Home  » Movie-News » స‌ర్దార్ గబ్బర్ సింగ్‌..ఓ కిచిడీ సినిమానా?



వంట‌గాళ్లు ఎక్కువైతే వంట‌కం నాశ‌నం అవుతుంద‌ని చెప్తుంటారు పెద్ద‌లు. సినిమా కూడా అంతే.  వేలు పెట్టి కెలికేవాళ్లు ఎక్కువ మంది ఉంటే ఆ సినిమా ఇక చూసిన‌ట్టే. ప్ర‌స్తుతం స‌ర్దార్ గ‌బ్బర్ సింగ్ ప‌రిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ ఉండ‌ద‌ని ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 8న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల్లోనూ భారీ అంచ‌నాలే ఉన్నాయి. అంచ‌నాల‌తో పాటు కొన్ని అనుమానాలూ వ్య‌క్తం అవుతున్నాయి. ఈ సినిమా స‌రిగ్గానే వ‌చ్చిందా?  నిజంగానే క‌థ‌లో, సినిమాలో అంత ద‌మ్ముందా?  అంటూ.. పంపిణీదారులు, కొంత‌మంది ప‌వ‌న్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ సైతం గాభ‌రా ప‌డిపోతున్నారు. దానికీ కార‌ణాలున్నాయి.

ఈ సినిమాని ముందు నుంచీ ప‌వ‌న్ క‌ల్యాణ్‌సింగిల్ హ్యాండెడ్‌తో న‌డిపిస్తున్నాడు. ఆయ‌నే తెర వెనుక ద‌ర్శ‌కుడ‌న్న‌ది కాద‌న‌లేని స‌త్యం. బాబి ఉన్నాడు కాబ‌ట్టి.. ఆయ‌నా అప్పుడ‌ప్పుడూ ఓ చేయి వేస్తున్నాడు. ఈలోగా ప‌వ‌న్ హ‌రీష్ పాయ్ అనే త‌న స్నేహితుడ్ని రంగంలోకి దించాడు. హ‌రీష్ ఓ డాన్స్ మాస్ట‌ర్.. ప‌వ‌న్‌కి బాగా స‌న్నిహితుడు. ప‌వ‌న్ సినిమాల్లో చాలా మ‌ట్టుకు ఆయ‌నే డాన్స్ కంపోజర్‌. స‌ర్దార్ సినిమాకి ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్ కూడా ఆయ‌నే. హ‌రీష్ పై ఉన్న న‌మ్మకంతో ఓయూనిట్ ద‌ర్శక‌త్వ బాధ్య‌త‌లు హ‌రీష్‌కి అప్ప‌గించాడు ప‌వ‌న్‌. అంటే అక్క‌డికి ముగ్గురు ద‌ర్శ‌కుల‌య్యార‌న్న‌మాట‌. క‌థ అక్క‌డితే ఆగిపోలేదు. ఆండ్రూని అద‌న‌పు కెమెరామెన్ గా నియ‌మించుకొన్న ప‌వ‌న్‌.. అత‌నికీ డైరెక్ష‌న్ ఛాన్స్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. కొన్ని స‌న్నివేశాల్ని ఆండ్రూనే టేక‌ప్ చేశాడ‌ని టాక్‌. అంతేకాదు.. రామ్ ల‌క్ష్మ‌ణ్‌లూ ఓ చేయి వేశార‌ట‌. యాక్ష‌న్ స‌న్నివేశాల‌నే కాకుండా హీరో బిల్డ‌ప్ సీన్స్ కూడా వారి ఆధ్వ‌ర్యంలోనే తీశార‌ని స‌మాచారం. అంటే.. ఈ సినిమాకి ఆరుగురు ద‌ర్శ‌కుల‌న్న‌మాట‌. ఇంత‌మంది చేయి చేసుకొన్న స‌ర్దార్ కిచిడీలా తయార‌వుతుందేమో అన్న‌ది సినీ జ‌నాల భ‌యం. ప్ర‌తీ ఎపిసోడ్‌కీ ద‌ర్శ‌కుడు మారిపోతే.. ఇక ఆ సినిమాలో కంటిన్యుటీ ఏముంటుంది??  మొత్తానికి ఇలాంటి అనుమానాలు స‌ర్దార్ చుట్టూ చేరి తెగ కంగారు ప‌డుతున్నాయి. ఇవ‌న్నీ కేవ‌లం అనుమానాలో, నిజాలో తెలియాలంటే స‌ర్దార్‌కి తెర లేవాల్సిందే. అప్ప‌టి వ‌ర‌కూ మ‌నం ఎదురుచూడాల్సిందే.