Home » Antera Bamardee » Antera Bamardee 9

Rating:             Avg Rating:       214 Ratings (Avg 2.82)

Antera Bamardee 9

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

అంతేరా బామ్మర్దీ - 9

ఆదివిష్ణు

బసవరాజు అండ్ కంపెనీ ఆఫీసు తాలూకు ప్రొప్రయిటరు గదిలో.

బసవరాజు పేపరు రీడింగ్ తో బిజిగా వున్నాడు. ఏ విషయంలో ఎంత అజాగ్రత్తగా వున్నా పర్లేదుగానీ,వార్తా పత్రిక చదివేటప్పుడు మాత్రం వాళ్ళు దగ్గరుంచుకొని చదవాలనేది అతని సిద్ధాంతం.

అప్పటికే చాలా పేపర్లు చదివేడు కాబోలు ఇంగ్లీష్,తెలుగు దిన పత్రికలు అనేకం నేలమీద బోలెడు పది వున్నాయి.

అతనికి నచ్చిన వార్తా ఏ పేపర్లోనూ పడనందుకు చిరాకు పడిపోతూ "చెత్తపేపర్లు "అని తిట్టుకున్నాడు.

బసవరాజుకి మంచి అలవాట్లు చాలా వున్నా దిక్కుమాలిన అలవాటు ఒకే ఒక్కటి తనని విడిచిపెట్టడం లేదు.

అది అతని వీక్నెస్సు. ఆ బలహీనత నుండి బయటపడమని సాక్షాత్తు దేవుడే దిగివచ్చి చెప్పినా 'అయ్ కాంట్ 'అని నిర్మొహమాటంగా చెప్పగల ధీమా అతని ప్రత్యేకత.

అతను దిన పత్రికలను చదివేది కేవలం దిక్కుమాలిన వార్తల కోసమే. కిరసనాయిలు పోసుకుని తగలబడ్డారు...లారీ తిరగబడి కూలీలు ప్రాణాలు పోగొట్టుకున్నారు... అప్పులెక్కువైన కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు లాటి వార్తల మీద అతనికి అపారమై యిష్టం.

ఆ వార్తలనే చదివి దేశం ఏ స్థాయిలో నడుస్తుందో అంచనా వేసి నిట్టూర్పుల్తో తానున్న గదిని వేడెక్కించడం అతని హాబీ. దురదృష్టవశాత్తు అతని అభిమతానికి వ్యతిరేకంగా ఆ రోజు పేపర్లో ఆ జాతి వార్తలు లేనందుకు సమస్తమైన పేపర్లకీ చెత్త పేపర్లని బిరుదిచ్చి నిట్టూర్చేడు.

సరిగ్గా అప్పుడే...తన గదిలో “గుడ్ మార్నింగ్ సర్ "అని వినిపించింది.

సవుండొచ్చిన వేపు తల తిప్పేడు.

అక్కడ పాణి...పూర్తి పేరు చక్రపాణి కనిపించేడు. పాణిని చూడగానే బసవరాజు మొహంలో వెల్తురు నిండిపోయింది. ఆనందంగా అన్నాడు.

“వెరీగుడ్..నీ కోసమే చూస్తున్నా "అని. నేల మీదున్న పేపర్లని పాణి చూసేడు. చూసి అడిగేడు.

“అన్ని పేపర్లూ చూసేసేరా సార్ ?”

“యస్.అంతా రొటీన్ న్యూసే.ఏ పేజీలో చూసినా మంత్రి వర్గం మట్టిపాలైందీ.ప్రభుత్వం పడిపోయిందీ, బడుగు వర్గాలకు చేయూత,సత్యాగ్రహాలు,వెన్నుపోట్లు...ఇవేం వార్తలు?నాక్కావాల్సిన వార్త ఒక్కటీ లేదు.మిస్టర్ పాణీ ణీ చేతిలో వున్నా పేపరేమిటి ?"

“మలయాళం సర్.మలయాళం పేపరు "

“అయిసీ...కనీసం అందులోనైనా నాక్కావాల్సిన వార్తలేమైనా...”

“ఒక అద్భుతమైన వార్తా వుంది సార్ " బసవరాజు ఆ మాటకి ఆనందించేడు.

“అల్లాంటి వార్తలు చదివేందుకే నిన్ను పేపరు రీడింగు ఆఫీసరుగా పెట్టుకున్నా "అన్నాడు.

“వద్దుసార్ "అన్నాడు చక్రపాణి.

“ఏమిటోద్దు ?”

“పేపరు రీడింగు ఆఫీసరు,స్టోరీ టెల్లింగ్ సెక్రటరీ...ఇలాంటి పేర్లతో పదవులోద్దు సార్!సింపులుగా పి.ఆర్.ఒ.ఆనండి సార్!హోదాగా వుంటుంది" పి.ఆర్.ఒ. అనగా పేపరు రీడింగు ఆఫీసరు!ఇక్కడ నీ ఉద్యోగం అదే కదా.నా తెలీని భాషల తాలూకు పేపర్లు చదివి అందులో నా అభిరుచికి తగిన వార్తల్ని నాకు తెలుగులో చెప్పడం నీ డ్యూటీ. అంతేకదా "అన్నాడు బసవరాజు.

“ఆఫ్ కోర్స్ సర్.నా డ్యూటీ అదే అయినా నన్ను మాత్రం పి.ఆర్.ఒ.గా మాత్రమే పిలవమని నా రిక్వెస్ట్ సార్ ?”

“ఒ.కె.అల్లాగే.వార్త చదువు " పాణి మలయాళం పేపరు విప్పేడు.

పక పేజీలో ఒక చోట దృష్టి నిలిపి అక్కడున్న వార్తని గబగబా మలయాళంలోనే చదివేసేడు. ఆ తరువాత అడిగేడు.

“అర్థమైందా సార్ "

“పేర్లు తప్ప మిగతా సౌండ్లు ఏవీ అర్థం కాలేదు.నువ్వు ఏ భాషలో వార్త చదివినా అర్థ తాత్పర్యాలు తెలుగులో చెబుతావనే ఉద్దేశంతో నిన్ను పేపరు రీడింగ్ ఆఫీసరుగా..” “పి.ఆర్.ఒ.సర్ "

“దట్ మీన్సదే!పిఆర్వోగా పెట్టుకున్నా.నువ్వు మళయాళంలో చదివిన వార్తకి తెలుగులో తాత్పర్యం చెప్పు.”అన్నాడు బసవరాజు.

(ఇంకావుంది)

(హాసం సౌజన్యంతో)