పండుగతో కాదు వంద పండుగలతో సమానం అనాల్సి వస్తుందేమో!
- నిర్జర.